Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారీ ఆయుధాలు కావాలని ఉక్రెయిన్ కోరుకుంటున్నదనటం పశ్చిమ దేశాల ప్రచారంలో భాగమని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు నోమ్ చోమ్ స్కీ చెప్పారు. ఉక్రెయిన్ నేత జెలెనెస్కీ పదే పదే రాజకీయ పరిష్కారం కావాలని చెప్పటం, నాటో సభ్యత్వ కోరికను వదులుకుంటామని, తటస్థంగా ఉంటామని చెప్పిన అంశాలు అమెరికా-బ్రిటన్ ప్రచార వ్యవస్థ నుంచి మనకు ఎక్కడా వినిపించవు అని చోమ్ స్కీ అన్నారు. ఉక్రెయిన్-రష్యా వివాదాన్ని పరిష్కరించేందుకు తోడ్పడే విధంగా పశ్చిమ దేశాల నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదా ప్రతిపాదనలు గానీ లేవు. దానికి బదులు తమ దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాలను అందించి సొమ్ము చేసుకోవాలనే దుష్ట ఆలోచనను కనపడకుండా చేసేందుకు రష్యా గురించి అనేక తప్పుడు ప్రచారాలను వ్యాపింప చేస్తున్న అంశం తెలిసిందే.
అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు భౌతికదాడుల్లో పాల్గొనటమే కాదు, వాటితో పాటు తప్పుడు ప్రచారదాడులు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాయి. అందుకోసం భారీ ఖర్చు, నిపుణులతో కూడిన ప్రత్యేక విభాగాలను కూడా ఏర్పాటు చేస్తాయి. వీటిని ఆదర్శంగా తీసుకొని అదే తరహాలో మన దేశంలో అనేక సంస్థలు ప్రత్యేకించి- సంఫ్‌ుపరివార్ ఏర్పాటు చేసిన వివిధ సంస్థలు, పలు ముస్లిం సంస్థలకు చెందిన వారు పరస్పరం రెచ్చగొట్టేందుకు వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారనే విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. మెజారిటీ, మైనారిటీ మతోన్మాద ప్రచారం అనేక మంది మెదళ్లను విద్వేషానికి, భౌతికదాడులకు అనువైనదిగా మారుస్తున్నది.
కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ముస్లింలను సమీకరించటం, కమ్యూనిజం, పూర్వపు సోవియట్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం, చైనా-సోవియట్ మధ్య విబేధాలను పెంచటంతో సహా పలు ఎత్తుగడలతో బ్రిటన్ విదేశాంగశాఖ ఏర్పాటు చేసిన ఇన్ఫర్మేషన్ రిసర్చ్ డిపార్ట్మెంట్(ఐఆర్‌డి) విభాగం సాగించిన దుర్మార్గాలకు సంబంధించిన పత్రాలను ఇటీవల బహిర్గతం చేశారు. వాటి నుంచి పరిశోధకులు తవ్వినకొద్దీ అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, గతవారంలో కొన్నింటిని విశ్లేషకులు వెల్లడించారు. 1960దశకంలో ఇండోనేషియాలో లక్షలాది మంది కమ్యూనిస్టులు, సానుభూతి పరులను ఊచకోత కోసేందుకు అక్కడి ముస్లిం మతోన్మాదులను రెచ్చగొట్టటంలో బ్రిటన్ ఐఆర్‌డి ప్రచార అంశాలు ప్రధానంగా దోహదం చేసినట్లు తేలింది. అధ్యక్షుడు సుకర్ణో, విదేశాంగ మంత్రి సుబాంద్రియో కమ్యూనిస్టుల పట్ల సానుకూలంగా ఉండటంతో పాటు బ్రిటిష్ వారు రూపొందించిన మలేషియా ఫెడరేషన్ ప్రతిపాదనను తిరస్కరించారు. వారిని కొనసాగనిస్తే ఇండోనేషియా కూడా సోషలిస్టు దేశంగా మారుతుందనే అంచనాతో అమెరికా, బ్రిటన్ కుట్ర చేసి తిరుగుబాటుకు మిలిటరీని ప్రోత్సహించాయి. దాన్ని సమర్థించుకొనేందుకు అనువుగా తప్పుడు ప్రచారం సాగించాయి. సుకర్నో, సుబాంద్రియోలను, చైనా జాతీయులను బతకనిస్తే కమ్యూనిస్టు చైనా ఏ క్షణంలోనైనా ఇండోనేషియాను ఆక్రమిస్తుందని, మిలిటరీతో పాటు దేశంలోని కమ్యూనిస్టు వ్యతిరేకులను, మతశక్తులను రెచ్చగొట్టేందుకు వందలాది కరపత్రాలను పంపిణీ చేశారు.
