Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయా సందర్భాలలో గాంధీ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్‌లను తమ ఆరాధ్యులుగా స్వంతం చేసుకోవాలని గత 25 సంవత్సరాల కాలంగా ఆరెస్సెస్ ప్రయత్నం చేస్తుంది. కానీ వారంతా సంఫ్‌ుపరివార్ భావజాలాన్ని పూర్తిగా వ్యతిరేకించిన వారే. అక్టోబర్ 2, 1997 గాంధీ జయంతి రోజున ఆరెస్సెస్ కార్యకర్తల మహా ప్రదర్శననుద్దేశించి నాటి ఆరెస్సెస్ అధినేత రాజేంద్ర సింగ్ ప్రసంగించిన సభకు అటల్ బిహారీ వాజ్‌పారు కూడా హాజరై గాంధీ గురించి సానుకూలమైన రీతిలో అనర్గళంగా మాట్లాడాడు. అంతకుముందు బీజేపీ అధ్యక్షుడైన ఎల్ కే అద్వానీ కూడా తన స్వర్ణ జయంతి రథయాత్ర సమయంలో 50 సంవత్సరాల భారత స్వాతంత్య్ర వేడుకల్లో గాంధీలోని అరుదైన లక్షణాలను గురించి ప్రసంగించాడు. రాజేంద్ర సింగ్ అయితే ఇంకాస్త ముందుకెళ్ళి ''భరతమాత కన్న నవరత్నాల్లాంటి ముద్దు బిడ్డలలో గాంధీజీ ఒకరనీ, ఆయనకు ప్రభుత్వం 'భారతరత్న'తో సత్కరించక పోయినప్పటికీ, మన సమాజం ఆయన్ను గౌరవిస్తుందని'' అన్నాడు. గాంధీజీకి విశ్వాసపాత్రులని ప్రజలకు కనిపించేందుకు వారు చేసిన చౌకబారు ప్రయత్నాలు అవి.
అక్టోబర్ 17, 1997న నాటి బీజేపీ ప్రధాన కార్యదర్శి, సుష్మా స్వరాజ్, గాంధీ కాంగ్రెస్ పార్టీకి గుత్త సొమ్ము కాదని ఆగ్రహంగానే వ్యాఖ్యానించింది. నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం కేసరి, బీజేపీ గాంధీని 'హైజాక్' చేసే ప్రయత్నం చేస్తుందనే వ్యాఖ్యలకు ప్రతిగా ఆమె ఆ వ్యాఖ్య చేసింది. ఇది కేవలం ఒక జాతీయ నాయకునిపై గుత్తాధిపత్యానికి సంబంధించిన అంశమే కాదు, గాంధీ బతికున్న రోజుల్లో ఆయన్ను వ్యతిరేకించి, ఆయన భావజాలాన్ని తిరస్కరిస్తూ, ఆకస్మికంగా ఆయన్ను జాతి నవరత్నాలలో ఒకరిగా వర్ణించే ఒక రాజకీయ ఉద్యమానికి సంబంధించిన విషయం కూడా.
