Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆహార ధాన్యాల ఉత్పత్తి, నిల్వలు, పంపిణీ, ఎగుమతులు, దిగుమతుల ఆధారంగానే ఆయా దేశాల ప్రజల తిండికొరత తీరుతుంది. అయితే ఇందుకు సంబంధించి పాలకులకు చిత్తశుద్ధితో కూడిన సమగ్రదృష్టి, దార్శనిక ప్రణాళిక, ఫలవంతమైన కార్యాచరణ అవశ్యం. అందునా రైతు కేంద్రంగా నిలిచే మనలాంటి వ్యవసాయ దేశానికి మరీ ముఖ్యం. లేకుంటే పరిస్థితి ఘోరంగా తయారై తీవ్ర సంక్షోభానికి దారితీస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నదదే.
అతివృష్టి అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు, కరోనా మహమ్మారి వంటి ఉత్పాతాలు, పెట్టుబడిదారీ వర్గం చేసే దోపిడీ మోసాలు ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ కూడా నేటికీ రైతు సేద్యం చేస్తూ తిండిగింజలు పండిస్తున్నాడంటే, ఎంతటి వారైనా మన రైతుకు రుణపడి ఉండాల్సిందేనని చెప్పక తప్పదు.
మన భారత రైతులు పాలకుల విధానాలతో నిత్యం ఒక వైపు ఆత్మహత్యలకు గురవుతున్నా, ప్రపంచాన నూట యాభైకి పైగా దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారంటే ఎంత గొప్ప విషయం. అంతే కాదు యాభైలక్షల మెట్రిక్ టన్నుల గోధుమలకు ఎగుమతి ఆర్డ్ర్లను కూడా అందుకుంటున్నారు. తొమ్మిదేండ్ల క్రితం 2013-14లో మన బియ్యం ఎగుమతుల విలువ 292 కోట్ల డాలర్లు ఉంటే, ప్రస్తుతం 2021-22 నాటికి అది 611 కోట్ల డాలర్లకు పెరిగింది. అంటే 109శాతం పెరుగుదల. ఇది మన రైతుల కష్టార్జితం కాక మరేమిటి? దాదాపు నాల్గొవంతు ప్రపంచ జనాభాకు మన రైతు అన్నం పెడుతున్నాడు.
కాగా మన వ్యవసాయ ఉత్పత్తుల విలువ గత ఏడాది (2020-21) 2,10,093 కోట్లు కాగా, దిగుమతుల విలువ 1,41,448 కోట్లు. అంటే ఎగుమతి - దిగుమతుల నిష్పత్తి 1:0.67గా నమోదైంది. ఇది కూడా శుభపరిణామమే. మన దేశ ఆర్థికవృద్ధికి తోడవుతుంది. నూనె గింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తిలో మనం కొంత వెనుకబడి ఉన్నాము. కనుకనే దిగుమతులపై ఆధారపడవలసి వస్తున్నది.
ఇక పోతే ప్రపంచంలో మన సేద్యపు భూమి వాటా కేవలం 2.4శాతం మాత్రమే. నీటి వనరుల శాతం కూడా నాలుగు మాత్రమే. మూడింట ఒకవంతు భూమికి మాత్రమే నీటి వనరులు దక్కుతున్నాయి. మిగిలిన రెండొంతుల భూమికి - రైతు భూగర్భ జలాల మీదగాని, వర్షపునీరు మీదగాని ఆధారపడవలసి వస్తున్నది.
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళల్లో అంటే సుమారు డెబ్భై ఏండ్ల కితం మన దేశ జనాభా 35కోట్లు మాత్రమే. అయినా అప్పుడు మన జనాభాకు రైతు పండించే తిండిగింజలు సరిపోయేవి కావు. విదేశాల నుండి ఓడల ద్వారా దిగుమతి అయితేనే ఆహార ధాన్యాలు లభ్యమయ్యేవి. దీనినే 'షిప్ టు మేత్' అన్నారు. మరిప్పుడు మన దేశ జనాభా135 కోట్లకు చేరింది. అయినా మన రైతు ఏటికి ఎదురీదినట్టుగా నిత్యం నిర్విరామంగా కష్టపడుతూ మన దేశ ఆకలి అవసరాలు తీర్చడమే కాదు. ప్రపంచానికే అన్నం అందిస్తున్నాడు.
ఆకలి బాధలు, ఆహార ధాన్యాల కొరతలేని ప్రపంచాన్ని సాధించాలన్న ఐక్యరాజ్యసమితి సుస్థిర లక్ష్యాన్ని సాధించేందుకు మనరైతు ఆహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఇదంతా నాణానికి ఒకవైపే. మరోవైపు ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నేడు 20కోట్ల మంది తీవ్రమైన ఆహారకొరతను ఎదుర్కొంటున్నట్టు అదే ఐక్యరాజ్యసమితి ఇటీవల ప్రకటించింది. ప్రపంచ మానవాళి ఆకలితీర్చడం ప్రతిఒక్కరి బాధ్యతగా గుర్తెరగాలని సంస్థ ప్రతినిధి క్యుడొంగ్యు మే 4న జరిగిన సమావేశంలో తెలిపారు. ఎప్పుడైనా, ఎక్కడైనా వ్యవసాయ కష్టజీవి రైతు జీవితాన్ని ధ్వంసం చేస్తున్నకొద్దీ, రానున్న కాలంలో ఈ మహావిపత్తును మనకు మనమే చేతులారా కొనితెచ్చుకోవడమే అవుతుందని అన్యోపదేశంగా నేతలను హెచ్చరించారు. కష్టం చేసే కష్టజీవులు ఎల్లెడలా ఉన్నారు. ఉత్పత్తిని పెంచుతూనే ఉన్నారు. అయినా ఆ కష్టజీవులను నిరంతరం పేదరికం ఊబిలోకి నెట్టే పాలకులు పెరుగుతున్నారు. అందుకే ఒకవైపు తిండిగింజలు ఉత్పత్తి అవుతున్నా మరోవైపు ఆ తిండి గింజలు దొరకని అన్నార్తులు కోట్ల సంఖ్యలో ఉంటున్నారు. ఇదో వర్తమాన విపరిణామం. విశ్వవిషాదం.