సిఐఏ, బ్రిటిష్ ఎం16 ఏజంట్లు రూపొందించిన కుట్రలో భాగంగా ఆరుగురు మిలిటరీ అధికారులను కిడ్నాప్ చేసి, వారిని హత్యగావించి, ఆ పని చేసింది కమ్యూనిస్టులే అని ప్రచారం చేసి దాడులకు రంగాన్ని సిద్దం చేశారు. కమ్యూనిస్టుల మీద చర్యలు తీసుకుంటే అమాయక చైనీయులు కొందరు ఇబ్బందిపడినప్పటికీ, వారే కారకులని గుర్తించినందున అంతం చేయకతప్పదని రేడియో ప్రసారాలు, ఆ కరపత్రాలతో రెచ్చగొట్టారు. ప్రవాసంలో ఉన్న జాతీయవాదులైన ఇండోనేషియన్ల పేరుతో సింగపూర్‌లో తిష్టవేసిన ఐఆర్‌డి నిపుణులు రాసిన సమాచారాన్ని ప్రచారంలో పెట్టారు. 1965 అక్టోబరులో ఊచకోతలను ప్రారంభించే ముందు కమ్యూనిస్టులను అంతమొందించాలని ప్రేరేపించారు. ఈ దుర్మార్గంలో తమ పాత్ర లేదని బ్రిటన్ దశాబ్దాల తరబడి చెప్పుకున్నది. కానీ ఇప్పుడు నాటి పత్రాలు వెల్లడి కావటంతో దాని దుర్మార్గం నిర్థారితమైంది. కమ్యూనిస్టుల నుంచి దేశాన్ని కాపాడేపేరుతో మిలిటరీ అధికారి సుహార్తో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. అధ్యక్షుడు సుకర్ణోను బందీగా పట్టుకొని సుకర్ణో పేరుతోనే ఊచకోతకు పాల్పడ్డాడు. తరువాత 1967లో తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించు కొని 32సంవత్సరాలు నిరంకుశపాలన సాగించాడు.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం కోసం 1948లో నాటి లేబర్ పార్టీ ప్రభుత్వం ఐఆర్‌డిని ఏర్పాటు చేసింది. అరబ్బు ప్రాంతం, ఆఫ్రికా, ఆసియాల మీద ప్రధానంగా ఇది కేంద్రీకరించింది. తప్పుడు వార్తలు, నకిలీ పత్రాలను ప్రచారంలో పెట్టటం వంటి పలు రూపాల్లో అది ప్రచారదాడులు చేసింది. తన ప్రచారాన్ని ఆకర్ణణీయంగా మార్చేందుకు యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టటం, జాత్యహంకారం, ముస్లిం మనోభావాల వంటి వాటినన్నింటినీ అది ఉపయోగించుకుంది. ఐఆర్‌డి ఏజంట్లు తెరవెనుక ఉండి స్వతంత్ర సంస్థల పేరుతో కొన్నింటిని సృష్టించి ఆ పేరుతో తాము రూపొందించిన తప్పుడు సమాచారాన్ని మీడియా, పశ్చిమ దేశాల ప్రభుత్వాలకు, అనేక సంస్థలకు అందచేసేవారు. తాము బురద జల్లదలచుకున్న దేశాలు, సంస్థల పేరుతో వాటిని రూపొందించేవారు. సోవియట్ వార్తా సంస్థ నొవొస్తి విడుదల చేయాల్సిన సమాచారాన్ని ఫోర్జరీ చేసి పదకొండుసార్లు ఐఆర్‌డి ప్రచారంలో పెట్టినట్లు తేలింది. వాటిలో ఒకటి ఈజిప్టుకు మిలిటరీ సాయాన్ని వక్రీకరించటం. 