Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిష్యుడు: గురువుగారూ గురువుగారూ.. మీకొక రియల్ స్టోరీ చెప్తాను వినండి. అది అమెరికా దేశంలో ఓ నగరం. పేరు బఫెలో. అక్కడ ఓ సూపర్ మార్కెట్‌కు ఓ శ్వేతజాతి కుర్రోడు (18సంవత్సరాలు) 320 కి.మీ. కార్లో ప్రయాణం చేసి వేగంగా వచ్చాడు. చూడటానికి మిలట్రీ దుస్తులు ధరించి ఉన్నాడు. బుల్లెట్ పూఫ్ర్ జాకెట్ కూడా వేసుకున్నాడు. అప్పుడతడు చేయాలనుకున్న పని అతనికి సుస్పష్టం. అకస్మాత్తుగా రైఫిల్ తీసి దఢా దఢా కాల్పులు జరిపాడు. బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఆ శబ్దానికి మార్కెట్లోని ప్రజానీకం భయకంపితు లయ్యారు. కకావికలై చెల్లాచెదురైపోయారు. అరుపులు కేకలతో తేరుకునే లోపులోనే... అంటే ఆ లిప్తకాలంలోనే ఆ ప్రాంతమంతా రక్తసిక్తమయింది. పదకొండుమంది ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. మరికొంత మంది క్షతగాత్రులయ్యారు. మృతులలో తొమ్మిదిమంది ఆఫ్రో - అమెరికన్లు అంటే నల్ల జాతీయులు.
తన సాహసమంతా లోకానికి వెనువెంటనే తెలపాలనే కాంక్షతో కెమెరా గల శిరస్త్రాణం ధరించాడు. ఆన్లైన్లో లైవ్స్క్రీన్లో ప్రజలంతా ఎప్పటికప్పుడు చూడాలని తాపత్రయ పడ్డాడు. జాతివిద్వేషం ఓ పాల బుగ్గల యువకుడిచేత ఇంత ఘాతుకం చేయిస్తుందా...? అంటే నిజమే... చేయిస్తుంది అనే సమాధానం వస్తున్నది.
ఆ యువకుడి పేరు పి. జెండ్రన్. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హింసాయుత చర్య. 'టాప్స్ ఫ్రండ్లీ' అనే ఆ మార్కెట్‌కు ఎక్కువగా నల్లజాతివారు వస్తారు గనుకనే అతడు ఆ మార్కెట్‌ను ఆ సమయాన్ని ఎంచుకున్నాడు. రద్దీగా ఉండే సమయం శనివారం మధ్యాహ్నం వేళ ప్రవేశించాడు. అడ్డుకున్న గార్డులపై కూడా కాల్పులు జరిపాడు. గార్డుల్లో నేలకొరిగిన విశ్రాంత పోలీసు అధికారి కూడా ఉన్నాడు. కొంతసేపటికి ఇతర పోలీసు అధికారులు, గార్డులు, ప్రజలు వచ్చి చుట్టుముట్టడంతో అతడు విధిలేక అప్పుడు లొంగిపోయాడు. చివరకు దీనిని జాతి విద్వేష నేరంగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ద్రిగ్భాంతి వ్యక్తంచేశాడు.
గురువు: భేష్.. బాగా చెప్పావ్. టెంపో సడలకుండా చక్కటి స్క్రీన్‌ప్లేతో ఇటీవల జరిగిన వాస్తవాన్నే కథగా రక్తికట్టించావ్. కాస్త స్థిమితపడు. ఇలా కూర్చో. అమెరికా అంటేనే ఓ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దేశమని తెలుసుగా... తుపాకుల సంస్కృతి అనేది వారి పాలనలో అంతర్భాగం అని మనం గమనించాలి.
శిష్యుడు: తుపాకుల సంస్కృతా?
గురువు: అవును తుపాకుల సంస్కృతే. అక్కడి జనాభా కంటే తుపాకుల సంఖ్యే ఎక్కువ. ప్రతి వంద మందికి 120 తుపాకులున్నాయి. మార్కెట్లో సబ్బులు, టూత్పేస్ట్లు మాదిరి అంగడి సరుకుల్లా అక్కడ తుపాకులు కూడా కొనుక్కోవచ్చు. ప్రతి ఏటా వేలాది మంది ఇలా విచ్చలవిడి కాల్పుల్లో చనిపోతూనే ఉంటారు. ఒక లెక్కప్రకారం వారానికి సగటున ఓ పది విచ్చలవిడి కాల్పులు అమెరికాలో ఎక్కడోచోట జరుగుతూనే ఉంటాయి.
శిష్యుడు: అవ్వ.. అవ్వ... ఇదేమైనా దీపావళి పండగటండీ, బొమ్మ తుపాకులతో పిల్లలు ఎక్కడికక్కడ పేల్చుకోవడానికీ. ప్రాణాలు పోతాయకదండీ. మరి ఈ ఘోరాన్ని ఆపే దిక్కేలేదా..?
