Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామ్రేడ్ పెంటయ్య గీత వృత్తి కుటుంబంలో పుట్టి, బతుకుదేరువు కోసం 45ఏండ్ల క్రితం రామన్నపేట ఏరియా నుండి సూర్యాపేటకు వచ్చారు. మొదట్లో చిన్నపాటి రైస్ మిల్లులో హమాలి వృత్తిని ఎంచుకొని జీవనం కొనసాగిస్తూనే కార్మికుల సమస్యలపై, వేతన ఒప్పందం విషయంలో యజమానులతో రాజీలేని పోరాటం చేస్తూ కార్మికులకు బంధువు అయ్యారు. చదువు రాకున్నా, అనుభవంతో రాజకీయాలను ఔపోసనపట్టారు. సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు రాయించడం, అధికారులతో మాట్లాడం, రేట్లపై యజమానులను ఒప్పించి, మెప్పించి, అవసరం అనుకుంటే సమ్మెకు కూడా కార్మికులను సిద్ధం చేసేవారు.
పెంటయ్యతో నాకు 1999 నుండి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ట్రేడ్ యూనియన్ రంగానికి నీకు తోడుగా ఎవరు ఉంటారని కామ్రేడ్ వి.ఎన్ పెంటయ్యను అడగగానే, నెమ్మాది అయితే బాగుంటుందని సూచించారు. అప్పుడు కామ్రేడ్ విఎన్ నన్ను ట్రేడ్ యూనియన్ రంగంలో పని చేస్తావా అని అడిగారు. నేను సిద్ధమే అని చెప్పగానే మెదక్జిల్లా సంగారెడ్డికి 10 రోజుల శిక్షణ తరగతులకు పంపించారు. కానీ పెన్పహాడ్ మండల ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పూర్తి స్థాయిలో మండల పార్టీ బాధ్యతలు చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రతి వేతన ఒప్పందంలో పెంటయ్య నన్ను చర్చలకు తీసుకెళ్ళేవాడు. కార్మికుల సమస్యలపై ఉద్యమాల సందర్భంగా నన్ను తప్పనిసరిగా చేసేవారు. అందుకే పెంటయ్య నాకు ట్రేడ్ యూనియన్ రంగంలో మొదటి గురువు. పార్టీ విచ్ఛిన్నం తర్వాత ట్రేడ్ యూనియన్ రంగాన్ని తన భుజం మీద పెట్టుకొని కొద్దీ రోజుల్లోనే అన్నీ ప్రధాన రంగాలను తిరిగి సీఐటీయూలోకి తీసుకొచ్చి సూర్యాపేటలో అగ్ర భాగాన నిలబెట్టారు. మార్కెట్ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, కూరగాయల మార్కెట్ హమాలీలు, పారబోయిల్డ్ హమాలీలకు ఏ సమస్య వచ్చినా, అర్థరాత్రి తలుపు కొట్టినా కాదనకుండా వెళ్లేవారు. అప్పగించిన బాధ్యత పూర్తి అయ్యేంత వరకు విశ్రమించేవారు కాదు.
ఆరోపణలకు దూరంగా నిలిచిన కామ్రేడ్
స్వార్థం, అవినీతి దరిదాపుల్లోకి రానివ్వని నిజాయితీ గల నాయకుడు పెంటయ్య. 50ఏండ్లుగా కార్మిక రంగంలో పని చేస్తూ ఏనాడూ అవినీతి, ఆరోపణలకు, పార్లమెంటరీ భ్రమలకు గురికాని మచ్చ లేని నాయకుడు పెంటయ్య.
