Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జూన్ 10తో వానాకాలం పంటల సాగు ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో 60లక్షల రైతు కమతాలు సాగుకు సన్నద్ధం అయ్యాయి. సాగుకు ముందు రైతు మౌలిక సౌకర్యాల ఏర్పాటుపై దృష్టిపెట్టాలి. ఉపకరణాలు సంపాదించుకోవాలి. ఏమాత్రం అలస్యం జరిగినా పంట దిగుబడికి నష్టం వాటిల్లుతుంది. సన్న, చిన్నకారు రైతులకు సకాలంలో ఉపకరణాలు లబించక పంటలు దెబ్బతినడం, ఉత్పాదకత తగ్గడం చూస్తున్నాం. ప్రధానంగా ఎనిమిది సమస్యలు సాగుకు ముందే పరిష్కరించ బడితలే ఉత్పత్తి, ఉత్పాదకత పెరుతుంది.
వ్యవసాయ ప్రణాళిక :ఏ మండ లంలో ఏ పంటలు వేయాలో వివరిస్తూ ప్రణాళికలు విడుదల చేయాలి. జిల్లా వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు రైతులకు చెప్పి ప్రణాళికలు అమలు జరపడానికి కృషి చేయాలి. ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి, నెల రోజుల క్రితమే 75లక్షల ఎకరాలలో పత్తి, 60 లక్షల ఎకరాలలో వరి, 11లక్షల ఎకరాలలో కందులు, 22లక్షల ఎకరాలలో మొక్కజొన్న, 5లక్షల ఎకరాలలో సోయా పంటలు వేయాలని ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన రైతుల వద్దకు చేరలేదు. ప్రకటనకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేయలేదు. భూసార పరీక్షలు జరిపి తగిన పంటలను గత 8 సంవత్సరాలలో ఏనాడూ సూచించిందిలేదు. నేడూ అదే విధానం కొనసాగుతున్నది. ప్రణాళిక లేకుండా వ్యవసాయంలో ఉత్పత్తి, ఉత్పాదకత సాధించలేం.
విత్తనాలు : నాణ్యత గల విత్తనాల కొరకు రైతులు ఆరాటపడుతున్నారు. కానీ ప్రతీ సంవత్సరం కల్తీ విత్తనాల బెడద కొనసాగుతునే ఉంది. ఇప్పటికే 30 వేల క్వింటాళ్ళ నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. విత్తనాలు ఎగుమతి చేసే రాష్ట్రంగా ఉండి కూడా తెలంగాణ రైతులు వరి, పత్తి, పప్పుదాన్యాలు, నూనెగింజలు, కూరగాయాల విత్తనాలను కల్తీవి కొనుగోలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. వ్యవసాయ శాఖ నిర్లిప్తంగా ఉంది. విజిలెన్స్ వారు కూడా పట్టుకున్న కేసులను పర్యవేక్షించి నేరస్తులకు శిక్షలు పడేటట్లు చేయాలి. కల్తీ విత్తనాలు వేసి నష్టపోయిన రైతుకు పంట దిగుబడి పూర్తి పరిహారం వ్యవసాయ శాఖ ఇప్పించాలి. ముందు ప్రభుత్వం చెల్లించి తరువాత నేరస్తుల నుండి వసూళ్ళు చేయాలి.
రుణ ప్రణాళిక : నెల రోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి ఉజ్జాయింపుగా పంట రుణాల మొత్తాన్ని ప్రకటించారు. 2022-23 సంవత్సరానికి రూ.67,863 కోట్లుగా చెప్పారు. 2021-22 సంవత్సరానికి రూ.53,221 కోట్లు పంట రుణాలు, రూ.12,061 కోట్లు దీర్ఘకాలిక రుణాలు ఇచ్చినట్లు నివేదించారు. కానీ ఈ ఇచ్చిన పంట రుణాలలో 50శాతానికి పైగా 'బుక్ అడ్జస్ట్మెంట్' చేసినవే. రుణమాఫీ పథకం వలన రైతులు బ్యాంకులకు బాకీలు పడి ఉన్నారు. నాలుగు విడతల చెల్లింపు వలన రైతులు చెల్లించక, ప్రభుత్వం చెల్లించక, బాకీలు కొనసాగుతున్నాయి. రూ.20వేల కోట్లు ప్రయివేటు రుణాలు 24-36శాతానికి వడ్డీకి తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు. ఆ బాకీలు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జూన్ 10వ తేదిలోపు ప్రతి ఏటా రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు అందించాలి.
