Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లోకల్ క్యాడరైజేషన్ అమలులో భాగంగా 317 ప్రభుత్వ ఉత్తర్వుతో చెల్లాచెదురైన 50శాతం నుండి 60శాతం ఉపాధ్యాయులు దాని రద్దు కోసం డిమాండ్ చేస్తూ రోడ్లమీదికొచ్చి ఉద్యమాలు చేసారు. మరోవైపు అకస్మాత్తుగా జరిగిన ఈ బదిలీలను జీర్ణించుకోలేని ఉపాధ్యాయులు ఇప్పటికే 14మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యమాన్ని ఆపడానికి 317 ద్వారా తనే సృష్టించిన స్పౌజ్ బదిలీల సమస్యను తనే పరిష్కరించడానికి ప్రయత్నించి చతికిలబడి ప్రభుత్వం పలుచనైంది. విద్యావేత్తలు, ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు కూడా స్థానికతకు ప్రాధాన్యతను ఇవ్వని ప్రభుత్వ ఏకపక్ష విధానాలను ఖండించడం ప్రారంభించాయి. ఈ పరిణామాన్ని ఊహించని ప్రభుత్వం వెంటనే తేరుకొని ప్రజల్లో మంచిపేరును సంపాదించు కోవడానికిగాను ప్రభుత్వ పాఠశాలలన్నింటిని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా మార్చబో తున్నామని ఎనిమిదేండ్లుగాలేని ప్రేమను ఒలకబోస్తూ ఏకంగా పాఠశాలలను నవీనీకరణ చేయడానికిగాను ''మన ఊరు-మన బడి'' కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు ప్రకటించింది. ఆ పథకం కింద మొదటి దశలో 9,123 పాఠశాలల్లో వసతుల కల్పన కొరకు రూ.7,289 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టబోతున్నట్లు, మొదటి మూడు నెలల్లోనే రూ.3,497 కోట్లు బడులపై ఖర్చు చేయబోతున్నామని కూడా ప్రకటించింది. కెేజీ టు పీజీ వరకు విద్యావిధానాన్ని ఇలా చేస్తాం, అలా చేస్తాం అని చెప్పి ఎనమిదేండ్లు గడిచిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలోని 50శాతం పాఠశాలలు మూసివేత అంచున ఉన్న సమయంలో ప్రభుత్వం మేల్కొనడం ఒకరకంగా శుభపరిణామమే.
గ్లోబలైజేషన్ సవాళ్ళను స్వీకరించని ప్రభుత్వాలు
ప్రభుత్వాలు మూడు దశాబ్దాలుగా గ్లోబలైజేషన్ విసురుతున్న సవాళ్ళను స్వీకరించి పాఠశాల విద్యావ్యవస్థను లేదా మొత్తంగా విద్యా వ్యవస్థను ఆధునీకరణ చేయాల్సిందిపోయి, విద్యను అంగడి సరుకుగా మార్చి అమ్మకానికి పెట్టి దానిని విద్యామార్కెట్గా అభివృద్ధి చేసారు. ఈ స్థితి ఎక్కడిదాక వెళ్ళిందంటే కొనగలిగే శక్తి ఉంటే మెరిట్‌తో సంబంధం లేకుండా ఏ సీటునైనా కొనవచ్చు, చదువవచ్చు. ఈ కార్పొరేట్ మార్కెట్నుండే విద్యావేత్తల ముసుగులో ఏకంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలేకాదు మంత్రులూ పుట్టుకొచ్చారు. ఇవ్వాల్టి చట్టసభల్లో సగానికిపైగా సభ్యులు విద్యావ్యాపారులే ఉన్నారంటే ఆ వ్యాపారం ఎంత లాభసాటిదో, ఎంత దోపిడీ మయమైందో మనం అర్థం చేసుకోవచ్చు!
ప్రజలు తమ పిల్లల భవిష్యత్తు కోసం కంటున్న కలలకు అనుగుణంగా ప్రభుత్వ రంగంలోని పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన పాలకులు ప్రయివేటుకు అండగా నిలబడ్డారు. ముప్పైయేండ్ల క్రితమే ప్రయివేటులో ఇంగ్లీషు మీడియం పాఠశాలలకు అనుమతిని ఇచ్చిన ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మాత్రం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా మార్చడంలో విఫలమైంది. తెలంగాణ ప్రభుత్వం ఈ లోపాన్ని గుర్తించి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా మార్చ నుండటం ఒక మంచి నిర్ణయం. ముప్పై ఏళ్ళ క్రితమే ప్రైవేటులో నర్సరీ, ఎల్.కె.జి, యు.కె.జి లాంటి ప్రీ ప్రైమరీ విద్యకు అనుమతిని ఇచ్చిన ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో గనుక ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించి ఉంటే ఇవ్వాళ ఈ దుస్థితి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి ఉండేది కాదు.
