Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంగారు తెలంగాణాల గుడిసెలొద్దు భవంతులు కన్పియ్యాలే అని కేసీఆర్ సారే వరంగల్లుకు వచ్చి చెప్పిండు. ఆ భవంతుల్లోనే దావత్ చేస్కుందామని చెప్పిండు. గుడిసెలొద్దన్నరు.. భూముల మీదకు పేదోళ్లను పోనీయకుండా చేసిండ్రు. భూ రాబందులొచ్చి ఉన్న భూమిని పీక్కతిని భూమే లేకుండా చేసినరు. భవంతులన్నరు.. ఒక్కటి కూడా ఇయ్యలే. కాంగ్రెస్కాలంల కట్టిన స్వగృహకల్ప ఇళ్లకు దర్వాజలు పోయినరు. పందులు దొర్లుతున్నరు. పాములు సంసారం చేస్తున్నరు. మరి పేదోడేమైపోవాలే??
మనం ఏమని తెలంగాణా తెచ్చుకున్నం? నిధులు, నీళ్లు, నియామకాలంటిమి కదా! విడిపోతే మనది ధనిక రాష్ట్రమైతది. పైసలు బాగా మిగుల్తయి. పేదోడిని రారాజులెక్క సూస్కోవచ్చు అనే కదా మన లెక్క. అప్పుడు ఆంధ్రోళ్లు దొచుకుంటున్నరు కాబట్టే పేదోడికి చానా కష్టమొచ్చిందని అనుకుంటిమి కదా! భూములన్నీ ఆళ్ల చెర నుంచి విడిపించేందుకే తెలంగాణా అంటిమి కదా! మరి ఇప్పుడు భూములున్నయా? ఉంటే ఎక్కడున్నరు?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వరంగల్ కథనే యాదికి తెచ్చుకుందాం. హయగ్రీవ చారి అప్పుడు రాష్ట్రానికే మంత్రి. వేల ఎకరాలు ఆయన కబ్జాలు చేసిండు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కామ్రేడ్ జి.రాములు నాయకత్వాన ఓ దిక్కు ప్రజా పోరాటం, ఇంకో దిక్కు కోర్టులో న్యాయ పోరాటం జరిగింది. భూ రాబందు ఎంతటోడైనా తగ్గేదేలేదని పదేండ్లకుపైగా కొడ్లాడితే సర్కారు భూమి మళ్లీ సర్కారు చేతికి వచ్చింది. అప్పుడైనా సర్కారు తన భూములను కాపాడుకుందా అంటే అదేం జరగలే. ఇగ ఇట్లయితే ఉన్న భూములు కూడా పోయి పేదోడికి తలదాచుకునే జాగా ఉండకుండా పోతుందని అప్పుడే గుడిసెల పోరాటం షురువయ్యింది. సర్కారు భూములు పేదలకు పోతే పీక్కతినేందుకు భూమి దొరకదని భూ రాబందులు మాఫియా అవతారమెత్తి సీపీఐ(ఎం) విలువైన కార్యకర్తలను పొట్టనపెట్టుకున్నరు. అయినా సీపీఐ(ఎం) పోరాటం ఆపలే. భూ రాబందులు భూమిని కబ్జా చేసినా ఫికర్ చేయని ఆనాటి సర్కార్లు పేదోడు సర్కారు భూముల్లకు పోయే సరికి పోలీసులను పెట్టి కొట్టించింది. అరెస్టులు.. కేసులు.. లెక్కలేనన్ని..