జనవరి 11, 1970లో గాంధీజీ హత్య జరిగిన రెండు దశాబ్దాల తరువాత ఆరెస్సెస్ పత్రిక 'ఆర్గనైజర్' తన సంపాదకీయంలో గాంధీ గురించి ఇలా పేర్కొంది... ''నెహ్రూ పాకిస్థాన్ అనుకూల వైఖరికి మద్దతుగా గాంధీ నిరాహారదీక్ష చేపట్టిన క్రమంలో ప్రజల ఆగ్రహానికి గురయ్యాడు. కాబట్టే నాధూరాం గాడ్సే ప్రజలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయన చేసిన హత్య ప్రజల ఆగ్రహానికి వ్యక్తీకరణ మాత్రమే''. తమ రాజకీయాలు బయటపడకుండా, ఒకవైపు గాంధీ దేని కోసమైతే నిలబడ్డాడో, దానిని తిరస్కరిస్తూనే మరోవైపు గాంధీ పేరును సంఫ్‌ుపరివార్ ఉపయోగించుకోవడం దానికి కొత్తేమీ కాదు. కొన్ని సంవత్సరాల క్రితం యునైటెడ్ కింగ్డమ్ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడైన ఎల్.సీ.పౌంజ్, అయోధ్య సమస్యపై హిందువుల అభిప్రాయాలను తెలియజేస్తూ రాసిన ఉత్తరాన్ని ఇండియన్ హై కమిషన్‌కు అందించాడు. 1934 అల్లర్ల తరువాత శ్రీ రామ జన్మభూమి వివాదానికి సంబంధించి, 27.7.1937న 'నవజీవన్' పత్రికలో మహాత్మా గాంధీ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఆ ఉత్తరంలో ఉదహరించాడు. అవి, సంఫ్‌ుపరివార్ అభిప్రాయాలను గాంధీ సమర్థించినట్లుగా ఉన్నాయి.
బీజేపీ ప్రధాన కార్యదర్శి కృష్ణ లాల్ శర్మ, నాటి దేశ ప్రధాని చంద్రశేఖర్‌కు గాంధీ ('నవజీవన్'లో కాక అదే తేదీన 'హరిజన సేవక్'లో ) ఆందోళనతో రాసిన రెండు పేరాలను ఉదహరిస్తూ ఉత్తరం రాసాడు. ఈ విషయాన్ని డిసెంబర్ 3, 1990లో 'ద టైమ్స్ ఆఫ్ ఇండియా' ద్వారా తెలియజేశారు. తాను ఆ హిందీ వార పత్రికను స్వయంగా చూశానని శర్మ చెప్పాడు. ఆ మరుసటి రోజే 'ద టైమ్స్ ఆఫ్ ఇండియా' రీసెర్చ్ బ్యూరో శర్మ చెప్పిన విషయం తప్పని రుజువు చేస్తూ తన నివేదికను ప్రచురించింది. గాంధీజీ అలాంటి వ్యాసాన్ని రాయలేదు. దానిని వ్యతిరేకిస్తూ, స్థానిక పత్రిక 'విశ్వాస్'లో(పునఃముద్రితం) చూసానని శర్మ అన్నాడు. మళ్ళీ మాట మారుస్తూ, దానిని పరిశీలించాల్సిన బాధ్యత ప్రధానమంత్రిపై ఉంటుందని పునరుద్ఘాటించాడు. 'ద టైమ్స్ ఆఫ్ ఇండియా' రీసెర్చ్ బ్యూరో వారు పదే పదే ఎన్ని విన్నపాలు చేసినప్పటికీ బీజేపీ కేంద్ర కార్యాలయం 'హరిజన్ సేవక్' లేదా 'నవజీవన్' పత్రిక ఒరిజినల్ కాపీలను అందించలేకపోయింది.
మసీదులను స్వాధీనం చేసుకుని, వాటిని దేవాలయాలుగా మార్చిన ఢిల్లీలో నవంబర్ 30, 1947లో గాంధీజీ చేసిన ప్రసంగంపై 'మెయిన్ స్ట్రీం' పత్రికలో విష్ణునగర్ రాసిన వ్యాసంలో ఈ విధంగా ఉదహరించారు. ''మసీదును బలప్రయోగంతో స్వాధీనం చేసుకోవడం హిందూ, సిక్కు మతాలకు సిగ్గుచేటైన విషయం. విగ్రహాలను మసీదు నుంచి తొలగించి, మసీదును పునరుద్ధరించడం హిందువుల కనీస బాధ్యత. మసీదులలో విగ్రహాలను ప్రతిష్టించడం ద్వారా వారు మసీదులను, విగ్రహాలను అపవిత్రం చేస్తున్నారు.'' కానీ నేడు, అయోధ్యలోని బాబ్రీ మసీదు, రామజన్మభూమి వివాదం ముగిసిన తరువాత దేశంలో ఏ సమస్యా లేనట్టూ, జ్ఞానవాపి సమస్యను ముందుకు తెచ్చి దేశ వ్యాప్తంగా మసీదులను కూల్చివేస్తామని సంఫ్‌ుపరివార్, బీజేపీ శక్తులు రెచ్చిపోయి మాట్లాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మసీదులను కూల్చివేస్తామనీ, వాటి కింద శవాలు తేలితే వారు (ముస్లింలు) తీసుకోవాలని, శివలింగాలు బయటపెడితే మేము(హిందువులు) తీసుకుంటామని బీజేపీ అధ్యక్షుడు ప్రజల మధ్య మత ఉద్రిక్తతలు సృష్టించే ప్రసంగాలు చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా, తాము అధికారంలోకి వస్తే ఉర్దూ భాషను, ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు చేయడం ద్వారా భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాడు.
