Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జూన్ నుండి 2022-23 విద్యా సంవత్సరంలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) ముసాయిదా ప్రతిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఎన్ఈపీ ముసాయిదా ప్రతిలోని విషయాలు అత్యంత ప్రమాదకరంగా, జాతీయోద్యమ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. లౌకిక భావనలు, సమానత్వం, ఇకపై అక్కర్లేదన్నట్టుగా మన పాలకులు ఎన్ఈపీ విధానాన్ని తీసుకొస్తున్నారు. కులం, మతం, ప్రాంతం, భాష అనే తేడా లేకుండా అందరూ సమానంగా విద్యను పొందాలని, లింగ వివక్షను రూపు మాపాలని కన్నకలలు కల్లలు చేస్తూ కేంద్రం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. అందరికీ ఉచిత విద్యను అమలుజేయాలని దాదాభాయి నౌరోజీ, మహాత్మా ఫూలే 1882లోనే బ్రిటిష్ పాలకులకు చేసిన సిఫారసులు ఇప్పుడు పనికి రానివని నేటి పాలకులు భావిస్తున్నారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సరికొత్త విద్యా విధానంతో విద్యార్థులు భారతీయ సంస్కృతి మూలాలతో మమేకమయ్యి ప్రపంచ పౌరులుగా ఎదుగుతారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖియాల్ నిశాంక్ మాట్లాడుతూ ఈ తాజా విధానంతో విద్యారంగంలో భారీ మార్పులు సంభవిస్తాయని చెప్పుకొచ్చారు. కానీ అందులోని చాలా విషయాలను లోతుగా పరిశీలిస్తే అవన్నీ ఒట్టిదేనని, నాణ్యమైన విద్యను సంపన్నులకే పరిమితం చేసి, పేద వర్గాల విద్యార్థులకు నాసిరకమైన చదువును విదిల్చి, భారతీయ సంస్కృతి, భాషల పేరుతో మనువాద సంస్కృతిని పెంచి పోషిస్తారని, తద్వారా బీజేపీ, ఆరెస్సెస్ అసలు ఎజెండాలైన వర్ణ వ్యవస్థను, సామాజిక అన్యాయాన్ని విద్యారంగంలో బలోపేతం చేస్తారని తెలుస్తోంది. సాధారణంగా 3నుండి 8 సంవత్సరాల వరకూ ఎదిగే లేత వయసు ఎంతో విలువైనది. ఎందుకంటే 85శాతం మెదడు వికసించేది ఆ వయసులోనే. ఆ దశలో పిల్లల శారీరక, భావోద్వేగ అభివృద్ధికి ఇచ్చే తర్ఫీదు భవిష్యత్ విద్యాభివృద్ధికి, జీవిత ఔన్నత్యానికి తోడ్పడుతుంది. కానీ దానిని అమలు చేసే విషయంలో మసిపూసి మారేడు కాయను చేస్తూ 3నుండి 18 సంవత్సరాల వయసు పిల్లలకు పాఠశాల విద్యను విస్తరించినట్లుగా ప్రకటించి, ఆచరణలో మాత్రం 3నుండి 6 సంవత్సరాల వయసు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లోనే ఉంచాలని చెప్పింది. దానితో అంగన్వాడీ కేంద్రాల్లో ఉండే పేదవర్గాల పిల్లలకు పౌష్టికాహారం పేరుతో ఎప్పటిలాగే ఇంత బువ్వ దక్కుతుందే తప్ప శిశు విద్య అందే అవకాశమే లేదు. శిశు విద్య లేకపోవడం వలన అభ్యసన సామర్థ్యాలలో పేద విద్యార్థులు వెనుకబడుతున్నారు. ఇక మీడియం విషయంలో పేర్కొన్న అసంబద్ధ విధానంతో ప్రయివేటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కొనసాగే అసమాన పరిస్థితే ఉంటుంది. విద్యా హక్కు చట్టాన్ని గాని, అందులోని సెక్షన్ 12(1)(సి)ని గాని అమలు చేయాలని నూతన విద్యా విధానంలో లేకపోవడం వలన పేద కుటుంబాల పిల్లలను ఇంగ్లీష్ మీడియం కోసం ప్రయివేటు స్కూల్లో చదివించుకునే రిజర్వేషన్ సదుపాయం కూడా దక్కకుండా చేయబడింది.