యాసంగి పంటల అమ్మకాలు : ఇంత వరకు యాసంగి పంటలో 35శాతం వడ్లు అనగా 30లక్షల టన్నులు అమ్మకాలు జరిగాయి. మొక్కజొన్నలు, కందులు, పసుపు, మిరప పంటల అమ్మకాలు పూర్తికాలేదు. మార్కెట్‌కు తెచ్చిన పంటలు తడిచి లక్ష క్వింటాళ్ళ వడ్లు దెబ్బతిన్నాయి. అలాగే తూకాలలో మోసం, ధరల నిర్ణయంలో తగ్గింపు వలన రైతులు సూమారుగా 500 కోట్లు నష్టపోయారు. గత సంవత్సరం కూడా ఇదే జరిగింది. అయినా రైతులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. నాణ్యతా ప్రమాణాలు ఉన్న సరుకులకు కూడా కేంద్రం మద్దతు ధరలు లభ్యం కావడం లేదు. మార్కెట్ కమిటీలు కొనుగోలు దారులతో కుమ్ముక్కై రైతులను నష్టపరుస్తున్నాయి. మార్కెటింగ్ వ్యవస్థను సివిల్ సప్లయి సంస్థను ప్రక్షాళన చేయాలి. ప్రతి మార్కెట్లో విజిలెన్స్ సిబ్బందిని ఎర్పాటు చేసి రైతులకు మద్దతు ధరలతో సకాలంలో అమ్మి డబ్బులు వచ్చే ఏర్పాటు చేయాలి. మార్కెటింగ్ శాఖలో ఉన్న అవినీతిని రూపుమాపాలి.
ధరణి సమస్యలు : ధరణి వలన రైతులు తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించారు. కానీ మరిన్ని సమస్యలు పెరిగాయి. ప్రభుత్వం వేసిన క్యాబినేట్ కమిటీ ధరణిలో 20లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఇందులో 11లోపాలను ఒక మాడ్యూల్‌గా రూపొందించి రైతు రూ.1000 చెల్లించి, రికార్డు సరి చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. మరో రూ.650 మీసేవా కేంద్రం వాళ్ళు తీసుకుంటున్నారు. ఆధికారులు తప్పులు రాసినందుకు శిక్ష రైతులకా? మిగిలిన లోపాలు సరి చేయడానికీ ఒక్కో మాడ్యూల్‌కు ఫీజులు చెల్లించాల్సిందేనా? తప్పులు చేసిన ఆధికారులపై ఏలాంటి శిక్షలు లేవు. తమ భూములపై తమకు హక్కులు కల్పించాలన్న కొరికతో ఆందోళన చేస్తున్న వారిపై లాఠిచార్జీలు చేసి కేసులు పెడుతున్నారు. ఇదేం న్యాయం? ఏలాంటి పరిహారం లేకుండా సాగుకు ముందరే వారి భూములపై హక్కులు కల్పించాలి.
