Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పర్యావరణ కాలుష్య సంక్షోభంతో ప్రజారోగ్యం గాల్లో దీపం అవుతున్నదని, లక్షల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని తాజా 'లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్' ప్రచురించిన 'పొల్యూషన్ అండ్ హెల్త్ : ఏ ప్రొగ్రేసివ్ అప్డేట్' అనే పరిశోధనా వ్యాసం కఠిన వాస్తవాలను వివరిస్తున్నది. ఐరాస వివరణ ప్రకారం పర్యావరణ విచ్ఛిన్న మానవ వ్యార్థాల కారణంగా నేల, నీరు, గాలిలో నాణ్యతలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తమవుతున్నది. గాలిని కలుషితం చేసే పియం 2.5, ఓజోన్, సల్ఫర్/నైట్రోజన్ ఆక్సైడ్లతో పాటు నీటిని కలుషితం చేస్తున్న పాదరసం, నైట్రోజన్, ఫాస్ఫరస్, ప్లాస్టిక్, పెట్రోలియం వ్యర్థాలు ప్రధాన కాలుష్య కారకాలుగా ఉన్నాయి. వీటికి తోడుగా నేలను కలుషితం చేస్తున్న లెడ్, పాదరసం, ఎరువులు, పెస్టిసైడ్లు, పారిశ్రామిక రసాయనాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, రేడియోధార్మిక వ్యర్థాలు జీవకోటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
కాలుష్య దుష్ప్రభావాల ఫలితం
పర్యావరణ కాలుష్యం కారణంగా 23.5లక్షల అకాల మరణాలు నమోదు అయ్యాయని, ఒక్క గాలి కాలుష్య భూతంతోనే 16.7లక్షల మరణాలు, కేవలం పియమ్ 2.5 గాలి కాలుష్యంతో 9.8 లక్షల మరణాలు, గృహ సంబంధ కాలుష్యంతో 6.1లక్షల మరణాలు జరిగాయనే భయంకర వాస్తవాన్ని 'లాన్సెట్' అధ్యయన పరిశోధనా వ్యాసం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పలు రకాలైన కాలుష్య కోరల్లో చిక్కి 9 మిలియన్ల ప్రజలు మరణించారని, వీరిలో అత్యధిక మరణాలు ఇండియాలో నమోదు అయ్యాయనే కఠిన వాస్తవాన్ని 'గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్, ఇంజూరీస్, అండ్ రిస్క్ ఫాక్టర్స్' అనబడే అధ్యయన వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇండియాలో నీటి కాలుష్యం బారిన పడి 5లక్షల మరణాలు, వృత్తిపరమైన కాలుష్యంతో 1.6లక్షల మరణాలు, సీసం (లెడ్) కాలుష్యంతో 2.3లక్షల మరణాలు జరిగాయని తెలుస్తున్నది. గృహ, పరిసర సంబంధ కాలుష్యంతో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా 6.67 మిలియన్ల మరణాలు (ప్రపంచ మరణాల్లో 17.8శాతం) జరిగాయని తెలుస్తున్నది. పేదరికంతో సంబంధాన్ని కలిగిన కాలుష్య మరణాలు కొంత తగ్గినప్పటికీ గాలి, లెడ్ కాలుష్య మరణాలు ఏటేటా క్రమంగా పెరుగుట గమనించబడింది. 2019లో నమోదైన సగటు ఆయుర్థాయం పురుషులకు 69.5ఏండ్లు, మహిళలకు 72ఏండ్లుగా ఉండగా 2020లో పురుషులకు 67.5ఏండ్లు, మహిళలకు 69.8ఏండ్లుగా మాత్రమే రికార్డు కావడం విచారకరం.
