Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రిటన్ దేశపు ఖజానాకి ముఖ్యాధికారి నివాసం బ్రిటిష్ ప్రధాని నివాసం పక్కనే ఉంటుంది. భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ ప్రస్తుతం ఆ ముఖ్యాధికారిగా ఉన్నాడు. బ్రిటిష్ హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ కూడా భారతీయ సంతతికి చెందినవారే. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్ తల్లిదండ్రులలో ఒకరు భారతీయులైతే మరొకరు జమైకా దేశస్థులు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉదాహరణలు ఉన్నాయి. అంతర్జాతీయ వ్యాపార ప్రపంచంలో భారతీయుల ''విజయ గాధలు'' చాలానే ఉన్నాయి. వీరు తమ స్వంత దేశంతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఉదాహరణకి రిషి సునాక్ భార్య భారతీయ పౌరురాలిగానే కొనసాగుతున్నారు. అమెరికా హోంశాఖ కార్యదర్శిగా ఉన్న మేడలీన్ ఆల్బ్రైట్ చెక్ దేశ సంతతి. ఒకానొక సమయంలో చెక్ దేశాధ్యక్షురాలిగా పోటీ చేయవచ్చునన్న ఊహాగానాలు కూడా సాగాయి.
ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఆయా దేశాల్లో మైనారిటీగా ఉన్న తరగతులకు చెందిన రాజకీయ నాయకులు తమ తమ దేశాల్లో ముఖ్యమైన పదవులను పొందగలిగారు. బెంజమిన్ డిజ్రాయిలీ అటువంటి వారిలో ఒకడు. ఐతే, మూడో ప్రపంచ దేశాల రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు సంపన్న పశ్చిమ దేశాల్లో ప్రముఖ స్థానాలను పొందగలగడం ఒక కొత్త ధోరణి. అటువంటి వారికి ప్రముఖ పదవులను ఇవ్వడం వలన ఆ దేశం ఎంత ''న్యాయ బద్ధంగా'' ఉంటుందో నొక్కి చెప్పినట్టవుతుంది. అంతేగాక, సంపన్న పశ్చిమ దేశాల్లో తమకు ''న్యాయబద్ధమైన'' అవకాశాలు లభిస్తాయని ఆ మూడో ప్రపంచ దేశాల మధ్య తరగతి వ్యక్తులను ఒప్పించడానికి కూడా వీలవుతుంది. అంతే కాదు, ఎవరు ఏ దేశానికి చెందిన వారన్న అంశంతో నిమిత్తం లేకుండా ''న్యాయం'' జరిగే ఒక నూతన ప్రపంచ వ్యవస్థ రూపొందుతోందన్న అభిప్రాయాన్ని కూడా కలిగించడానికి తోడ్పడుతుంది. జీవితంలో విజయం సాధించడానికి, ఏ దేశంలో జన్మించామనేదానికి సంబంధం లేదన్న భావం కలుగడానికి దారితీస్తుంది.
వలస పాలన సాగిన కాలంలో ఆ వలస దేశాల్లోని మధ్య తరగతి వర్గానికి తాము పుట్టిన దేశంలోనే తాము వివక్షతను ఎందుర్కొంటున్నామనే దుగ్ధ ఉండేది. ఆ వివక్ష కారణంగానే ప్రభుత్వ పదవుల్లో ఒక స్థాయి దాటి అంతకన్నా పైకి ఎదగలేకపోతున్నామనే అసంతృప్తి ఉండేది. ఆ అనుభవాల నుండి అసలు ఈ వలస పాలన పెత్తనం నుండి మొత్తంగానే బైటపడాలనే అవసరం ముందుకొచ్చింది. ఇప్పటి మధ్య తరగతి అనుభవం దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఉంది. వివక్ష ఏమాత్రమూ లేదని, అందుచేత సామ్రాజ్యవాదం అనే ఒక అవగాహన ఇంకెంతమాత్రమూ వర్తించేది కాదని ఆ అనుభవం వారిని ఒప్పిస్తుంది.
