Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందమూరి తారక రామారావు శతజయంతి. మహానటుడుగా, తెలుగుదేశం వ్యవస్థాపకుడుగా, తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఆయనను తల్చుకునే సందర్భం. తన ఘన విజయాలు, చిత్రాలసంఖ్య కూడా అనితర సాధ్యమే. రాముడు, రావణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు వంటి పూర్తి భిన్నమైన పాత్రలు కూడా ఒకేనటుడు ఒకేచిత్రంలో వేసి ప్రేక్షకులను మెప్పించిన వైనం ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే అనితర సాధ్యమైంది. ఎన్టీఆర్ పౌరాణికాలలోనే అద్భుతంగా నటిస్తారని చెప్పడం కూడా పాక్షికమవుతుంది. ఆయన సాంఘికాలలోనూ చరిత్ర కథనాల్లోనూ గొప్ప విజయాలు సాధించారు. కేవలం హీరోగా మాత్రమే గాక దర్శకుడుగానూ ఎన్టీఆర్ రికార్డు చాలా గొప్పది. ఎన్టీఆర్ కళాజీవితం ప్రజా కళల ప్రభావంతో వెలసిన ఎన్ఎటి నాటక సంస్థతో జరిగింది. తొలి దశలో అభ్యుదయ దర్శకులు, మహామహులు ఆయనను తీర్చిదిద్దారు. సామాజిక సమస్యలను చాలా వరకూ పోరాటంతో పరిష్కరించుకోవాలనే సందేశం ఆయన ఎక్కువచిత్రాల్లో ఉంటుంది. పౌరాణికా లకు మానవీయ స్వర్శనిచ్చి హేతువాద ధోరణిని కూడా అలవాటు చేసిన ద్రవిడ ఉద్యమ సంప్రదాయం చూస్తాం. తమిళనాడులో నట ముఖ్యమంత్రి ఎమ్జీఆర్‌లా ఎన్టీఆర్ ఎప్పుడూ ఒకే మంచితనం చూపించాలని పాత్రలకు పరిధి పెట్టుకోలేదు. వీటన్నిటికి కారణం ఆయన ఒక ఇమేజి చట్రంలో ఇరుక్కుపోవడానికి సిద్దపడలేదు. శతజయంతి వేళ ఒక మహానటుడుగా తెలుగువారు తనను స్మరించు కుంటారు.
35ఏండ్ల సినీ జీవితం తర్వాత, 1982 మార్చి29న తెలుగుదేశం స్థాపన ఆయన జీవిత చరిత్రలో రెండవ అధ్యాయం. ఆ పార్టీ నవమాసాలు తిరక్కుండానే 1983లో అధికారం చేపట్టడం అసాధారణ విజయమే. అంతకు ముందు సాగిన కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాల రాజకీయ ప్రభావం బాగా దోహదం చేసింది. ప్రజల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత, కళాకారుడుగా ఆయనతో సుదీర్ఘ అనుబంధం, రెండు రూపాయాల కిలోబియ్యం వాగ్దానం ఇందుకు దోహదం చేశాయి. కొంతమంది ఎన్టీఆర్ టీడీపీతోనే ఆంధ్రుల చరిత్ర మొదలైనట్టు అతిశయోక్తిగా చెబుతుంటారు గానీ అది నిజం కాదు. ప్రకాశం పంతులు నుంచి పుచ్చలపల్లి సుందరయ్య వరకూ ఎందరో మహామహులు, కాంగ్రెస్ కమ్యూనిస్టు నాయకులు తెలుగువారి చరిత్రను తీర్చి దిద్దారు. యాభైలలో ప్రపంచాన్నే ఆకర్షించిన ఆంధ్ర కమ్యూనిస్టు ఉద్యమ విజయాలు, వీర తెలంగాణ రైతాంగ పోరాటం, రాష్ట్ర సాధన వంటివన్నీ కీలక ఘట్టాలు. దేశంలో మారిన సమీకరణాలూ కాంగ్రెస్ గుత్తాధిపత్యం క్షీణతలో టీడీపీ విజయం మరోదశ. ఈ పరిణామాలలో కమ్యూనిస్టు ఉద్యమం ఒక ముఖ్య పాత్ర వహించింది. ఈ వాస్తవం తెలుసు గనకే ఎన్టీఆర్ సుందరయ్యగారి పట్ల ఎనలేనిగౌరవం చూపేవారు. అయితే ప్రజల నాడిని సమయాన్ని పట్టుకోవడంలో ఎన్టీఆర్ ప్రత్యేకత ఉంది. గద్దెక్కిన ఏడాదిన్నరలోపే విరుచుకుపడిన నాదెండ్ల భాస్కరరావు తెచ్చిపెట్టిన 1984 తొలి ఆగస్టు సంక్షోభం అధిగమించడం జాతీయ పార్టీల ప్రజాశక్తుల సహకారం లేకుంటే సాధ్యమయ్యేది కాదు. ఆ శక్తులతో కొన్ని కొలబద్దల ఆధారంగా కలసి పనిచేయడం ఎన్టీఆర్ రాజకీయ విజ్ఞతకు అద్దం