Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ఏర్పడి ఎనిమి దేండ్లు అయ్యింది. పాలకులు ఆనాడు చేసిన బాసలు, నేడు చూపిన ఆచరణ బేరీజు వేసుకోవల్సిన సందర్భం. నాటి వాగ్దానాలు, నేటి వాస్తవాలు మన కండ్లముందున్నాయి. అంతా 'బ్రహ్మండం' అనే భజన పరులకు కొదవలేదు. అధికారమే లక్ష్యంగా అడ్డంగా దాడిచేసే అవకాశావాదులూ ఉన్నారు. వీరికి ప్రజల ప్రయోజనాలు పట్టవు. స్వప్రయోజనాలు, అధికార దాహమే వారిని నడిపిస్తుంది. నమ్మిన ప్రజలు నోచుకున్నదెంత అన్నదే గీటురాయి కావాలి.
నీళ్ళు, నిధులు, నియామకాలే ట్యాగ్‌లైన్‌గా తెలంగాణ ఉద్యమం సాగింది. రాష్ట్రం వచ్చిన నాటినుంచీ ముఖ్యమంత్రి మనది ధనికరాష్ట్రమని గొప్పలు చెబుతూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చింది ప్రాంతీయ పార్టీ. సహజంగానే రాష్ట్ర హక్కులు, అధికారాల కోసం, ప్రజలు తలెత్తుకుని తిరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడుతుందని జనం ఆశిస్తారు. ఢిల్లీలో తెలంగాణ గౌరవం వెలుగుతుందని భావిస్తారు. ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకత్వం ప్రజాస్వామ్యం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుందని అనుకుంటారు. అనేక సంస్కృతులు, సంప్రదాయాల సమాహారంగా ఉన్న తెలంగాణను పాలిస్తున్న నాయకత్వం లౌకిక విలువల కోసం నిజాయితీగా నిలబడుతుందని నమ్ముతారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ 'బంగారు తెలంగాణ' గురించి బల్లగుద్ది మాట్లాడటంతో కొత్త ఆశలు చిగురించాయి. ఈ విషయాలన్నీ ప్రజల ప్రయోజనం కోణంలో విశ్లేషించడానికి ఎనిమిదేండ్లు తగిన కాలమే! తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంచనా గట్టడానికి ఇది తగిన సమయమే!
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ఒక ప్రధానాంశం. ఈ విషయంలో ఎన్టీఆర్, వైఎస్సార్‌లను మించి మరో అడుగు ముందుకేసింది కేసీఆర్ ప్రభుత్వం. రకరకాల పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు పేదలకు ఎంతో కొంత ఊరటనిచ్చాయి. అవే టీఆర్ఎస్కు ఓట్ల రూపంలో ఊతమిచ్చాయి. ఇప్పుడు ప్రకటించిన దళితబంధు ఏమేరకు దళితుల బంధుగా నిలుస్తుందో చూడవల్సిందే. ఇదే కాలంలో గురుకుల పాఠశాలల సంఖ్య గణనీయంగా పెంచారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు మెరుగుపర్చారు. బస్తీ దావాఖానాలూ ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వశాఖలు, ప్రభుత్వరంగ సంస్థలలో సుమారు 30వేల పోస్టులు భర్తీ చేసారు. మరో యాభైవేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామన్నారు. రైతు బంధు అమలు చేస్తున్నారు. గురుకులాలు, వైద్యరంగంలో చర్యలు, భర్తీ చేసిన మేరకు ఉద్యోగాలు కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించేవే. ఆహ్వానించదగినవే. కానీ, ఎనిమిదేండ్ల తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆశించవల్సింది ఇంతేనా?
