Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమ్ము కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేయటం, అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ప్రభుత్వ పథకంగా చేపట్టడంలో జయప్రదం అయిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించటంలో నిమగమైంది. 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత ఈ మూడు అంశాలనే తమ రాజకీయ ఎజెండాగా మల్చుకున్న తీరు మనకు తెలిసిందే. ఇంకా చెప్పాలంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు 1925లో ఏర్పడినా స్వాతంత్య్రానంతరం భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా తీర్చి దిద్దటానికి తొలి అడుగులు వేయాలంటే ఈ మూడు రాజకీయ లక్ష్యాలను సాధించాలని దిశా నిర్దేశం చేసుకుంది. అందువల్లనే హిందూ మహాసభ, జనసంఫ్‌ు, భారతీయ జనతా పార్టీ... పేరు ఏదైనా ఆరెస్సెస్ అండదండలతో తెరమీదకు వచ్చిన రాజకీయ పార్టీలు ఈ మూడు లక్ష్యాలనే తమ రాజకీయ లక్ష్యాలుగా అధికారానికి సోపానాలుగా మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి గురించిన చర్చను ముందుకు తీసుకెళ్లటం కోసం రకరకాల ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి. అందులో భాగంగా ఉమ్మడి పౌరస్మృతి ద్వారానే భారతదేశంలో మహిళలు లైంగిక సమానత్వాన్ని సాధించగలరన్న వాదన కూడా ముందుకొస్తోంది. ఈ వాదనలో ఉన్న వాస్తవం ఎంతో పరిశీలిద్దాం.
భారతదేశం భిన్న మతాల సమాహారం. వ్యక్తిగత జీవితాన్ని నియంత్రించటంలో, వివాహం, ఆస్తి పంపకం వంటి విషయాల్లో ప్రతి మతానికి తమదైన ప్రత్యే రీతి రివాజులు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ మేళవిస్తూనే భారతదేశంలో న్యాయ వ్యవస్థ పని చేస్తోంది. మౌలికమైన చట్టాలు భారతీయ నేర శిక్షా స్మృతి, పౌర శిక్షాస్మృతి విషయంలో చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రాన్ని అమలు చేస్తోంది. కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, దత్తత, వారసత్వం, భరణం, వివాహాది విషయాల్లో మాత్రం ఆయా మతాలకు చెందిన ప్రత్యేకతలు, సాంప్రదాయలు, ఆచారాలకు తగిన స్థానం కల్పిస్తూ కొన్ని వెసులుబాట్లు కల్పించారు. అంటే హిందూ కుటుంబాలకు హిందూ వివాహ చట్టం, ముస్లిం కుటుంబాలకు ముస్లిం వివాహ చట్టం, క్రైస్తవ వివాహ చట్టం, ప్రత్యేక వివాహాల చట్టం వంటివి ఉన్నాయి. అలాగే ఆస్తి వివాదాలకు సంబంధించిన వివాదాల్లో కూడా ఆయా మత సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిచ్చే విధంగా చట్టం వ్యవహరిస్తోంది.
ఇప్పుడు ఈ ప్రత్యేకతల స్థానంలోనే ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడున్న చట్టాల్లో వ్యక్తిగత జీవితాన్ని నియంత్రించే వెసులుబాటు ఉన్న కారణంగా మహిళలకు అన్యాయం జరుగుతోందని, స్వాంతత్య్రం వచ్చి 75ఏండ్లు అవుతున్నా మహిళలు అనేక విషయాల్లో ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉంటున్నారని అందువల్ల ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తే అన్ని మతాలకు చెందిన మహిళలకూ సమాన హక్కులు, అవకాశాలు దక్కుతాయన్న వాదన ముందుకు తెస్తున్నారు. దీనికోసం రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని ఆదేశిస్తున్నాయని, అందువల్ల తాము రాజ్యాంగాన్ని అమలు చేయటం కోసమే ఈ ప్రతిపాదన ముందుకు తెస్తున్నామని బీజేపీ చెప్తోంది. ఇందులో వాస్తవమెంతో పాఠకులే ఆలోచించాలి.