పడుతుంది. అంతకు ముందున్న ద్రవిడ పార్టీలు, అకాలీదళ్ వంటివాటిలా గాక ఆయన వచ్చాక పాంతీయ పార్టీల పాత్ర విస్తరించింది. కాంగ్రెసేతర ఐక్యత అంటూ తొలి మహానాడులోనే జాతీయ ప్రతిపక్ష నేతలను పిలిచి శిఖరాగ్రసభ నిర్వహించారు. కేంద్రం ఒక మిథ్య అని ఎన్టీఆర్ అంటే మిథ్యాపురణాల గురించి ఆయనకే నాకంటే బాగా తెలుసు అని ప్రధాని ఇందిరాగాంధీ చమత్కరించారు. తర్వాత ఆమే సర్కారియా కమిషన్ నియమించి రాష్ట్రాల హక్కులపై అధ్యయనం చేయించాల్సి వచ్చింది. కొన్ని విషయాల్లో స్పష్టత, రక్షణలు కల్పించాల్సి వచ్చింది.
సానుకూలఅంశాలు, తప్పిదాలు
కేంద్ర నిరంకుశత్వంపై పోరాటం, ప్రజా సంక్షేమ పథకాల పట్ల ప్రత్యేక శ్రద్ధ, లౌకిక సూత్రాలకు కట్టుబాటు ఎన్టీఆర్ పాలనలో విలక్షణాంశాలు. విద్యాధికులకూ ముఖ్యంగా బీసీలను అప్పట్లో ఆయన రాజకీయాల్లోకి పెద్ద ఎత్తున తీసుకురాగలిగారు. మునసబు కరణాల రద్దు, మండలి రద్దు, మండలాల ఏర్పాటు లాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఆ పార్టీని ముందుకు నడపడంలో కొన్ని ఆర్థిక సామాజిక శక్తులున్నాయి గనక వాటిని కాదని భూ సంస్కరణల వంటి మౌలిక మార్పులను చేయలేకపోయారు. కుటుంబ సభ్యులతో మొదలుపెట్టి టీడీపీలో అంతర్గతంగా ఐక్యత ఎప్పుడూ ఎండమావిగానే ఉండింది. ఇద్దరు అల్లుళ్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు మధ్య వైరుధ్యాలతో విసిగిపోయిన ఎన్టీఆర్ 'పార్టీ నాతోనే వచ్చింది నాతోనే పోతుంది' అన్నారు. 1988లో మంత్రివర్గ సామూహిక భర్తరఫ్ ద్వారా తనే సర్వస్వం అని సందేశమిచ్చారు. వంగవీటి రంగా హత్యానంతరం కాంగ్రెస్ ప్రతివ్యూహాలు పరాకాష్టకు చేరగా తెలుగుదేశం బేలగా ఉండిపోయింది. ఇన్ని ఎదురుదెబ్బలు తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోలేదు గనకనే 1989లో ఎన్టీఆర్(ఒకచోట)తో సహా ఓడిపోయారు. ఆ ఎన్నికలలో మతతత్వం అనర్థం పెరిగాక బీజేపీ నుంచి విడగొట్టుకుని కేవలం వామపక్ష పార్టీలతో అవగాహనకు పరిమితమైనారు. బీజేపీకి చోటులేని నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడైనారు. 1990లో ఎల్‌కె అద్వానీ చేపట్టిన రథయాత్ర ఆపిి అప్పటి విపి సింగ్ నాయకత్వంలోని ప్రంట్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అద్వానీని ఇంటికి పిలిచి అభ్యర్థించారు. అప్పుడాయన అధికారంలో కూడా లేరు. అయినా అధికారం కోసం మతరాజకీయాలు వద్దనుకున్నారు. 1992లో అయోధ్య బాబరీ మసీదు విధ్వంసం తర్వాత నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1993లో సారావ్యతిరేక ఉద్యమ ప్రభావం గుర్తించి సంపూర్ణ మద్య నిషేదం నినాదం ఇవ్వడం ఆయన రాజకీయ చతురతను తెల్పుతుంది. ఆ విధంగా 1994లో రెండవ సారి అద్భుతమైన ఆధిక్యతతో అధికారంలోకి వచ్చారు. అయితే దానికి ముందే లక్ష్మీ పార్వతితో ఎన్టీఆర్ వివాహం, అనంతర పరిణామాలు తన రాజకీయ జీవితానికి చరమఘట్టం. ఇద్దరు అల్లుళ్లేగాక భార్యకు కూడా పార్టీ వ్యవహారాలలో జోక్యం కల్పించడం పరిస్థితిని మార్చివేసింది. కుటుంబమంతా కలసి మరోసారి పదవినుంచి తొలగించడం, చంద్రబాబు పదవిచేపట్టడం ఎన్టీఆర్‌కు ఆఖరిదెబ్బ. నాటి తెలుగుదేశం నేతల జ్ఞాపకాలు చదివితే ఈ పరిణామాల వివిధ కోణాలు తెలుస్తాయి.
