Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిగ్స్క్రీన్పై ఫ్యాషన్‌తో ఎంతో మంది సినిమా అవకాశాల కోసం ఎన్నో, ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కొంటారు. ఈ పయనంలో కొంత మంది కళామ తల్లి ఒడికి చేరుతారు. మరికొంత మంది అక్కడే ఆగిపోతారు. అయినా తమ లక్ష్యాన్ని చంపుకోకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు. దానికి కొనసాగింపుగానే ఖడ్గం చిత్రంలో సంగీత హీరోయిన్ కావాలనే ఫ్యాషన్‌తో సినిమా పెద్దలను కలుస్తూ... ''ఒక్క చాన్స్ ఇవ్వండి'' అంటూ కాళ్లావెళ్లా పడుతారు. ఈ క్రమంలో ఆమె ఎన్నో అవమానాలు, వేధింపులను ఫేస్ చేస్తారు. చివరకు వారేం చెయ్యమంటే అది చేసేందుకు కూడా సిద్ధపడారు. ఎక్కిరింపులు, హేళనలు ఒక్కటేమిటీ అవి మాటల్లో చెప్పలేనివి. అయినా గ్యారంటీ లేని గాలిపటం లాంటి జీవితాలు. ఇంతకు చెప్పొచ్చేదేమంటే, ఒక్క చాన్స్ అంటూ హీరోయిన్ సంగీత పడిన కష్టాలు ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తాయి. రంగుల ప్రపంచంలో ఇన్నీ కష్టాలుంటాయా? అనిపిస్తుంది. ఒక్క చాన్స్ డైలాగ్ చాలా ఫేమస్ అయింది. జనజీవితాల్లో అనేక సందర్భాల్లోనూ ఆ డైలాగ్ ఉపయోగిస్తున్నారు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతను యాజమాన్యాలు అడుగుతున్న ప్రశ్న ఏమైనా అనుభవం ఉందా? అప్పడే చదువు ముగించుకుని బయటకొచ్చిన వాడికి ఏం అనుభవముంటుంది? నా బొంద కాకపోతే. ఎవరో ఒకరు చాన్స్ ఇస్తేనే కదా అనుభవం వచ్చేది? అప్పుడే కదా తనను తాను నిరూపించుకుంటాడు. అందుకే ఒక్క చాన్స్ ఇవ్వాలని వేడ్కొంటారు. ఈ మధ్య కాలంలో ఆయా పార్టీలు కూడా ఓటర్లను ఒక్క చాన్స్ అని అడుగుతున్నాయి. కొత్త పార్టీలు అడిగితే ఓ అర్థం,పరమార్థం. కానీ దశాబ్దాలు పరిపాలించిన పార్టీలు సైతం ఒక్క చాన్స్ అంటూ నవ్వు తెప్పిస్తున్నాయి. హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న పార్టీలు కూడా ఈ ఒక్క చాన్స్ ఇవ్వండి అంటున్నాయి. అధికారంలోకి రావడానికి ముందు ప్రజలకు ఎన్నో తియ్యటి సినిమా కబుర్లు చెప్పి ఓట్లు వేయించుకుంటాయి. పీఠమెక్కగానే ప్రజలను గాలికొదిలేస్తాయి. ఐదేండ్ల తర్వాత మళ్లీ అధికారం గుర్తుకు రాగానే ఒక్క చాన్స్ అంటూ సెంటిమెంట్‌ను రగిలిస్తాయి. నమ్మి ఓట్లు వేసిన తర్వాత సీఎంనో, మంత్రినో, ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో కలిసేందుకు ఒక్క చాన్స్ ఇవ్వండి... మా కష్టాలు చెప్పుకుంటామంటూ ప్రాధేయపడాల్సిన దుస్ధితి ఉన్నది. కాబట్టి ఒక్క చాన్స్ ఇచ్చేందుకు ముందు ఒక్కసారి ఆలోంచించాల్సిన బాధ్యత ఓటర్లదే.
- గుడిగ రఘు