Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ ముద్దుబిడ్డ, బాక్సర్ నిఖత్ జరీన్ విజేతగా నిలిచింది. భారతదేశంతోపాటు ప్రపంచ ప్రజల జేజేలు అందుకుంటున్నది. అలాగే అన్ని పార్టీలూ అభినందనలు తెలిపాయి. కానీ బీజేపీ ఒక అడుగు ముందుకేసి, జరీన్ విజయం వెనుక ప్రధాన మంత్రి మోడీ కృషి అమోఘం అంటూ పోస్ట్ పెట్టింది. దీనిపై సోషల్ మీడియాలో ''దరిద్రం కాకపోతేను... దేనికైనా ఒక హద్దు ఉంటుంది, మాకృషి అని పోస్టులు పెట్టడానికి కొంచెమైనా సిగ్గుండాలే..'' అంటూ రివర్స్ పోస్టులు పెడుతున్నారు జనం. ఆమె విజయం వెనుక మోడీ చేసిందేంటో చెప్పాలని అడుగుతున్నారు. ఒకరైతే 'విసా, పాస్పోర్టు కేంద్రమే జారీ చేస్తుంది. ఆమె ప్రయాణించే విమానాలు కేంద్రం పరిధిలో ఉంటాయి. పైగా ఆమె దేశం తరుపున ఆడారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి కాబట్టి దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన కృషి ఉండవచ్చు' అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ''నిఖత్ జరీన్ అహర్నిశలు కష్టపడ్డారు. ఆమెకు కేంద్ర ప్రభుత్వం ఏమైనా సహకారం అందించిందా? ఏం చేశారని ఇలాంటి గొప్పలు చెబుతున్నారు'' అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు చాలా విషయాల్లో వీరి వాట్సాప్ యూనివర్సిటీ లేని విషయాన్ని ఉన్నట్టు ప్రచారం చేస్తుందనడం అతిశయోక్తికాదు. చివరకు గాంధీని హత్య చేసిన గాడ్సేను సైతం ఆకాశనికెత్తుకుంది. అబద్దాలను నిజమని నమ్మించేందుకు పడరానిపాట్లు పడుతోంది. ఏదో ఒక రోజు నిజాలు నిగ్గుతేలుతాయి. అప్పుడు వాట్సాప్ యూనివర్సిటీకి పట్టపగలే చుక్కలు కనిపిస్తాయని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.
- గుడిగ రఘు