ఇన్ని కష్టాల మధ్య వరంగల్ జిల్లాలోని పేదలు ఎర్రజెండ వెలుగుల్లో గుడిసెల పోరాటాన్ని ముందుకే పోనిచ్చిండ్రు. 28కిపైగా బస్తీలు పుట్టినరు. 30వేల పేద కుటుంబాలకు తలదాచుకునే జాగా దొరికింది. భూ మాఫియాతో కలిసి కొన్ని గుడిసె సెంటర్లను సర్కారే కూలగొట్టింది. అయినప్పటికీ... లెనిన్ నగర్, గణపతి నగర్, ఏసి రెడ్డి నగర్ ,మైసయ్య నగర్, కాశి కుంట, నాన్నమియా తోట, ఎన్.ఎన్ నగర్, ఆర్ఎస్ నగర్, బీరన్న కుంట, కొత్త బీరన్న కుంట, డి కె నగర్, జ్యోతిబసు నగర్, సుందరయ్య నగర్, కార్ల్ మార్క్స్ నగర్, ఏకశిలా నగర్, భూపాల్ రెడ్డి నగర్, ఎంహెచ్ నగర్, , ఐలమ్మ నగర్, ఓఎస్ నగర్, రఘునాథ్ కాలనీ, సూర్జిత్ నగర్, సమ్మయ్య నగర్, జెపి నగర్, భగత్ సింగ్ నగర్ గుడిసె కాలనీలు ఆనాటి పోరాటంతోనే పుట్టినరు. నిలబడ్డరు.
ఈ 30వేల పేద కుటుంబాలే వరంగల్ నగరాన్ని అభివృద్ధిలో ఉరకలెత్తించారు. పాకీ పని మొదలుకుని అందమైన భవంతులు కట్టే వరకు, తోపుడుబళ్లు, ఆటోలు, దుకాణాలు, హౌటళ్లు.. ఇట్ల వరంగల్లో మనిషి బతికేందుకు అవసరమైన అన్ని పనుల్లో ఈ కుటుంబాలున్నారు. ఈనాడు వరంగల్ వేలకోట్లకు పడగలెత్తిందంటే ఈ పేదోళ్ల చెమటచుక్కే కారణం.
ఇంకో దిక్కు సూస్తే 25ఏండ్ల క్రితం పోరాడి ఏసిన గుడిసె ఒక సంసారాన్ని ఎంతకాలం కాపాడుతది? గుడిసెల్లో ఉన్నోళ్లకు పిల్లలు పుట్టి, పెండ్లీలు కూడా అయిపోతున్నరు. ఇల్లు సరిపోదు. బయటుండాలే. కిరాయిలు కట్టుకోవాలే. ఇప్పుడు వరంగల్లు పట్నంలో ఒక బెడ్ రూమ్ ఇంటికి అయిదు నుంచి ఎనిమిదివేలు బాడుగ కట్టాల్సిరావట్టే. డబుల్ బెడ్ రూమ్ అయితే పదివేలకంటే ఎక్కువే కట్టాలె. నెల జీతం వచ్చే పనుల్లేకపోయే సరికి ఇల్లు కడ్తామంటే బ్యాంకులు లోనులు ఇయ్యట్లే. రోజు కూలితో బతుకుతూ ఇంటి కిరాయి కట్టాలంటే అప్పు తేవాల్సి రావట్టే. ఇట్లయితే పూటగడవడానికే కష్టంగా బతుకుతున్న పేదోడు ఏమైపోవాలే? ఏడ ఉండాలే? ఏడ పండాలే?