ముప్పైయేండ్ల క్రితమే అడ్మిషన్ వయస్సును ప్రయివేటులో 2+కు అనుమతిని ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నేటికీ 5+ మాత్రమే ఉంది. దశాబ్దంన్నర క్రితమే ప్రయివేటులో డిజిటల్ క్లాస్‌రూమ్స్ వచ్చి కంప్యూటర్లపై పిల్లలు ఆటలాడు తుంటే... వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పరిచిన కంప్యూటర్ ల్యాబులన్నీ బోధకులను తొలగించడంతో మూత పడ్డాయి. గ్లోబలైజేషన్లో కంప్యూటర్ విద్యకు ఉన్న ప్రాముఖ్యత తెలిసికూడా కంప్యూటర్ స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఇప్పటికీ సృష్టించకపోవడం ప్రభుత్వానికి విద్యపై ఉన్న చిత్తశుద్దికి నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులను ప్రవేశపెట్టాల్సిన మన ఘనత వహించిన విద్యాశాఖ పనికిమాలిన శిక్షణలు ఇస్తూ పరువు తీసుకుంటున్నది. సమావేశాలపై సమావేశాలు, నివేదికలపై నివేదికలు, రిపోర్టులపై రిపోర్టు లడగటం లాంటివన్ని కేవలం ఉపాధ్యాయున్ని తరగతి గదికి దూరంచేసే కుట్రలో భాగమే! ప్రతిభావంతులైన విద్యార్థులకు ఐ.ఐ.టి, మెడికల్ లాంటి ఎంట్రెన్స్ పరీక్షలను ఎదుర్కొనే విధంగా ఇ-టెక్నో స్కూల్స్, కాన్సెప్ట్ స్కూల్స్, ఒలంపియాడ్ స్కూల్స్ ప్రభుత్వ రంగంలో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నా నేటికీ ప్రారంభం కాలేదు. ఒకవేళ ఇవన్ని జరిగి ఉంటే ప్రభుత్వ పాఠశాలలు ఈ దుర్భర స్థితికి వచ్చి ఉండేవి కావు. కొత్త ఉద్యోగాలు సృష్టించబడి చాలామంది నిరుద్యోగులకు అతిపెద్ద ఉపాధి కేంద్రంగా విద్యావ్యవస్థ ఉండేది. ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలన్నింటిని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల తల్లిదండ్రులకే వర్తించపచేయాలనే డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వం ఒక చట్టం చేయాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వ పాఠశాలలను రెసిడెన్షియల్‌గా మార్చలేరా!
వీటన్నింటికి తోడు రకరకాల పాఠశాలలు ప్రభుత్వ రంగంలో రావడం దురదృష్టకరం. కులాల, మతాల, జాతులవారి పాఠశాల విద్యావ్యవస్థ ఉండదని ప్రజలకు హామీ ఇచ్చిన వారే తిరిగి అటువంటి రెసిడెన్షియల్ పాఠశాలల వ్యవస్థను తీసుకొని వచ్చి, ప్రభుత్వ పాఠశాలలనుండి చదివే పిల్లలందరిని తీసుకుపోతూ ఉపాధ్యాయులు చదువు చెప్పడంలేదని, వారికి చదవడం రాయడం రావడంలేదని బదునాం చేయడం ఎంతపెద్ద కళ! ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేకుండా చేసి మూసివేత దశకు తీసుకురావడం ఎంత వరకు సమంజసమో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. ప్రతి ఊరిలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటికి సకల సౌకర్యాలు కల్పించి వాటినే రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చడానికి ఎందుకు ముందుకు రావడంలేదు? మండలానికి నాలుగైదు పాఠశాలలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నిర్మాణాలభారం, భూమి సేకరణలాంటి అనేక రిస్క్లుతప్పి వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆదా చేసుకోవచ్చు. ప్రజల పిల్లలు వారి గ్రామంలోనే కళ్ళముందుంటారు కదా!
మౌలికవసతులపై కూడా ఇంత నిర్లక్ష్యమా!
