Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వార్తలద్వారా ఎలా రెచ్చగొట్టవచ్చో ఒక మంచి ఉదాహరణను చూద్దాం. ''ప్రధాని మోడీ పాల్గొన్న చతుష్టయ సమావేశానికి దగ్గరగా చైనా, రష్యా యుద్ధ విమానాలు : జపాన్ మంత్రి'' అన్నది ఒక వార్త శీర్షిక. జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఆ సమావేశంలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాధినేతలు కూడా ఉన్నారు. నరేంద్రమోడీ ఉన్నందున అనే అర్థం వచ్చేట్లు శీర్షిక పెట్టటం చైనా, రష్యాలతో మన దేశానికి తంపులు పెట్టే లేదా పెంచే వ్యవహారం తప్ప మరొకటి కాదు. చతుష్టయ దేశాలను హెచ్చరించేందుకే ఈ చర్య అని మన దేశంలో కొన్ని పత్రికలు సంపాదకీయాలు రాయటం సరేసరి. ఇది తీవ్ర ఆందోళన కలిగించేది అని జపాన్ రక్షణ మంత్రి నోబు కిషి గుండెలు బాదుకున్నాడు. ఇలా జపాన్ సరిహద్దుల వరకు చైనా-రష్యా విమానాలు రావటం గతేడాది నవంబరు నుంచి నాలుగవసారి అని కూడా కిషి చెప్పాడు. మరి అప్పుడే సమావేశాలు జరిగినట్లు? ఎవరిని హెచ్చరించేందుకు వచ్చినట్లు? వాటిలో నరేంద్రమోడీ గారు లేరు కదా! మా మంత్రిగారు ఏం చెప్పారన్నది వేరే గానీ ఆ విమానాలు తమ గగనతలాన్ని అతిక్రమించలేదని జపాన్ రక్షణ మంత్రిత్వశాఖ చెప్పినట్లు ఎఎఫ్‌పి వార్తా సంస్థ పేర్కొన్నది. జపాన్ సముద్రం మీద రెండు చైనా విమానాలతో జత కలసిన మరో రెండు రష్యా విమానాలు తూర్పు చైనా సముద్రం నుంచి పసిఫిక్ సముద్రం వైపు వెళ్లినట్లు జపాన్ మంత్రి చెప్పాడు. గూఢచార సమాచారాన్ని సేకరించేందుకు రష్యా విమానం కూడా ఒకటి జపాన్ వైపు వచ్చినట్లు, ఈ చర్యలు రెచ్చగొట్టేందుకే అని ఆరోపించాడు. అంతర్జాతీయ నిబంధనలను పాటించి మరొక దేశ గగనతలాన్ని అతిక్రమించకుండా విమానాలు తిరగటం సర్వసాధారణం.
ఇలా తమ విమానాలు సంయుక్తంగా తిరగటం నిరంతర గస్తీలో భాగమే అని చైనా, రష్యా పేర్కొన్నాయి. వార్షిక మిలిటరీ సహకార ఒప్పందంలో భాగంగా తిరిగినట్లు చైనా రక్షణశాఖ నిర్ధారించింది. టోకియో చతుష్టయ సమావేశాల సందర్భంగా తన రెచ్చగొట్టుడు చర్యలను సమర్థించుకొనేందుకు జపాన్ ఇలాంటి ఆరోపణలను చేస్తోందని చైనా పేర్కొన్నది. అమెరికా, జపాన్ రెచ్చగొడుతున్న తరుణంలో రెండు యుద్ధ నౌకలను జపాన్ సమీపంలోని రెండు జలసంధులకు చైనా పంపింది. పశ్చిమ పసిఫిక్ సముద్రంలోని చైనా విమానవాహక నౌక నుంచి గత ఇరవై రోజుల్లో కనీసం మూడువందల సార్లు విమానాలు చక్కర్లు కొట్టినట్లు, తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే తమ సత్తా ఏమిటో చూపేందుకే ఇలా చేసినట్లు వార్తలు వచ్చాయి.