అయితే, ఇది ఇంకొక అవగాహన వైపు దారితీస్తుంది. ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థ లోపల సామాజిక-ఆర్థిక పురోగమనానికి పుట్టిన దేశం, మన వొంటి రంగు ఆటంకం కానప్పుడు ఇంకేమిటి ఆటంకం? ఈ వ్యవస్థ గురించి ''పాత కాలపు'' వామపక్ష సైద్ధాంతిక విశ్వాసాలు మాత్రమే ఆటంకం. ఆ విశ్వాసాలే ''చిక్కులు తెచ్చిపెడుతున్నాయి''. వాటిని వొదిలించుకుని త్వరగా బైటపడగలిగితే మనం మన కెరీర్లో విజయాలు సాధించగలుగుతాం. - ఈ విధమైన అవగాహన మధ్యతరగతిలో మనకు ఎక్కడ చూసినా కనిపిస్తోంది. ఇది ప్రస్తుత నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థలో కనిపించే ధోరణి. ''పెట్టుబడిదారీ వ్యవస్థకు లోబడివుండరాదనే ధోరణిలో పస ఏమీ లేకపోగా, అది మన కెరీర్నే దెబ్బ తీసే ప్రమాదం ఉంది'' అని భావించే ధోరణి ఇది. ఇటువంటి ధోరణి పర్యవసానాలు చాలానే ఉంటాయి.
మొదటిది: సమాజాన్ని మార్చాలనే తాపత్రయం - ఆ మార్పు విప్లవం దిశగానే ఉండకపోవచ్చు- మధ్య తరగతిలో జావగారిపోవడం. నయా ఉదారవాద విధానాన్ని ఆమోదించే మధ్య తరగతి అందరిలో ఉమ్మడిగా కనిపించే సారాంశం ఇది. కనీసం కీన్స్ వంటి వారు ప్రతిపాదించిన మాదిరిగా కార్మికులకు కూడా న్యాయం జరిగేలా ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ఉండాలని కూడా వీరు కోరుకోరు. అటువంటి ''సామాజిక జోక్యం'' ప్రస్తుతం అనవసరం అని ఈ కొత్త మధ్యతరగతి వర్గం భావిస్తోంది.
రెండవది: నయా ఉదారవాద వ్యవస్థకు కట్టుబడి వ్యవహరించాలన్న సైద్ధాంతిక ధోరణినుండి ఒక ''అంతర్జాతీయ'' మధ్య తరగతి వర్గం తలెత్తుతోంది. ఈ వర్గానికి నయా ఉదారవాద వ్యవస్థకు లోబడి ఉండాలన్న ఉమ్మడి అంశం తప్ప ఎవరు ఏ దేశంలో, ఏ వర్గంలో జన్మించారన్నది పట్టదు.
మూడవది: చాలా ముఖ్యమైనది: అణచివేతకు గురవుతున్న వర్గాలు మన్ను తిన్న పాముల్లా స్తబ్దుగా పడివుండే పరిస్థితి కొనసాగడానికి ఈ ధోరణి దోహదం చేస్తుంది. బూర్జువా వర్గానికి, మధ్య తరగతి వర్గానికి చెందిన వ్యక్తులలో విద్య వలన చైతన్యం పొంది, సమగ్ర చారిత్రిక అవగాహనను పెంపొందించుకుని, తమ తమ వర్గాల అవలక్షణాలను వొదిలించుకోగలిగిన మేథావులు కార్మికులను, రైతాంగాన్ని సంఘటితపరచడంలో వైతాళికుల పాత్రను పోషిస్తారని కమ్యూనిస్ట్ ప్రణాళికలో మార్క్స్, ఎంగెల్స్ చెప్పారు. తాము పుట్టిన వర్గాల అవలక్షణాలను వొదిలించుకోగలిగిన మేథావులే కార్మిక వర్గానికి ట్రేడ్ యూనియన్ చైతన్యం స్థానే సోషలిస్టు చైతన్యాన్ని కలిగించగలుగుతారని లెనిన్ నొక్కి చెప్పారు. అయితే ఆ మేథావులు తమ స్వంత వర్గ అవలక్షణాలను వొదిలించుకోవడం అన్నది కేవలం వారి మేథోపరమైన విశ్వాసాల మీద మాత్రమే ఆధారపడి వుండదు. ఈ వ్యవస్థలో మేథావులుగా వారికి ఎదురైన ప్రత్యక్ష అనుభవాల మీద, అందులో వారికి జరిగిన అన్యాయాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. వారి స్వంత కెరీర్ల మీద ఈ వ్యవస్థ ప్రత్యక్షంగా చూపిన ప్రతికూల ప్రభావం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అటువంటి ప్రతికూల ప్రభావాలు, ఆటంకాలు ఏ మేరకు తొలగిపోతే, ఆ మేరకు స్వంత వర్గ అవలక్షణాలను వొదిలించుకోగలిగిన మేథావుల సంఖ్య తగ్గిపోతుంది. వారి సంఖ్య ఏ మేరకు తగ్గితే, ఆ మేరకు కార్మిక వర్గానికి విప్లవ సిద్ధాంతాన్ని అందించడం తగ్గిపోతుంది. పుట్టిన దేశం, జాతి, రంగు ప్రాతిపదికన వివక్షతను చూపని ఈ నయా ఉదారవాద వ్యవస్థ పరోక్షంగా కార్మిక వర్గం స్తబ్దుగా, చైతన్య రహితంగా ఉండిపోడానికి, తద్వారా మరింత ఎక్కువగా దోపిడీకి గురవడానికి దోహదం చేస్తుంది. నయా ఉదారవాద విధానపు ప్రత్యేక లక్షణం ఇది.
ఇక్కడే మనకి అసలు సమస్య వస్తుంది. మూడో ప్రపంచ దేశాల్లోని రైతాంగానికి, చిన్న ఉత్పత్తిదారులకు దుర్భరమైన కడగండ్లను నయా ఉదారవాదం తెచ్చిపెడుతుంది. వారి నిజ జీవన ప్రమాణాలను అంతకంతకూ దిగజారుస్తుంది. అదే సమయంలో కార్మికులను నిరుపేదరికంలోకి నెడుతుంది. చిన్న ఉత్పత్తిదారులు దెబ్బ తినడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోయి నిరుద్యోగ సైన్యం పెరిగిపోతుంది. ఆ విధంగా చిన్న ఉత్పత్తిదారుల మీద దాడి అటు నిరుద్యోగాన్నీ పెంచుతుంది, ఇంకోవైపు పనిలో ఉన్న కార్మికుల ఆదాయాలనూ దెబ్బ తీస్తుంది. కార్మికుల బేరసారాలాడే శక్తిని పెట్టుబడి ప్రపంచీకరణ బలహీన పరుస్తుంది. ప్రభుత్వ రంగ ప్రయివేటీకరణ వలన కూడా ఇటువంటి ఫలితాలే కలుగుతాయి. మొత్తం మీద కార్మిక వర్గం నయా ఉదారవాద వ్యవస్థలో హీన స్థితికి నెట్టబడుతుంది. అదే వ్యవస్థలో ఉన్న మధ్య తరగతి మాత్రం ''అంతర్జాతీయత''ను సంతరించుకుంటుంది. వివక్షను ఎదుర్కోవలసి వస్తుందన్న భయం లేనందువల్ల, సంపన్న పశ్చిమ దేశాలు తమ ఉత్పత్తులను చౌకగా శ్రమశక్తి లభించే ప్రదేశాలకు తరలించినందువల్ల ఈ మధ్య తరగతి వర్గం సంపన్న దేశాల్లో ఉపాధి అవకాశాలను పొందడంతోబాటు తమ స్వంత దేశాల్లోనే మెరుగైన ఆదాయాలు లభించే ఉపాధి అవకాశాలను పొందగలుగుతారు. గతంకన్నా మెరుగైన ఆర్థిక స్థితిని పొందుతారు. మూడో ప్రపంచ దేశాల్లో బడా బూర్జువా వర్గానికి, తక్కిన ప్రజానీకానికి మధ్య అగాథం పెరగడంతోబాటు, మధ్య తరగతికి, తక్కిన కార్మిక వర్గానికి మధ్య కూడా అంతరం బాగా పెరుగుతుంది. మధ్య తరగతి పరిస్థితి మెరుగుపడుతూంటే కార్మిక వర్గం పరిస్థితి నానాటికీ దిగజారుతూ ఉంటుంది. ఇది కార్మికవర్గంలో ''మన్ను తిన్న పాము'' స్థితిని పెంచుతుంది.
