Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మా అన్న యాత్ర గ్రేట్ సక్సెస్! ఇక తెలంగాణలో మాకు తిరుగేలేదు!'' అంటూ ఉత్సాహంగా ఏదో చెబుతున్నాడు పుష్పరాజ్. అతడు పువ్వుగుర్తు పార్టీ వీరాభిమాని. పుష్ప సినిమా రాకముందు నుండే అంతా ఆయన్ను పుష్పరాజ్ అని పిలుస్తుంటారు! అతని అసలు పేరేంటో అంతా మర్చిపోయారు.
''ఏమి యాత్ర? ఏమా సక్సెస్?'' అన్నాడు మల్లేష్.
''ఏమి యాత్ర అంటున్నావా! ఇంతకీ నీవు తెలంగాణలోనే ఉన్నావా? అసలు బతికే ఉన్నావా?'' అంటూ పుష్పరాజ్ మల్లేష్‌ను గిల్లబోయాడు.
''నేను బ్రహ్మండంగా ఉన్నాను! తెలంగాణ గడ్డమీదే ఉన్నాను!'' అన్నాడు మల్లేష్ దూరంగా జరుగుతూ.
''మా బండి సంజరు ప్రజా సంగ్రామ యాత్ర గ్రేట్ సక్సెస్!'' రాష్ట్రంలో, దేశంలోనే పెద్ద రికార్డు తెలుసా!'' అన్నాడు గొప్పగా పుష్పరాజ్.
''మీ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం నడుపుతున్నది కదా! మళ్ళీ ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకు?'' ఆశ్చర్యంగా అడిగాడు మల్లేష్.
''రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చేటందుకు! రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తాం. తెలంగాణను అభివృద్ధి చేస్తాం!'' అన్నాడు పుష్పరాజ్ ఉత్సాహంగా.
''ఇప్పుడున్న అధికారంతో ప్రజలకు సేవ చేయొచ్చుకదా! ఎవరొద్దని అని అన్నారు!'' అడిగాడు మల్లేష్.
''మేము చెప్పేదీ అదే! ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అభివృద్ధి చేస్తాము! కేంద్రంలో అధికారంలో దేశంలో అభివృద్ధి! రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఇక్కడ అభివృద్ధి! రెండుచోట్లా అధికారంలో ఉంటే రెండుచోట్లా అభివృద్ధి! అందుకే డబుల్ ఇంజన్ గవర్నమెంటు రావాలి!'' అన్నాడు పుష్పరాజ్.
''అంటే తెలంగాణ భారతదేశంలో లేదా?'' అడిగాడు మల్లేష్.
''తెలంగాణ భారతదేశంలోనే ఉంది! కాని తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు. కుటుంబ పాలన చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు'' అన్నాడు పుష్పరాజ్.
''మీరు కేంద్రంలో అధికారంలో ఉండి దేశాన్ని రెండు కుటుంబాలకు దోచిపెడుతున్నారు కదా!'' అన్నాడు మల్లేష్.
''ఆ రెండు కుటుంబాలు కూడా భారతీయ కుటుంబాలే కదా! వారు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లే!'' అన్నాడు పుష్పరాజ్.
''అంటే మీకూ, కేసీఆర్‌కూ తేడా ఏమీలేదన్న మాట!'' అన్నాడు మల్లేష్.
''అట్లాకాదు! మోడీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. కాని కేసీఆర్ మన తెలంగాణను దివాలా తీయించాడు! అందుకే రాష్ట్రంలో కూడా బీజేపీ పాలన రావాలని ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టాము'' అన్నాడు పుష్పరాజ్.
''ఆల్రెడీ ప్రజలపై నరేంద్రమోడీ యుద్ధం ప్రకటించారు కదా! ఆయన అధికారంలోకి వస్తే పాకిస్థాన్, చైనాలపై యుద్ధం చేసి, వాళ్ళు ఆక్రమించిన మన భూభాగాలను తిరిగి తెస్తాడని ప్రచారం చేస్తిరి! ఇప్పుడేమో సొంత ప్రజలమీదే ధరల యుద్ధం చేస్తున్నాడు'' అన్నాడు మల్లేష్.
''ఉక్రెయిన్ యుద్ధం వల్ల ధరలు పెరిగాయి!'' అన్నాడు పుష్పరాజ్
''ఉక్రెయిన్ యుద్ధం రాకముందు పెరిగిన ధరల సంగతేమిటి? అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోయినప్పుడూ, దేశంలో ధరలు తగ్గించలేదు. పైగా పన్నులు పెంచి ప్రజల రుణం తీర్చుకున్నారు. దేశంలోని కొనుగోళ్ళు, అమ్మకాల సేవలు కూడా జీఎస్టీ పరిధిలోకి వస్తాయి! అదేమి ఖర్మోగాని పెట్రోలు, డీజిల్ మాత్రం జీఎస్టీ పరిధిలోకి రావు! పన్నులు నిర్ణయించేది కేంద్రమే! కానీ తగ్గించమని రాష్ట్రాలకు సుద్దులు చెప్తారు!'' అన్నాడు మల్లేష్.