కెసిఆర్ సార్ మొదటిసారి గెలిచి వరంగల్లుకు వచ్చి, ఎనుమాముల మార్కెట్ లకీëనగర్ల రెండ్రోజులు ఉండి, ఇక్కడి గుడిసెవాసులతో మాట్లాడిన మాటలను వరంగల్లు పేదలు ఇంకా యాదిమరవలేదు. 'పోయిన సర్కార్లు అగ్గిపెట్టే అసొంటి ఇండ్లు కట్టినరు. ఆడ పందులే ఉండరు. మీ అందరు ఫికర్ చేయకండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. గుడిసెల్లేని నగరాన్ని చేస్తా. అప్పుడు మళ్లీ వస్తా. మనం దావత్ చేసుకుందాం' అని చెప్పిండు. పేదలు ఆశతో ఎదురు చూసిండ్రు. అయితే ఆళ్ల మధ్యనే చిచ్చు పెట్టే కిరికిరిని తెలంగాణా సర్కార్ షురూ చేసింది. పేదలు పోరాడి పట్టాలు తెచ్చుకున్న భూమిలనే జి+5, జి+8 పేరుతో డబుల్ బెడ్ రూములు కడ్తామన్నది. తమ స్వాధీనంలోని భూమిపైకి వేరేవాళ్లని తెచ్చి నెత్తిమీద పెట్టొద్దని పేదోళ్లు మళ్లా పోరాడాల్సి వచ్చింది. సర్కారు కొన్ని జాగల్ల తోకముడ్చింది. ఇంకా కొన్ని జాగల్లనేమో లెక్కా పత్రం లేకుండా పని చేస్కపోతున్నది. ఉదాహరణకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో దూపకుంటలో 1400 ఇండ్లను జి+5 లెక్కన కడ్తున్నది. ఆక్కడ రెండు వేల మందికి ఆల్రెడీ పట్టాలున్నరు. ఆ రెండు వేల మందిలో ఏ 1400 మందికి ఇస్తరో తెల్వదు. మిగిల్న 600 మందిని ఏం చేస్తరో తెల్వదు. గిట్లనే ఇంకో లెక్కా పత్రం లేని పని ఖిలా వరంగల్ల జరిగింది. రోడ్డును యెడల్పు చేస్తమని 400 మంది ఇండ్లను కూలగొట్టిండ్రు. అవి పట్టాలున్న జాగాలు. ఇప్పటిదాకా ఆళ్లకు జాగా చూపెట్టలేదు. పోనీ డబుల్ బెడ్రూమన్న కట్టిస్తరను కూంటే ఊ అంటలే.. ఉఊ అంటలే. పోనీ గుడిసెలేసుకున్న జాగల్లనయినా ఉండనిస్తున్నరా అంటే అదీ లేదు. మునిసిపాలిటోడు పోడు. ఊడ్వడు. రోడ్డేయడు. డ్రైనేజీ కట్టడు. భూ రాబందులు చెరువులు, కుంటలను కబ్జా చేసుడుతోని ఆడ ఉండాల్సిన నీళ్లన్నీ గుడిసెల జాగాల్లోకి వస్తు న్నయి. చిన్న వర్షం పడ్డా ఇండ్లన్నీ మునిగిపోతున్నరు.
తెలంగాణ వచ్చినంక ఎక్కడి నుంచి అండ దొరికిందోగానీ పిసరంత భూమిని కూడా ఉండనీయకుండా భూ రాబందులు భూమిని మింగేస్తాపోతున్నరు. ఉదాహరణకు ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీని కుదిపేసిన జక్కలోది భూముల సంగతి సూద్దాం. దళితులకు కొంత భాగం ఇయ్యంగ 296 ఎకరాలు మిగులుండాలే. భూ రాబందులు పీక్కతినుడుతోని ఇప్పుడది 28 ఎకరాలు కూడా లేదు. బెస్తం చెరువు 105 ఎకరాలుండాలే. 60 ఎకరాలు గాయబ్ అయిపాయే. 40 ఎకరాలకన్న మించి లేదు. కాకతీయుల కాలం నాటి పుట్టకోట భూములు 1800 ఎకరాలుండాలే. ఇప్పుడు కోట ఆనవాలే మాయమాయే. ఒక్క ఇంచు జాగా కూడా కన్పిస్తలే. ఆ కాలం నాటిదే మట్టికోట ఖిలావరంగల్ చుట్టూ కోటకు బందోబస్తుగా 3000 ఎకరాల్లో అగర్తల్ చెరువుల భూములండేవి. కోట రక్షణ కోసం వంద మీటర్ల వరకు నిషేధిత ప్రాంతం. మరో 200 మీటర్ల వరకు నో ఆబ్జెక్షన్ పొందాల్సి ఉండేది. ఆ రూల్స్ అన్నీ రాజకీయ నాయకుల వెంచర్లలో కలిసిపోయినరు. మొత్తం మింగేస్తున్నరు. ఈ కబ్జాల్ల ఒక్క కబ్జాను కూడా సర్కారు ఆపట్లేదు. ఆపే ప్రయత్నం కూడా చేస్తలేదు.
