Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాశంలో పావురాలు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. పిల్లపావురం తల్లి పావురాన్ని అడిగింది...
''మనం గుడి, మసీదు, చర్చి, గురుద్వారాలన్నీ తిరుగుతాం. వాటిపై వాలుతాం. గింజలు కనబడితే ఏరుకుని తింటాం. మరి మనలాగే మనుషులు కూడా వాటిలో తిరుగుతూనే ఉంటారు. ప్రార్థనలు చేస్తుంటారు. కానీ, ఎందుకు తన్నుకు ఛస్తారో తెలియదు. మన పావురాల్లో అలా కొట్లాటలు, రాళ్ళు విసరడాలు, నరికి చంపడాలు ఉండవు కదమ్మా?'' అని అంది. ఆ ప్రశ్నకు తల్లి పావురం సంతోషించి, జవాబు చెప్పింది. ''మనం మనుషుల కన్నా ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్ళం. పై పైకి ఎగిరినకొద్దీ అందమైన, అద్భుతమైన దృశ్యాల్ని చూస్తాం! మనది స్వేచ్ఛా ప్రపంచం. జీవరాసులన్నింటి కన్నా మనిషే తెలివైనవాడు... అని అంటారే గానీ, కుల, మత, జాతి, లింగ, వర్గ, వర్ణ, ప్రాంతాల గోడలు ఎత్తుగా కట్టుకుని కుంచించుకు పోతున్నాడు'' అని చెప్పింది.
''ప్రేమ లేని జగత్తు చచ్చిన ప్రపంచమే! ఎవరి పనిలో వారు బందీలై, బాధ్యతలు మోస్తూ ఉన్నప్పుడు ప్రేమ పూర్వకమైన పలకరింపు, స్పర్శ స్వర్గతుల్యమవుతుంది'' అన్నాడు - ఫ్రెంచ్ తత్త్వవేత్త ఆల్బర్ట్ కామూస్. విశ్వప్రేమ, కరుణ గురించి అద్భుతమైన సందేశమిచ్చిన బుద్ధుడు - ఒక్కొక్కసారి తర్కాన్ని పక్కనపెట్టి, వెంటనే చేయాల్సింది చేయాలని హితవుపలికాడు. ఉదాహరణకు ఒక బాణం మనకు తగిలినప్పుడు... అది ఏ దిశలో ఎంత వేగంతో వచ్చిందన్న తర్కం కంటే, తగిలిన గాయానికి, తగిన మందు వేసుకుని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మూలికల గూర్చి చదివినంత మాత్రాన వైద్యశాస్త్రం అంతా తెలిసినట్టు కాదు. ఎప్పుడు, ఎక్కడ, ఎంత మోతాదులో వాడాలో తెలుసుకుని వాడాలి. దానివల్ల ప్రయోజనం పొందడం వివేచన! అది మనిషికి మాత్రమే ఉన్న ప్రత్యేకమైన గుణం!! - అని అన్నాడు.