బీజేపీతో చంద్రబాబు దోస్త్
వ్యవస్థాపకుడుగా ఎన్టీఆర్‌కు నమస్కారం పెట్టినా, ఇప్పుడున్న తెలుగుదేశం వ్యవస్థ పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లో పెరిగిందే. 1996 పార్లమెంటు ఎన్నికలకు కొంచెంముందు ఎన్టీఆర్ అనూహ్య మరణం తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు శకాన్ని ప్రారంభించింది. ఆయన కూడా వామపక్షాల మద్దతు లేకుంటే నిలదొక్కుకోవడం సులభమయ్యేది కాదు. జాతీయంగా చక్రం తిప్పారని ఆయన గురించి అదేపనిగా కొందరు పొగుడుతుంటారు గానీ, 1996లో ఆ చక్రం ఆయన చేతిలో పెట్టింది అప్పటి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి, జాతీయ దిగ్గజం హరికిషన్ సింగ్ సూర్జిత్, విపి సింగ్ అనే చారిత్రిక సత్యాన్ని వారు దాటేస్తుంటారు. అయితే చంద్రబాబు ఎన్టీఆర్‌లా లౌకిక తత్వానికి కట్టుబడలేదు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉండి 1998 తర్వాత బీజేపీ ఎన్డీఏతో జత కట్టారు. ప్రపంచ బ్యాంకు విధానాలతో చెలరేగిపోయారు. ఈ రెండు చర్యలకూ అంతస్ససంబంధం ఉంది. ఈ విధానాలపై వామపక్షాలు సాగించిన వీరోచిత పోరాటమే తర్వాత ఎన్నికల్లో ఆయన ఓటమికి, వైఎస్ ప్రభుత్వం రావడానికి ఒక కారణమైంది. ఈ నలభయ్యేండ్లలో 21ఏండ్ల కాలం తెలుగుదేశం అధికారంలో ఉంది. అందులోనూ పద్నాలుగేండ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి. ఆ పార్టీ ప్రస్తుత మంచి చెడ్డలకూ తప్పొప్పులకూ ఆయనే కర్త కర్మ క్రియ. జ్యోతిబసులా పాతికేండ్లు పాలిస్త్నానన్న చంద్రబాబు వరుసగా రెండవ సారి గెలిచిన సందర్భమే లేదు. ఆనాటి ప్రపంచ బ్యాంకు విజన్లు హైటెక్ కీర్తనలు ఎలా ఉన్నా ఆయన రాజకీయంగా తిన్నదెబ్బలు, రాష్ట్రానికి ఎదురుదెబ్బలు చాలా ఉన్నాయి. విద్యుత్ ఉద్యమం తర్వాత రెండుసార్లు గెలిచిన వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎదుర్కొవడంలోనూ, రాష్ట్ర విభజన సమస్యలోనూ ఉక్కిరి బిక్కిరైన చంద్రబాబు పదేండ్లు ప్రతిపక్షంలో కష్టంగానే గడిపారు. ఆయన మంత్రివర్గ సభ్యుడూ పార్టీ ఎంఎల్ఏ అయిన కేసీఆర్ రాజీనామా చేసి టీఆర్ఎస్ స్థాపించారు. ఏపీ విభజనకు కూడా ఆ పార్టీ అంగీకరించడానికిదే కారణమైంది. అయినా ఆ పదేండ్లకాలం మల్లగుల్లాలు పడుతూ పిల్లిమొగ్గలువేస్తూ కాలం గడిపారు.