డిసెంబర్ 28, 1980లో ముంబైలో జరిగిన మొదటి ప్లీనరీ సమావేశంలో భారతీయ జనతా పార్టీ 'గాంధేయ సోషలిజాన్ని' సమర్థించింది. 1985 అక్టోబర్‌లో బీజేపీ జాతీయ కమిటీ గాంధేయ సోషలిజాన్ని వదిలేసింది కానీ, ప్రజల ప్రతిస్పందనలను పసిగట్టి జాతీయ మండలి తిరిగి పునరుద్ధరించింది. గాంధీ, ఆరెస్సెస్‌ల మధ్య ఉన్న అభిప్రాయబేధాలు సమాధాన పరచలేనంత ప్రతికూలంగా, బద్ధ వ్యతిరేకంగా ఉన్నాయి. బ్రిటిష్ పాలన పైన, ముస్లింలపై హింసాత్మక అణచివేత, మరీ ముఖ్యంగా భారతదేశ సమ్మిళిత సంసతి పైన వారిరువురూ భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ''ఢిల్లీ సంస్కృతి హిందూ, ముస్లింలు ఇరువురికీ చెందినది, ఒకరిని కాదని మరొకరికి చెందింది కాదు'' అని సెప్టెంబర్ 11,1947లో గాంధీజీ అన్నాడు. ''సమ్మిళిత సంస్కృతిపై జరిగే ఎటువంటి చర్చైనా ప్రమాదకరమైనదే'' అని డిసెంబర్ 1969లో జనసంఫ్‌ు పేర్కొంది. ఏప్రిల్ 8, 1988లో ఆగ్రాలో జరిగిన బీజేపీ సమావేశంలో అద్వానీ సమ్మిళిత సంస్కృతి భావనను తీవ్రంగా దుయ్యబట్టాడు. గడచిన ఎనిమిది సంవత్సరాల కాలంగా వివిధ కుల, మతాలకు చెందిన ప్రజల భిన్న సంస్కృతులు, భాష, సాంప్రదాయాలు, అలవాట్లు, కట్టుబాట్లపై ఎందుకు, ఎలా దాడులు జరుగుతున్నాయో ప్రత్యేకంగా కారణాలను మనం అర్థం చేసుకోవచ్చు.
గాంధీని గోల్వాల్కర్ 1947 సెప్టెంబర్‌లో కలిసినప్పుడు, ప్రతీ సంఫ్‌ు సభ్యుని ప్రవర్తనకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేక పోయినప్పటికీ, సంఫ్‌ు ఎవరినీ నష్ట పెట్టకుండా హిందువులకు, హిందూ మతానికి సేవ చేస్తుందని గోల్వాల్కర్, గాంధీకి మాట ఇచ్చాడు. ''సంఫ్‌ుకు హింసాత్మక దాడులపై విశ్వాసం లేదు. దానికి అహింసలోనూ విశ్వాసం లేదు. సంఫ్‌ు ఆత్మరక్షణ కళను నేర్పింది. ప్రతీకార చర్యలకు సంబంధించిన బోధనలు కూడా సంఫ్‌ు చేయలేద''ని గోల్వాల్కర్ అంటాడు. కానీ నేడు దేశంలో ముఖ్యంగా ముస్లింలు, దళితులపై అనేక రూపాల్లో ఎందుకు దాడులు జరుగుతున్నాయో నేటి పాలకులు సమాధానం చెప్పాలి.
