Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోటారు వాహన చట్టం-2019ని సవరించాలని కేంద్ర ప్రభుత్వం తేది: 4-10-2021న ఇచ్చిన గెజిట్ నెం. జిఎస్ఆర్ 714(ఇ) రద్దు చేయాలని, తదితర డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్రంలోని ఆటో, క్యాబ్, లారీ తదితర సంఘాలతో కూడిన జేఏసీ మే 19న ఒక్కరోజు 'రవాణా బంద్'కు పిలుపునిచ్చాయి. ఈ జేఏసీలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టియుసి, ఐఎఫ్‌టియులతో పాటు రాష్ట్ర పాలక పార్టీ టీఆర్ఎస్ అనుబంధ టీఆర్‌ఎస్‌కెవి కూడా భాగస్వామిగా ఉంది.
భారతదేశంలో ప్రమాదాలలో ఏడాదికి 5లక్షల మందికి పైగా గాయపడుతున్నారని, 1.5లక్షల మంది మరణిస్తున్నారని, ప్రజలకు భద్రత కల్పించడం కోసమే ఎం.వి. యాక్ట్ 1988 స్థానంలో 2019ని తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నది. రోడ్ సేఫ్టీ బిల్-2014తో ప్రారంభించి, కార్మికవర్గ పోరాటాలతో అనేక రూపాంతరాలు చెందింది. 2017లో బీజేపీ ప్రభుత్వం లోక్‌సభలో ఆమోదింపజేసుకున్నా, రాజ్యసభలో ఆమోదింపజేసుకోలేకపోయింది. 16వ లోక్‌సభ రద్దయి, 17వ లోక్‌సభ ఏర్పడడంతో ఎం.వి. యాక్ట్ 2017 కూడా రద్దయింది. తిరిగి 2019లో లోక్‌సభలో ప్రవేశపెట్టి, జూలై 23న లోక్‌సభలో ఆమోదం, జూలై 31న రాజ్యసభ ఆమోదం పొంది, 2019 ఆగస్టు 9న రాష్ట్రపతి ఆమోదముద్రతో 2019 సెప్టెంబర్ 1 నుండి చట్టరూపంలో అమలులోకి వచ్చింది. ఇప్పుడు ఆ చట్టంలోని అనేక సెక్షన్లకు ప్రత్యేక గెజిట్స్‌ను విడుదల చేసి వాటిని అమల్లోకి తీసుకువస్తున్నారు. అలా ముందుకు వచ్చిందే గెజిట్ నెం.714(ఇ). ఈ గెజిట్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయడానికి, ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందడానికి ఫీజులను, 15ఏండ్లు వయసు దాటిన వాహనాలకు చెల్లించాల్సిన ఫీజులను నిర్ధేశిస్తున్నది. రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం అప్లయి చేయడంలో జాప్యం జరిగితే మోటారు సైకిల్ అయితే నెలకు రూ.300లు, ఇతర నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలైతే నెలకు రూ.500లు ఫైన్‌గా చెల్లించాలి. 15ఏండ్లు దాటిన వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలంటే మోటారు సైకిల్‌కు రూ.1,000లు, మూడు చక్రాల వాహనమైతే రూ.3,500లు, తేలికపాటి వాహనం అయితే రూ.10,000లు, హెవీ గూడ్స్, పాసింజర్ వాహనమైతే రూ.12,500లు ఫీజు చెల్లించాలి. వీటితో పాటు ఫిట్నెస్ సర్టిఫికెట్ కాలపరిమితి ముగిసిన కాలానికి ప్రతి రోజుకు రూ.50ల చొప్పున చెల్లించాలని నిర్ధేశిస్తున్నది. ఉదాహరణకు ఒక ఆటో ఫిట్నెస్ సర్టిఫికెట్ లాప్స్ అయి ఒక ఏడాది అయితే రూ.3,500 + 18,250 = రూ.21,750లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది వాహన యజమానులకు తీవ్రమైన భారంగా ఉండడంతో బంద్ పిలుపుకు దారి తీసింది.
