Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దక్షిణ భారత ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల ప్రియతమ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. 1913 మే 1న నెల్లూరు జిల్లా అలగానిపాడులో ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించిన సుందరయ్య జీవితమంతా ప్రజా ఉద్యమాల నిర్మాణానికి, మార్క్సిస్టు సిద్ధాంత పరిరక్షణకు పాటుపడ్డారు. చిన్న వయసులోనే సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాట దీక్ష అలవర్చుకున్న ఆయన బాల్యంలోనే కారాగార శిక్ష అనుభవించారు. తిరిగి వచ్చిన తర్వాత అమీర్ హైదర్‌ఖాన్ ద్వారా కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులైనారు. 1930వ దశకంలో దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి బీజాలు వేశారు. దేశంలోనే తొలి వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించారు. ఆంధ్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో రహస్యంగా పర్యటిస్తూ నాయకులను, కార్యకర్తలను ఎంతోమందిని తయారుచేసి తీర్చిదిద్దారు. తన వాటాకి వచ్చిన యావదాస్తిని పార్టీకి ఉద్యమానికి ధారబోసి అత్యంత నిరాడంబరంగా, నియమబద్ధంగా, నిర్మాణాత్మకంగా జీవించారు. ప్రజలతో నిత్యం మమేకం కావడం, పోరాటాలు నడిపించడం, సిద్ధాంత అధ్యయనం, సమాజ పరిశీలన, ఉద్యమ నిర్మాణం ఇలా అన్ని విషయాల్లోనూ ఆయన తిరుగులేని యోధుడు.
తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఒక మహాశక్తిగా మలచడంలో సుందరయ్య అగ్రగణ్యుడు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించారు. భూమిలేని నిరు పేదలకు ఆ పోరాటం 10లక్షల ఎకరాల భూమిని పంచింది. 3000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పర్చారు. నైజాంను భారతదేశంలో విలీనం చేయడానికి భారత సైన్యాలు వచ్చినప్పటికీ అవి కమ్యూనిస్టులను అణచివేయ చూసినప్పుడు సాయుధ పోరాటం కొనసాగిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో ఆయన కృషి గణనీయమైనది. అజ్ఞాత వాసాలు, అరణ్యవాసాలు సాగిస్తూ ఆ పోరాటానికి మార్గదర్శకత్వం అందించారు. స్వాధీనం చేసుకున్న భూములపై హక్కులు వచ్చేంత వరకు పోరాటం కొనసాగించారు. ఆ క్రమంలోనే భారతదేశ వ్యవసాయ సమస్యను క్షుణ్ణంగా అధ్యయనం చేసి శాస్త్రీయ విధానాన్ని రూపొందించడానికి కారకులైనారు.
కమ్యునిస్టు పార్టీ తొలి కేంద్ర కమిటీలో సభ్యుడైన సుందరయ్య ఆఖరి వరకు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉన్నారు. మితవాద, ఉగ్రవాద పెడ ధోరణులు తలెత్తినపుడు మార్క్సిస్టు సిద్ధాంత స్వచ్ఛతను కాపాడడం కోసం అంతర్గత పోరాటాన్ని సాగించడమే గాక చాలా కాలం కారాగారవాసం కూడా అనుభవించారు. సీపీఐ(ఎం) ఏర్పడినప్పుడు తొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పార్టీ విస్తరణకు పునాదులు వేశారు. పశ్చిమబెంగాల్లో అర్థ ఫాసిస్టు బీభత్సకాండ కాలంలో రంగంలో ముందుండి వారికి చేయూతనందించారు. ఎమర్జెన్సీ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చి మళ్ళీ ఉద్యమ నిర్మాణాన్ని పటిష్టం చేసేందుకు విస్తృత పరిచేందుకు అంకితమైనారు. రెండేండ్ల పాటు రాష్ట్ర కార్యదర్శిగానూ పనిచేశారు.