సమాజం భ్రష్టు పట్టి పోయింది. మనుషులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు - నిజమే! కాని మానవత్వం గల మనుషులు కొందరైనా ఉన్నారు. కుల మత ప్రాంతీయ బేధాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నారు. అయితే, సమాజంలో వీరి శాతాన్ని బాగాపెంచుకోవాల్సిన అవసరం ఉంది. న్యూజిలాండ్‌లోని గ్రేమోత్ లోకల్ మార్కెట్లో ఒక దయార్ద్ర హృదయుడు తిరుగుతుంటాడు. బతికి ఉన్న తాబేళ్ళను కొంటూ ఉంటాడు. రొయ్యలు, చేపలు లాగా అక్కడ ఫుడ్ మార్కెట్లో తాబేళ్ళు కూడా అమ్ముతారు. ఎందుకంటే వాటిని తినేవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. మనం చెప్పుకున్న ఈ దయార్ద్ర హృదయుడు తాబేలు మాంసం కోసం రాడు. తాబేళ్ళను రక్షిద్దామని వస్తుంటాడు. బేరమాడి తాబేళ్ళన్నిటినీ కొని ట్రక్కులో సముద్రం దాకా తీసుకుపోయి, ఒక్కొక్కటిగా వాటిని మళ్ళీ సముద్రంలోకి వదులుతాడు. అంటే... వాటికి మళ్ళీ ప్రాణం పోసినట్టు. అక్కడి తాబేళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఒకరకంగా అంతరించిపోతున్న తాబేళ్ళ జాతికి జీవం పోస్తున్నట్టే కదా? పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతున్నట్టే కదా? ఏదో విధంగా తమ పని గడిస్తే చాలు ననుకుంటున్న మనుషుల మధ్య ఎంతో బాధ్యతతో 'మనిషి'లా ప్రవర్తించే వారున్నారు. 'ప్రపంచమేం గొడ్డుపోలేదు' - అని అన్నది అందుకే. పాపువా న్యూగైనా మార్కెట్ల దగ్గర ఇలాంటి జీవ పరిరక్షకులు ఉన్నారు. వారాంతాల్లో, సెలవు దినాల్లో వారికి అదే పని!
ఇటీవల 2 ఏప్రిల్ 2022న రాజస్థాన్ జైపూర్‌లో మానవత, మతాన్ని గెలిచింది. మధూలిక అనే ఒక 48 ఏండ్ల హిందూ మహిళ 13మంది ముస్లింల ప్రాణాలు కాపాడింది. భర్త చనిపోయిన ఆమె, తన ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటూ ఒక బట్టల కొట్టు నడుపుకుంటూ జీవిస్తోంది. ఆమె బట్టలకొట్టు ఉన్న ఆ వీధిలో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారు. ఒక రోజు హిందూ వర్గానికి చెందిన గుంపు-శోభాయాత్ర ఊరేగింపు తీస్తూ, లౌడ్స్పీకర్స్తో గోల చేస్తూ, అల్లర్లు సృష్టించింది. అందులో భాగంగా అక్కడ ఉన్న 13మంది ముస్లింలను కొట్టి చంపాలని కోపోద్రిక్తులై... వారి వెంట పడ్డారు. అదంతా గమనించిన మధూలిక ముస్లింలను తన కొట్టులోకి పంపి, షట్టర్ వేసేసింది. ఆ తర్వాత హిందూ దుండగులను ధైర్యంగా ఎదుర్కొంది. అతి కష్టంమీద వారిని వెనక్కి పంపించింది. 'మానవత్వమే అన్నిటి కన్నా గొప్పదని భావించి, ముస్లిం సోదరులకు సాయం చేశాననీ - మతాల కన్నా మనుషులే ముఖ్యమని' - ఆమె అన్నారు. ఒక సామాన్య మహిళ ఆచరణాత్మకంగా ఎంతో గొప్ప సందేశం ఇచ్చారు. ఈ సంఘటన తెలుసుకోగానే, మన తెలుగు కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి పాట గుర్తుకొచ్చింది...
''మతమన్నది నా కంటికి మసకైతే
మతమన్నది నా మనసుకు మబ్బయితే
మతం వద్దు గితం వద్దు - మాయా మర్మం వద్దు''
కొన్నేళ్ళ క్రితం ఆకాశవాణి లలిత సంగీతం కార్యక్రమంలో ఈపాట తరచూ వినిపిస్తూ ఉండేది. ఇక్కడ గమనించవలసిన విషయమేమంటే... దేవులపల్లి కృష్ణశాస్త్రి ఏ హేతువాదో కాదు. కేవలం మంచి మనసున్న కవి. మానవత్వంపై నమ్మకమున్న కవి. అంతే! అలాంటివాడే మతాన్ని ఎంత తీవ్రంగా నిరసించాడో గమనించండి! మెయిన్స్ట్రీమ్లోనూ, సోషల్ మీడియాలోనూ కొన్ని వార్తలు నిజంగానే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఫరవాలేదు... సమాజంలో ఇంకా అక్కడక్కడ కొందరు ''మనుషులు'' ఉన్నారని సంతోషం కలుగుతుంది.