ప్రజలకు భారంగా మారనున్న అనేక నిబంధనలు
భారత రాజ్యాంగం ప్రకారం రవాణా అనేది రాష్ట్రాల జాబితాలో ఉంది. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర నిబంధనలు, రూల్స్ చట్టాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎం.వి. యాక్ట్-2019 ద్వారా ఆ రాష్ట్రాల హక్కులను కూడా కేంద్రం తనకు దఖలు పర్చుకున్నది. రాష్ట్రాల పరిధిలో ఉన్న సేల్స్ ట్యాక్స్‌ను జీఎస్టీ ద్వారా కేంద్రం తన పరిధిలోకి ఎలా తీసుకున్నదో అలా అన్నమాట. అలాగే టూరిస్టు పర్మిట్ నిబంధనలు సరళతరం చేసింది. రూ.15,000 నుండి రూ.3 లక్షలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే భారతదేశంలోని ఏ రాష్ట్రం నుండి ఏ రాష్ట్రానికైనా, సమయాలతో సంబంధం లేకుండా ఎన్నిసార్లైనా స్టేజీ క్యారేజీలాగా ప్రయాణీకులను ఎక్కించుకొని పోవచ్చు. ఈ నిబంధనల మార్పు ఫలితంగా ఆర్టీసీ బస్‌లకు అవకాశం కల్పించారు.
అలాగే ఈ చట్టం యాప్ ఆధారిత సంస్థల ద్వారా నడిచే ''అగ్రిగ్రేటర్స్'' సంస్థలను అనుమతించారు. కేవలం యాప్ మాత్రమే కలిగిన సంస్థ (ఓలా, ఊబర్, ఎల్వైఎన్కె) వాహన యజమాని, డ్రైవర్ నుండి తాను సంపాదించు కున్న దానిలో 35శాతం కాజేస్తున్నాయి. సరుకు రవాణా, ప్రజల రవాణాలోను కార్పొరేట్ సంస్థలు ప్రవేశించిన ఫలితంగా ఒకటి, రెండు వాహనాలు కలిగిన యజమానులు ఈ రంగం నుండి బయటకు నెట్టివేయబడ్తున్నారు.
ఇటీవల ఆర్టీసీ సంస్థ ప్యాసింజర్ సేఫ్టీ సెస్ పేరుతో ప్రతి ప్రయాణికుడి నుండి ఒక్క రూపాయి వసూలు చేస్తున్నది. ప్రమాదాలు జరిగినప్పుడు చెల్లిస్తున్న కాంపెన్సేషన్ కోసం ఈ డబ్బులు వినియోగిస్తామని చైర్మన్ చెప్పారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నుండి ఆర్టీసీ ఇప్పుడు మినహాయింపు పొందింది. ఎం.వి. యాక్ట్ 2019లోని సెక్షన్ 145(ఱ) ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను కంపల్సరీ చేశారు. ఇది అమలులోకి వస్తే ఒక టీఎస్ఆర్టీసీ పైననే రూ.350 కోట్లు వరకు అదనపు భారం పడుతుందని అంచనా. ఇది నేరుగా ప్రజలు భరించాల్సి వస్తుంది.
తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 8 సంవత్సరాలు అయింది. 77 షెడ్యూల్డ్ పరిశ్రమలలో కనీస వేతనాలు సవరించమని కార్మికవర్గం ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జీతాలు పెరగక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ సంస్థలోని కార్మికులకే ఐదు డీఏలు అమలు కాని పరిస్థితి ఉంది. ఎంవి యాక్ట్ 2019లో నిర్ధేశించిన ఫైన్స్‌కు పెరుగుతున్న ద్రవ్యోల్పణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న 10శాతం ఫైన్ పెరిగేలా నిర్థేశించారు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది. రోజూ కష్టపడుతున్నా కార్మికునికి కరువు భత్యం, కనీస వేతనం పొందాలంటే ఆందోళనలు చెయ్యాలి. కానీ ప్రభుత్వం ఒక చిన్న క్లాజ్‌తో ప్రజలపై ఫైన్ల భారం పెంచుతోంది.