ప్రజా ఉద్యమాలు పోరాటాలతో పాటు చట్టసభ ల్లోనూ సుందరయ్య ప్రజల వాణి వినిపించడంలో గొప్ప పాత్ర నిర్వహించారు. భారత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా 1952-54 మధ్య రాజ్యసభలో ఉండి నాటి ప్రధాన ప్రతిపక్షమైన కమ్యూనిస్టు సభ్యులకు నేతృత్వం వహించారు. పార్లమెంటుకు సైకిల్‌పై వెళ్లిన ఆయన నిరాడంబరత్వం చరిత్రలో నిలిచిపోయింది. 1955లో ఆంధ్ర శాసనసభ మధ్యంతర ఎన్నికలలో పాలకవర్గాలు బడా పత్రికలు విషపు ప్రచారాలు సాగించినా వాటిని లెక్కచేయకుండా నికరంగా పోరాడారు. 1962లో గెలుపొంది విశాఖ ఉక్కు సమస్యపై రాజీనామా చేసి మళ్ళీ 1978-83 మధ్య శాసనసభ్యుడుగా ఉన్నారు. చట్టసభల్లో అర్థవంతమైన ప్రసంగాలకు, గౌరవప్రదమైన నడవడికి ఆయనను నమూనాగా పార్టీలకు అతీతంగా అందరూ అంగీకరిస్తారు. ఆయన కమ్యూనిస్టు నాయకుడుగానే గాక త్యాగధనుడుగా అందరి గౌరవాభిమానాలు పొందగలిగారు. సుందరయ్య లీల దంపతులిద్దరూ సంతానాన్ని కూడా వద్దనుకుని ఉద్యమ నిర్మాణానికే అంకితమైన తీరు గొప్ప స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
కామ్రేడ్ సుందరయ్య రాజకీయాలతో పాటు కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలోనూ మహత్తర కృషి చేశారు. తెలుగు జాతి సాహిత్య సాంస్కృతిక పునరుజ్జీవనానికి సదా శ్రద్ద వహించారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకం రాసి భావికి బాట చూపారు. నవశక్తి, స్వతంత్ర భారత్, ప్రజాశక్తి, విశాలాంధ్ర, తిరిగి ప్రజాశక్తి వంటి పత్రికలు స్థాపించడం ద్వారా కమ్యూనిస్ట్ భావాలను వ్యాప్తి చేసేందుకు కృషి చేశారు. భారత కమ్యూనిస్టు నాయకుడుగా అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో గౌరవాభిమానాలు పొందిన సుందరయ్య శ్రామికవర్గ అంతర్జాతీయను నిలబెట్టిన యోధుడు. కమ్యునిస్టు ప్రమాణాలకూ, క్రమశిక్షణకూ సుందరయ్య పెట్టింది పేరు. కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలను తు.చ. తప్పకుండా ఆచరించిన సుందరయ్య అగ్రనేతల నుంచి అతి సామాన్యుల వరకూ అందరితో కలిసిపోయి ఆదరాభిమానాలు పొందారు. కార్యకర్తల పట్ల సదా శ్రద్ద వహిస్తూ కంటికి రెప్పలా పార్టీని కాపాడారు. ఈ నిర్విరామ కృషిలో కారాగార వాసాలు, అరణ్య, అజ్ఞాత వాసాల మద్య ఆయన అనారోగ్యంతో పెనుగు లాడుతూ వచ్చారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉండగానే 1985 మే 19న ఆయన కన్నుమూశారు. ఆయన అంతిమ యాత్ర మరే నాయకుడికి జరగనంత ఘనంగా జరిగింది. సుందరయ్య మృతి పట్ల రాజకీ యాలకు అతీతంగా ప్రతి వారూ జోహార్లర్పించారు. భారత కమ్యూనిస్టు ఉద్యమంతో, ప్రత్యేకించి తెలుగు నాట శ్రమజీవుల ఉద్యమాలతో పెనవేసుకుపోయిన, సుందరయ్య జీవితాదర్శాన్ని, సైద్ధాంతిక గమనాన్ని, రాజకీయ నిర్మాణ కృషిని స్మరించుకోవాలి. సుందరయ్య జీవిత సందేశాన్ని వివిధ రూపాలలో భావితరాలకు అందించేందుకు విస్తృత ప్రయత్నం జరగాలి. ఆయన వారసత్వాన్ని సమున్నతంగా నిలబెడతామని సుందరయ్య 37వ వర్థంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ ముందుకు సాగుదాం.
- జూలకంటి రంగారెడ్డి