1967లో ఇజ్రాయెల్‌తో ఈజిప్టు జరిపిన ఆరు రోజుల యుద్ధంలో చేసిన సాయం వృధా అయినట్లు సోవియట్ నుంచి వెలువడిన వార్త పేర్కొన్నట్లు ప్రచారం చేశారు. ఇంతేకాదు అరబ్బు దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ముస్లిం బ్రదర్హుడ్ సంస్థ పేరుతో కూడా నకిలీవార్తలను సృష్టించారు. ఈజిప్షియన్లను తిరోగామి ముస్లిం మూఢనమ్మకాలను పాటించేవారుగా చిత్రించి చెడు మాటలు మాట్లేడే నాస్తికులు, సోవియట్లు ప్రచారం చేస్తున్నారని బురదజల్లుతూ ముస్లిం బ్రదర్హుడ్ పేరుతో ప్రచారంలో పెట్టారు. ఇజ్రాయెల్‌తో పోరులో అరబ్బుల ఓటమికి విశ్వాసం లేకపోవటమే కారణమంటూ ఆ సంస్థ పేరుతో రెచ్చగొట్టారు. యూదులకు మాతృదేశం పేరుతో ఇజ్రాయెల్ సృష్టికి బాటలు వేసిన, కుట్రలు చేసిన వారిలో బ్రిటన్‌ది ప్రధాన పాత్ర అన్న సంగతి తెలిసిందే. ఐఆర్‌డి తాను రూపొందించిన నకిలీవార్తలను నిజమని భావించేేందుకు, ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించే వారే వాటిని ప్రచారంలో పెట్టినట్లు నమ్మించేందుకు ఈజిప్షియన్లు నేరుగా యూదుల మీద ఎందుకు దాడులకు దిగటం లేదని రెచ్చగొడుతూ రాసేవారు.
ఆఫ్రికా దేశాల్లో సోవియట్ వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు సోవియట్ అనుకూల సంస్థల పేర్లతోనే ప్రచారం చేశారు. ఆఫ్రికన్లు అనాగరికులని ప్రపంచ ప్రజాతంత్ర యువజన సమాఖ్య వర్ణించినట్లు ఒక వార్తను ఐఆర్‌డి ప్రచారంలో పెట్టింది. సోవియట్ విశ్వవిద్యాలయాల్లో చేరిన ఆఫ్రికన్ విద్యార్థులకు చదువు సంధ్యలు రావని తూలనాడినట్లుగా కూడా ప్రచారం చేసింది. ఈ తప్పుడు ప్రచార సంస్థను ఉపయోగించటంలో లేబర్, కన్సర్వేటివ్ పార్టీలు దేనికి ఏదీ తీసిపోలేదు. సోవియట్‌కు చేరువ అవుతున్న ఆఫ్రికా దేశమైన ఘనా సంగతి చూడాలని 1964లో కన్సర్వేటివ్ ప్రధాని అలెక్ డగ్లస్ ఆదేశించాడు. కొద్ది నెలల తరువాత చైనా - ఆఫ్రికన్ల మధ్య జాతులపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలని లేబర్ పార్టీ ప్రభుత్వ విదేశాంగ మంత్రి పాట్రిక్ గార్డన్ వాకర్ కోరాడు. 1977లో ఈ సంస్థను రద్దుచేసినట్లు ప్రకటించారు. మరొక పేరుతో అదే ప్రచారదాడులను కొనసాగిస్తున్నారు. తప్పుడు సమచారాన్ని ఎదుర్కొనేందుకు కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు 2022 ఫిబ్రవరిలో బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ ప్రకటించారు. ఆమె ప్రకటన తరువాత అదే నెలలో ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ పరిణామం గురించి పశ్చిమదేశాల సంస్థలు ఎన్ని అసత్యాలను ప్రచారం చేస్తున్నదీ తెలిసిందే. వాటిలో బ్రిటన్ ఒక ప్రధాన పాత్రధారి.
