Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మా భాషలోనే గులాబీ పరిమళిస్తుంది / మరో భాషలో గుబాళించదు / మా ఊళ్ళోనే చంద్రుడు నవ్వుతూ ఉంటాడు / మరో ఊళ్ళో అఘోరిస్తాడు / ... మా కత్తులు సైతం మెత్తగా ఉంటాయి / మా నెత్తురు ఆహా నీలంగా ఉంటుంది / మా ఊళ్ళో పాములు అమృతం చిలుకుతాయి / మానోటి తిట్లు ముద్దులొలుకుతాయి / ...మా గొప్పలు మేం చెప్పుకో గూడదు కాబట్టి / మా ఘనతనే కీర్తించండి బాజాలతో / మా తాతలు నేతులు తాగారా మరి? / మాకు ఇప్పటికీ తేన్పులొస్తాయి నమ్మండి! / మీ డొక్కలు మాడుతున్నాయంటారా? / మజ్జారే! ఎంత కమ్మగా పాడుతున్నాయో వినండి'' - ఆరుద్ర
ప్రస్థుతం కేంద్రంలో అధికారంలో ఉన్నవారి ఆలోచనా ధోరణి గూర్చి 'త్వమేవాహం' కవి ఆరుద్ర ఎప్పుడో ఊహించి ఈ ''అసమానావవతు'' అనే కవిత రాశారా? అనిపిస్తుంది. దేశంలో భాష పేరుతో, సంస్కృతి పేరుతో, మతం పేరుతో జనం మీద జరుపుతున్న అఘాయిత్యాలకు లెక్కలేకుండా పోతోంది. ఇప్పుడు ఇక్కడ విద్య, ఆరోగ్యం, ఆహారం, అభివృద్ధి, ఉపాధి వంటివి అసలు సమస్యలే కావు. గుళ్ళు, మసీదుల పునాదుల్లో ఏమున్నాయన్నదే ముఖ్యం! కాశీ జ్ఞానవాపి మసీదు విషయం కోర్టుకెక్కి, సర్వే జరుగుతున్న సమయంలోనే, మన తెలంగాణ - నిజామాబాద్ అమ్మాయి నిఖత్ జరీన్ బాక్సింగ్‌లో ప్రపంచ విజేతగా నిలిచింది. అక్కడ మత ప్రసక్తిలేదు!! కానీ, దేశంలో అనేక చోట్ల అనేక విషయాలు మత ప్రాతిపదికన వివాదాస్పదమై పోతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ దాని అనుబంధ సంస్థలు కావాలని అనేక వివాదాల్ని తెరపైకి తెస్తున్నాయి. ప్రజలు నిజాలు తెలుసుకోకుండా అడ్డుపడుతున్నాయి. ఒకవైపు ఆగ్రాలో తాజ్‌మహల్, మరోవైపు కాశీలో జ్ఞానవాపి మసీదు, ఇంకోచోట మధురలో కృష్ణుడి ఆలయం వగైరా. అడుగడుగునా వందల ఏండ్లనాటి మొఘలులను కించపరచడం, ముస్లింలను తక్కువ చేసి మాట్లాడటం చూస్తున్నాం.
