Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల కోనసీమ జిల్లా పేరు విషయంలో అమలాపురంలో నానా బీభత్సం జరిగింది. ఒక మంత్రి, మరో ఎమ్మెల్యే ఇండ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఇప్పటికీ ఆ చిచ్చు చల్లారనే లేదు. అంబేద్కర్ పేరును ఆ జిల్లాకు పెట్టడాన్ని కొందరు వ్యతిరేకించగా.. మరికొందరు ఆ పేరే ఉంచాలంటూ పట్టుబట్టారు. ఆఖరికి కొంపలు తగలబెట్టే దగ్గరకు పరిస్థితి వచ్చింది. ఇది పైకి కనిపించే సీన్. కానీ లోపల వేరే కత ఉందని అమలాపురానికే చెందిన కొందరు బుల్లబ్బాయిలు చెబుతున్నారు. అన్న జగనన్న ప్రభుత్వం ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉంది. చేబదుళ్లు తీసుకోవటంలో అది దేశంలోనే నెంబర్వన్ స్థానాన్ని ఆక్రమించింది. ఈ క్రమంలో అమ్మఒడి లాంటి ప్రతిష్టాత్మక పథకాలకు డబ్బులు చాలటం లేదు. దీంతోపాటు అనేక సంక్షేమ పథకాలకు ఖజానా సరిపోవటం లేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా జనం క్రమక్రమంగా రోడ్లెక్కుతున్నారు. ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీయే కావాలని 'అమలాపురం' అంశాన్ని తెరపైకి తెచ్చిందనేది ఇప్పుడు ఓ పెద్ద టాక్. వైసీపీ ప్రమేయం లేకపోతే... ముందస్తుగా ఇంట్లోని వాళ్లందర్నీ సామాన్లతో సహా సాగనంపి, ఆ తర్వాత తీరిగ్గా ఎవడైనా నిప్పు పెడతారా..? అనే సందేహాలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. సో... ఈ అంశంలో నిజానిజాలు తేలాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
- కేఎన్ హరి