అయితే ఈ వివరణకు మూడు మినహాయింపులున్నాయి. మధ్య తరగతి అన్న పదాన్ని యావత్తు మధ్య తరగతికీ వర్తించేలా అర్థం చేసుకోకూడదు. వాస్తవానికి ఈ మధ్య తరగతిలో చాలా విస్తారమైన సెక్షన్లు కూడా నయా ఉదారవాద విధానాలకు బాధితులే. అయితే మధ్య తరగతిలోని ఉన్నత స్థాయిలో ఉన్న వారు నయా ఉదారవాద విధానాల వలన గణనీయంగా ప్రయోజనాలు పొందారు. మొత్తం మధ్యతరగతిలో వీరు ఒక చిన్న భాగమే అయినా, నేను మధ్య తరగతి అని ఉపయోగించింది ఈ ఉన్నత స్థాయి వారిని దృష్టిలో ఉంచుకునే. రెండవది: ఈ ఉన్నత స్థాయి వారిలో కూడా సైద్ధాంతికంగా నయా ఉదారవాదం పట్ల ఏకాభిప్రాయం ఒక ధోరణిగా మాత్రమే ఉంది తప్ప అందరిలోనూ అది వ్యక్తం అవుతుందని కాదు. అభ్యుదయ మార్గం వైపు సమాజం పురోగమించాలన్న అవగాహనకు కట్టుబడిన వారు వారిలో గణనీయంగా ఉన్నారు. అయితే గతంతో పోల్చితే వారు కలిగించగలిగే ప్రభావం సాపేక్షంగా తగ్గిపోయింది. మూడవది: తక్కిన వారిలో కూడా ప్రస్తుతం నయా ఉదారవాదం పట్ల ఉన్న సానుకూలత ఎల్లకాలమూ ఇలానే ఉండిపోతుందని కూడా అనుకోలేము. నయా ఉదారవాద సంక్షోభం పెరుగుతున్నకొద్దీ ఈ తరగతిలో చాలామంది అభిప్రాయాలు మారే అవకాశం ఉంది. మార్క్స్ చెప్పినట్టు ముదిరే సంక్షోభం వారి తలల్లోకి ''గతితర్కాన్ని'' ఎక్కిస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ ఉన్నత మధ్య తరగతిలోని గణనీయమైన సెక్షన్లలో నయా ఉదారవాదం పట్ల మోజు ఇంకా ఏ మాత్రమూ తగ్గలేదు.