ఈ దేశ ప్రజలు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల గూర్చి, వంటగ్యాసు గూర్చి, ఎక్కడ గొంతెత్తుతారోనని, ఆకలితో అలమటిస్తున్నామని పేదలంతా ఎక్కడ ఆక్రోషిస్తారోనని, తమకు ద్రోహం తలపెట్టొద్దని రైతులంతా ఎక్కడ మళ్ళీ తిరగబడతారోనని, ఏండ్లకేండ్లు ఉద్యోగాల్లేని యువత ఎక్కడ పిడికిళ్ళు బిగిస్తారోనని... ప్రభుత్వ పెద్దలు అతి తెలివితో లేని సమస్యలు సృష్టించి వాటిని వివాదాస్పదం చేసి, జనాన్ని అభద్రతా భావంలోకి నెట్టేస్తున్నారు. కొద్దిపాటి ఇంగితజ్ఞానం ఉన్న వారికైనా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మనకు దక్షిణాన ఉన్న శ్రీలంక మన కళ్ళముందే ఎలా నాశనమవుతూ వచ్చిందో చూశాం. అలా అక్కడ ఎందుకయ్యిందీ? సింహళ భాష, సింహళ సంస్కృతి, సింహళ ధర్మం అంటూ ప్రజాక్షేమం, అభివృద్ధి, వనరులు కాపాడుకోవడం, ఆర్థిక రంగ పటిష్టత వంటి విషయాలు పూర్తిగా మరిచారు. ఇప్పుడు ఇక్కడ మన దేశంలోనూ అదే జరుగుతోంది. హిందీ భాష, హిందూ సంస్కృతి అంటూ ఒక మత పిచ్చిని జనం మెదళ్ళలో కూర్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. రూపాయి విలువ అత్యంత కనిష్టస్థాయికి పడిపోయిందన్న స్పృహ లేదు. హంగర్ ఇండెక్స్ (ఆకలి సూచి)లో పొరుగు దేశాల కన్నా ఈ దేశాన్ని అధ్వాన్నపు దుస్థితిలోకి నెట్టేశామన్న స్పృహ లేదు. ఆవు మూత్రం, ఆవు పేడ, గుళ్ళు, లింగాలు, దేవీ దేవతల మూర్తులతో దేశాన్ని పురోగమన మార్గంలోకి ఎలా తీసుకుపోతారో వారికే తెలియాలి. దేశం 'హిందూ రాష్ట్ర'గా మారిపోతే చాలు. ముస్లింలంతా వారికై వారు పాకిస్థాన్ వెళ్ళిపోతే చాలు. దళితుల్ని కొట్టి చంపితే చాలు. రాష్ట్రాల నుండి కేంద్రానికి రావల్సిన డబ్బు వస్తూ ఉంటే చాలు. కేంద్రం నుండి రాష్ట్రాలకు విదిల్చేది ఏదీ లేకుండా ఉంటే చాలు. అంబానీ ఆదానీలను రెండు కళ్ళుగా చూసుకుంటే చాలు. ప్రధాని 'మన్ కి బాత్' ఏమిటో ఈ దేశ ప్రజలకు బాగానే అర్థమవుతూ ఉంది.
తాజ్ మహల్లో 22 గదులు మూసి ఉన్నాయి. వాటిపై తాము పరిశోధన చేస్తామని - కొందరు కోర్టు కెక్కారు. అందుకు కోర్టు సరైన సమాధానమే ఇచ్చింది. పరిశోధన చెయ్యాలంటే ఏదైనా విశ్వవిద్యాలయంలో పేరు నమోదు చేసుకుని చెయ్యండి. అక్కడి నుండి డిగ్రీ తీసుకోండి. అంతే గాని ఇలాంటి విషయాలతో కోర్టు సమయం వృధా చేయకండి.. అని చెప్పింది! దీనికి అనుమతి ఇస్తే, ఇదే కోర్టు జడ్జి ఛాంబర్ కింద ఏముందో పరిశోధన చేస్తామని వచ్చినా వస్తారు కదా? అని చురక అంటించింది. తాజ్‌మహల్ కట్టిన స్థలం తమ పూర్వీకులదని, దాన్ని షాజహాన్ అన్యాయంగా ఆక్రమించుకుని ఆ స్థలంలో తాజ్‌మహల్ నిర్మించాడని ఒక బీజేపీ ఎంపీ ప్రకటించింది. అది హిందువుల కట్టడమని, దాన్ని హిందువులకు అప్పగించాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు అది ముస్లింల ఆధీనంలో ఉన్నట్లు... అసందర్భ ప్రేలాపన లెందుకూ? వందల ఏండ్లు గడిచిపోయిన తర్వాత ఈ విషయం లేవనెత్తారంటే ఏమిటీ? దాని వెనక ఉన్న దురుద్దేశం అర్థమవుతూనే ఉంది కదా?