చట్టంలో నిర్ధేశించిన ఫైన్లను రాష్ట్ర ప్రభుత్వం సవరించవచ్చని చట్టం చేస్తున్నది. అయితే కేంద్రం చట్టంలో ప్రతిపాదించిన ఫైన్లను తగ్గించడానికి వీలులేదు. కానీ వాటిని 1 నుండి 10 రెట్లు పెంచడానికి మాత్రం అనుమతించారు. అధికారులు ఇచ్చే ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఫైన్‌ను రూ.2,000కు పెంచారు. ఎటువంటి ఉత్తర్వులు ఉన్నాయో దానిలో స్పష్టత ఇవ్వలేదు. ప్యాసింజర్ ఓవర్‌లోడ్ అయితే ప్రతి ప్యాసింజర్‌కు రూ.1,000లు ఫైన్ చెల్లించాలి. ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10,000లు జరిమానా వేస్తారు. ఇటువంటివే అనేకరకాల ఫైన్లు పెంచారు. కొన్నింటికి జైలు శిక్షలు కూడా ప్రతిపాదించారు. మన రాష్ట్రంలో ఇప్పటికే అవి అమలులోకి వస్తున్నాయి.
ఫిట్నెస్ టెస్టింగ్ ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్స్‌లోనే చేయించాలి. అవన్నీ కూడా ప్రయివేటు కార్పొరేట్ కంపెనీలే ఏర్పాటు చేసాయి. అలాగే వాహనాల రిపేరింగ్ కూడా ఆథరైజ్డ్ షోరూంలలోనే చేయించాలి. ఐఎస్ఐ మార్కు ఉండి ఆథరైజ్డ్ షోరూంలలోని మెటీరియల్ వాడాలి. ఇది అమలులోకి వస్తే ప్రతి ఊరిలో రిపేర్లు చేసుకొని జీవనం గడుపుతున్న లక్షలాది మంది మెకానిక్‌లు ఏమైపోతారు? చిన్న చిన్న ఆటోమొబైల్ షాపుల ద్వారా జీవనం సాగిస్తున్న వారంతా ఏమైపోవాలి ?
ఇలా వివరించుకుంటూ పోతే ప్రజా వ్యతిరేకమైన అనేక అంశాలు మనకు అర్థం అవుతాయి. మొత్తంగా రవాణా రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పడం చట్టం లక్ష్యంగా ఉంది.
రాష్ట్రంలో పాలక పార్టీగా ఉన్న టిఆర్ఎస్ మొదట బిల్లు పట్ల వ్యవరేకత తెలిపినా, తర్వాత లోక్సభలోను, రాజ్యసభలోను బిల్లు చట్ట రూపం దాల్చేందుకు ఓటు చేసింది. ఈ చట్టంలో ప్రతిపాధించిన ఫైన్లు, ఇతర అనేక అంశాలు ఈ రాష్ట్రంలో అమలు చేస్తూనే ఉంది. అటువంటి పార్టీ ఈరోజు తన లైన్‌ను మార్చుకొని ఎం.వి. యాక్ట్ 2019ని వ్యతిరేకిస్తున్నామని ప్రకటన చేస్తూ ఆందోళనలో కలిసి వస్తున్నది. ఆ నేపథ్యంలో మే 19న ఈ బంద్తోటి పోరాటం ఆగిపోకూడదు. ప్రజా వ్యతిరేకమైన అంశాలలో సమూలమైన మార్పులు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలి. అలా ప్రజలను చైతన్యపరచాలి. అతి త్వరలోనే ప్రజలే స్వచ్ఛందంగా ''రవాణా బంద్'' పాటించే రోజు వచ్చేలా చేయాలి.
- పుష్పా శ్రీనివాస్