Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని అంటారు మన పెద్దోళ్లు. నిజానికి రాళ్లు ఎప్పుడైనా కరిగాయో, లేదో తెలియదు గానీ కఠినమైన మనుషులు, ఎంతో అలసిపోయిన హృదయాలు, నిర్లిప్తత గూడు కట్టుకున్న గుండెలు కూడా మనసుకు నచ్చిన సంగీతం విన్నప్పుడు మరెంతో స్వాంతన పొందుతాయి. వాటికి ప్రశాంతత చేకూరుతుంది. ఇదే విషయాన్ని ఇటీవల హైదరాబాద్లో నొక్కి వక్కాణించారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు. అనేక మానసిక సమస్యలను కూడా తీర్చగలిగే శక్తి సంగీతానికుందంటూ ఆయన సెలవిచ్చారు. నిజమే మరి... మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన అబ్దుల్ కలామ్ సైతం సంగీత ప్రియుడే. ఆయనంతటివాడే తన పనిలో బాగా అలసిపోయినప్పుడు స్వయంగా సితార వాయించటం ద్వారా ఆ అలసట నుంచి బయటపడేవారు. ఒకానొక సందర్భంలో కలాం గారే ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం అనేక మానసిక రుగ్మతలు ఎక్కువైపోతున్న క్రమంలో అలాంటి రోగులకు వెంకయ్య గారు చెప్పిన మ్యూజిక్ థెరపీ ఎంతో అవసరమన్నది కాదనలేని సత్యం. మనుషుల మీదికి బుల్డోజర్లు ఎక్కించటం, పొట్ట పోసుకోవటానికి చిరు వ్యాపారులు పెట్టుకున్న దుకాణాలను ధ్వంసం చేయటం, కులం, మతం పేరిట పొడిచి చంపటం, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు శరవేగంగా పెరుగుతున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా పేడ తినాలి, మూత్రం తాగాలని చెప్పటం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా... దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇష్టానుసారంగా రోజుకోసారి పెంచుకుంటూ పోవటం, తద్వారా జనాన్ని చావ బాదటం, ఇవన్నీ తప్పు.. దేశానికి నష్టం, ప్రమాదమని తెలిసినా వాట్సాప్ యూనివర్సిటీల్లో పీజీలు, పీహెచ్డీలు, ఎమ్ఫిళ్లూ చేస్తూ రోజూ అడ్డగోలు వాదలనకు 'పరమ భక్తులు...' దిగటం... ఇవన్నీ పాపం మానసిక సమస్యలే కాబోలు. వైద్య శాస్త్రానికి, ప్రఖ్యాత వైద్యులకు సైతం అంతుబట్ట్టని ఈ రుగ్మతలకు 'సంగీతమే...' సరైన మందు. అందుకే పెద్దలు చెప్పినట్టు ఈ జబ్బులతో బాధపడేవారికి వెంటనే మ్యూజిక్ థెరపీని ఇప్పించటమొక్కటే మార్గం. లేదంటే దేశం మరింత ఆగమై పోవటం ఖాయం.
-బి.వి.యన్.పద్మరాజు