''అదంతా! కాంగ్రెస్ చేసిన పెట్రోబాండ్స్ బాకీలు తీర్చటానికి'' అన్నాడు పుష్పరాజ్ గంభీరంగా.
''ఏడేండ్ల నుంచి ఆ బాకీలు తీరటం లేదా! పెట్రోలు, డీజిల్‌పై పెంచిన ధరలు ఎంత, బాండ్స్ బాకీలు ఎంతో లెక్కలు చెబుతారా? మరి ఏడేండ్ల కాలంలో 40లక్షల కోట్ల అప్పులు బయటి దేశాల నుండి తెస్తిరి కదా! ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందో ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలకు చెప్పినారా! నల్లధనం బయటకు తెచ్చి, ప్రతి ఒక్కరికీ 15లక్షల రూపాయలు బ్యాంకు అకౌంట్లలో వేస్తామన్నారు కదా! అట్లా వేసినవారు ఎవరైనా మీకు ప్రజా సంగ్రామయాత్రలో తారసపడ్డారా? ప్రశ్నించాడు మల్లేష్.
''ఇప్పుడు దేశం ఇలా కావటానికి నెహ్రూనే కారణం!'' అన్నాడు మరింత గంభీరంగా పుష్పరాజ్.
''ఆ మాట అనటానికి మీకు సిగ్గూ శరం లేదా! మీరు ఈనాడు అమ్ముతున్న, ప్రయివేటు పరం చేస్తున్న సంస్థలన్నీ నెహ్రూ ఏర్పాటు చేసినవే! విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ఇస్రో, ఎల్ఐసీ, జీఐసీ, బాల్కో, బీఎస్ఎన్ఎల్, విశాఖస్టీల్ లాంటి ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారో మీ యాత్రలో ప్రజలకు వివరించారా?'' అడిగాడు మల్లేష్.
''తెలంగాణలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ యాత్ర చేశాము!'' అన్నాడు పుష్పరాజ్.
''ఒకసారి అధికారంలోకి వచ్చేందుకంటారు! మరొకసారి సమస్యలు తెలుసుకునేందుకంటారు! ఏది నమ్మాలి! అసలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి! మీరు కేంద్రంలో ప్రతిపక్షంలో ఉంటే రథయాత్రలు చేస్తారు! అధికారంలోకి వస్తే విదేశీ యాత్రలు చేస్తారు! రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంటే పాదయాత్రలు చేస్తారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తీర్థయాత్రలు చేస్తారు! ఇదే కదా మీ విధానం!'' అన్నాడు మల్లేష్!
''దేశాభివృద్ధికి విదేశీ యాత్రలు చేయాలి తప్పదు!'' అన్నాడు మేకపోతు గాంభీర్యంతో పుష్పరాజ్.
''గత ప్రధానులు విదేశీ యాత్రలు చేస్తే ఆయా రంగాల నిపుణులను, శాస్త్రవేత్తలను, పత్రికా సంపాదకులను వెంట తీసుకెళ్ళేవారు! కాని ప్రస్తుతం ప్రధాని వెంట అంబానీ, ఆదానీలు మాత్రమే ఉంటున్నారు! ఇక మీ ముఖ్యమంత్రులు ఏనాడైనా ప్రజల మధ్యకి వచ్చారా? పాదయాత్రలు చేశారా?'' నిలదీశాడు మల్లేష్.
''అదీ... ..... '' అంటూ నీళ్ళు నమిలాడు.
''ఇక చాలు ఏమీ చెప్పొవద్దు. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పే మాటలకు, అధికారంలోకి వచ్చాక చేసే చేతలకు హస్తిమ శకాంతర వ్యత్యాసం ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పే మాటలు అప్పుడే మర్చిపోవటం మీకున్న ఒక గొప్ప సుగుణం! పెద్దనోట్ల రద్దువల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఉరుకులు పరుగులు తీస్తుందని, నల్లధనం తెల్లధనమై వెల్లువెత్తుందనీ లేకపోతే నన్ను ఉరితీయమని అన్న పెద్దమనిషి, ఆ మాటలు మర్చిపోయాడు. తుక్కుగూడలో ఆ సంగతేమిటో చెప్పండి! లేకపోతే మీరు మర్చిపోయినా, మీ విధానాలకు బలైతున్న ప్రజలు మర్చిపోరు కదా! సందు దొరికితే మిమ్మల్ని తుక్కుకింద మార్చుతారు!'' అన్నాడు మల్లేష్.
- ఉషాకిరణ్, సెల్:9490403545