గురువు: అంత తేలిక కాదు శిష్యా. విషయం తెలుసుకోవాలంటే మనం వందల ఏళ్ళ వెనక్కి వెళ్ళాలి. అప్పుడు బ్రిటిష్ పాలనలో అమెరికా వారికి సరైన భద్రతా వ్యవస్థలేదు. ఎవరి రక్షణవారిదే. స్వీయరక్షణ కోసం అమెరికా పౌరులు తుపాకులు చేపట్టారు. తుపాకులు అమ్మేది మరల బ్రిటిష్ వ్యాపారులే.
ఒక వైపున అమెరికాను పాలించేది బ్రిటిష్‌వారే అయినా బందిపోట్ల దాడుల నుండి అమెరికా ప్రజలకు రక్షణ ఉండేది కాదు. కొందరు బ్రిటిష్ వ్యాపారులైతే తమ తుపాకుల అమ్మకాలకోసం దొంగలు, బందిపోట్లను ప్రజలపై ఉసికొల్పేవారు కూడా. ఆ విధంగా బ్రిటిష్ తుపాకీ కంపెనీల దొరలు విపరీతంగా లాభాలు ఆర్జించారు.
అందుకే అమెరికా రాజ్యాంగం పౌరులకు తుపాకులు ధరించే స్వేచ్ఛను కల్పించింది. అంటే అమెరికా పుట్టుకే తుపాకుల సంస్కృతితో పుట్టింది.
శిష్యుడు: అప్పుడు సరే... ఇప్పుడు మరి ఇంత ఘోరం జరుగుతున్నా మార్పురాలేదా...?
గురువు: రాలేదు. అందుకు కారణం ఆ దేశంలోని నేషనల్ రైఫిల్ అసోసియేషన్. 1871లో ఏర్పడిన ఈ సంస్థ, ఎవరు తుపాకుల నియంత్రణకు ప్రయత్నించినా ఎదుర్కొంటూనే ఉన్నది. లక్షలాది మంది ఈ తుపాకుల సంస్కృతికి బలైపోతున్నా ఇది లెక్కచేయడం లేదు.
శిష్యుడు: మరి అమెరికా గొప్ప ప్రజాస్వామ్యదేశం అంటారే. అక్కడి సెనేటర్లు కూడా మాట్లాడటం లేదా?
గురువు: సెనేటర్స్లో ఒకరో ఇద్దరో మాట్లాడినా ఈ సంస్థ బలమైన లాబింగ్తో ఎప్పటికప్పుడు వారిని అడ్డుకుంటున్నది. కారణం లాబింగ్లో ప్రధాన పాత్ర పోషించేది మరల తుపాకుల వ్యాపారులే కదా!
శిష్యుడు: అవునవును.. అప్పుడూ వారే. ఇప్పుడూ వారే.
గురువు: విశేషమేమంటే... తుపాకుల సంస్కృతి వద్దనే బలమైన ప్రజాభిప్రాయాన్ని కూడా ఈ వ్యాపార వర్గాలు మీడియాతో అడ్డుకుంటున్నాయి. తిమ్మిని బమ్మిని చేస్తున్నాయి.
శిష్యుడు: మరి దీనికి పరిష్కారం?
గురువు: పరిష్కారం కంటే ప్రమాదాన్ని గుర్తించడంలోనే పాలకులు విఫలమవుతున్నారు. తమ లాభాల వేటలో ఈ తుపాకుల సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు. అందుకే ఉన్మాదాన్ని, హింసను, విద్వేషాన్ని ఆర్పకుండా నిత్యం రగులుస్తూనే ఉన్నారు.
2020లో ఈ విచ్చలవిడి కాల్పుల వలన 19,384 మంది చనిపోతే, చేతిలో తుపాకి ఉంది కాదా అని ఆత్మహత్యగా కాల్చుకు చనిపోయిన వారు 24,292 మంది అని లెక్కలు చెపుతున్నాయి. క్షణికావేశం, హింసోన్మాదం ఎంతటి వారినైనా క్షణాల్లోనే బలి తీసుకుంటుంది.
అమెరికా అధ్యక్షులు అబ్రహం లింకన్, జాన్ కెనడీలు ఇలా తుపాకీ సంస్కృతికే బలైపోయారనే విషయం మనం మరువరాదు.
శిష్యుడు: అవునవును.. మన దేశంలో కూడా మహాత్మాగాంధీ, ఆర్ఎస్ఎస్ వ్యక్తి నాథూరాం గాడ్సే తుపాకీ గుళ్ళకు బలైపోయాడు కదా!
గురువు: శాంతియుత సమాజం కావాలంటే తుపాకీ సంస్కృతి కచ్చితంగా పోవాల్సిందే శిష్యా....
- కె. శాంతారావు
సెల్: 9959745723