Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ద్రవ్యోల్బణం (ఇన్ఫేషన్) అంటే ధరల పెరుగుదల. ప్రస్తుత ధరలను గత నిర్దిష్ట కాలానికి సరిపోల్చి శాతం రూపంలో ఈ ద్రవ్యోల్బణ హెచ్చుతగ్గులను ప్రతి నెలా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటుంది. అనగా గత సంవత్సరం ఏదైనా ఒక వస్తువు ధర కిలో వంద రూపాయలు ఉందనుకుంటే, ఇప్పుడు 110 రూపాయలుగా ఉన్నట్లయితే ద్రవ్యోల్బణం 10శాతం ఉన్నట్లు. ఇలా లెక్కించడానికి అనేక వస్తువుల సగటు ధరను ఉపయోగిస్తారు. వినియోగ ధరల ద్రవ్యోల్బణం (షశీఅరబఎవతీ జూతీఱషవ ఱఅసవఞ), టోకు ధరల ద్రవ్యోల్బణం (హౌల్ సేల్ ప్రైస్ ఇండెక్స్) అని రెండు విభాగాలు ఉంటాయి. వినియోగదారుల ద్రవ్యోల్భణాన్ని లెక్కించటానికి వినియోగ వస్తువులతో పాటు సేవలను (సర్వీసులను) కూడా లెక్కలోకి తీసుకుంటారు. టోకు ధరల ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి ఉత్పాదక వస్తువులు మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. ఈ ధరలు ఎందుకు పెరుగుతాయి, వాటిని ఎలా కట్టడి చేయాలి, దానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను కేంద్ర ప్రభుత్వం ఎలా వినియోగిస్తుందీ అన్నది స్థూలంగా ఆర్థిక పరిభాషలో ద్రవ్యోల్బణ శాస్త్రం. ఈ ఎప్రిల్ మొదటివారం నుంచి ఆర్థిక వేత్తలతో పాటు ప్రభుత్వాన్నీ ఇది కలవరపెడుతోంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దాని ప్రకారం గ్రామీణ ద్రవ్యోల్బణం ఏప్రిల్ 2021న 3.75శాతం ఉండగా మార్చి 2022న అది 7.66శాతానికి చేరింది, ఏప్రిల్ 2022లో 8.38శాతంగా నమోదయి పరిగెడుతోంది. పట్టణం ద్రవ్యోల్బణం ఏప్రిల్ 2021న 4.71 ఉండగా, మార్చి 2022న 6.12 శాతానికి చేరి ఏప్రిల్ 2022నాటికి 7.09గా నమోదయింది. ఇదే కాలానికి ఆహార ద్రవ్యోల్బణం 1.96, 7.68, 8.38గా నమోదయింది. ఈ గణాంకాలన్నీ వినియోగ వస్తువుల ద్రవ్యోల్బణానికి సంబంధించినవి(షజూఱ). ఇదే ఏప్రిల్ 2022 కాలంలో టోకు ధరల ద్రవ్యోల్భణ రేటు 15.8శాతంగా ఏప్రిల్ 2022లో నమోదైంది. అకాలంగా నమోదవుతున్న ఈ పెరుగుదలలను గమనిస్తున్న నిపుణుల నుండి మొదలు అనేక మందిలో ఒక గుబులు మొదలైంది. ఎందుకంటే, ఎండాకాలం, పంటల సమయం కాదు కాబట్టి సమీప భవిష్యత్తులో ఆహారోత్పత్తుల ఆగమనం లేదు. అందుచేత పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేయకుంటే వినియోగదారులు బెంబేలెత్తి, భవిష్యత్తులో వస్తువుల కొరత మరింత తీవ్రమవుతుందేమోనన్న అనుమానంతో, అనవసర కొనుగోళ్ళకు పాలుపడే అవకాశమున్నది. దీని పర్యావసానంగా గొలుసుకట్టు ప్రభావంలా ఇతర ఉత్పాధక వస్తువులపై ప్రభావం పడే అవకాశం ఉన్నది.