జపాన్ పార్లమెంటు వెలుపల చతుష్టయ సమావేశాలు జరిగే చోట ఏర్పాటు చేసిన బానర్లు, పోస్టర్లలో ''హాంకాంగ్ స్వాతంత్య్రం, విప్లవం, ఉఘిర్‌లో మారణకాండను ఆపండి'' అని రాయటం చైనాను రెచ్చగొట్టటమే అన్నది స్పష్టం. ఇక జపాన్ సంగతికొస్తే 2021లో ఇరుగు పొరుగు దేశాలు తన గగనతలాన్ని అతిక్రమిస్తున్నాయనే అనుమానంతో తానే రికార్డు స్థాయిలో ఎగబడి పట్టుకొనేందుకు ప్రయత్నించటం లేదా తానే గస్తీ తిరగటం వంటి పనులు చేసింది. ఇది ఆప్రాంతంలో తలెత్తిన తీవ్ర పరిస్థితికి అద్దం పడుతోంది. ఇదంతా చతుష్టయం పేరుతో చైనా వ్యతిరేక కూటమి చర్యలు ముమ్మరం అయిన తరువాతే అన్నది స్పష్టం. 2020లో 279లో సార్లు, 2021లో 1,004 సార్లు జపాన్ విమానాలు తిరిగాయి. అంతకు ముందు 2016లో గరిష్టంగా 1,168సార్లు వెంటపడినట్లు అధికారికంగా వెల్లడించారు. దానికి 2012లో జపాన్ జనావాసం లేని మూడు దీవులను ప్రయివేటు వారినుంచి కొనుగోలు చేసింది, అవి తమవని చైనా చెప్పటంతో వాటి చుట్టూ జపాన్ తన విమానాలను గస్తీ తిప్పింది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో ఈ చర్యలు ఆందోళన కలిగిస్తున్నట్లు చైనా తన శ్వేతపత్రంలో ఆరోపించింది.
యధాతధ స్థితిని బలవంతంగా మార్చేందుకు పూనుకుంటే సహించేది లేదని ఏ దేశం పేరు పెట్టకుండా టోక్యో చతుష్టయ సమావేశం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నప్పటికీ అది చైనా, రష్యాల గురించే అన్నది స్పష్టం. పేరుకు తమది మిలిటరీ కూటమి కాదంటూనే ఆ దిశగా దాన్ని మార్చేందుకు పూనుకున్నారు. దానికి విరుగుడుగా చైనా కూడా జాగ్రత్తపడుతోంది. దానిలో భాగంగానే తన మిలిటరీని పటిష్టపరుస్తోంది. దక్షిణ ఫసిఫిక్ ప్రాంతంలోని అనేక చిన్న దేశాలతో సంబంధాలను పటిష్టపరుచుకుంటోంది. 2017వరకు ఒక భావనగానే ఉన్న ఈ కూటమి గడచిన రెండు సంవత్సరాలలో నాలుగు సార్లు సమావేశం కావటం గమనించాల్సిన అంశం. ఆ తరువాతే లడఖ్‌లోని గాల్వన్ లోయ ఉదంతం జరిగినట్లు అంతర్జాతీయ పరిశీలకులు చెప్పారు. ఆస్ట్రేలియా-చైనా మధ్య వాణిజ్యపోరు మొదలైంది. సోలోమన్ దీవుల ప్రభుత్వంతో చైనా కుదుర్చుకున్న భద్రతా ఒప్పందం తమకు వ్యతిరేకంగానే అని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది. చైనా నావలు ఆ దీవుల్లో లంగరువేసేందుకు వీలుకలుగుతుందని అంటోంది. దీనికి ప్రతిగా బ్రిటన్, అమెరికాతో కలసి అకుస్ పేరుతో మిలిటరీ ఒప్పందం చేసుకుంది. బ్రిటన్ నుంచి అణుశక్తితో నడిచే జలాంతర్గాముల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దాదాపు శతాబ్దికాలంగా జపాన్-చైనా మధ్య వివాదాస్పదంగా ఉన్న కొన్ని దీవుల అంశమై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకవైపు తైవాన్ దీవిని చైనా అంతర్భాగంగా గుర్తిస్తున్నామని చెబుతూనే దాన్ని సైనికంగా బలపరిచేందుకు అమెరికా పూనుకుంది. ఒక వేళ చైనా గనుక బలవంతంగా విలీనం చేసుకోవాలని పూనుకుంటే తాము మిలిటరీతో రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసియా పర్యటనలో బెదిరించిన అంశం తెలిసిందే.
