Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదాయంలో సింహ భాగం వైద్యం కొరకు ఖర్చు చేయవలసి వస్తున్నది. కొన్ని కుటుంబాలు అప్పులపాలై, ఆ తరం మొత్తం అప్పుల ఊబిలో జీవితాలను గడపవలసిన దుస్థితి ఏర్పడుతున్నది. దీనికి పరిష్కారం ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ స్కీంలేనా? లేక ప్రభుత్వ వైద్య సంస్థలను తగు రీతిలో అభివృద్ధి చేయటమా? కరోనా మహమ్మారి వలన ప్రభుత్వ వైద్య సంస్థల అవసరమూ, ప్రాధాన్యతా మెజారిటీ బాగా ప్రజానీకానికి తెలిసొచ్చింది. ప్రభుత్వ వైద్య సంస్థలను అభివృద్ధి చేయటం ద్వారానే ప్రజారోగ్యానికి భరోసా ఏర్పడుతుంది. ప్రజలందరికీ ఆరోగ్య రక్షణ కలుగుతుంది.
ప్రభుత్వ వైద్యరంగంలో మూడు దొంతరలున్నాయి. 1.ప్రాథమిక ఆరోగ్య సంస్థలు 2.మాధ్యమిక ఆరోగ్య సంస్థలు, 3.ఉన్నత (టెర్షరీ) స్థాయి ఆరోగ్య సంస్థలు. ప్రయివేటు ఆరోగ్య రంగంలో ప్రాథమిక ఆరోగ్య సంస్థలు లేవనే చెప్పాలి. రోగం వచ్చిన వారికి వైద్యం చెసే పద్ధతి మాత్రమే ప్రయివేటు వైద్యరంగంలో ఉన్నది. రోగ నివారణ చర్యలు ప్రయివేటు రంగంలో లేవు. కానీ, 'రోగ చికిత్స కంటే రోగ నివారణ' చాలా ముఖ్యం. ఈ భావన ప్రజల్లో కల్పించడంలో ప్రభుత్వాలు నేటికీ విఫలమవుతున్నాయి. స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజారోగ్య విభాగం ఉంటుంది. మంచినీరు అందించటం, మురుగు నీరు నిలువలేకుండా చేయటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రజారోగ్య రక్షణలో కీలకమయిన కర్తవ్యాలు. ఈ కర్తవ్యాల సక్రమ నిర్వహణ బాధ్యత స్థానిక సంస్థలదే. ఈ మూడు కర్తవ్యాలు సవ్యంగా నిర్వహిస్తే ప్రజారోగ్యం బాగుంటుంది. ప్రజా సమూహాలలో కూడా ప్రజారోగ్యంపై చైతన్యం చాలా పెరగవలసి ఉన్నది.
ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్యం కొరకు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల గురించి చర్చిస్తాను. గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవాటిని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటారు. పట్టణాలు, నగరాలలో ఉన్నవాటిని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటారు. ఇవి 25 వేల నుండి 30 వేల జనాభాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఈ కేంద్రాల సంఖ్య పెంచకపోవడం వలన గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 50 వేలకు పైగా జనాభా ఉన్నది. అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 50 వేల నుండి లక్షకు పైగా జనాభా ఉన్నది. కొన్నికొన్ని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో రెండు లక్షల జనాభా కూడా ఉంటుంది. వీటి నిర్వహణకు రాష్ట్ర స్థాయిలో ప్రజారోగ్య సంచాలకులు ఉంటారు. జిల్లా స్థాయిలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఉంటారు. పెద్ద జిల్లాలలో ఉప జిల్లా వైద్యారోగ్య అధికారులు కూడా ఉంటారు. హైదరాబాదు జిల్లాలో 86, మేడ్చెల్ జిల్లాలో 24, రంగారెడ్డి జిల్లాలో 18, మొత్తం 128 గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 14, నిజామాబాదు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 10 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య పెంచకుండా ''బస్తీ దవాఖానాల'' పేరుతో ఆరోగ్య కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. హైదరాబాదు జిల్లా పరిధిలోనే 132 బస్తీ దవాఖానాలు ప్రారంభించినట్లు సమాచారం. అర్భన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజారోగ్యానికి బాధ్యత వహిస్తాయి. 'బస్తీ దవాఖానా'లు ఔట్ పేషెంటు ట్రీట్మెంటుకు మాత్రమే పరిమితమవుతాయి.