సాగునీటి సమస్యలన్నింటికీ కాళేశ్వరమే సమాధానం అన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రజలు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివాదాలు పక్కనబెడితే, వనరులన్నీ ఈ ఒక్క ప్రాజెక్టుకే మరలించిన ఫలితంగా రాష్ట్రంలో జిల్లాల మధ్య కొత్త అసమానతలకు బీజం వేస్తున్నారు. నియామకాల మాట తప్పి, చదువుకున్న యువత విశ్వాసం కోల్పోతున్నారు. తెలంగాణ తొలి శాసనసభ సమావేశాలలోనే ప్రభుత్వశాఖలలో లక్షా ఏడువేల పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రకటించారు. ఏడాదిలో భర్తీ చేస్తామన్నారు. ఎనిమిదేండ్లయ్యింది. ఇప్పుడు వేతన సవరణ సంఘం రాష్ట్రంలో లక్షా తొంభై ఒక్కవేల ఖాళీ పోస్టులున్నాయని తేల్చింది. అవన్నీ నిజమైన ఖాళీలు కావని పాలకులు బుకాయిస్తున్నారు. ఉద్యమానికి దండలో దారంలా పనిచేసిన ట్యాగ్‌లైన్ నీరుగారింది. దళితులకు మూడెకరాల భూమి, గిరిజన భూముల మీద హక్కులు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఉద్యోగాల్లో కాంట్రాక్టు పద్ధతి రద్దు, యువతకు నిరోద్యగ భృతి వంటి వాగ్దానాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఇవి అమలు చేస్తే దీర్ఘకాలిక ఫలితాలుంటాయి. అనేక చోట్ల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. పేదలకు కేటాయించలేదు. అప్పుడే అవి పగుళ్ళు చూపుతున్నాయి. మిగిలిన వాగ్దానాలకు మొండిచేయి చూపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్ గురించి పెద్ద మాటలు చెప్పారు. ఖర్చు చేయని నిధులు తర్వాత సంవత్సరానికి చేర్చుతామన్నారు. ఆచరణ భిన్నంగా ఉన్నది. బడ్జెట్ సైజు పెంచి చూపించటం, బడుగు బలహీన వర్గాలకు కేటాయింపులు చూపించటం, తర్వాత కోతపెట్టటం ఆనవాయితీగా మారింది. 2018-21 మధ్య ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.16527.77 కోట్లు దారిమరలించారు. వీటికి తోడు బడ్జెట్లో కేటాయించిన ఇతర నిధులు కూడా గణనీయమైన భాగం ఖర్చు చేయలేదు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు రాజకీయ పునరావాసానికే తప్ప ఎంబీసీలకు ఉపయోగపడలేదు. నిధుల కేటాయింపే తప్ప ఖర్చులేదు. ''మనవూరు-మనప్రణాళిక'', ''మనవూరు-మన కూరగాయలు'' గాలిలో కలసిపోయాయి. ఇప్పుడు ''మన వూరు - మన బడి'' అంటున్నారు. ఇవన్నీ ప్రకటిస్తున్నప్పుడు చప్పట్లు కొట్టిన జనం తర్వాత మరచిపోతారని పాలకుల నమ్మకం. అమలు చేసిన సంక్షేమ పథకాలలో ఎక్కువ భాగం తక్షణం ఎంతో కొంత ఊరటనిచ్చేవి. ఓట్లు రాల్చేవి. అమలు జరగనివీ, మాట తప్పినవన్నీ దీర్ఘకాలంలో ప్రజల జీవితాలను మెరుగుపరిచేవి. అంటే ఓట్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలు పరిష్కరించటంలో లేదు. కౌలు రైతులను, వ్యవసాయ కార్మికులను, కార్మికులను కావాలనే పక్కన బెట్టారు. కౌలు రైతులను గుర్తించేది లేదని బహిరంగంగానే ప్రకటించారు. కార్మికుల, వ్యవసాయ కార్మికుల కనీస వేతనాల ప్రస్తావన కూడా లేదు. పెట్టుబడిదారులు, భూస్వాములు, ధనిక రైతుల మీదనే ప్రేమ. రైతు బంధు పేరుతో వందల ఎకరాల యజమానులకు ఖజానా దోచిపెట్టారు. పెట్టుబడిదారులకు సకల సౌకర్యాలు గ్యారంటీ ఇచ్చారు. కోటిమంది కార్మికులకు గత 