Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మూఢవిశ్వాసాల ఆధారంగా కాదు.. టెక్నాలజీని నమ్ముకుని ముందుకెళ్తేనే దేశాభివృద్ధి సాధ్యం' అని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకున్నందుకు అందరూ స్వాగతించాల్సిందే. 'పురాతన కాలంలోనే విమానం ఉండేది.. ఆవు మూత్రం తాగితే రోగాలు రావు... ఆవుపేడను ఒంటికి పూసుకుంటే కరోనా పోతుంది... దేశంలోని ప్రజలందరూ ఒకేసారి కొవ్వొత్తులు వెలిగిస్తే ఆ వెలుగులో కరోనా మాడి మసైపోతుంది... ఒకేసారి ప్లేట్లు, గిన్నెలు తీసుకుని సౌండ్ చేస్తే ఆ ధ్వనికే కరోనా చనిపోతుంది.. అంటూ పుక్కిటి పురాణాలను అడ్డంపెట్టుకుని ప్రధాని నుంచి వాట్సాప్ యూనివర్సిటీ వరకూ చేసే వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రచారాలన్నీ రాజకీయ లబ్దికోసమే తప్ప దేశాభివృద్ధి కోసం కాదని తమ పార్టీ అంతఃసారాన్ని మోడీ చెప్పకనే చెప్పేశారు. మూఢవిశ్వాలను నూరిపోసేవారిని సీఎం పీఠంలో కూర్చొబెడుతున్న మోడీజీ నుంచి ఈ మాటలు జాలువారటం 'పిల్లి కండ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడట్లేదు' అన్న చందంగా ఉంది. వీటన్నింటిని బట్టే ప్రధాని మాటల్లో వీసమెత్తయినా చిత్తశుద్ధి లేదని అవగతం అవుతున్నది. తాను మంచి దారిలో నడుస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉంటే ప్రధాని మాటల్ని అందరూ హృదయపూర్వకంగా ఆహ్వానించేవారే. కానీ, ఆచరణలో జరుగుతున్న పరిణామాలే వారిపై విమర్శలు ఎక్కుపెట్టడానికి ఆయుధాలైనవి. మూఢవిశ్వాసాలు, టెక్నాలజీపైనా ప్రధానమంత్రి నరేంద్రమోడీ నోటి నుంచి జాలువారిన మాటలు 'నవ్విపోదురుగా...నాకేటి సిగ్గు?' అన్న చందంగా ఉన్నాయి. మోడీ ముందు ఇంటిని(బీజేపీ పార్టీని) చక్కదిద్దుకుని పొరిగింటివారికి(ఇతర పార్టీలకు) సూచనలు చేస్తే బాగుంటుందేమో!
- అచ్చిన ప్రశాంత్