త్రిభాషా సూత్రం మాటున సంస్కృత భాషను నేర్పాలనే వత్తిడితో చాతుర్వర్ణ వ్యవస్థను బహిరంగంగానే అమలు చేయడానికి ఈ విధానం తలబడుతోంది. ఇంత కాలమూ మూడో భాషగా అమలవుతున్న ఇంగ్లీషును వెలివేయడం మరీ దారుణం. ఇది యావత్ విద్యా వ్యవస్థకే ప్రమాద ఘంటిక. ఇకపోతే ఆరో తరగతి నుండి ఒకేషనల్ కోర్సులను నేర్పాలనే నిర్ణయంలో కుల వృత్తులను ప్రోత్సహించి సాధారణ విద్యకు దూరం చేసే కుట్ర కూడా దాగి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 50 వేలకు పైగా ఉన్నత విద్యా సంస్థల్లో సరైన నాణ్యతా ప్రమాణాలు లేనివే అత్యధికమని, అందువలన వాటిని కుదించి మూసి వేయాలని విధాన పత్రంలోనే గట్టిగా చెప్పింది. మూడు వేల మందికి పైగా విద్యార్థులతో మల్టీ డిసిప్లీనరీ కోర్సులతో నడిచే యూనివర్సిటీ లేదా అటానమస్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజి జిల్లాకి ఒకటున్నా చాలని, అవి ప్రయివేటు రంగంలో అయినా ఫర్వాలేదని చెప్పారు. మూడేండ్ల డిగ్రీ కోర్సులు నాలుగైదు సంవత్సరాల కోర్సులుగా మారాయి. ఉన్నత విద్యలో ఒకసారి చదువు ఆగిపోతే పేద వర్గాల విద్యార్థులు మళ్ళీ చదువుకోలేరు. అలాంటి వారు 4, 5 సంవత్సరాల పాటు క్యాంపస్‌లో ఉండి చదువుకునే అవకాశం నూతన విద్యా విధానంలో లేదు.
ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీలు భారతదేశానికి రావాలని ఈ విధానం స్వాగతం పలుకుతోంది. తద్వారా ప్రపంచ స్థాయి ఉన్నత విద్య కోసం మన విద్యార్థులు విదేశాలకు పోవాల్సిన అవసరం ఉండదని, చాలా ఖర్చు తగ్గుతుందని, స్వదేశంలోనే విదేశీ విద్యను నేర్చుకోవచ్చని చెబుతోంది. కానీ ఉన్నత విద్యాభివృద్ధి పేరుతో ఏర్పాటుచేసే ఈ ప్రయివేటు యూనివర్సిటీలు, అటానమస్ డిగ్రీ కాలేజీలు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు ఉండవు. అలాంటి ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తరగతుల్లోని పేదలకు చదువుకునే అవకాశం లేదు. విద్యలో సమానత్వం, సమ్మిళితం సాధించడానికి ఈ విధానంలో కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు విద్యాభ్యాసంలో కూడా వెనుకబడి ఉంటున్న విషయం తెలిసిందే. సదరు వెనుకబాటుతనాన్ని అధిగమించడానికి అదనపు సదుపాయాలు కల్పించాలనే విషయం పరిశీలించదగిందే. విద్యలో వెనుకబడిన వర్గాలవారు ఎక్కువగా ఉండే ప్రాంతాలను స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్‌గా ప్రకటించి, వారికి అదనపు విద్యాబోధన కోసం వలంటీర్లు, ట్యూటర్లు, కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమయ్యే ఖర్చుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా అసలు అమలు జరుగుతుందా అనేది అనుమానమే. ఎందుకంటే పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించి అందరూ స్వాగతించిన విద్యాహక్కు చట్టమే అమలు కానప్పుడు ఇలాంటి బ్రిడ్జి కోర్సుల వంటి కార్యక్రమాలు సఫలం అవుతాయని ఆశించలేం. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70సంవత్సరాలు గడిచినా అందరికీ సమానంగా నాణ్యమైన విద్య అందకపోవడానికి రెండు బలమైన కారణాలు ఉన్నవి. వాటిలో ఒకటి సంపన్నులతో సమానంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్య అండకూడదనే మనువాద మనస్తత్వం పాలక వర్గాల్లో కొనసాగుతుండడం. రెండవది సదరు సామాజిక అసహన వైఖరితోనే విద్యారంగానికి అవసరమైన నిధులు కేటాయించక పోవడం. అందరికీ విద్య అందించడానికి స్థూల జాతీయ ఉత్పత్తి(జీడీపీ)లో 6శాతం నిధులు వెచ్చించాలని 1968 విద్యా విధానంలో చేసిన నిర్ణయం 52 సంవత్సరాలు గడిచినా అమలు జరగలేదు. విద్యా విధానం ఎప్పుడైనా పాలక వర్గాల ప్రయోజనాల కోసమే రూపొదించ బడుతుంది. అంతిమంగా కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ఈ నూతన విద్యా విధానం మనువాద సంస్కృతికే అధిక ప్రాధాన్యతను ఇస్తున్న నరేంద్ర మోడీ పరిపాలనకు బాగా సరిపోతుంది.
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్: 9676407140