హైదరాబాదు పాత బస్తీలో గాజుల అంజయ్య అందరికీ తెలిసినవాడు. అతని మిత్రులలో చాలా మంది ముస్లింలే. 17 ఏప్రిల్ 2022న తన కొడుకు పెళ్ళికి మిత్రులందరినీ పిలిచాడు. అవి రంజాన్రోజులు గనక, రోజా పాటించే తన ముస్లిం మిత్రులెవరూ ఇబ్బంది పడకూడదని వారికోసం ప్రత్యేక వసతులు కల్పించాడు. నమాజ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేశాడు. ఇఫ్తార్ విందూ ఏర్పాటు చేశాడు. వారంతా మరునాడు ఉపవాసం పాటించేందుకు సహౌరీ ఏర్పాటు చేశాడు. వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసం విద్వేషాలు నూరిపోసే వారి వలలో పడకూడదనీ - గంగా జమునా తహజీబ్‌ను అందరూ కాపాడుకోవాలనీ పాతబస్తీ అంజయ్య చెపుతుంటాడు. ఒక హిందువుల వివాహవేడుకలో ముస్లింల కోసం రంజాన్ ఏర్పాట్లు చూసి అతిధులంతా ఆశ్చర్యానికీ, ఆనందానికీ గురయ్యారు.
ఇలాంటిదే మరో సంఘటన కేరళలో జరిగింది. ఒక ముల్లాగారు తమ మసీదులో హిందూ అమ్మాయి వివాహం జరిపించి అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. కోజికోడ్‌లో మసీదు ఉన్న ఓ వీధి చివరిలో ఒక హిందూ మహిళ ఉంటోంది. ఆమెకు ఈడొచ్చిన కూతురు ఉంది. కానీ ఆ మహిళ కూతురి పెండ్లి చేయలేకపోతోంది. అమ్మాయిని ప్రేమించిన యువకుడు మంచి కుర్రాడు. కట్నం లాంటిది ఏదీ లేకుండా పెండ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ, అతని కుటుంబం వారు మాత్రం పెళ్ళి హిందూ సంప్రదాయాల ప్రకారం ఘనంగా జరగాలన్నారు. అమ్మాయి తల్లికి ఆ స్థోమత లేదు. ఎటునుంచీ ఏ ఆధారమూ లేదు. తనకు ఉన్న పరిచయం కొద్దీ ఓ రోజు ఆమె ముల్లాగారికి తన గోడు వెళ్ళబోసుకుంది. ఆయన ఒక రోజంతా ఆలోచించి, ఒక నిర్ణయం తీసుకున్నాడు. పెండ్లి జరిపించి, వంద మందికి భోజనాలు పెట్టించే బాధ్యత తనమీద వేసుకున్నాడు. అంతా బాగానే ఉంది. కాని పెళ్ళి జరిపించడానికి చిన్నపాటి ఓ మోస్తరు హాలు కావాలి కదా? అదెలాగండీ? అని అడిగిందామె - అందుకు ముల్లాగారు నవ్వి ''దేనికీ కంగారు పడాల్సిన పనిలేదు. మా మసీదులోని విశాలమైన ప్రాంగణంలోనే పెళ్ళి! మేళ తాళాలు కూడా నేను మాట్లాడతాను. ఒక్క పంతులుగారిని పిలుచుకుని, మీ పద్ధతిలో మీరు నిరభ్యంతరంగా పెండ్లి జరిపించుకోండి!'' అని అన్నాడు. ఆ విధంగా ఒక హిందూ వివాహానికి ఒక మసీదు వేదిక అయ్యింది. ఇది కదా భారతదేశమంటే... అని అనుకున్నారు - అందరూ. ఈ సంఘటనని ప్రాంతీయ మళయాళ దినపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. అంతే కాదు, 'ద హిందూ' జాతీయ ఇంగ్లీషు వార్తా పత్రిక కూడా ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇది కోవిడ్ లాక్‌డౌన్‌కు ముందు 2019లో జరిగింది.