దేశంలో జీఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయిలో, అనగా లక్షా డెబ్బై వేల మార్కు వద్ద నమోదవుతున్నాయి. గత సంవత్సరం ఇదే కాలానికి లక్ష మార్కు దగ్గరే ఉన్నాయి. ధరల పెరుగుదల వలన వినియోగ పరిమాణం (క్వాంటిటీ) తగ్గిపోయినప్పటికీ ఈ వసూళ్ళు పెరుగుతున్నాయంటే, పన్ను వసూళ్ళలో ముఖ్య భూమిక పోషించే పరోక్ష పన్నులు భరిస్తున్న సామాన్య ప్రజలు గతం కంటె ఎక్కువ పన్ను కడుతున్నారన్న మాట. అందుకే... మార్క్సిస్టు మేధావి బి.టి. రణదీవే మాటల్లో చెప్పాలంటే ''సామాన్యుని జేబు కత్తిరించడమే ద్రవ్యోల్బణం''. సామాన్యుణ్ణి వినియోగ, పౌష్టికాహార, వస్తువులనుండి దూరం చేసి పన్ను రాబడిలో మాత్రం రాజీ పడని ప్రభుత్వ విధానమే ఈ ద్రవ్యోల్బణం ద్వారా ధరల పెరుగుదల అన్నమాట.
దేశంలో వంట గ్యాస్ ధర ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నది. పెట్రోలు ధరలో ప్రపంచంలో మూడవ స్థానం, డీజిల్ ధర ప్రపంచంలో 8వ స్థానం. ఈ ధరల పెరుగుదలలో ప్రభుత్వానిది ప్రత్యక్ష పాత్ర ఉంటుంది. అనగా ప్రభుత్వ విధానాల వల్ల లేదా అపరిమిత పన్నుల వల్ల ఇవి పెరుగుతున్నాయి. ధరల పెరుగుదల ఆర్థిక వృద్ధిని మందగించేలా చేస్తుంది. అందుకే ప్రపంచ దిగ్గజ సంస్థ మోర్గాన్ స్టాన్లీ భారత ఆర్థిక వృద్ధిని 2022-23కు 7.6 గాను 2023-24కు 6.7గాను దాదాపు 0.3శాతం తక్కువ చేసి అంచనా వేస్తున్నది. వినియోగ వస్తువుల సరఫరా పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండదు. చాలా వరకు ప్రయివేటు వ్యవస్త వీటిని నియంత్రిస్తూ ఉంటుంది. కొన్ని నిర్దారిత సరుకుల నిలువ నిషేధం. అయినప్పటికీ వాటిని లోపాయికారిగా నిలువ ఉంచుతుంటారు. నీటి లభ్యతను బట్టీ పంటల సాగును మానిటర్ చేసే బాధ్యత కూడా వ్యవసాయ శాఖదేగా! ఈ విధంగా ప్రభుత్వాధీనంలో ఉండేవాటి ధరలను ప్రభుత్వమే తమ ఖజానా కోసం పెంచుకుంటుంది. దళారీ వ్యవస్థను కట్టడి చేయడంలో ఒక నిర్లక్ష్యం, వ్యవసాయాన్ని సరిగా మానిటర్ చేయడంలో మరో నిస్సాహయత. ధరల పెరుగుదలకు ఇవే అసలు కారణాలని తెలిసి కూడా అనుకోకుండా వచ్చి పడి అంతగా ప్రభావంలేని ఉక్రెయిన్ వార్, లేదా అంతర్జాతీయ మార్పులను సాకుగా చెప్పడం సరి కాదు. ఈ ధరల పెరుగుదల భారత్లోనే ఎక్కువగా ఉన్నదీ అంటే ఇక్కడి విధానంలోనే లోపం ఉన్నదన్నమాట. ఆహార ద్రవ్యోల్బణం పెరగడానికి దళారీ వ్యవస్థ సృష్టించే తాత్కాలిక కొరతే ప్రధాన కారణం. ఈ వ్యవస్థను నియంత్రించే యంత్రాంగం ఘోర వైఫల్య కారణంగానే కాస్త డిమాండు పెరిగితే చాలు ధరలు పెంచేస్తారు. ప్రజల వద్ద ఏదో ఉపాధి కారణంగా నాలుగు రూపాయలు కదలాడే సరికి మరింత మంచి ఆహారాన్ని తిందామనుకుని కొన్ని ఎక్కువగా కొంటారు. ఫలితంగా ధరల పెంపుతో గణాంకాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దాన్ని కట్టడి చేసేందుకు ప్రజల చేతుల్లో డబ్బులుండకుండా ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది. వెరసి, ఉపాధి పెరిగినా, పెరిగిన ధరల వల్ల మళ్ళీ అదే చాలీ చాలని కొనుగోళ్ళతో చాలీచాలని జీవనం గడపాల్సిన స్థితి ప్రజలకు దాపురిస్తుంది.