రాష్ట్రంలోని బడులలో 99.99శాతం జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అటుంచి కనీస ప్రమాణాలకు నిలబడవు. తరగతి గదులు సక్కగా లేవు. మూత్రశాలలు లేవు. లైబ్రరీ లేదు. కొన్ని పాఠశాలల్లో ఉన్న ఒక్క కంప్యూటర్ గది కూడా మూతపడ్డది. ఈ విధంగా అందవిహీనమైన కూలిపోయే గదులతో కునారిల్లుతున్న పాఠశాలలకు ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఎలా పంపిస్తారు? ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న స్కావెంజర్‌ను కూడా ఊడబెరికి పరిశుభ్రత బాధ్యత గ్రామ పంచాయతీలకు అప్పగించడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. రాష్ట్రంలోని చాలా పాఠశాలలకు కరెంట్ సౌకర్యంలేదు. ఒక వేళ ఉన్నా పాఠశాలల నిధులు మొత్తం కరెంట్ బిల్లుల చెల్లింపుకే పోతున్నవి. క్యాటగిరి మార్చాలనే డిమాండ్‌ను ఇప్పటివరకు పరిశీలించలేదు. వందలకొద్ది పాఠశాలలు బకాయిలు చెల్లించే స్థితిలోలేవు. రాష్ట్రంలో వేళ్ళమీద లెక్కబెట్టే పాఠశాలలకే ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. మధ్యాహ్నా భోజనం తినడానికి మంచినీళ్ళు కూడా లేని పరిస్థితిలో పాఠశాలలు ఉన్నాయి. అది వండే కార్మికులకు ఆరు నెలలకొకసారి కూడా డబ్బులు రాకపోతే పౌష్టికాహారం రుచికరంగా ఎలా వండిపెడతారు?
నివేదికలపై ఉన్న శ్రద్ధ
నియామకాలపై ఎందుకు ఉండదు!
కొత్త పోస్టుల సృష్టి అటుంచి, 30ఏండ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలైన ఒక్క అటెండర్, స్వీపర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులేవీ తిరిగి నింపడంమీద ఏ ప్రభుత్వం ఇప్పటివరకు దృష్టిపెట్టలేదు. 33 జిల్లాలను ఏర్పరచగా 12జిల్లా విద్యాశాఖాధికారి పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇంకా 21జిల్లాలకు డి.ఇ.ఓ పోస్టుల మంజూరి లేదు. జిల్లాల ఏర్పాటు వరకు రాష్ట్రంలో కొనసాగిన డివిజన్ విద్యా వ్యవస్థ త్రిశంకు స్వర్గంలో ఉంది. 600కు పైబడి మండల విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉంటే పర్యవేక్షణకు అర్థమేముంది? 30వేలకు పైబడి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయుల సర్వీస్‌రూల్స్ పీటముడిని 25ఏండ్లుగా విడదీయలేని పరిస్థితిలో కోర్టులు, ప్రభుత్వాలు ఉంటే ఎట్లా! తరగతిగదికో ఉపాధ్యాయుడు అటుంచి ఇంకా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. రిటైర్ అయిన ఉపాధ్యాయుని స్థానాన్ని వెంటనే భర్తీ చేయకపోతే విద్యార్థుల పరిస్థితి ఏంటి? నియమించిన విద్యావాలేంటీర్కు కూడా జీతాలు ఎప్పుడువస్తాయో ఎవ్వరికీ తెలియదు! ఉపాధ్యాయులు బోధన చేయకపోవడం, సమయ పాలన పాటించకపోవడం కూడ ఒక అవినీతి, నీతిబాహ్యచర్యగానే చూడాల్సి ఉంటుంది. దీనితో ప్రయివేటు వ్యవస్థ అందివచ్చిన ఈ అవకాశాలన్నింటిని ఆకాశానికెత్తి, తల్లిదండ్రులలో కోటి ఆశలు రేకెత్తించి వేల కోట్లకు విద్యావ్యాపారం పడగలెత్తడం ప్రభుత్వం, ఉపాధ్యాయులు, అన్ని రకాల సంఘాల వైఫల్యంగానే చూడాల్సి ఉంటుంది.
ఇప్పుడు బడిబాటలు చేయడం కాదు కావల్సింది. బడికి ఉన్న బాటను ఎవ్వరు చెరిపారో కనిపెట్టాలి, ధైర్యంగా చెప్పగలగాలి. ఇకనైనా ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజలు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కళ్ళు తెరవాలి. లేదంటే పతనం అంచున నిలబడి ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మూతబడటం ఖాయం! ''మన ఊరు - మన బడి'' ద్వారా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూనే నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలి. బడిని బాగుచేసుకోవడం అంటే భవిష్యత్ తరాల ఉజ్వల భవిష్యత్తుకు బాటవేయడమనీ, తద్వారానే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమని గుర్తించాలి.
- డాక్టర్ ఏరుకొండ నరసింహుడు
సెల్:9701007666