చతుర్ముఖ భద్రతా మాటామంతీ (ద క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్) పేరుతో 2007లో జపాన్ చొరవతో భారత్, ఆస్ట్రేలియా, అమెరికా చర్చలు ప్రారంభించాయి. దీన్నే క్వాడ్(చతుష్టయం) అంటున్నారు. ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో చైనాను ఎదుర్కోవటమే దీని లక్ష్యం. అదే ఏడాది ఆస్ట్రేలియా వెనక్కు తగ్గటంతో ఆ కూటమి ముందుకు సాగలేదు. 2017లో మనీలాలో జరిగిన ఆసియన్ కూటమి సమావేశాల సందర్భంగా ఈ కూటమిని పునరుద్దరించాలని నాలుగు దేశాలు నిర్ణయించాయి. ఆ ప్రాంతంలో నౌకలను అడ్డుకున్న ఉదంతం ఒక్కటీ లేకున్నా ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో స్వేచ్ఛగా నౌకా రవాణా ఉండే పరిస్థితి కల్పించాలనే పేరుతో ఒక అజెండాను ముందుకు తెచ్చాయి. పైకి ఏమి చెప్పినా చైనాను అడ్డుకోవటమే అసలు ఎత్తుగడ. ఇండో-ఫసిఫిక్ ప్రాంతం గురించే తమ కేంద్రీకరణ అని చెప్పిన చతుష్టయ కూటమి క్రమంగా ఇతర అంశాల మీద కూడా దృష్టి సారిస్తోంది. టోక్యో భేటీతో పాటు ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్ సంక్షోభం గురించి చర్చించింది.
ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసినపుడు వివిధ కారణాలతో మిలిటరీతో ఆదుకోలేదు, తైవాన్ విషయంలో కూడా చైనా దాడి చేస్తే అలాగే ఉంటారా లేక రక్షణకు వస్తారా అని టోక్యోలో విలేకరి అడిగిన ప్రశ్నకు వెంటనే జో బైడెన్ అవసరమైతే తైవాన్‌లో మిలిటరీతో ఎదుర్కొంటామని చెప్పాడు. ఒకే చైనా విధానాన్ని అమెరికా అంగీకరించింది నిజం, ఆ మేరకు ఒప్పందంపై సంతకాలు కూడా చేశాం. దానిలో ఎలాంటి మార్పూ లేదు. కానీ తైవాన్ను బలవంతంగా స్వాధీనం చేసుకోవటం సబబు కాదు. అందుకు పూనుకుంటే మిలిటరీతో ఎదుర్కొంటాం అన్నాడు. బలప్రయోగం చేసే హక్కు చైనాకు లేదన్నాడు. బలవంతంగా ఆక్రమించేందుకు చైనా పూనుకుంటుందని తాను అనుకోవటం లేదని, అది ప్రపంచం ఎంత గట్టిగా స్పందస్తుంది అనేదానిపై ఆధారపడి ఉంటుందని, దురాక్రమణకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నాడు. అంతకు ముందు జపాన్ ప్రధాని కిషిడాతో కలసి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా ఏకపక్షంగా యధాతధ స్థితిని మార్చేందుకు ఎవరైనా పూనుకుంటే సహించేది లేదని, రష్యా దాడి ప్రపంచ వ్యవస్థ పునాదులను కదలించిందని బైడెన్ అన్నాడు.
