Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో 18ఏండ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. ఇష్టమైన నాయకుణ్ని ఎన్నుకునే అవకాశం వారికి దక్కుతుంది. ఆ క్రమంలో పౌరులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు తమ సమస్యలను విన్నవించటం, డిమాండ్లను వారి ముందు పెట్టటం పరిపాటి. వాటిల్లో ఎన్ని సమస్యలు పరిష్కారమవుతున్నాయి..? ఎన్ని డిమాండ్లు నెరవేరుతున్నాయనేది వేరే విషయం. కానీ హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లికి చెందిన చిన్నారులకు... బహుశా ఓటు హక్కు లేదనే కారణంతోనే కావచ్చు, పాలకులు, అధికారులెవ్వరూ వారి సమస్యలను పట్టించుకోవటం లేదు. స్థానిక సుందరయ్య పార్కు, మదర్ డెయిరీ గ్రౌండ్, ఎల్ఐజీ క్వార్టర్స్ స్కూల్ గ్రౌండ్లో ఆట వస్తువులు, పరికరాలు, ఉయ్యాలలు, జారుడు బల్లలు విరిగి, పాడైపోయి దాదాపు రెండేండ్లు కావస్తున్నది. కానీ వాటి గురించి పట్టించుకున్న నాథుడే లేడు. దీంతో సెలవు దినాలు, పండగ రోజులు, బడి లేని ఇతర రోజుల్లో బుడతలకు ఆడుకోవటానికి సరైన వసతుల్లేక నానా ఇబ్బందులూ పడుతున్నారు. ఇదే సమయంలో బాగ్‌లింగంపల్లికి కూతవేటు దూరంలో ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి పిల్లర్లు చకచకా లేస్తున్నాయి. కోట్ల రూపాయలతో నాలాల పూడిక తీత పనులు కొనసాగుతున్నాయి. ఇవన్నీ జరుగతున్నప్పుడు కేవలం రెండు లక్షల రూపాయలతో వచ్చే ఆట వస్తువులు కొనటానికి 'పెద్ద మనుషలకు' చేతులు రావటం లేదు. దీంతో 'మాకు ఓటు హక్కు లేదనేగా...' మీకు ఈ అలుసంటూ నొచ్చుకున్న చిన్నారులు, ఈ మధ్యనే జీహెచ్ఎమ్సీ కమిషనర్‌కు పోస్టు కార్డులు రాయటం ద్వారా తమ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వారి పోరాటం సక్సెస్ కావాలని ఆశిద్దాం.
-కేఎన్ హరి