10-15 సంవత్సరాలుగా, ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు పాలకులే కనీస వేతనాలు సవరించలేదు. ఇది ప్రభుత్వం ఖర్చుపెంచేది కాదు. ప్రభుత్వ ఆదేశాలు చూపించి కార్మికులు, తమ యజమానుల మీద వత్తిడి చేసి వేతనం పెంచుకొనేందుకు ఉపయోగం. యజమానుల సేవలో ఉన్న ప్రభుత్వం కనీస వేతన చట్టాన్ని అమలు చేయటం లేదు. హరితహారం పేరుతో ఆదివాసీల భూములు స్వాధీనం చేసుకుంటున్నది. వారి మీద దాడులు చేస్తున్నది. స్మగ్లర్లను, భూకబ్జాదారులను మాత్రం వదిలేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాల రద్దును పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు సమర్థించారు. ఆర్టీసీని బలహీన పరిచేందుకు దారితీసే ట్రాన్స్పోర్ట్ సవరణ చట్టాన్ని కూడా సమర్థించారు. 'వాగుదాటింతర్వాత బోడిమల్లయ్య' సామెతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేస్తున్నది. ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకత్వం ఉద్యమం శక్తినీ, ప్రజాస్వామ్య హక్కుల ప్రభావాన్నీ బాగా అర్థం చేసుకున్నది. తమ తప్పులను ప్రశ్నించడాన్ని సహించటం లేదు. హక్కులను హరిస్తున్నది. ధర్నాలు, ప్రదర్శనలు, నిరసనల మీద ఆంక్షలు విధిస్తున్నది. దేశంలో ఎక్కడా లేనన్ని సీసీ కెమెరాలు పెట్టి ప్రజా ఉద్యమాల మీద నిఘా పెట్టింది. ధర్నాచౌక్‌ను కూడా పోరాడి నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ప్రజా సమస్యల మీద వినతిపత్రాలు కూడా స్వీకరించ నిరాకరిస్తున్నది. ప్రతిపక్షం ఉండకూడదన్న ధోరణి ప్రదర్శించింది. కాంగ్రెస్, టీడీపీ శ్రేణులను కొనుగోలు చేసింది. శూన్యం ఎంతోకాలం ఉండజాలదు. ప్రతిపక్షాన్ని ప్రజలు సృష్టించుకుంటారన్న స్పృహ లేదు. సొంతపార్టీలోనే అసంతృప్తులు పెరుగుతాయన్న సోయిలేదు. ప్రజల అసంతృప్తి పెరుగుదలతో పోరాటాలను, ప్రశ్నించేవారినీ ఆపటం ఎవరితరమూ కాదుకదా! ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న వామపక్షాలను కూడా అడ్డుకునే ప్రయత్నం దుస్సాహసమే అవుతుంది. కుల దుహంకార దాడులు, మహిళల మీద లైంగిక దాడులు ఎప్పుడూ లేనంత స్థాయికి పెరిగాయి.
చదువుకున్న యువత, కార్మికులు, ఉద్యోగులలో టీఆర్ఎస్ పాలన పట్ల అసంతృప్తి పెరుగుతున్నది. అయినా, పాలకుల చూపులు పైకే ఉంటున్నాయి. అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు కాచుకుని కూర్చున్నాయి. ఒకవైపు దేశాన్నీ, ఉమ్మడి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్, మరోవైపు దేశ సంపదను బడాబాబులకు కట్టబెడుతున్న బీజేపీ తెలంగాణ మీద కన్నేసాయి. ప్రజలలో మతపరమైన విభజన సృష్టించి పబ్బంగడుపు కోవాలని బీజేపీ ఎత్తులు వేస్తున్నది. అధికారం కోసం ఏ గడ్డి గరవడానికైనా వెనుకాడటం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్రను ఇందుకు సాధనంగా వాడుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకత్వం కూడా పచ్చి అవకాశవాదం ప్రదర్శిస్తున్నది. టీఆర్ఎస్ను ఓడించే లక్ష్యంతో బీజేపీ ప్రమాదాన్ని కూడా విస్మరిస్తున్నది. మొత్తం మీద వామపక్షాలు మినహా వీరెవరికీ ప్రజా సమస్యలు పట్టవు. కేవలం అధికార దాహమే వారిని నడిపిస్తున్నది.
ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని కూడగట్టి, పోరాడవల్సిన బాధ్యత వామపక్షాల మీద ఉన్నది. ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేసే శక్తులు కమ్యూనిస్టులే కదా! సమస్యల పరిష్కారం కోసం ప్రజలను పోరాటాలవైపు సమీకరించాలి. ప్రజలతో మమేకం కావాలి. ప్రజలు కదిలేదాకా విస్తృతంగా వారికి నచ్చజెప్పాలి. పరిష్కారమయ్యేదాకా వారి వెన్నంటి ఉంటామన్న విశ్వాసం కల్పించాలి. ఈ దిశలో కృషి తగినంత జరగనప్పుడు, అసంతృప్తిని బీజేపీ, ఆరెస్సెస్‌ల నాయకత్వం మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు వాడుకుంటున్నాయి. నిజానికి తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి సరైన ప్రత్యామ్నాయం చూపగలిగేదీ, ఆచరించి చూపగలిగేదీ వామపక్షాలే కదా! ఇప్పుడు కేరళలో వామపక్ష ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచింది. వామపక్షాలు బలపడే దాకా ఏమీ చేయలేమా? టీఆర్ఎస్ నాయకత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, కేంద్ర ప్రభుత్వ విధానాల మీద ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలి. అప్పుడు వామపక్షాలు కూడా భుజం కలిపి పోరాడటానికి వెనుకాడవు. కానీ టీఆర్ఎస్ నాయకత్వం ఏకపక్ష ధోరణులు, అవకాశవాద విధానాలే ఆటంకంగా ఉన్నాయి. ఏడున్నర ఏండ్లపాటు కేంద్రంలో మోడీ ప్రభుత్వంతో లాలూచీ కుస్తీ నడిపారు. గుడులు, గోపురాల విషయంలో పోటీపడే ప్రయత్నం చేసారు. కేంద్రం మోసపూరిత ఎత్తుగడలు ఆలస్యంగా అర్థం చేసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్తు సవరణ బిల్లును టీఆర్ఎస్ వ్యతిరేకించింది. ఇన్సూరెన్స్, బ్యాంకులు, ఇంధన రంగంలో ప్రయివేటీకరణను కూడా వ్యతిరేకించింది. రాష్ట్రానికి చట్టబబద్ధంగా రావల్సిన జీఎస్టీ బకాయిలు, కేంద్రం గ్రాంట్లు బకాయిలు కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. మంచిదే. వీటితో పాటు సాగునీటి రంగంలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హౌదా, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, నిజామాబాద్‌లో పసుపు బోర్డు, కేంద్రం యాసంగి బియ్యం కొనుగోలు లాంటి సమస్యలూ ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో కేంద్రంతో రాజీలేని పోరాటానికి సిద్ధమని చెబుతున్నారు. దేశమంతా తిరిగి వివిధ ప్రాంతీయ పార్టీలతో సంప్రదిస్తున్నారు. కానీ రాష్ట్రంలో కలిసొచ్చే పార్టీలను కలుపుకుని, ప్రజలను సమీకరించి పోరాడేందుకు సిద్ధంగా లేరు. హైదరాబాద్‌లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాల సందర్భంగా నాయకత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించారు. తీరా టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆశ్చర్యకరంగా మాట్లాడారు. ఈ పద్ధతితో ప్రజలలో తామే చులకన అవుతారని గ్రహించటం మంచిది. ముఖ్యమంత్రి మరో ప్రకటన చేసారు. ఇప్పుడు దేశంలో ప్రధాని లేదా ప్రభుత్వం మారటం ముఖ్యం కాదన్నారు. విధానాలు మారాలన్నారు. ఆ విధానాలేమిటో మాత్రం చెప్పలేదు. గాలిమాటలతో ప్రజలకు విశ్వాసం కల్పించజాలరు. నిర్దిష్ట కార్యక్రమం ప్రజల ముందుంచాలి. ప్రజలను కదిలించడానికి సిద్ధపడాలి. కానీ నిజమైన ప్రజల ప్రత్యామ్నాయం చూపగలిగేది వామపక్షాలే. ఆ ప్రయత్నం వేగం పుంచుకోవాలిప్పుడు.
- ఎస్. వీరయ్య