Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత ఎనిమిది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రజలపై పన్నుల రూపంలో వడ్డించిన ఆర్థిక భారంతో ఆర్జించిన ఆదాయం సుమారు 20లక్షల కోట్ల రూపాయలు. పెట్రో ఉత్పత్తులపై 273శాతం పన్నుల భారాలు పెంచి, సామాన్య ప్రజల నడ్డి విరిచింది. అంతర్జాతీయంగా బ్యారెల్ ధర గతంలో60 డాలర్లు ఉన్నా, కనీసం ఒక రూపాయి కూడా తగ్గించకుండా, మన ప్రభుత్వాలు పన్నుల ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయి. పెట్రోల్ ధరల 2020లో లీటర్ 69 రూపాయలు ఉండగా, ఇటీవల కాలంలో 120 రూపాయల వరకూ చేరి ఆల్ టైం రికార్డు సృష్టించింది. దీంతో అన్ని నిత్యావసర వస్తువులు, కూరగాయలు, వంట గ్యాస్, మందులు సమస్త వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు ''పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు'' అయింది. ఎలా కొనాలి? ఏమి తినాలి? అనే పరిస్థితి నెలకొంది. ఒక వైపు కరోనా వలన ఉపాధి అవకాశాలు కోల్పోయి, ఎన్నడూ లేనివిధంగా నిరుద్యోగం తాండవం చేస్తూ, ఆదాయం లేకుండా ఆకలితో అల్లాడుతున్న సామాన్య ప్రజలకు పెట్రో, డీజిల్, వంట గ్యాస్, నూనె ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వలన వంట నూనెలు, స్టీల్ ధరలు పెరగి, బొబ్బలు కడుతున్నాయి. నిర్మాణ రంగం కూడా ఆపసోపాలు పడుతున్నది.
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మనదేశంలోనే పెట్రోల్ డీజిల్‌పై అత్యధికంగా పన్నులు వేస్తున్నారు. బ్రిటన్‌లో 61శాతం, ఫ్రాన్స్‌లో 59శాతం, అమెరికాలో 21శాతం ఉండగా మన భారత్‌లో అత్యధిక పన్నులు విధిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని సమకూర్చుకుంటూ, ఎవరైనా ప్రశ్నిస్తే సంక్షేమ పథకాలు అమలు చేయుద్దా..! అని ప్రభుత్వాధినేతలు ఎదురు దాడికి పాల్పడుతున్నారు. తెలంగాణలో పెట్రోల్ పై 35.20శాతం, డీజిల్‌పై 27శాతం పన్నులు సెస్ విధిస్తూ ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 31శాతం పన్నులు సెస్ విధిస్తున్నారు. బేసిక్, స్పెషల్ ఎడిషనల్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో పన్నులు వడ్డిస్తున్నారు. కేంద్రం ఆర్జిస్తున్న పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు 41శాతం వాటా దక్కాలి. ఇటీవల కాలంలో 3,71,908 లక్షల కోట్ల రూపాయలు రాగా, కేవలం రాష్ట్రాలకు 19,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వటం జరిగింది అని తెలుస్తోంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య తరచూ వివాదాలు తెరపైకి వస్తున్నాయి. జీయస్టీ విషయంలో కూడా ఇదే వైఖరి నడుస్తున్నది. సెంటర్, స్టేట్ ఎవరి మట్టుకు వారు పన్నులు, సెస్‌లు విధించి మధ్యలో సామాన్యులను సొమ్మసిల్లి పడిపోయేటట్లు చేస్తున్నారు.
చమురు ధరల నియంత్రణ అంతా చమురు సంస్థల ఆధీనంలో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ ఎన్నికల సమయంలో చమురు ధరలు అమాంతంగా తగ్గించే నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఎలా తీసుకోగలుగుతుంది? అంటే కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా చమురు సంస్థలు ధరలు పెంచడం, తగ్గించడం చేయలేవు అని అవగాహన అవుతుంది. గత కొద్ది నెలల క్రితం ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించుట జరిగింది. ఆ మేరకు ఓట్లు రాబట్టుకునే మార్గాలు వేసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై పది రూపాయలు వరకూ తగ్గించింది. డీజిల్ ధరలను కొంతమేరకు ఉపశమనం పొందేటట్లు చేసింది. దీని వెనుక అంతరార్థం ఉంది. త్వరలో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అదే సమయంలో రష్యా నుంచి తక్కువ ధరకే చమురు దిగుమతి చేసుకుంటుండటం గమనించదగిన విషయం. మళ్లీ ఓటర్లకు గాలం వేసేందుకే పెట్రో ఉత్పత్తులపై ధరలు తగ్గించి, సామాన్యులపై అసమాన ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు. ఇదీ సంగతి! గతంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పెట్రోల్ ధరలు ఎలా పెంచారో గుర్తు చేసుకుంటే విషయం బోధపడుతుంది. ప్రభుత్వాలు తమ అవసరార్థం, అధికారం నిలబెట్టుకోవడం కోసం ఈ జిమ్మిక్కులు చేస్తూ ఓట్లు దండుకుంటున్నాయి. కాబట్టి ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి. ఏ ప్రభుత్వాలు, పార్టీలు అయితే ఎల్లవేళలా ప్రజల సంక్షేమం కోరుతూ సామాన్య ప్రజలకు అండదండగా ఉంటాయో వారికి ఓటర్లు విజ్ఞతతో ఓటు వేయాలి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం చేయడానికి పౌర సమాజం తమ ఓటు ద్వారా రూట్ ఖరారు చేయాలి. కుల మత ప్రాంతీయ భాషా లింగ భావోద్వేగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు లోను కాకుండా, భిన్నత్వంలో ఏకత్వం గల మన భారత ఔన్నత్యం గురించి పాటుపడే ప్రభుత్వాలు, పార్టీలకు తమ వంతు సహాయ సహకారాలు అందించుటయే నేటి ప్రజల కర్తవ్యం.
- రావుశ్రీ