మధ్య తరగతికి, కార్మిక వర్గానికి మధ్య అంతరం పెరిగిన తీరు మూడో ప్రపంచ దేశాల్లోని మీడియా వైఖరిలో వ్యక్తం మవుతోంది. ఈ మీడియా ప్రధానంగా బడా బూర్జువా వర్గం యాజమాన్యం కింద, వారి చెప్పుచేతల్లో నడుస్తోందన్నది వాస్తవం. అందుచేత మీడియా తన యజమానుల వైఖరినే వ్యక్తం చేస్తుంది. నయా ఉదారవాదానికి అనుకూలంగా, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఆ వైఖరి ఉంటుంది. కాని ఆ మీడియాను నిర్వహించే ఉద్యోగులలో సైతం నయా ఉదారవాదానికి అనుకూలత బలంగా ఉంది. అందుకే కార్మికవర్గ ప్రతిఘటన పట్ల ఏ మాత్రమూ సానుభూతి ఉండదు (మామూలుగా అటువంటి ప్రతిఘటన జరిగిన సందర్భాలలో ఆ సమాచారాన్ని కనీసం ప్రస్తావించరు). అలాగే, మైనారిటీ జాతుల, మైనారిటీ మతాల ప్రజలపై సాగే ఊచకోతను కూడా చూడనట్లే వ్యవహరిస్తారు. ''మెజారిటీ ఆధిక్య'' వాదాన్ని మీడియా ఎన్నడూ ఎదిరించదు. ఆ మెజారిటీ ఆధిక్యత మైనారిటీల పట్ల విద్వేషాన్ని ప్రదర్శించినప్పుడు కూడా దాన్ని ప్రశ్నించదు. సంక్షోభ కాలంలో విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా నయా ఉదారవాదానికి మితృడి పాత్ర పోషిస్తుంది.
''మెజారిటీ ఆధిక్య'' వాదానికి, నయా ఉదారవాద వ్యవస్థకి మధ్య పొత్తు భారతదేశంలో ''కార్పొరేట్-హిందూత్వ'' రూపం తీసుకుంది. ముస్లిం మైనారిటీల పట్ల ద్వేష భావాన్ని రెచ్చగొట్టడం మీద ఈ రెండు శక్తుల మైత్రి ఆధారపడివుంది. కార్మికవర్గం బడా బూర్జువా వర్గం మీద తన పోరాటాన్ని ఎక్కుపెట్టకుండా ఇది అడ్డుకుంటుంది. కార్మిక వర్గాన్ని మతపరంగా విభజించి, సమాజంలో జరిగే చర్చ మొత్తంగా కార్మిక వర్గపు దైనందిన, భౌతిక జీవితపు సమస్యల నుండి పక్కకు మళ్ళడానికి ఇది దోహదం చేస్తుంది. రూపాయి విలువ మునుపెన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయి, నిత్యావసరాల హోల్సేల్ ధరల సూచీ పెరుగుదల 15 శాతాన్ని దాటి, వినిమయ ధరల సూచి 8శాతాన్ని దాటి పెరిగిపోయి, నిరుద్యోగం స్వతంత్ర భారత దేశంలో మునుపెన్నడూలేని గరిష్ట స్థాయికి చేరి వున్నప్పుడు కూడా మీడియా వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదులో దొరికినట్టు చెప్పబడుతున్న ''శివలింగం'' గురించిన వార్తల చుట్టూనే తిరిగింది. దేశంలోని ప్రజా జీవితంలో, సామాజిక చర్చల్లో మతతత్వ- ఫాసిస్టు విషం ఏ స్థాయిలో విరజిమ్ముతున్నారో దీనిని బట్టే గ్రహించవచ్చు. మధ్య తరగతి ప్రజలు ఈ సందర్భంలో మౌనంగా ఉండడం అంటే ఆ మౌనం ద్వారా ఈ విష ప్రచారానికి వారు తోడ్పడుతున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ఈ కార్పొరేట్- హిందూత్వ కూటమికి వ్యతిరేకంగా, అది విరజిమ్ముతున్న మతోన్మాద-ఫాసిస్టు విషానికి విరుగుడుగా పోరాటం జరగాలంటే అది కేవలం నయా ఉదారవాద ఎజెండాపై పోరాటానికే పరిమితం కాకూడదు. కార్మిక వర్గాన్ని ఉత్సాహపరిచేలా నయా ఉదారవాదానికి ప్రత్యామ్నాయ ఎజెండాను వారి ముందు ఉంచాలి. వారిని కదిలించాలి. తమ వర్గ స్వభావ పరిమితుల నుండి బైటపడి కార్మికవర్గ దృక్పథాన్ని అనుసరించే మధ్యతరగతి చేయవలసిన పని ఇదే.
- ప్రభాత్ పట్నాయక్
(స్వేచ్ఛానుసరణ)