ఒక పుష్కర కాలం క్రితం 2007-08లో ప్రపంచ ఆహార సంక్షోభం ఏర్పడినప్పుడు దాదాపు 37దేశాలు ఆహార కొరతను ఎదుర్కొవలసి వచ్చింది. అప్పుడు కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తి కొరతగాని, తగ్గుదల గాని సంభవించలేదు. ఈ కృత్రిమ కొరత అంతా మార్కెట్ శక్తుల పుణ్యమే. అయినా పాలకులు గుణపాఠం నేర్వడం లేదు.
కాగా ఇప్పుడు రష్యా - ఉక్రెయిన్ యుద్ధ కారణంగా, ఆహార ధాన్యాల కొరత లేనప్పటికీ ధరలు మాత్రం ఆకాశానికి ఎగబాకుతున్నాయి. మొక్క జొన్నలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి ఉత్పత్తులు సమృద్ధిగాఉన్నా, నిజం చెప్పాలంటే యుద్ధం ప్రారంభం కాకముందే వీటిధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి.
ఆహార సంక్షోభం అంటే ఇదే కదా! రైతు శ్రమతో ఉత్పత్తి అయ్యే తిండిగింజలు ఆ రైతుకే అందకుండా దూరమవుతున్నాయి. కనుకనే ప్రపంచ వ్యాప్తంగా కష్టజీవులే నిరుపేదలుగా మారిపోతున్నారు. వారే నిత్యాకలి సమస్యలో కూరుకుపోతున్నారని మరో ప్రతినిధి ఆలివర్ డి షుట్టర్ వాపోయారు.
ఆహార ధాన్యాలతో జూదమాడటం ఎవరికీ తగదని, ఇంతకన్నా అమానవీయ కోణం ఏముంటుందని సంస్థ వైస్‌ఛైర్మన్ జెన్నీఫర్ క్లాప్ ప్రశ్నించారు. స్పెక్యులేషన్‌ను అడ్డం పెట్టుకుని, ప్యూచర్ మార్కెట్ అంటూ కొరతను సృష్టించడం వ్యవసాయ వాణిజ్య కంపెనీలకు ఓ పరిపాటిగా మారిందని కూడా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి విమర్శించింది. ఈ కృత్రిమ కొరతను సృష్టించడం యుద్ధనేరాల కన్నా ఏమీ తీసిపోదని, జీవించే హక్కును కాలరాయడమే అవుతుందని మండలి కుండ బద్దలు కొట్టింది.
ఇది ఇలా ఉండగా, మార్కెట్ శక్తులు సృష్టించే కృత్రిమ కొరత కారణాన ప్రపంచవ్యాప్తంగా కొట్లాదిమంది క్షుద్బాధను ఎదుర్కొంటున్న తీరును 'వర్తమాన ప్రజాస్వామ్యం' (డెమోక్రసీనే) అనే పాపులర్ టీవీ దుయ్యబట్టింది. దేశ దేశాల్లోని విషాద పరిస్థితులను విశదపరిచింది. ఆహార స్వావలంబనను నెలకొల్పడం, ఆహార భద్రతా వ్యవస్థను నిలకడగా ఉంచడం వంటి బాధ్యతాయుత చర్యలకు పాలకులు తిలోదకాలిచ్చి మార్కెట్ శక్తులకు సాగిలపడటాన్ని ఆ టీవీ ఎండగట్టింది.
ఈ కారణంగానే ఆహార ధాన్యాల కంపెనీల్లో ఒకటైన కార్గిల్ కంపెనీ ఈ ఏడాది ఇప్పటికే రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించినట్టు 'గార్డియన్' పత్రిక కూడా విమర్శించింది.
ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం వ్యవసాయ పంటల ధర గత ఏడాది కంటే 41శాతం పెరిగింది. గోధుమలు, మొక్కజొన్నల ధరలైతే అంతర్జాతీయ మార్కెట్లో 50-60శాతం పెరిగాయి.
తిండిగింజలు పండించే వ్యవసాయ దేశం మన భారతదేశం గనుక, అదీనూ స్వాభావికంగా కష్టించే మన రైతుల వలన, మన దేశం కొంతలో కొంత ఊపిరి పీల్చుకోగలుగుతున్నది. లేనిపక్షంలో మార్కెట్ శక్తులు రాబందుల్లా మన ప్రజల్ని మరింతగా పీక్కుతినేవి. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు మన పాలకులు ఊడిగం చేయడం గమనిస్తున్నాం. ప్రజల్ని మరిచిన పాలకులు మార్కెట్ శక్తులతో అపవిత్ర చెలిమి చేయడం వల్లనే అన్నం సృష్టించే రైతులే చివరకు అన్నార్తులుగా మిగిలిపోతున్నారు. జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని రైతులే కాదు ప్రతి ఒక్క భారతీయుడు గుర్తెరగాలి. ప్రపంచ వ్యాప్తంగా సాగే రైతుల పోరాటాల్లోనూ, ఆకలి వ్యతిరేక పోరాటాల్లోనూ భాగస్వామ్యం కావాలి.
- కె. శాంతారావు
సెల్:9959745723