సోవియట్ ప్రచారాన్ని అడ్డుకొనే పేరుతో అమెరికా, బ్రిటన్ తదితర సామ్రాజ్యవాద దేశాలు జరిపిన దుర్మార్గాలు, ప్రచారదాడి గురించి ప్రపంచానికి తెలిసింది స్వల్పమే. ఐఆర్‌డి సంస్థలో 360 మంది పని చేశారు. వారి పని కమ్యూనిజం, సోవియట్ ముప్పు గురించి కల్పిత నివేదికలను తయారు చేసి వివిధ ప్రభుత్వాలకు, ఎంపిక చేసిన జర్నలిస్టులు, మేధావులకు పంపటం. వాటికి విశ్వసనీయత కల్పించేందుకు బ్రిటన్ గూఢచార, భద్రతా సంస్థలు అందచేసిన అంశాలను కూడా జోడించి స్వతంత్ర సంస్థల పేరుతో వాటిని పంపేవారు. అ సంస్థలు కూడా ఐఆర్‌డి ఏర్పాటు చేసినవే. వాటిలో 1964లో ఏర్పాటు చేసిన ''కమ్యూనిస్టు అనుబంధ సంఘాల గురించి శోధించే అంతర్జాతీయ కమిటీ'' ఒకటి. ఇది మరొక సంస్థను ఏర్పాటు చేసింది. దాని పేరు విశ్వాసుల సభ (లీగ్ ఆఫ్ బిలీవర్స్). దీని పనేమిటంటే రష్యన్లకు దేవుడి మీద విశ్వాసం లేదు, అరబ్బుల ఓటమికి దేవుడి మీద సరైన విశ్వాసం లేనివారిని అనుసరించడమే అంటూ పచ్చి మతోన్మాదాన్ని ప్రచారంలో పెట్టటం, అలాంటి వారి మన్నన పొందటం లక్ష్యంగా ఉండేది. అది ప్రచారంలో పెట్టినదానిలో ఒక అంశం ఇలా ఉంది. ''ఈ తరుణంలో అరబ్ జాతి ఇంతగా ఎందుకు విచారంలో ఉంది? విపత్తుకు గురైంది? ధైర్యవంతులైన అరబ్బు శక్తులు జరిపిన జీహాద్‌లో దుష్ట యూదుల చేతిలో ఎందుకు ఓడిపోయారు? సమాధానాలు కనుగొనటం సులభమే! మనం గతంలో అనుసరించిన సరైన మార్గం నుంచి వైదొలుగుతున్నాం. మతం ఒక సామాజిక జబ్బు అని భావించే కమ్యూనిస్టులు-నాస్తికులు మనకు సూచించిన మార్గంలో మనం వెళుతున్నాం'' అని పేర్కొన్నారు, అంటే కమ్యూనిస్టులు, సోషలిస్టు దేశాలకు దూరంగా ఉండాలని ముస్లింలను రెచ్చగొట్టటమే ఇది. ఇలాంటి రాతల్లో ఇజ్రాయెల్ మీద వ్యతిరేకతను చొప్పించేవారు. వాటిని చూసి సామాన్య అరబ్బులు సహజంగానే తమ హితం కోరేవారు చెబుతున్నట్లుగా భావించేవారు.
ఐఆర్‌డి సంస్థ ఒక్క కమ్యూనిస్టుల మీదనే కాదు, బ్రిటన్ ప్రయోజనాలు ఉన్న ప్రతి చోటా జోక్యం చేసుకుంది. ప్రస్తుతం జింబాబ్వేగా పిలుస్తున్న దేశం ఒకనాడు బ్రిటిష్ వలస ప్రాంతం. 1965లో ఇయాన్ స్మిత్ రొడీషియా పేరుతో స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. స్మిత్‌ను వ్యతిరేకించే వారి పేరుతో ఐఆర్‌డి ఒక నకిలీ గ్రూపును ఏర్పాటు చేసింది. తాజా పరిస్థితిని చూస్తే గతంలో సాగించిన మాదిరే ఇప్పుడూ ప్రచారం చేస్తున్నారు. చైనాలో ముస్లింలను అణచివేస్తున్నారని రోజూ వినిపిస్తున్న కట్టుకథలు అలాంటివే. రుణాల పేరుతో చైనా బలహీన దేశాలను ఆక్రమిస్తున్నదన్నదీ దానిలో భాగమే. కనుక వాట్సాప్, టీవీ, పత్రికల్లో వచ్చే వాటిని గుడ్డిగా నిజమని భావించరాదు!
- ఎం. కోటేశ్వరరావు
సెల్:8331013288