తాజ్‌మహల్ గూర్చి అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. షాజహాన్ - బాదుషా నామా అనే పుస్తకంలో తాజ్‌మహల్‌కు సంబంధించిన అన్ని వివరాలూ ఉన్నాయి. ఆ స్థలం రాజా జయసింగ్ దగ్గర ఎంతకు కొన్నారు? విదేశాల నుండి తెప్పించిన పాలరాయి, ఇతర సామాగ్రికి ఎంత ఖర్చయ్యింది? రవాణాకు ఎంత ఖర్చయ్యింది? 20వేల మంది నిర్మాణ కార్మికుల జీతభత్యాలకు, కూలీలకు ఎంత ఖర్చయ్యింది? వంటి వివరాలన్నీ అందులో నమోదై ఉన్నాయి. ఈ వివరాల వల్ల ఏం తెలుస్తోందీ? రాజా జయసింగే, షాజహాన్ దగ్గర డబ్బులు తీసుకుని అమ్మేశాడని!! ఇదేకాక ఇంకా కొన్ని ఆధారాలున్నాయి. షాజహాన్ పరిపాలనా కాలంలో భారతదేశం సందర్శించిన యూరోప్ యాత్రికుడు పీటర్ ముండి తన గ్రంథంలో - షాజహాన్ బాదుషా తన ప్రియతమ సహచరి ముంతాజ్ జ్ఞాపకార్థం ఒక దివ్యమైన సమాధిని నిర్మిస్తున్నాడని - ఆ దశలో దాన్ని తను చూశాననీ రాసుకున్నాడు. ఇదే విషయం ఫ్రెంచ్ పర్యాటకుడు ఎవర్నియర్ కూడా తన రచనలో ప్రస్తావించాడు. తాజ్‌మహల్ షాజహాన్ నిర్మాణమని, అదొక సమాధి - అని చెప్పడానికి గట్టి సాక్ష్యాలే ఉన్నాయి. ఇది శివుడి ఆలయం - తేజోమహల్ అని చెప్పడానికి ఎట్టి ఆధారమూ లేదు. ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే తెలిసేదేమంటే... హిందూ దేవాలయమైతే దాన్ని ఇరాన్ - ప్రష్యా ఆర్కిటెక్చర్‌తో ఎందుకు నిర్మిస్తారూ? ఆలోచించాలి!
వాస్తవ దృష్టికోణం ఉంటే తప్ప, భావనలతో సత్యాన్ని బయటికి తేలేం. తాజ్‌మహల్‌లో 22 గదులు మూసి ఉన్నాయనీ, అందులో హిందూ మతానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయనీ కొందరి వాదన. ''ఇది సమాధి అనీ, హిందూ దేవాలయం ఏమాత్రం కాదని'' - 2017లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. సమయానుకూలంగా ఆ 22 గదులు తెరిచి, శుభ్రపరిచి భద్రతా కారణాల దృష్ట్యా మళ్ళీ మూసివేస్తున్నామనీ చెప్పింది. కనీసం ఈ విషయాలు తెలుసుకుని మాట్లాడాలి కదా? తాజ్‌మహల్ కాదు, ఇది హిందువుల తేజోమహాలయమని పి.ఎన్.ఓక్ అనే హిందుత్వవాది రాసిన పుస్తకం 1980లలో నేను చదివాను. అర్థరహితమైన వాదన అని నాకు అప్పుడే అనిపించింది. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. తాజ్‌మహల్ నిర్మాణానికి పనిచేసిన కార్మికులు శిల్పులు అధిక శాతం ఇక్కడివారు. అందులో అన్ని మతాల వారు ఉండి ఉంటారు. వారికి నచ్చిన అంశాలేవో వారు ఆ గోడలమీద చిత్రించి ఉంటారు. పూలు, తోరణాలు, కళశాలు వగైరా ఉన్నంత మాత్రాన అది ఒక బలమైన సాక్ష్యం కాదు. ఇటీవల తెలంగాణలో యాదాద్రి నిర్మాణం సాగుతున్నప్పుడు కార్మికులెవరో తెలంగాణ సి.ఎం. బొమ్మ చెక్కారు. ఈ వార్త పత్రికల్లో వచ్చిందే. తాజ్‌మహల్ నిర్మాణంలో పనిచేసిన వేల మందిలో ఎవరో కొందరు తమ ఇష్టాల్ని అనాలోచితంగా, అలవోకగా చెక్కి ఉంటారు. ఒకవేళ అది హిందూ దేవాలయమైతే అది ఎవరు ఎప్పుడు కట్టించారో వివరాలు ఇవ్వాలి కదా? వివాదాలు లేపే ఈ హిందుత్వ అతి మేధావులకు మళ్ళీ ఆజ్ఞానం ఉండదు?
