Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామాజిక మాధ్యమాల విస్తృతి, వినియోగం పెరిగిన తర్వాత అయినదానికి, కాని దానికి స్పందించటం, తెలిసినా తెలియకపోయినా పుంఖాను పుంఖాలుగా విశ్లేషణలు చేయటం చాలా మందికి పరిపాటిగా మారింది. మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసి సబ్జెక్టు మీద నామమాత్రపు అవగాహన కూడా లేకుండా అడ్డగోలు వాదనలకు దిగటమే పనిగా పెట్టుకుంటున్నారు. ఇటీవల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగటం, కరెంటు, బస్ ఛార్జీలు రెట్టింపవటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కులదురహంకార, ఉన్మాద హత్యలు నానాటికీ పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తుల అమ్మకపు పరంపర కొనసాగుతున్నది. వీటన్నింటిపై పదుల సంఖ్యలో వీడియోలు, వందల సంఖ్యలో ఆర్టికల్స్ వస్తున్నా... కేవలం వినోదపు అంశాలకే అలవాటుపడ్డ జనం వాటిని పట్టించుకోకుండా తమ మానాన తాము సెల్ఫోనుల్లో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పోతున్నారు. ఇదే విషయమై ఇటీవల ఒక ప్రభుత్వ ఉద్యోగినీ, మరో ఉపాధ్యాయురాలిని కదిలిస్తే... 'మాకు కూడా చాలా ఇబ్బందు లున్నాయి తెలుసా...15వ తారీఖు వస్తున్నా ఈ రోజు వరకూ మాకు జీతాలు పడలేదు...' అంటూ ఆక్రోశంతో కూడిన ఆవేదనను వ్యక్తం చేశారు. అలాంటప్పుడు మీ డిమాండ్ల సాధన కోసం, సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాలు, యూనియన్లకు మద్దతు పలికారా..? అవి నిర్వహించే కార్యక్రమాల్లో ఎప్పుడైనా పాల్గొన్నారా..? అని అడిగితే మాత్రం నో ఆన్సర్. ఈ నేపథ్యంలో బుద్ధి జీవులు, మేధావులుగా పరిగణించబడే ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సమస్యల పట్ల తామే స్పందించకపోతే ఇక కూలినాలి చేసుకునే పేదలు, చదువులేని కార్మికులు, అడ్డమీద కూలీల పరిస్థితేమిటి..? అని అనుకోవాల్సి వచ్చింది. ఇలా సమాజంలో జరిగే అనేక విషయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉండి కూడా వాటిపై స్పందించకుండా మౌనం దాల్చే వారిని చూసినప్పుడు... 'ఏమిరా బాలరాజూ... నీ వల్ల దేశానికి ఏమి ఉపయోగం...?' అనే ధర్మవరపు సుబ్రమణ్యం డైలాగ్ గుర్తుకొస్తుంది.
- బి.వి.యన్.పద్మరాజు