ఎన్టీఆర్ వారసత్వ పోటీదారుగా టీఆర్ఎస్
విభజిత ఆంధ్ర ప్రజలు బీజేపీ జనసేనల పొత్తులో 2014లో చంద్రబాబుకు అధికారం అప్పగించినా అంతకుముందరి ఊపు లోపించడానికి కారణాలు అనేకం. కేంద్రంలో భాగస్వామిగా ఉంటూనే రాష్ట్రానికి రావలసినవి సాధించలేకపోవడం, అమరావతి రాజధానిని ఒక దశకు తీసుకురాలేకపోవడం వాటిలో పెద్దవి. చంద్రబాబు పాలనా రీతిలో వైఫల్యాలు, చుట్టూ వంధిమాగధులను చేర్చుకోవడం, తీవ్ర తప్పిదాలను కూడా సమర్థించుకోవడం, అనుచిత ఫిరాయింపులను ప్రోత్సహించడం, ఆర్థిక దుస్థితి తెలుగుదేశం విశ్వసనీయతకు కూడా భంగకరంగా మారాయి. 2018 తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని తమ రాజకీయ మూలాలనే మార్చుకున్నారని కూడా విమర్శకు లోనైనారు. అయినా ఫలం దక్కలేదు. క్రమేణా తెలంగాణలో ఆ పార్టీకి ఠికానా లేకుండా పోయింది. చంద్రబాబుకు అతి సన్నిహితులైన వారు కూడా టీఆర్ఎస్లో చేరి మంత్రులూ ఎంఎల్‌ఎలూ అయ్యారు. వారితో ఇప్పటికీ ఆయన సంబంధాలు కొనసాగిస్తున్నారనే భావన ఉంది. 2019 ఎన్నికలకు ముందు వీటిని ఏదో సర్దుబాటు చేయడానికి ప్రయత్నించినా, 2019 ఎన్నికల చివరి దశలో ధర్మయుద్ధం అంటూ ప్రహసనం నడిపినా జగన్ వైఎస్ఆర్సిపి చేతిలో టీడీపీకి ఘోర పరాజయం తప్పలేదు. మోడీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల పట్ల ఎంత వివక్ష కొనసాగిస్తున్నా ఓటమి తర్వాత చంద్రబాబు బీజేపీపై నోరెత్తిన సందర్భం లేదు. ఈ రాష్ట్రాలలో ప్రభుత్వాల తప్పిదాలపై పోరాడటం అవసరమే గానీ, కేంద్రం ఏకపక్షపోకడలను నిధుల నిరాకరణను మతతత్వ రాజకీయాలను వ్యతిరేకించడం కూడా తప్పనిసరి. చంద్రబాబు బీజేపీ కులమత రాజకీయాలను ఖండించకపోగా తానూ ఆ పల్లవే ఆలపించి ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వంటివారు రాజకీయంగా కేంద్రంపై బీజేపీపై చేసే విమర్శలు చేస్తుంటే, చంద్రబాబు ఆ పార్టీతో పొత్తుకు సంకేతాలిస్తున్నారు. ఈ పమయంలో టీఆర్ఎస్ అధినేత ఎన్టీఆర్‌కు అసలైన వారసత్వం తమదేనని చాటుకోవడానికి శతజయంతిని సందర్బంగా చేసుకుంటున్నారు కూడా. ఇందులోని రాజకీయ కోణం చూడకుండా కేవలం సామాజిక ప్రాంతీయ పాచికగా కొందరు పరిగణించడం పాక్షికమే అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడూ ఎన్టీఆర్పట్ల గౌరవంగానే మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ పార్క్, స్మారకచిహ్నం మారుస్తారనే వదంతులను కూడా ఖండించి ఆయన తెలుగు ప్రజల మహోన్నత నాయకుడని కొనియాడారు. ఇప్పుడు జాతీయ ప్రత్యామ్నాయం కోసం తాము చేస్తున్న ప్రయత్నాలు మౌలికంగా ఎన్టీఆర్ బాటలో ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు తెలంగాణలో ఎన్టీఆర్ వారసత్వం టీఆర్ఎస్ స్వంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చంద్రబాబు బీజేపీ మతరాజకీయా లను, నిరంకుశ పోకడలను ఖండించకపోతే ఎన్టీఆర్ వారసత్వం తమదని చెప్పుకునే అవకాశం ఉండదు. ఎన్టీఆర్ లౌకిక నిబద్దవారసత్వం ఇప్పుడు మరింత అవసరం.
- తెలకపల్లి రవి