కాలుష్యాలకు కారణాలు
పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, జనాభా విస్పొటనం, శిలాజ ఇంధన వినియోగం, కాలుష్య నివారణ చర్యలు లేకపోవడం లాంటి కారణాలతో ప్రజారోగ్యం పడకేయడం జరిగింది. నీటి కాలుష్యంతో పిల్లలు, మహిళలు అధికంగా అనారోగ్యాలపాలు అవుతున్నారు. యుద్ధాలు, ఉగ్రవాదం, మలేరియా, హెచ్ఐవి, టిబి, మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ లాంటివి కూడా కాలుష్యాల కారణంగానే జరుగుతున్నట్లు తేలింది. బయోమాస్/బొగ్గు దహనం, వ్యవసాయ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో కాల్చడంతో గాలి కాలుష్యం రెచ్చిపోతున్నట్లు తేలింది. ప్రపంచ గాలి నాణ్యత నివేదిక-2021 ప్రకారం భారతదేశంలోని 50నగరాల్లో 35నగరాలు గాలి గరళ కాలుష్యంతో సతమతం అవుతున్నట్లు తేలింది. మన దేశ రాజధాని వరుసగా నాలుగవ సారి ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య నగరంగా రికార్డు సృష్టించిందని మనకు తెలుసు. పేద, మధ్య ఆదాయ దేశాల్లో కాలుష్యాలను తగ్గించడానికి పెద్దగా ప్రయత్నాలు జరగడం లేదని, సత్వరమే కాలుష్య నియంత్రణకు ప్రపంచదేశాలు పలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, ఒకవేళ ఇలాగే నిర్లక్ష్యం చేస్తే కాలుష్య గరళంతో ప్రపంచ మానవాళి పలు అనారోగ్యాలు, అకాల మరణాలను ఎదుర్కోవలసి వస్తుందని మరువరాదు.
వాతావరణ ప్రతికూల మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, అకాలవర్ష వడగళ్లు, జీవ వైవిధ్య విచ్ఛిన్నం, పెరుగుతున్న కాలుష్య గాఢతలతో మానవ జీవితాలు ప్రభావితం కావడమే కాకుండా జీవకోటి మనుగడ కూడా ప్రశ్నార్థకం అవుతున్నది. వాతావరణ మార్పులతో అసాధారణ కరోనా లాంటి విపత్తులు, అంటువ్యాధులు ప్రబలడం మానవాళిని పట్టి పీడిస్తున్నాయి. భారతంలో 2021 ఏడాది 1.93 లక్షల మంది డెంగ్యూ అంటువ్యాధి బారినపడగా, 2018 తరువాత అత్యధికంగా 306 మంది మరణించడం కూడా గమనించారు. అకాల వర్షాలతో అంటువ్యాధులు రెచ్చిపోతున్నాయి. భూతాపంతో వాతావరణ మార్పులు పెరగడం ప్రాణికోటికి ప్రమాదకరంగా మారుతున్నది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం రానున్న 80ఏండ్లలో భూతాపంతో సగటు వాతావరణ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరిగితే మనిషి/ప్రాణికోటి మనుగడ మహాసంక్షోభంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. గాలి కాలుష్యంతో ఆసియా, ఫసిఫిక్ దేశాలపై భారీగా ఆర్థిక భారం పడుతున్నదని తెలుసుకోవాలి.
ఆధునిక కాలుష్యం - నియంత్రణ
ఆధునిక గాలి కాలుష్య కారకాలైన లెడ్, రసాయన కాలుష్యాలను సత్వరమే కట్టడి చేయాలి. కాలుష్య నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేయడం, నిధులను కేటాయించడం, కఠినంగా చట్టాల అమలు, ప్రపంచ దేశాలు, ప్రాంతాల మధ్య కాలుష్య కట్టడికి సమన్వయం పెరగడం, గృహ సంబంధ గాలి కాలుష్య కట్టడి వంటి పటిష్ట చర్యలు సత్వరమే అమలు చేయాలి. భూగోళ కాలుష్యానికి ఏకైక కారణం మానవుడే. అభివృద్ధి సుస్థిరంగా, పర్యావరణ హితంగా ఉండాలి. కాలుష్యాన్ని పెంచి పోషించే అభివృద్ధి మనకు అవసరం లేదు.
- డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్:9949700037