Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థుల తీవ్రమైన నిరీక్షణ తర్వాత మార్చి 9న ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఉద్యోగాలపై ప్రకటన చేశాడు. 91,147 ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేస్తామని, దీంట్లో 11 వేల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామనీ అన్నారు. ఇవి పోను మిగతా ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. ప్రకటన చేసి రెండు నెలలు గడుస్తున్నా, నేటికీ అరకొర ఉద్యోగాల నోటిఫికేషన్లే తప్ప, భారీ ఉద్యోగాలతో ఏ ఒక్క నోటిఫికేషన్ లేదు. ముఖ్యమంత్రి, తన మంత్రులు, పూర్తిస్థాయిలో నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఇంకా సమయం పడుతుంది అని అంటున్నారు. అంటే నిరుద్యోగుల పట్ల మరోసారి బాధ్యతారాహిత్యమే తేటతెల్లం అవుతోంది.
ఉద్యోగాల ఖాళీలు ఎన్ని? భవిష్యత్ ఉద్యోగాల మాటేమిటి?
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ పీఆర్సీ నివేదికలో 10జిల్లాల తెలంగాణలోనే లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తేల్చింది. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడిన 33జిల్లాల తెలంగాణలో ఖాళీలు మూడింతలు పెరిగే అవకాశం ఉంది. కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 91 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమే. టి.ఎస్.పి.ఎస్.సీ వన్ టైం రిజిస్ట్రేషన్‌లో 25ఐదు లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారు. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే తెలంగాణలో 25 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అలా అయితే ఇప్పుడు భర్తీ చేస్తానన్న ఉద్యోగాలు ఏ మూలకూ సరిపోవు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే రాష్ట్రం వస్తే ఒక్క దెబ్బకు లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారు. మరి నేడు ఆ మాటపై ఎందుకు నిలబడలేక పోతున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అన్ని ఉద్యోగాలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలి. ప్రభుత్వ బాధ్యత కేవలం ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడమే కాదు, నూతన ఉద్యోగాల కల్పనకు కృషి చేయాలి. రాష్ట్రంలో ప్రతి ఏటా తయారవుతున్న పట్టభద్రుల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగాలను సృష్టించాలి, పరిశ్రమలు నెలకొల్పాలి. నిరుద్యోగ సమస్యకి శాశ్వతమైన పరిష్కారాన్ని కనుగొనాలి. భవిష్యత్తులో ఉద్యోగాల భర్తీ కోసం నిర్దిష్టమైన ''ఉద్యోగాల క్యాలెండర్''ను ప్రతి సంవత్సరం విడుదల చేయాలి.
నిరుద్యోగులపై ఎందుకింత నిర్లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థుల, నిరుద్యోగులది ప్రధానమైన పాత్ర. రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతున్న కొద్దీ అనేక మంది విద్యార్థులు చనిపోయారు. వారి అమరత్వం ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలను తట్టి లేపింది. 1200మంది విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైనారు. ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆనాడు ''జై తెలంగాణ'' అని నినదించారు. రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని కలలు కన్నారు. రాష్ట్రమైతే వచ్చిందిగానీ, విద్యార్థులు, నిరుద్యోగులు నిలువునా మోసపోయారు. నిరుద్యోగ సమస్యతో యువత మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత నెలకొన్నది. ఒత్తిడి పెరిగింది. ఇది గమనించిన కేసీఆర్ మార్చి 9న అసెంబ్లీలో ఉద్యోగాల జాతర అని ప్రకటించి, నామమాత్ర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు.
ప్రభుత్వం ఇప్పటివరకు పోలీస్, గ్రూప్-1, టెట్ నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చింది. పోలీస్ నోటిఫికేషన్లో 16వేలు, గ్రూప్-1 లో కేవలం 503 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. దీనికి కూడా 800నుండి 1200 రూపాయల దరఖాస్తు ఫీజును నిర్ణయించింది. ఇప్పటికే కోచింగ్ పేరుతో లక్షలాది రూపాయలు వెచ్చించిన నిరుద్యోగులకు ఈ దరఖాస్తు ఫీజు ఆర్థిక భారమే అవుతుంది. అందుకే ప్రభుత్వం ఇచ్చే అన్ని ఉద్యోగాలకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలి. దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే తిరస్కరిస్తారని టీఎస్ పీఎస్సీ చెపుతుంది. అంటే ఎంత వీలైతే అంత నిరుద్యో గులను వడపోసి, ఉద్యోగాలకు అనర్హులను చేద్దామనే ప్రభుత్వ కుట్ర దీంట్లో దాగి ఉంది. కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు ఫారంలో తమ తప్పులను సరి చేసు కోవడానికి ఎడిట్ ఆప్షన్ సౌకర్యాన్ని కల్పించాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరు ద్యోగంతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.
కోచింగ్ సెంటర్ల ఫీజుల దోపిడీ
ఈ అరకొర ఉద్యోగాల నోటిఫికేషన్లలో తమకు ఏదైనా ఒక్క ఉద్యోగం రాకపోతుందా అని ఆశపడుతున్న నిరుద్యోగులను ప్రయివేటు కోచింగ్ సెంటర్లు దోచుకుంటున్నాయి. నిరుద్యోగుల ఆశలతో లక్షలాది రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేట్ కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు దానికి తగిన మౌలిక వసతులు కల్పించడంలేదు. వేలాది మందితో ఫంక్షన్ హాల్లో తరగతులు నిర్వహిస్తున్నాయి. భద్రతా పరమైన చర్యలను గాలికి వదిలేస్తున్నాయి. అనుకోని సంఘటన జరిగి ఏదైనా ప్రమాదం వాటిల్లితే తీవ్రమైన ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగులను మోసం చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల దోపిడీ చేస్తూ, సదుపాయాలు కల్పించనీ ప్రయివేటు కోచింగ్ సెంటర్లపై విద్యాశాఖ తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. అనుమతులులేని కోచింగ్ సెంటర్ లను రద్దుచేయాలి.
ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యం
తెలంగాణలో యూనివర్సిటీలన్నీ వెంటిలేటర్‌పై ఉన్నాయి. టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీలేదు. నిధులు లేవు. మౌలిక సదుపాయాల కల్పన లేదు. నూతన రాష్ట్రంలో కొత్త యూనివర్సిటీలను కనీసం జిల్లాకి ఒకటి ఇవ్వాల్సింది పోయి, తన మంత్రులకు, ప్రజాప్రతినిధులకు ప్రయివేటు యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వడం ద్వారా ఉన్నత విద్యా వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. పీజీ మెడికల్ సీట్ల బ్లాక్ దందాతో కోట్లాది రూపాయల దోపిడీ జరిగినా ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదు. సమస్యలతో ప్రభుత్వ పీజీ, డిగ్రీ, జూనియర్ కాలేజీలు కునారిల్లు తున్నాయి. ప్రభుత్వ అండదండలతో కార్పొరేట్ విద్యాసంస్థలు నేడు జిల్లాలకు కూడా తమ విద్యా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిం చాయి. కార్పొరేట్ విద్యాసంస్థలను తన్ని తరుము తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వాటికే మోకరిల్లింది. పెండింగ్‌లో ఉన్న దాదాపు 4500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. దీంతో అనేకమంది పేద విద్యా ర్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి ఉంది.
- పి. మహేష్
సెల్:9700346942