Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయ మారకపు మార్కెట్లో భారత దేశ కరెన్సీ రూపాయి విలువ నిరంతర పతనాన్ని చవిచూస్తోంది. ఇటీవల డాలర్‌తో రూపాయి మారకపు విలువ 77.72గా నమోదయ్యి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి దిగజారింది. క్రమానుగతంగా క్షీణిస్తున్న రూపాయి ఆసియాలోనే అత్యంత భారీగా పతనమైన కరెన్సీగా నిలవడం ఆందోళనకరం.
రూపాయి విలువ పతనానికి, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడిచమురు ధరలు, భారత దేశ స్టాక్ మార్కెట్ నుంచి వేగంగా తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, ప్రపంచంలో భౌగోళికంగా రష్యా-ఉక్రేయిన్ యుద్ధ కారణంగా ఏర్పడిన సంక్షోభ పరిస్థితులు, ఎగుమతుల కన్నా దిగుమతులు పెరిగి చెల్లింపుల్లో అసమతుల్యం వలన ఏర్పడిన వాణిజ్యలోటు, 18 నెలల గరిష్ట స్థాయికి చేరిన టోకుధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణ ప్రభావం, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్‌బ్యాంక్ అమలుచేస్తున్న కఠిన ద్రవ్య విధానం వంటివి కొన్ని ప్రధాన కారణాలు. సమాజ నిర్మాణానికి సహజ పునాదులుగా ఉన్న ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని, పురోగమ నాన్ని, ప్రపంచీకరణ విధానాలతో ముడిపెడుతున్న ప్రస్తుత ధోరణిలో కరెన్సీ క్షీణత పరిణామాలను కేవలం కారణాల విశ్లేషణతో పరిష్కరించలేం.
కరెన్సీ విలువ క్షీణత దేశ ఆర్థిక వ్యవస్థపైన, విస్తృతమైన ప్రజా జీవన ప్రమాణ స్థాయిపైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ బలహీనపడినప్పుడు డాలర్‌తో మారకం చేసే అన్ని వస్తూత్పత్తులకు, దిగుమతులకు మరింత ఎక్కువ మొత్తంలో రూపాయిలు చెల్లించవలసి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఫైనాన్స్ పెట్టుబడి ద్వారా పొందే లాభాల వస్తూత్పత్తితో కానీ, ఆ వస్తువులను ఉత్పత్తి చేసే క్రమంలో భాగస్వామ్యం కానీ, వస్తు వాణిజ్యంతో కానీ ప్రత్యక్ష సంబంధం ఉండకపోవడం గమనార్హం.
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ వంటి పెట్రోలియం ఉత్పత్తులలో 80శాతానికి పైగా దిగుమతులపై ఆధారపడిన భారత ఆర్థిక వ్యవస్థపై రూపాయి పతన తీవత్ర భారమవుతుంది. ఎలక్ట్రానిక్, ఇంజనీరింగ్ వస్తువులు, రసాయినాలు, వంట నూనెలు, ఐరన్, స్టీల్, ప్లాస్టిక్, హెవీ మిషనరీ, మొబైల్ ఫోన్స్, టీవీలు, లాప్టాప్ లు ఇతర గృహౌపకరణాలు ఖరీదు పెరిగి, చెల్లించాల్సిన వస్తువు ధరలు పెరుగుతాయి.
విదేశీ విద్య మరింత భారమవుతుంది. విదేశాలలో విద్యనభ్యసించడానికి ఉపయోగించుకున్న బ్యాంకు రుణాల భారం పెరుగుతుంది. విదేశీ ప్రయాణాల కోసం చేసే ఖర్చుకూడా మరింత ప్రియమవు తుంది. అంతర్జాతీయ మార్కెట్ల నుండి రుణాలను పొందిన భారతీయ సంస్థలు వాటిని తిరిగి చెల్లించే క్రమంలో ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేయవలసి ఉంటుంది. ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతున్న నేపథ్యంలో వినియోగదారుని కొనుగోలు అలవాట్లపైన దీని ప్రభావం పడుతుంది.
దేశ ప్రజల ప్రయోజనాలు, అవసరాలు, ఆకాంక్షల మేరకు కాకుండా, ప్రపంచీకరణ ముసుగుతో సంపన్న దేశాలకు లాభాలను ఆర్జించి, తరలించేందుకు నిర్ధేశించిన అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని, విశృంఖలంగా ఆహ్వానించడం, ఆంక్షలు లేకుండా ఆమోదించడమే దేశంలో ఈ కరెన్సీ విలువ క్షీణత తీవ్రతకు మూల కారణం. ప్రపంచవ్యాప్తంగా ఏ పరిణామం వచ్చినా దాని ప్రభావం భారత మార్కెట్లపై పడుతుంది. ఫలితంగా మార్కెట్ పతన ప్రభావం దేశ ఆర్థిక పునాదులను ప్రభావితం చేస్తుంది.
ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో జరిగే కరెన్సీ లావాదేవీల ప్రభావం రోజువారీ మార్కెట్లో జరిగే వివిధ అంశాల ప్రాతిపదికన నిర్ణయించబడుతుంది. పలువురు ఆర్థికవేత్తలు విశ్లేషించినట్లుగా, విశ్వవ్యాపిత గుత్త పెట్టుబడి విస్తరణ దశలో మార్కెట్ అంటే కోట్లాది మంది ప్రజల జీవితాలతో నిత్యం జూదమాడే సెక్యూరిటీలకు, కరెన్సీ, స్టాక్ మార్కెట్ లావాదేవీలకు వర్తించే మార్కెట్ అనే అర్థంగా మారిపోయింది. ప్రజలకు అవసరమైన సరుకులు, ఉత్పత్తులు, సర్వీసులకు సంబంధించిన మార్కెట్ పూర్వపక్షమయ్యింది.
స్వేచ్ఛా వాణిజ్యం అంటే ఏ విధమైన ఆంక్షలు లేకుండా, యధేచ్ఛగా లాభాల స్వీకరణను కొనసాగించడానికి వీలుగా, స్వేచ్ఛగా పెట్టుబడులను తరలించడానికి, ఇతర దేశాల ప్రయోజనాలను విస్మరించి తాము నిర్ణయించుకున్నట్టుగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేయడానికి అవకాశం ఇచ్చే ప్రక్రియగా రూపాంతరం చెందింది. అటువంటి ఆంక్షలులేని అంతర్జాతీయ పెట్టుబడిని ఆహ్వానించిన ఫలితంగానే, నేడు దేశీయ స్టాక్ మార్కెట్ నుండి రోజూ వేలకోట్ల రూపాయల తమ పెట్టుబడులను విదేశీ వ్యవస్థాగత మదుపు దారులు ఉపసంహరించు కుంటున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 28.05 బిలియన్ డాలర్ల మేరకు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరిం చుకున్న ఫలితంగా విదేశీ మారక ద్రవ్య నిలువలు 635.36 బిలియన్ డాలర్ల నుంచి 607.31 బిలియన్ డాలర్లకు పడిపోయి నాయి. పెట్టుబడి విశ్వీకరణ పేరుతో నియంత్రణలులేని విదేశీ పెట్టుబడులను అనుమతించడం వలన దేశ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూలేని ముప్పును ఎదుర్కొం టోంది. ఇతర దేశాల కరెన్సీ విలువలను నియంత్రించి, డాలర్ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తన పట్టును కాపాడుకునేందుకు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి చేసే వికృత విన్యాసమే వివిధ దేశాల కరెన్సీల క్షీణతకు ప్రధాన ప్రాతిపదిక. గతంలో కూడా అనేకసార్లు అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో భారత దేశ రూపాయి పతనాన్ని నిలువరించేందుకు రిజర్వ్ బ్యాంక్ స్వయంగా జోక్యం చేసుకుని ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో అమెరికన్ డాలర్లను విక్రయించి, రూపాయి పతనాన్ని నిలువరించిన నేపథ్యం ఈ సందర్భంగా గమనార్హం.
కనిష్టస్థాయికి రూపాయి విలువ పడిపోయి, ద్రవ్యోల్బణం 8ఏండ్ల గరిష్టస్థాయికి చేరి, ప్రజల కొనుగోలు శక్తి ఆవిరవుతున్నప్పటికీ దేశ ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయంటున్న పాలకుల ప్రసంగాలు నీటిమూటలే. గతంలో ఏషియన్ టైగర్లుగా వెలుగువెలిగిన దేశాల కరెన్సీల పతనానికీ, ఆగేయ ఆసియా దేశాలలో వచ్చిన కరెన్సీ సంక్షోభాలకీ మూలం ఎటువంటి ఆంక్షలులేని స్వల్పకాలిక విదేశీ పెట్టుబడుల ప్రవేశాన్ని ఆయా దేశాలు ఆహ్వానించడమేనన్న అంత ర్జాతీయ అనుభవాల గుణపాఠాన్ని విస్మరించలేం. ఫైనాన్స్ క్యాపిటల్ విస్తృతి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు వాటిల్లుతున్న నష్టం విస్తారమవుతున్న ప్రస్తుత నేపథ్యంలో, విచక్షణా రహితమైన విదేశీ పెట్టుబడులను, ఆంక్షలులేని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని నియంత్రిం చేందుకు అవసరమైన నిబంధనలను, ఆంక్ష లను రూపొందించు కోవడం దేశ పాలకులకు అనివార్యం.
- జి. కిషోర్ కుమార్
సెల్:9440905501