Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''డాడీ, నాకో డౌటొచ్చింది!'' అంటూ వచ్చాడు నాని.
''బైజూస్‌కు మెసేజి పెట్టురా!'' అన్నాడు అప్పుడే ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన సురేష్.
''ఏంటి డాడీ! పొద్దుటి నుండి మమ్మిని అడిగితే, మీ డాడీనే అడుగు అంది!'' ఇప్పుడు నీవేమో బైజూస్‌ని అడగమంటున్నావు'' అన్నాడు నాని.
''నానీ! డాడీని విసిగించకు! ముందు చెప్పింది చెరు!'' అన్నది సురేఖ వంటింట్లో కాఫీ కలుపుతూ.
''నానిగాడు కాళ్ళు నేలకేసి కొడుతూ కంప్యూటర్ వద్దకెళ్ళాడు.
''ఏమిటీ వాడి డౌటు?'' కాఫీ తాగుతూ భార్యను అడిగాడు సురేష్.
''మీ ముద్దుల కొడుకునే అడగండి!'' అన్నది సురేఖ.
''డాడీ! బైజూస్ కూడా సమాధానం చెప్పట్లేదు!'' అంటూ వచ్చాడు.
''వేల కొద్దీ ఫీజులు ఆన్లైన్లో కట్టాం! నీకొచ్చిన చిన్నడౌటు తీర్చని బైజూస్ వేస్ట్! సరేగానీ! ఆ డౌటేమిటో అడుగు నేనే చెబుతాను!'' అన్నాడు భార్య వంక చూస్తూ! నా తెలివి ఎంత గొప్పది చూస్కో అన్న ఫీలింగ్‌తో.
''డాడీ! మరేఁ అంధవిశ్వాసం అంటే ఏమిటీ?'' అన్నాడు నాని.
''అంధ విశ్వాసం! ఈ మాట ఎక్కడ విన్నావురా?'' ఆశ్చర్యంగా అడిగాడు సురేష్.
''నిన్న టీవీలో మోడీ తాత అంటుంటే విన్నాను! అంధవిశ్వాసం అంటే ఏమిటో చెప్పు డాడీ!'' అన్నాడు నాని తండ్రిని పట్టుకుని కదుపుతూ.
''చూశావా! నా మోడీ ఎంత గొప్పవాడో! ఒక్క పదం వాడి, మన నానిగాడితో మనందరి బుర్రలకు పని కల్పించాడు. ఆఖరికి బైజూస్ కూడా సమాధానం చెప్పలేని పదం వాడాడు!'' అన్నాడు సురేష్ గర్వంగా.
''సరే గాని ముందు నానిగాడికి సమాధానం చెప్పండి!'' అన్నది సురేఖ.
''అంధవిశ్వాసం అంటే గుడ్డి నమ్మకం! ఎలాంటి ఆధారంగానీ, సాక్ష్యంగానీ లేకుండా దేన్నైనా నమ్మితే అది అంధవిశ్వాసం అంటారు'' అన్నాడు సురేష్.
''అంటే నాకర్థం కాలేదు!'' నానిగాడు బుర్రగోక్కున్నాడు.
''నీకు అర్థం అయ్యేలా చెబుతాను! ఇదిగో ఈ డైనింగ్ టేబుల్‌ను నేను మంచం అని చెప్పాననుకో! అది నీవు నమ్మితే దాన్ని అంధవిశ్వాసం అంటారు!'' అన్నాడు సురేష్.
''డైనింగ్ టేబుల్ మంచమెట్లా అవుతుంది!'' ప్రశ్నించాడు నానిగాడు బుర్రని ఇంకాస్త గట్టిగా గోక్కుంటూ.
సురేష్‌కి బుర్ర గిర్రున తిరిగింది. దీనికంతా కారణం నువ్వే అన్నట్లు భార్యవంక చూశాడు. సురేఖ బలవంతాన నవ్వు ఆపుకుంటున్నది.
''అప్పుడెప్పుడో, పెద్ద నోట్లు రద్దు చేస్తే నల్లధనం బయటికి వస్తుంది. దేశం అభివృద్ధి చెందుతుంది. నన్ను నమ్మండి! అని మోడీ తాత ప్రకటిస్తే నీవు ఏమీ ప్రశ్నించకుండా, మమ్మీకి, నాకే కాక పక్కింటి వాళ్ళకి కూడా స్వీట్లు పంచావు కదా! అలాగన్న మాట! అంతేనా'' అన్నాడు నానిగాడు.
సురేష్‌కి ఏం చెప్పాలో తెలియటం లేదు. తన జవాబు తనకే బూమరాంగ్‌లా తగులు తుందనుకోలేదు. బుర్ర గోక్కుంటున్నాడు.
''ఆవుపేడ ఒంటికి రాసుకుంటే కరోనా రాదని, అప్పుడాలు తింటే వచ్చిన కరీనా పోతుందని, బీజేపీ ఎంపీలు, మంత్రులు ప్రకటిస్తే, చాలా మంది ఏమీ ప్రశ్నించకుండా, వాటిని అమలు చేయటమే కాకుండా, ప్రశ్నించినవారిని కొట్టారు కదా! ఇది కూడా మోడీగారు చెప్పినట్లు అంధవిశ్వాసమేనా డాడీ!'' అమాయకంగా అడిగాడు నాని.