ముస్లింల, క్రైస్తవుల సఖ్యత గూర్చి కూడా ఒక సంఘటన గుర్తు చేసుకుందాం. ఇది 21 ఏప్రిల్ 2022న మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ముస్లింలు చర్చిలో నమాజు చదివారు. అదే విచిత్రం! ఇఫ్తార్ విందుకోసం అజ్మల్‌ఖాన్ అనే వ్యక్తి అన్ని మతాల మత పెద్దల్ని ఆహ్వానించాడు. అయితే అక్కడ చర్చి ఫాదర్ ఆ విందును అంగీకరించడమే కాకుండా... ఆ ఇఫ్తార్ విందును తన చర్చిలోనే నిర్వహించాలని సూచించాడు. అందువల్ల ఇఫ్తార్ విందు తొలిసారి ఒక చర్చిలో ఫాదర్ పర్యవేక్షణలో జరిగింది. ముస్లింలంతా చర్చిలోనే నమాజు చేసుకున్నారు. మరో విచిత్రం ఏమిటంటే... ముస్లిం సోదరులతో కలసి చర్చి ఫాదర్ కూడా నమాజు చేశాడు. పరమత సహనం - సహకారం అంటే ఇదే కదా? అసలైన భారతదేశపు 'ఆత్మ' అక్కడ తొణికిసలాడింది. ఆత్మ అంటే ఆత్మ-పరమాత్మలూ కావు. అంతరంగంలోని ఒక సమర్పణ భావం! ఆలోచనల ఐక్యత. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం. మనిషి, మనిషిని మనిషిగా గుర్తించి ప్రేమించడం!
ఇక్కడ చెప్పుకున్న అన్ని సంఘటనలకూ, ఒక అంత స్సూత్రం ఉంది! ''దేవుడులేడు - మతం అనేది వ్యక్తిగత విశ్వాసం. మన చివరి గమ్యం మా'నవ'వాదం'' అనేది సాధించడానికి... ఇలా మెల్లగా అడుగులు పడుతున్నాయేమో? ఇలా తరతమ బేధాలు మరిచి, మనుషులంతా ఒక్కటే అనే విషయం జీర్ణించుకుంటారేమో... మనిషికి మనిషే ముఖ్యం - దేవుళ్ళుకాదు, అనే భావనలోకి వస్తారేమో - మత విద్వేషాలు రేపి, మారణ హౌమం సృష్టించే వారి ఆట కట్టిస్తారేమో - అందుకే చేగువేరా అంటాడు... ''మన మార్గం సుదీర్ఘమైంది. రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలియదు. మన పరిమితులు మనకు తెలుసు. 21వ శతాబ్దపు స్త్రీ, పురుషుల్ని - అంటే మనల్ని మనం కొత్తగా తయారు చేసుకోవడానికి రోజువారీగా కృషి చేస్తూనే ఉండాలి!'' అని! బూజు పట్టిన భావజాలాన్ని వదిలి, కొంచెం కొంచెంగా పైకి ఎదుగుతూనే ఉండాలి కదా?
'నువ్వు బతికి ఉన్నావంటే / నీ జీవితపు విజయోత్సవాన్ని పంచుకో
స్వర్గమనేది ఎక్కడైనా ఉంటే / దాన్ని భూమి మీదికి దించుకో' అని మాత్రం గట్టిగా చెప్పాలనిపిస్తుంది.
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.