రాజ్యాంగంలోని వైరుధ్యం ఇక్కడే బట్టబయలవుతుంది. రాజ్యాంగంలోని 25 నుండి 28 అధికరణాల్లో భారతీయులందరికీ మతస్వేఛ్చనిస్తూనే ఆదేశిక సూత్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి గురించి ప్రస్తావిస్తోంది. ఇటువంటి వైరుధ్యాలు కేవలం వ్యక్తిగత జీవనాన్ని నియంత్రించటంలోనే కాక, జాతి ఆర్థిక జీవనాన్ని నియంత్రించటంలో కూడా ఉన్నాయి. వీటన్నింటినీ అటు కార్పొరేట్ వర్గాలు, ఇటు మతోన్మాద శక్తులు తమతమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు ముందుకు తీసుకెళ్లటానికి ఉపయోగించుకుంటున్నాయి. ఉమ్మడి పౌరస్మృతి వివాదం కూడా అటువంటిదే.
స్వతంత్ర భారత ప్రభుత్వం రాజ్యాంగంతో పాటు పౌరస్మృతిని రూపొందించటానికి కూడా కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా నాటి ప్రభుత్వం బిఎన్ రావ్ నాయకత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాచీన హిందూ సంస్కృతికి సంబంధించిన రచనల సారాంశానికి అనుగుణంగా హిందూ చట్టాన్ని ప్రతిపాదించటం ఈ కమిటీకి అప్పగించిన కర్తవ్యం. తదనుగుణంగానే ఈ కమిటీ హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వం చట్టాలను రూపొందించింది. ఇక్కడ గుర్తించాల్సిన విషయం హిందూ మత ఆచార వ్యవహారాలు, సాంప్రదయాలకు అనుగుణంగానే ఈ చట్టాలు రూపొందాయి. ఉదాహరణకు హిందూ కుటుంబాల్లో ఆస్తి పంపకం విషయంలో వివాదం తలెత్తితే మితాక్షర న్యాయ భాష్యం ప్రకారం పరిష్కారం చేస్తున్నారు. దీన్నే సుప్రీం కోర్టు కూడా సాధికారిక హిందూ న్యాయ వ్యాఖ్యగా పరిగణిస్తోంది. తదనుగుణంగానే వేర్వేరు మతాలకు సంబంధించిన సాధికారిక వ్యాఖ్యల ప్రాతిపదికన ఆయా విశ్వాసాలు పాటించే వారి వ్యక్తిగత జీవనాన్ని ఆస్తి తగాదాలను నియంత్రించే చట్టాలు రూపొందించబడ్డాయి. అయితే ఈ అన్ని మతాధారిత చట్టాల్లోనూ లైంగిక వివక్ష అడుగడుగునా కనిపిస్తంది. ఈ లోపాన్ని అధిగమించటానికి చట్టం ముందు అందరూ సమానులే అన్న మౌలిక న్యాయ సూత్రాన్ని పాటించటమే పరిష్కారం. కానీ బీజేపీ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయటానికి బదులు తమ హిందూత్వ రాజకీయ కార్యక్రమం, లక్ష్యాలకు అనుగుణంగా వ్యక్తిగత జీవితాన్ని నియంత్రించే చట్టాలను సవరించాలని ప్రతిపాదిస్తోంది. ఈ ముసుగు రానున్న కాలంలో అనేక రాజకీయ న్యాయపరమైన, చట్టపరమైన వివాదాలకు దారితీయనుంది.
బీజేపీ కేంద్రంలో అధికారానికి రావటానికి ముందు ఏ న్యాయ వివాదమైనా న్యాయవివాదంగానే ఉండిపోయేది. అది రెండు పక్షాల కక్షిదారుల వ్యక్తిగత వ్యవహారంగా మిగిలిపోయేది. బీజేపీ సంపూర్ణ సంఖ్యాబలంతో అధికారానికి వచ్చాక ఆ పరిస్థితి లేదు. ప్రతి న్యాయవివాదమూ రెండు మతాల మధ్య వివాదంగా మారింది. ఆరెస్సెస్ ప్రతిపాదించిన హిందూరాష్ట్ర నిర్మాణం అనే లక్ష్యాన్ని అమలు చేయటంలో భారతీయులు ఎన్నుకున్న కేంద్ర ప్రభుత్వం ఆరెస్సెస్ చేతిలో పావులా మారింది. తదనుగుణంగానే రాజకీయ వివాదాలు ధార్మిక వివాదాలు గానూ, ధార్మిక వివాదాలు రాజకీయ వివాదాలు గానూ తారుమారు అవుతున్నాయి. మతం ప్రస్తావన రాగానే ఒళ్లు మర్చిపోయి ప్రవర్తించటానికి సిద్ధమయ్యే ప్రత్యేక బృందాలు తయారయ్యాయి.