బైడెన్ ప్రకటనల మీద చైనా తీవ్రంగా స్పందించింది. ఏదో అనుకోకుండా మాట్లాడినట్లుగా తాజా స్పందనను పరిగణించలేమని, అంగీకరించిన ఒకే చైనా విధానం నుంచి వెనక్కు తగ్గుతున్నదనేందుకు సూచిక, మరొక అడుగు ముందుకు వేసినట్లు చైనా భావిస్తోంది. ఉక్రెయిన్ ముసుగులో తైవాన్ స్వాతంత్య్రం గురించి అమెరికా, జపాన్ తమ పథకాలతో ముందుకు పోతే వాటిని గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లో మాదిరి బలప్రయోగంతో ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో కూడా ఏకపక్షంగా యధాతధ స్థితిని మార్చితే చూస్తూ ఊరుకోబోమని జపాన్ ప్రధాని కిషిడా కూడా చెప్పటాన్ని చైనా పరిశీలకులు గుర్తు చేశారు. తైవాన్ తమ అంతర్గత అంశమని, దానిలో విదేశీ శక్తుల జోక్యాన్ని అనుమతించబోమని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ విలేకర్లతో స్పష్టం చేశాడు. అమెరికా సైనికులను తైవాన్‌కు తరలించనప్పటికీ ఏదో ఒక ముసుగులో ఆయుధాలను పెద్దఎత్తున అందచేస్తున్నది. అందువలన సైనికులను పంపటం ఒక్కటే మిలిటరీ జోక్యం కాదని ఆయుధాల అందచేత కూడా మిలిటరీ జోక్యమే అని చైనా పరిగణిస్తున్నప్పటికీ సంయమనం పాటిస్తున్నది. చైనా మీదకు పోవాలని బైడెన్ కోరుకున్నట్లయితే చైనా-అమెరికా సంబంధాలు టైటానిక్ ఓడ మంచుకొండను ఢకొీన్నప్పుడు జరిగిన మాదిరే జరుగుతుందని చైనా పరిశీలకులు వర్ణించారు. ఉక్రెయిన్ అంశాన్ని తైవాన్ సమస్యతో కలిపి చూపటం వెనుక తైవాన్ దీవిపై చైనా సార్వభౌమత్వాన్ని తిరస్కరించే ఎత్తుగడ ఉంది. అంతేకాదు తైవాన్ను చూపుతూ ఆసియా ఫసిఫిక్ ప్రాంతానికి చైనా ముప్పు ఉందని ఈ ప్రాంత దేశాలను నమ్మించటం, తప్పుదారి పట్టించటం కూడా తెలిసిందే.
జో బైడెన్ ఆసియా పర్యటనను మొత్తంగా చూసినట్లయితే ప్రధానంగా రెండు లక్ష్యాలతో సాగినట్లు చెప్పవచ్చు. గత రెండు దశాబ్దాలలో తొలిసారిగా ఆసియా పర్యటన జరిపిన అమెరికా నేతలందరూ చైనాను సందర్శించారు. తొలిసారిగా జోబైడెన్ చైనాలో అడుగుపెట్టలేదు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి) పేరుతో ఏర్పడిన అతి పెద్ద ఆర్థిక కూటమిలో అమెరికా లేదు. దానికి పోటీగా ఇండో ఫసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపిఇఎఫ్) పేరుతో కొత్త కూటమిని ఉనికిలోకి తెచ్చి ఆ ప్రాంత దేశాలను ఆకర్షించటం, తద్వారా తనపెత్తనాన్ని నిలుపుకొనేందుకు పూనుకోవటం చేస్తున్నది. దీని వలన మనకు కలిగే లబ్ది ఏమిటో తెలియకుండానే మన దేశం సిద్దం సుమతీ అన్నది. ఆర్‌సిఇపిలోని మరికొన్ని దేశాలు కూడా దీనిలో చేరుతున్నట్లు ప్రకటించాయి. ఈ కూటమిలో అమెరికా మార్కెట్లో ప్రవేశించే అవకాశాలు పరిమితమని ఇప్పటికే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇది కూడా చైనాను దూరంగా పెట్టే ఎత్తుగడే. రెండవదానికొస్తే ఉక్రెయిన్ విషయంలో తాము మిలిటరీని పంపేది లేదని అమెరికా చెప్పటంతో దాన్ని నమ్ముకుంటే అంతే సంగతులని అనేక దేశాలు భావిస్తున్నాయి. ఇది అమెరికాకు రాజకీయంగా ఎంతో నష్టం కలిగించింది. తన ప్రయోజనాలకోసం రెచ్చగొట్టి ముందుకు తోసి తాను తప్పుకుంటుందనే భావం ఎల్లెడలా కలిగింది. దాన్ని పోగొట్టేందుకు, మద్దతుదార్లలో విశ్వాసాన్ని కల్పించేందుకు తైవాన్ అంశంలో తాము సైనికంగా జోక్యం చేసుకుంటామని బైడెన్ చెప్పాడు.
- ఎం.కోటేశ్వరరావు
సెల్:8331013288