సురేఖకు నవ్వాగలేదు.
''సైన్సు కాంగ్రెస్‌ను ప్రారంభిస్తూ, మనదేశంలో చాలా కాలం కిందటే టెస్ట్‌ట్యూబ్ బేబీలను తయారు చేశారని, ప్లాస్టిక్ సర్జరీ చేసి తలలు అతికించారని, విమానాలు, విమానాశ్రయాలు కూడా ఉండేవని మోడీ తాత చెప్పారు కదా!'' మరి ఇది నిజామా? అంధవిశ్వాసమా చెప్పు డాడీ!'' అన్నాడు నాని తండ్రిని సీరియస్‌గా చూస్తూ..
సురేష్ బుర్రగోక్కోవటం మానేసి, జుట్టుపీక్కోవటం మొదలు పెట్టాడు.
'రాఫెల్ యుద్ధవిమానాలకు దిష్టితీసి, నిమ్మకాయలు గట్టిన హౌంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గారిది అంధవిశ్వాసమా కాదా! అక్కడ ఉన్న మిలిటరీ ఆఫీసర్లది అంధవిశ్వాసమా కాదా!'' నాని అడుగుతూనే ఉన్నాడు.
సురేష్ చేతిలోకి జుట్టు వచ్చింది. దాన్ని నేలకేసి కొట్టి, భార్యవంక కోపంగా చూశాడు. ''వీడిని ఇలా తయారు చేసింది నీవే!'' అన్నాడు మరింత కోపంగా.
''బాగుంది! మీ సరసం! వాడికి సమాధానం చెప్పకుండా నన్ను అంటారేమిటి?'' అన్నది సురేఖ.
''ప్రధాని అన్నదేమిటి? మీకర్థమయ్యిం దేమిటి? టెస్ట్‌ట్యూబ్ బేబీలు, ప్లాస్టిక్ సర్జరీ, విమానాలు, మనదేశంలో ఎప్పుడో ఉన్నాయి. వాటికి రుజువులూ, సాక్ష్యాలు మీకు చూపనవసరం లేదు! మీరు దేశద్రోహులు!'' అంటూ కోపంతో ఊగిపోయాడు సురేష్.
సురేఖ నవ్వుకి ఈసారి నానిగాడు జతకలిశాడు.
''ఇందాక నీవు చెప్పినదానికి నీవే వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. ఇతరులు చెప్తే అది అంధవిశ్వాసం! అదేపని మీరు చేస్తే, దాన్ని ప్రశ్నించకూడదు! ఒకవేళ ప్రశ్నిస్తే అది దేశద్రోహం! వV్‌ా! చాలా బాగుంది మీ సిద్ధాంతం!
కేసీఆర్‌ని అంధవిశ్వాసాలు ఉన్నాయని విమర్శించే మీకు ఆ హక్కు ఉందా? కేసీఆర్ తన మానాన తాను విశ్వాసాలు పాటిస్తాడు కాని, ఎవర్నీ ఆ విశ్వాసాలు పాటించమని బలవంత పెట్టలేదు! అలాగని నేను కేసీఆర్‌కి సపోర్టు చేయటం లేదు. కాని మీరు దేశాన్ని అంధవిశ్వాసాలలో ముంచుతున్నారు. మీరు చెప్పినట్లు టెస్ట్‌ట్యూబ్ బేబీలు ఎన్నడో మనదేశంలో తయారై ఉంటే, దేశంలో ఇన్ని సంతాన సాఫల్య కేంద్రాలెందుకు? ఎన్నడో ప్లాస్టిక్ సర్జరీ చేస్తే, ఇప్పుడు చేయటానికి మీకేం అడ్డం వచ్చింది! అధికారంలో మీరే కదా ఉన్నారు. విమాన తయారీ సాంకేతిక నైపుణ్యం, మన పుస్తకాల్లో రాసుంటే వేలకోట్ల రూపాయలు తగలేసి, రాఫెల్ విమానాలు ఎందుకు కొన్నారు? వాటికి దిష్టితీసి నిమ్మకాయలెందుకు కట్టారు?'' నిలదీసింది సురేఖ.
సురేష్ జుట్టుపీక్కోవటం పెరిగింది.
''అంధవిశ్వాసాల గురించి మీరు మాట్లాడం కంటే ఘోరం, నేరం ఈ దేశంలో మరొక్కటి లేదు! కొన్ని తరాలకు సరిపడా అంధ విశ్వాసాలను, వాట్సప్ యూనివర్సిటీ ద్వారా ప్రచారం చేస్తున్న ప్రబుద్ధులు మీరు! ఇది చాలదన్నట్లు సినిమాలకు కూడా తెగించారు! కాని అంధవిశ్వాసాలు ఎక్కువ కాలం నిలవవు. సైన్సు అభివృద్ధి చెంది, జ్ఞానదీపం వెలుగుతుంది! అదే ఈ దేశపు నిజమైన అభివృద్ధి, భవిష్యత్ కూడా!'' అన్నది సురేఖ.
సురేష్ జుట్టంతా అతని చేతుల్లోకి వచ్చేసింది!
- ఉషాకిరణ్, సెల్: 949040354