Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుల, మత ఉచ్చులో రాజ కీయాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాల పాలనా కొనసాగుతోంది. సెక్యులర్ వాదాన్ని అణిచే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ తరహా ప్రయోగాలను తెలంగాణలోనూ అమలు చేస్తోంది బీజేపీ. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్లో బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజరు నిర్వహించిన ఏక్తా యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా దూమారాన్ని రేపింది. గతంలోనూ అనేక రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినప్పటికీ, ఇది అంతకు మించి ఆక్షేపనీయమైన ప్రసంగం. ముస్లింలపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతంగా ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందు ఓటు బ్యాంకు కోసం బీజేపీ చేస్తున్న ఇలాంటి రాజకీయాల వల్ల సమాజం దారి తప్పుతోంది. అనేక సంఘటనలూ చోటు చేసుకుంటున్నాయనడంలో సందేహం లేదు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న అత్యంత కిరాతకమైన పరువు హత్యలు ఇందుకు ఉదాహారణలుగా చెప్పవచ్చు. మతోన్మాదం బలంగా జనం మెదళ్ళలో నాటుకపోతోంది. దాని ప్రభావం సమాజంపై పడుతోంది. భావోద్రేకాలను రెచ్చగొడుతూ చివరకు అదే ఒక భౌతిక శక్తిగా ఎదుగుతోంది.
వృత్తి పరంగా ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడం వల్ల అట్టడుగు వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది. కానీ, ప్రభుత్వాలు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో రైతుబంధు ద్వారా నిరుపేద రైతులకు పెట్టుబడి సాయం అందిండాన్ని ఎవరూ కాదనరు. కాని దీని ద్వారా ఉద్యోగులు, బడా భూస్వాములకే ఎక్కువగా ప్రయోజనం చేకూరుతోంది. దళితులకు దళితబంధు స్కీమ్ కూడా పలుకుబడి ఉన్నవారికే చేకూరుతోంది. ఎమ్మెల్యేలు, మంత్రులకు దగ్గరగా ఉన్నవారు, ఆర్థికంగా ఉన్నవారే ఎక్కువ సంఖ్యలో లబ్ది పొందుతుండగా, అట్టడుగునున్న దళితులు ఆఫీసులు, అధికారుల చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నారు.
కుల సంఘాలకు భవనాలు కేటాయంచడాన్ని ఆత్మగౌరవంగా చెబుతోంది రాష్ట్ర సర్కారు. కానీ గ్రామీణ, పట్టణ పేదరికంలోవున్న వారు వీటిని ఎంత మేరకు వినియోగిస్తారనేది ప్రశ్నార్థకం. లక్షలు, కోట్లాది రూపాయల విలువైన భవనాలు, ఆస్తులు కొందరి చేతుల్లోకి వెళ్తున్నాయే తప్ప.. పేద వారికి ఏ మాత్రమూ ఉపయోగపడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య నిరుపేద వృత్తిదారులు ఏ మాత్రమూ వినియోగించుకోలేరు. కుల వృత్తులు కూనరిల్లుతోన్నా ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. భారత రాజ్యాంగం గురించి గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు.. ఆ దిశగా పారిపాలన, పథకాలు తీసుక రాక పోవడం దురదృష్టం. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- చిలగాని జనార్థన్
సెల్:8121938106