తాజ్‌మహల్ విషయం వివాదం చేయడానికి వీలేలేదు. ఎందుకంటే అది ముస్లింల ప్రార్థనా స్థలం కాదు. మతాలకు అతీతంగా దేశంలోని అన్ని మతాలవారు, అన్ని ప్రాంతాల వారు దాన్ని దర్శించుకుంటున్నారు. ఆ అద్భుత నిర్మాణాన్ని చూసి దేశ ప్రజలే కాదు, ప్రపంచ పౌరులే అబ్బుర పడుతున్నారు. అందువల్ల ఈ కట్టడం ఒక మతం వారిది అని ముద్ర వేయడం బుద్ధితక్కువ పని. ఇది భారతీయులందరి ఉమ్మడి ఆస్థి. దానికి దేశ ప్రజలందరూ వారసులే! ఇదే కాదు, దేశంలోని అన్ని రకాల చారిత్రక కట్టడాలు భారత పౌరుల ఉమ్మడి ఆస్థులే. పోట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. తాజ్‌మహల్ తమదే అని ఈ దేశ ముస్లింలు ఏమైనా ప్రకటించుకున్నారా? లేదే.. ధర్మం పేరుతో సనాతన - సంప్రదాయం పేరుతో సాగుతున్నదంతా కాషాయ రాజకీయమే. తక్షణం సోషలిజానికి చరమగీతం పాడి దీన్ని 'హిందూ రాష్ట్ర'గా మార్చేయాలన్న ధ్యేయంతో అన్ని రకాలుగా అన్ని వైపుల నుండి ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్షాలన్నీ ఒక్క తాటిపైకి రాలేక బలహీన పడ్డాయి కాబట్టి, వారి ఆటలు సాగుతున్నాయి. అందుకే సామాన్యుల్లోనే చైతన్యం రావాలి. కాస్త ఇంగిత జ్ఞానంతో పనిచేయగల ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. శ్రీలంకలో లాగా ప్రధాని ఇల్లు తగులబెట్టి, మంత్రుల గుడ్డలిప్పి తన్నే పరిస్థితి మన దేశంలో రాకూడదు. అయితే బుల్డోజర్లతో పరిపాలన సాగిస్తున్న పాలకులకు ఎలా బుద్ధిచెప్పాలో ఈ దేశ ప్రజలే నిర్ణయించుకోవాలి!
అందుకే బషీర్ బదర్ అనే ఉర్దూ కవి తన గజల్లో ఈ భావం ఇలా వ్యక్తీకరించారు...
''జనం ఒక ఇల్లు కట్టుకోవాలని
జీవితాంతం కొట్టుమిట్టాడుతారు
వాళ్ళ ఇళ్ళు కాల్చేయడానికి నువ్వు మాత్రం,
దయా దాక్షిణ్యాలను కొట్టి చంపుతావు!
(లోగ్ టూట్ జాతేహై ఎక్ ఘర్ బనానే మె /
తుమ్ తరస్ నహీఁ కర్తే బస్తియా జలానేమె)
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.