వరంగల్లులో ఉన్న పేదోడు కెసిఆర్ ముచ్చటను యాదికి ఉంచుకున్నడు. తాను బతికేందుకు ఇంత జాగా ఇయ్యాలని అడిగితే సర్కారే పెడుతున్న కిరికిరినీ చూస్తున్నడు. ఇంకో దిక్కు తమ కళ్ల ముందే భూమి మాయమైపోతున్న సంగతినీ చూస్తున్నడు. నిన్నగాక మొన్న అసెంబ్లీలో నియోజకవర్గానికి మూడువేల ఇండ్లు ఇస్తామని చెప్పిన ముచ్చటనూ విన్నడు. అప్పుల పాలైతున్న తన బతుకును, ఏ ఆశల్లేకుండా పోతున్న తన పిల్లల బతుకునూ చూస్తున్నడు. గుడిసెల పోరాట చరితన్రూ గుర్తుకుతెచ్చుకున్నడు. సర్కారు జాగాలు కాపాడాలన్నా, గా జాగల్లో తమకు నిలువనీడ దక్కాలన్నా, కెసిఆర్ సారుకు మరో మారు తమ బతుకుల గురించి చెప్పాలన్నా, ఆయన చెప్పిన ముచ్చటను తమ కళ్లతో చూడాలన్నా ఎర్రజెండానే దిక్కనుకున్నడు. అందుకే సీపీఐ(ఎం) ఇచ్చిన పిలుపుతో భూములను వెతికిండ్రు. భూముల మీదకు పోయిండ్రు. గుడిసెలు వేసిండ్రు. పోలీసులు గుడిసెలను కాల్చిండ్రు. మళ్లీ వేసిండ్రు. తహశీల్దారు వచ్చిండు. జాబితా ఇయ్యాలన్నాడు. పదివేల మందితో భారీ ర్యాలీగా వెళ్లి జాబితా ఇచ్చిండ్రు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని సర్కారు చెబితే 'ఎన్నికలొస్తున్నరు. ఇప్పుడుకాకపోతే ఇంకెప్పుడు? మీరు మీ పని చేయండి. మేము మా పని చేస్తం. భూముల మీదకు పోతం. గుడిసెలు ఏస్తం' అని ఒక్క గొంతుతో జనం చెప్పిండ్రు. కేసులైతరు. కష్టాలొస్తరు. తల్లులు, పిల్లలకు కష్టమొస్తదని బెదరించేందుకు ప్రయత్నిస్తే 'మేమిప్పుడు పడుతున్న దానికంటే అదంత పెద్ద కష్టమేం కాదు. గవన్నీ ఉడకరు.' అని తెగేసి చెప్పిండ్రు.
కేసీఆర్ సారు ఇప్పటికైనా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలే. మన రాష్ట్రాన్ని మున్సిపాలిటీ తీరుగా దిగజారుస్తున్న ఢిల్లీ సర్కారు మీద మీరు యుద్ధం చేస్తున్నరు. మీకు తోడుగా పేదోడు కూడా నిలబడాలంటే ఆళ్లకు ఇయ్యాల్సింది ఇచ్చేయాలే. దానికి మీకు ఖర్చు కూడా ఏం కాదు. దరఖాస్తులన్నింటినీ విచారించి, అసలైన లబ్దిదారులకే ఉన్న ప్రభుత్వ భూముల్ల ఇండ్ల జాగాలియ్యాలే. అప్పుడు ఆళ్ల ఓట్లన్నీ మీకే పడ్తయి కదా! మీ పోరాటానికి మద్దతొచ్చినట్లే కదా! గీ పని చేస్తే పేదోడి ప్రతీ గుమ్మం ముందు మీ కోసం దావత్తు రెడీగా ఉంటుంది కదా! కెసిఆర్ సార్ మీరు పేదలకు జాగాలియ్యాలే. దావత్తు గట్టిగా చేసుకోవాలే.. లేదంటే, పోరాటమాగదు..
- ఎం. సాగర్
సెల్:7013805411