కిసాన్ సమ్మాన్ : కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికి భూ కమతాలతో సంబంధం లేకుండా సంవత్సరానికి రూ.6వేలు ఇస్తున్నది. తెలంగాణ రాష్ట్రం నుండి 38,68,211 మంది రైతులకు మాత్రమే ఈ సహాయం అందుతున్నది. సహాయం పొందేవారు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, భూమి హక్కు పత్రాలు(ఫహణీ), బ్యాంక్ అకౌంట్ నంబర్ కేంద్ర సంస్థ వెబ్సైట్లో నమోదు చేయాలి. రాష్ట్రంలో కేంద్ర సంస్థ లేనందున జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో నోడల్ అధికారిని నియమించి అతని ద్వారా మండలాలలో గ్రామాలలో ఉన్న రైతుల వివరాలన్ని కేంద్ర సంస్థకు అందించాలి. కేంద్ర సహాయాన్ని వీలైనంత ఎక్కువ వినియోగించుకోవాలి. రాష్ట్రంలో 60లక్షల మంది రైతులున్నారు. ప్రస్తుతం 55శాతం మందికి మాత్రమే ఈ పథకం అందుతున్నది. ప్రభుత్వ సంస్థలకు, సహకార సంస్థలకు, పన్నులు చెల్లించేవారికి, ఇతర సబ్సీడీలు పొందేవారికి ఈ పథకం వర్తించదు. అలాంటి రైతులు రాష్ట్రంలో 5శాతం కూడా లేరు. అందువలన రాష్ట్రంలో రైతులందరికి ఈ పథకం రావాలి.
రైతు బంధు : 9వ విడత రైతు బంధు నిధులు విడదలయ్యాయి. ఇంకా 10లక్షల మందికి అందడంలేదు. వారికి పాస్‌పుస్తకాలను సరి చేసి అందించే ఏర్పాటు చేయాలి. రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సకాలంలో నిధులు విడుదల అయితే వానాకాలం పెట్టుబడికి ఇవి చాలా ఉపయోగపడుతాయి. బ్యాంకులు రుణాలు ఇవ్వని స్థితిలో రాష్ట్రం ఇచ్చే రైతు బంధు, కేంద్రం ఇచ్చే కిసాన్ సమ్మాన్ రైతులకు పెద్ద ఊరట. కానీ కొందరూ బ్యాంకర్లు ఈ నిధులు వారి పాత ఖాతాలో జమచేసుకుంటున్నారు. ఇది దుర్మార్గం. ఆర్బిఐ చట్ట ప్రకారం, గత రాష్ట్ర ప్రభుత్వాల జీవోల ప్రకారం జూన్, జూలైల్లో రైతును వసూళ్ళ పేరుతో జప్తులు చేయరాదు. రైతును ఏమాత్రం అలజడికి గురి చేయరాదు. అల జరిగినప్పుడు 'రుణ విమోచన కమిషన్' (ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది.)కు రిపోర్టు చేసి వారి సహాయంతో రైతులు డబ్బులు తీసుకోవాలి. బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే విధంగా చూడాలి.
రైతు బీమా: 18-59 సంవత్సరాల మధ్య ఉన్న వారు ఏలాంటి మరణానికి గురైనా వారికి బీమా కంపెనీ 5లక్షల రూపాయలు పరిహరం చెల్లించాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రిమియం చెల్లిస్తుంది. 2018లో ప్రారంభించిన ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న ప్రిమియంలో 70-80శాతం మాత్రమే క్లైమ్ల కింద ఇస్తున్నారు. మిగిలిన డబ్బు వారు లాభంగా పొందుతున్నారు. ఈ పథకం ఆగస్టు 15తో ప్రారంభమై తిరిగి మరుసటి సంవత్సరం ఆగస్టు 14కు ముగుస్తుంది. గత సంవత్సరం 13వేల మంది మరణించినట్లు నివేదికలు చెపుతున్నాయి. వాస్తవానికి ఈ పథకాన్ని 18-70సంవత్సరాలకు పోడగించాలి. రైతులు 70సంవత్సరాల వరకు వ్యవసాయం బాగానే చేస్తున్నారు. అందువలన కీలక దశలో ఉన్నవారికి ఈ పథకం వర్తించడంలేదు.
గ్రామాలలోకి వ్యవసాయ శాఖ అధికారులు వెళ్ళి రైతులతో సమావేశాలు జరిపి ఈ సమస్యలను పరిష్కరిస్తే రాష్ట్రం వ్యవసాయ ఉత్పత్తులలో అగ్రగామిగా నిలుస్తుంది. ఆత్మహత్యలు నిరోదించబడుతాయి. రైతు కుటుంబాలలో ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందా? వేచి చూడాలి.
- మూడ్ శోభన్
సెల్: 9949725951