సుందరయ్య నగర్ ఇండ్ల స్థలాల పోరాటం
ఇండ్ల స్థలాల పోరాటంలో తన వయస్సును కూడా లెక్క చేయకుండా ముందు భాగాన నిలిచారు. సూర్యాపేటలో ఇండ్లులేని పేదలందరిని సమీకరించి 72,73 సర్వే నెంబర్లో 18ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎర్రజెండాలు పాతి ఆరునెలల పాటు ఎడతెరిపి లేకుండా ఎన్నో నిర్బంధాలనెదురుకుని పోరాడారు. ఒకపక్క వందలాది మంది ప్రత్యేక పోలీసు దళాలు పేదల గుడిసెలపై దాడి చేసి, మహిళలు అని కూడా చూడకుండా, మానవత్వం మరిచి అర్థరాత్రి దాడి చేయగా... మరోపక్క ఆ పేదలకు అండగా నిలబడి, వందలాది పోలీసులను ఒక్కడుగా ఎదిరించి పోరాడిన కామ్రేడ్ పచ్చి మట్టల పెంటయ్య. ఆ సందర్భంగా జరిగిన అక్రమ కేసుల్లో జైలుపాలయినా పెంటయ్య అధైర్య పడలేదు.
సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడుగా పెంటయ్య
కామ్రేడ్ పెంటయ్య సుదీర్ఘ కాలం సీఐటీయూ సంఘానికి డివిజన్ అధ్యక్షుడుగా పని చేసారు. నిరంతరం కార్మికుల చుట్టే నిలిచిన వ్యక్తి. కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు, యజమానులతో వైద్య ఖర్చులు ఇప్పించేంత వరకు పోరాడేవారు. ఆయన వేసిన పునాది వల్ల సీఐటీయూ నేటికీ చెక్కు చెదరకుండా నిలిచింది. వందలాది మంది కార్మికులను పేరు బెట్టి పిలిచే అరుదైన జ్ఞాపక శక్తి ఆయన సొంతం. ప్రతి కార్మికుని సెల్ ఫోన్ నెంబర్ను చూడకుండా నోటికి చెప్పేవారు. ఉపన్యాసం చెప్పినా సరళమైన భాషలో కార్మికులకు అర్థమయ్యే విధంగా వివరించే వాడు. సుదీర్ఘ కాలం కార్మిక రంగంలో పని చేసిన పెంటయ్య అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఏ ఒక్క రోజూ కార్యక్రమాలకు దూరంగా లేడు. ప్రతి కార్యక్రమంలో ముందుండే వారు. ఆయన ప్రతి ప్రజా సంఘాల కార్యక్రమంలో జెండా పట్టుకొని నిలిచాడు. ఏ మహాసభలు జరిగినా అప్పగించిన పనిని బాధ్యతగా చేసేవారు. ట్రేడ్ యూనియన్ రంగానికే పరిమితం కాకుండా విద్యార్థి, యువజన, మహిళా, రైతు, కూలి పోరాటాల్లో చురుకుగా పాల్గోని బహుళ సంఘాల నిర్మాణంలో కృషి చేసారు. 2021 మే 10న లాక్డౌన్లో పెంటయ్య అనారోగ్యంతో మరణించారు. కుటుంబ సభ్యులు లేకున్నా పార్టీ ఆఫిస్లోనే తన భౌతికకాయాన్ని ఉంచి దహన సంస్కారాలు చేయడం జరిగింది.
పెంటయ్య అంతిమ యాత్రలో ఆయన అనుచరులం కడదాకా నడిచి జోహార్లు అర్పించగా, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి చితికి నిప్పంటించారు. ఆయన చనిపోయి నేటికీ సవంత్సరం దాటింది. కామ్రేడ్ పెంటయ్య ప్రధమ వర్థంతి నేడు సూర్యాపేట లోని కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరుగు తున్నది. కార్మికులూ, పార్టీ కార్యకర్తలూ, నాయకులు జిల్లా నలు మూలల నుండీ తరలివస్తున్నారు. నిజాయి తీకి, కమ్యూ నిస్టు నిబద్దతకూ మారుపేరుగా నిలిచిన కామ్రేడ్ పెంటయ్యకు విప్లవ జోహార్లు.
- నెమ్మాది వెంకటేశ్వర్లు