ద్రవ్యోల్భణ పెరుగుదలకు వినియోగదారుల చేతుల్లో నగదు లభ్యత ఎక్కువగా ఉండటం లేదా డిమాండుకు తగ్గ ఉత్పత్తి లేకపోవడం అనేవి సాధారణ సూత్రాలు. లేబర్ పార్టిసిపేషన్ రేటు ఎప్రిల్ నెలలో 47 నుండి 40కి పడిపోయింది. ఇలాంటప్పుడు వస్తువులకు డిమాండు పెరిగే అవకాశాలూ తక్కువేగా! ఉత్పత్తిని ఇప్పటికిప్పుడు పెంచేందుకు ప్రత్యక్ష చర్యలను ప్రభుత్వం గానీ లేదా రిజర్వు బ్యాంకు గానీ చేయలేవు. ఇక దీనిని కట్టడి చేయడానికి మార్కెట్లో నగదు లభ్యత తక్కువయ్యేలా చూడటమే తక్షణ చర్యగా భావించి, కేంద్రం బ్యాంకు రెపో రేటును, నగదు నిల్వల నిష్పత్తిని పెంచడం వంటి చర్యలను ప్రకటిస్తుంది. రెపో రేటు అనగా కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకిచ్చే రుణాలపై విధించే వడ్డీ రేటు. ఉన్న ఫళంగా 40 పాయింట్ల రెపోరేటును 50 పాయింట్ల నగదు నిల్వల నిష్పత్తిని ఆర్.బి.ఐ పెంచింది. రిజర్వు బ్యాంకు ఆ రేటును పెంచగానే వాణిజ్య బ్యాంకులు కూడా తమ కస్టమర్లకిచ్చిన రుణాలపై వడ్డీ రేట్లను పెంచేస్తాయి. ఫలితంగా కస్టమర్లు తాము బ్యాంకులకు లేదా రుణదాతలకు చెల్లించే నెలవారి కిస్తుల భారం పెరిగిపోయి రోజువారీ ఖర్చులైన ఆహార వస్తువులపై వ్యయాన్ని తగ్గించుకుంటారు. పర్యవసానంగా మార్కెట్లో వస్తువులకు డిమాండు తగ్గి అమ్మకపుదార్లు ధరలను తగ్గిస్తారు, ద్రవ్యోల్భణం మెల్లిగా దిగి వస్తుంది. ఇదే ఆర్థిక శాస్త్రంలో ప్రధానమైన కోణం. ఈ ఆర్థిక వ్యవస్థ తన పాలకులకు పెద్ద విస్తరి వేసే ఈ క్రమంలో ఒకసారి ధరలు పెంచి వినియోగదారుల జేబులు కత్తిరిస్తుంది, మరో సారి రుణదాతలకిచ్చే వడ్డీ రేట్లను పెంచి వారి జేబుల్లో డబ్బులే లేకుండా చేస్తుంది.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016