జవహర్ లాల్ నెహ్రూ అక్టోబర్ 29, 1948న సర్దార్ పటేల్‌కు రాసిన ఉత్తరంలోని సారాంశం ఇలా ఉంది... ''గోల్వాల్కర్‌తో మొదటి సమావేశం తరువాత, నేను అతని మాటలకు పాక్షికంగా ప్రభావితం అయ్యాను, కానీ అదే సమయంలో అతని మాటలను పూర్తిగా కూడా విశ్వసించలేదని బాపూ నాతో చెప్పింది నాకు ఇంకా గుర్తుంది. రెండవ, మూడవ సమావేశం తరువాత గోల్వాల్కర్, ఆరెస్సెస్‌ల పట్ల తన (గాంధీ) బలమైన వ్యతిరేకతను వ్యక్తం చేసి, వారి మాటపై ఆధారపడటం అసాధ్యమైన పని అని అన్నాడు. వారు(ఆరెస్సెస్) మాట్లాడే సందర్భంలో చాలా హేతుబద్ధంగా కనిపిస్తారు కానీ ఆచరణలో వారు మాట్లాడిన దానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. నేను కూడా బాపూ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.''
ఆరెస్సెస్‌ను నిరంకుశ ధోరణి కలిగి ఉన్న మతోన్మాద సంస్థగా అభివర్ణించాడు.'' నాధూరాం గాడ్సే, గాంధీజీని హత్య చేసిన వార్త తెలిసిన వెంటనే ఢిల్లీతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆరెస్సెస్ శ్రేణులు మిఠాయిలు పంచుకున్నారు. గాంధీకి వ్యతిరేకంగా సంఫ్‌ుపరివార్ నిత్యం అబద్ధపు ప్రచారాన్ని పాతికేళ్ళుగా కొనసాగిస్తుంది.
ఆరెస్సెస్ గురించి అంబేద్కర్ హెచ్చరిక :-
అంబేద్కర్ రచించిన 'పాకిస్థాన్ ఆర్ ద పార్టిషియన్ ఆఫ్ ఇండియా'లో ''ఒకవేళ హిందూ రాజ్యం ఏర్పాటు కావడమే నిజమైతే, అది మన దేశానికి ఒక పెద్ద విపత్తు అనడంలో ఎటువంటి సందేహం లేదు. హిందువులు ఏమంటారనేది ముఖ్యం కాదు కానీ, హిందూ మతం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి ప్రమాదకరం. ఏ విధంగానైనా హిందూమత రాజ్య ఏర్పాటును అడ్డుకోవాలని'' అభిప్రాయపడ్డాడు. కానీ నేడు దేశంలోని బీజేపీ పాలనలో ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే, దానిని వ్యతిరేకిస్తూ, అల్లర్లు సృష్టిస్తున్న పరిస్థితులను మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం.
సుభాష్ చంద్రబోస్‌ను కూడా సంఫ్‌ుపరివార్ స్వంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. బెంగాల్లో హిందూ, ముస్లింల సంధిని రూపొందించిన సీ.ఆర్.దాస్‌కు అనుచరుడైన బోసు ఏనాడూ మతోన్మాద చర్యల్లో భాగస్వామి కాలేదు. ఆరెస్సెస్, హిందూ మహాసభల పట్ల బోసుకు ఏ విధమైన ప్రేమ, ఆకర్షణ ఉన్నట్లు ఎక్కడా లేదు. వాస్తవానికి, ఆయన జనసంఫ్‌ు ఏర్పడిన (1951) ఆరు సంవత్సరాలకు ముందే(1945లో) మరణించాడు.
- బోడపట్ల రవీందర్
సెల్: 9848412451