Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన ముఖ్యమంత్రి కేసీఆర్.. మన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.. మన మంత్రుల్లో ఎర్రబెల్లి, సత్యవతి, తలసాని, గంగుల సీనియర్లు. అధికార టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు. గులాబీ పార్టీలో బ్రహ్మాండంగా చెలామణి అవుతున్న వీరు ఒకప్పుడు అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన వారే. ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పదవులు అనుభవించిన వారే. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారందరూ కారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఇప్పటి సంగతి తెలిసిందే. కానీ తెలంగాణ వచ్చిన కొత్తలో వీరందరూ టీడీపీలోనే ఉన్నారు. అప్పుడు నిర్వహించిన మహానాడు, ఇతర సభల్లో కేసీఆర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. మున్ముందు తాము టీఆర్ఎస్లో చేరతామనీ, అక్కడ పదవులు అనుభవిస్తామని ఊహించని వారు... 'కేసీఆర్... హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది ఎవరనుకున్నవ్... మా చంద్రబాబు. నీకు రాజకీయ భిక్ష పెట్టింది అన్న ఎన్టీఆర్. అట్లాంటి పార్టీని ఇప్పుడు ఆంధ్రా పార్టీ అంటవా... ఖబర్దార్' అంటూ అప్పట్లో గులాబీ దళపతిపై వారు నిప్పులు చెరిగారు. ఇప్పటి మంత్రి మల్లారెడ్డి అయితే... 'చంద్రబాబు మాకు దేవుడు. ఆయన చెప్పిందే వేదం. నేను టీడీపీని వీడనుగాక వీడను...' అని బల్లగుద్ది మరీ చెప్పారు. ఉదయం ఈ మాట చెప్పిన ఆయన సాయంత్రానికి తెలంగాణ భవన్లో కేసీఆర్‌తో భేటీ అయి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఒంగోలులో టీడీపీ మహానాడు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎర్రబెల్లి, మల్లారెడ్డి, తలసాని తదితరులు కేసీఆర్‌ను ఉద్దేశించి ఏమేం మాటలు మాట్లాడారో, ఇప్పుడవన్నీ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. అప్పటి వారి వ్యాఖ్యల్ని, ఇప్పుడు వారు కేసీఆర్‌ను పొగుడుతున్న వీడియోలను పక్కపక్కనబెట్టి నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. పనిలో పనిగా ఇప్పుడు వారితో నిండి ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కాదు... తెలుగుదేశం రాష్ట్ర సమితి (టీడీఆర్ఎస్) అంటూ సెటైర్లు విసురుతున్నారు.
-బి.వి.యన్.పద్మరాజు