ఉమ్మడి పౌరస్మృతి కోసం డిమాండ్ చేస్తున్న వారు ఇతర మతాల్లోని మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని, వివక్షను, ఆయా మత సాంప్రదాయలననుసరించి మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటాన్ని చూపించి చర్చ చేస్తున్నారు. ఈ రకమైన నిర్మిత చర్చ (అర్కెస్ట్రేటెడ్ డిస్కషన్)లో ఎక్కువగా పాలుపంచు కొంటోంది హిందూత్వ, హిందూరాష్ట్ర వాదాన్ని తలకెత్తుకున్న మేధావులే అన్న విషయాన్ని మనం గుర్తు పెట్టుకుంటే మీడియాలో జరుగుతున్న చర్చలు ఒకే కోణంలో ముంగింపునకు రావటం వెనక ఉన్న మతలబు అర్థమవుతుంది. ఇదే మేధావులు హిందూ మతంలోని దొంతరల వ్యవస్థ గురించి కానీ, దాని కారణంగా తలెత్తిన వివక్ష, అణచివేత, సమానత్వ నిరాకరణ, మహిళల విషయాన్నే తీసుకుంటే పరువు హత్యలు, వరకట్న హత్యలు, దాంపత్య జీవితంలో క్రూరత్వం వంటి విషయాల గురించి మాట్లాడటం లేదు.
ఒకే దేశం, ఒకే పౌరస్మృతి అన్న నినాదం అత్యంత ప్రమాదకరమైనది. స్థూలంగా అగ్రరాజ్యంగా బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలనుకుంటున్న ఏ దేశమైనా ప్రజలు పాటించే మత విశ్వాసాలకు అతీతంగా చట్టం ముందు అందరూ సమానులే అన్న ప్రాధమిక న్యాయ సూత్రాన్ని అమలుచేయాలి. కానీ మన దేశంలో హిందువు అయి ఉండి, భారతీయ జనతా పార్టీ నాయకుడు అయి ఉండీ, ఆరెస్సెస్ నిర్మాణంలో ఉంటే అతను మతం కోసం చంపటానికైనా సిద్ధమని బాహాటంగా ప్రకటించినా, ఉద్వేగాలు రెచ్చగొట్టే ప్రకటనలు, కార్యక్రమాలు చేసినా అటువంటి వాళ్ల ముందు చట్టం తన ప్రతాపాన్ని ప్రదర్శించలేదు అన్నది ఎన్‌టివీలో రాజాసింగ్ లాంటి ఇంటర్వూలు చూస్తే అర్థమవుతుంది. ఇటువంటి వాతావరణంలో ఒకే దేశం ఒకే పౌరస్మృతి అన్న నినాదం చట్ట రూపం తీసుకునే విధానం, పరిణామాన్ని జాగ్రత్తగా పరిశీలించటమే కాక అప్రమత్తంగా ఉండకపోతే ఈ దేశం హందూత్వ తాలిబాన్ల చేతుల్లో బందీ అయ్యే ప్రమాదం ఉంది. లైంగిక వివక్షకు తావులేకుండా చేయాలంటే అన్ని మతాల్లోని వివక్ష పూరిత సిద్ధాంతాలు, విధానాలు, భాష్యాలకు స్వస్తి చెప్పటమే సరైన మార్గం. కనీసం రాజ్యాంగం ఆదేశించి అనుమతించిన మేరకైనా కుల మత ప్రాంత లింగ వివక్షతలకు తావులేని ఆధునిక లౌకిక ప్రజాతంత్ర పౌరసత్వం నవ భారత నిర్మాణానికి పునాది కావాలి. ఉమ్మడి పౌరస్మృతి సందర్భంగా జరుగుతున్న చర్చను ఈ దిశగా ప్రజాభిప్రాయ సేకరణకు సాధనంగా ఉపయోగించుకోవాలి.
- కొండూరి వీరయ్య
సెల్: 8971794037