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లక్ష్యాలు, విధులు, సిబ్బంది వివరాలు ఇవ్వమని నేను ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో అడిగాను. కానీ, అటువంటి వివరాలు ఇవ్వలేకపోయారు. గతంలో బుక్ ప్రింటు చేశాము, వెతికి పంపిస్తామన్నారు, నేటికీ పంపించలేకపోయారు. ప్రజారోగ్య సంచాలకుల 'వెబ్ సైట్' కూడా సరైన సమాచారంతో లేదు. ఏమైనా ''రోగ చికిత్స కంటే ముందుగా రోగ నివారణ'' చర్యలు ముఖ్యమనే లక్ష్యంతో ఈ ప్రజారోగ్య సంస్థలు పనిచేయాలి. కొన్ని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి. నా నియోజకవర్గ పరిధిలో నేను ఇప్పటికి 60కి పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించాను. నేను సందర్శించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 10 చోట్ల మాత్రమే నాకు ప్రత్యక్షంగా డాక్టర్లు కలిశారు. డాక్టరు లేనిచోట ఎక్కడైనా సిబ్బంది డాక్టరు ఇప్పుడే వెళ్లారనే చెప్పారు. నేను కొన్ని చోట్ల అటెండెన్స్ రిజిష్టరు పరిశీలించాను. సిబ్బంది మాటలకు అటెండెన్స్ రిజిష్టరుకు పోలిక కుదరలేదు. గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నాలుగు నుండి 10వరకు ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. కొన్నింటికి స్వంత భవనాలున్నాయి. కొన్ని అద్దె భవనాలలో నడుస్తున్నాయి. ఆరోగ్య ఉప కేంద్రములో ఇద్దరు ఎఎన్ఎంలు ఉన్నారు. వీరిలో ఒకరు రెగ్యులర్, మరొకరు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు.
ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో వెయ్యి జనాభాకు ఒకరు 'ఆశా' కార్యకర్త ఉన్నారు. పట్టణ, నగర ప్రాంతాలలో రెండు వేల జనాభాకు ఒక ఆశా కార్యకర్త ఉన్నారు. ప్రభుత్వ ప్రజారోగ్య రంగములో ''ఆశా కార్యకర్త''లే ఆశాకిరణంగా కన్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ కొందరు పురుషులు, కొందరు మహిళలున్నారు. వీరి పని ఆశా కార్యకర్తలపైన పెత్తనం చేయటం లాగా కన్పించింది. వీరి విధినిర్వాహణ వలన ప్రజారోగ్యానికి జరుగుతున్న ప్రయోజనమేమిటో జిల్లా వైద్య ఆరోగ్యాధికారులు సమీక్ష చేసి, వీరి సేవలు సమర్ధవంతంగా వినియోగించాలి. క్షయ నిర్మూలనకు, ఎయిడ్స్ కంట్రోల్‌కు కూడా ప్రత్యేక విభాగాలున్నాయి. ఈ మధ్య కాలంలో అంటువ్యాధులు కాని, వ్యాధుల (బిపి, షుగర్ లాంటివి) నివారణ విభాగం కూడా పనిచేస్తున్నట్లుంది. బిపి, షుగర్ వ్యాదులకు ఉచిత మందుల సరఫరా జరుగుతుందని తెలిపారు. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే ఆయుష్ (ఆయుర్వేద, యునానీ, హౌమియో)కు సంబంధించిన క్లీనిక్‌లు కూడా ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెడికల్ ఆఫీసర్ (డాక్టరు) రానిరోజు ఈ ఆయుష్ డాక్టర్లే అల్లోపతి మందులు రాస్తుంటారు. బాల, బాలికల ఆరోగ్య రక్షణ కోసం ''ఆర్బిఎస్కె'' స్కీం అమలు చేస్తున్నారు. ఇది 'మొబైల్ టీం'గా బాల, బాలికలుండే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలోని బాల, బాలికలకు ఆరోగ్య సంరక్షణ అందిస్తున్నది. ఈ డాక్టర్లు కూడా అప్పుడప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కన్పిస్తుంటారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉదయం సందర్శిస్తే అన్నీ ఉన్నట్లు కన్పిస్తాయి. మధ్యాహ్నం వెళ్తే ఏమీ లేనట్లు కన్పిస్తాయి. 24 గంటలు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాత్రిపూట వెళ్తే ఎవరైనా సిబ్బంది ఉన్నారా? లేదా? అని వెతుక్కోవలసిందే. గర్భిణీ స్త్రీలు, బాలింతల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు కన్పిస్తుంది. కెసిఆర్ కిట్ ఆకర్శణీయంగానే ఉన్నది. దీని ద్వారా లభించే ఆర్థిక సహాయంతో గర్భిణీ స్త్రీలు మళ్ళీ ప్రయివేటు హాస్పిటల్స్‌లో పరీక్షలకు వెళ్తున్నట్లు గుసగుసలు. ఇవన్నీ తక్షణమే ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.
- అలుగుబెల్లి నర్సిరెడ్డి