Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు ప్రపంచం పర్యావరణ అత్యయిక స్థితిని ఎదుర్కొంటున్నది. 'ముప్పేట భూ పర్యావరణ సంక్షోభానికి' తక్షణ పరిష్కారాలు కనుగొనేందుకు 'స్టాక్‌హౌమ్+50' పర్యావరణ సదస్సు జరుగుతున్నది. 'అందరి శ్రేయస్సుకు ఆరోగ్యకరమైన భూగోళం: మన బాధ్యత, మన అవకాశం' అన్న లక్ష్యంతో జరిగే ఈ సదస్సులో వివిధ దేశాల అధినేతలు, పౌర సమాజ ప్రతినిధులు, వ్యాపార వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటున్నాయి. వాతావరణ మార్పు, జీవవైవిధ్య నష్టం, వ్యర్థాలు - కాలుష్యం నేటి మానవాళి, భూగోళం ఎదుర్కొంటున్న మూడు ముప్పులు. 1972లో తొలి పర్యావరణ సదస్సు స్టాక్హౌమ్లో జరిగి 50యేండ్లు. నాటి సదస్సు 'ఉన్నదొక్కటే భూమి' అనే అంశంపై జరిగి పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలనెన్నింటినో సూచించింది. స్టాక్‌హౌమ్ డిక్లరేషన్‌గా నాటి తీర్మానాలు ప్రసిద్దిచెందాయి. ఇప్పుడు ఐదు దశాబ్దాల తర్వాత మళ్లీ పర్యావరణే లక్ష్యంగా సదస్సు జరుగుతుండటం దేన్ని సూచిస్తున్నది? మనం ముందుకు పోతున్నట్టా? వెనుకకు పయనిస్తున్నట్టా? నానాటికి పర్యావరణం దిగజారిపోతుంటే ప్రజలకేమీ పట్టడం లేదా? ఉద్యమాలు చేయటం లేదా? చేస్తే ఆ ఉద్యమంలో ఎవరు ముందున్నారు? ఈ ఉద్యమ పరిణామాన్ని తెలుసుకోవటం ఈ సందర్భంలో సముచితం, అవసరం కూడానేమో!
ప్రపంచ వ్యాపితంగా అది అమెరికా అయినా, హిమాలయాలైనా పర్యావరణ ఉద్యమాలకు పునాదులు వేసిన వాళ్లు మహిళలు. కుటుంబ నిర్వహణతో పాటు సహజ వనరుల నిర్వహణలో వారిదే కీలకపాత్ర. ప్రకృతిలో వచ్చే మార్పులకు, ప్రకృతికి జరిగే నష్టానికీ స్పందించేది ముందుగా మహిళలేనని చరిత్ర చెబుతున్నది. పర్యావరణం విషయంలో ఇది ముమ్మాటికీ నిజం. పాశ్చాత్యదేశాలు పారిశ్రామిక విప్లవం తెచ్చిన అభివృద్ధిలో మునిగితేలుతున్నప్పుడు ఆ అభివృద్ధి తెచ్చిన అనర్థాలను, హానిని ప్రపంచం ముందు ఉంచింది రేచల్ కార్సన్. ఆరోగ్యరంగంలో ఆమె సుదీర్ఘ అనుభవంతో పురుగుమందుల దుష్ప్రభావాన్ని తన 'సైలెంట్ స్పింగ్' పుస్తకంలో వివరించింది. 1963లో వచ్చిన ఆ గ్రంథం నాడొక సంచలనం. ప్రపంచాన్ని కుదిపివేసింది. అదే ఆధునిక పర్యావరణ ఉద్యమాలకు ప్రాతిపదిక నేర్పరచింది. దోమల నివారణకు వాడే డిడిటి ఎలా తల్లీ పిల్లల ఆరోగ్యాన్ని కబళిస్తుందో తెలియజెప్పింది. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రపంచం గుర్తించేలా చేసింది. పర్యావరణాన్ని ఉద్యమ ఎజెండాగా మార్చిన గొప్ప మలుపునకు రేచల్ కార్సన్ అంకురార్పణ చేసింది.
కుటుంబ బాధ్యతలు మోసే తల్లిగానే కాకుండా సామాజిక బాధ్యతను నెరవేర్చే మహిళగా అమెరికాలో విషవ్యర్థాల తొలగింపునకు నడుం కట్టింది లాయిస్ గిబ్స్. నయాగరా జలపాతం దగ్గర ఉన్న చిన్న పట్టణం లవ్ కెనాల్. తన కొడుకు చదువుతున్న పాఠశాల ఒక విషవ్యర్థాల గుట్టపై కట్టబడిందని తెలుసుకుని తన కొడుకుతో పాటు పిల్లల ఆరోగ్యంపై ఆందోళన చెందింది. లవ్కెనాల్ నివాసితుల సంఘాన్ని నెలకొల్పి న్యూయార్క్ రాష్ట్ర ఆరోగ్య డిపార్ట్మెంట్తో పోరాడింది. తీరా చూస్తే లవ్ కెనాల్ ప్రాంతమంతా విషవ్యర్థాల దిబ్బ అని తేలింది. ఆమె పోరాట ఫలితంగానే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి విష వ్యర్థాలను తొలగించింది ప్రభుత్వం. గిబ్స్ కృషి దేశంలో ఇలాంటి విష వ్యర్థాల ప్రదేశాలను గుర్తించి శుభ్రపరిచేలా అమెరికా పర్యావరణ పరిరక్షణా సంస్థను (ఈపిఏ) ప్రేరేపించింది.
సకల జీవజాతులకు ప్రాణవాయువు నందించే అమెజాన్ వర్షారణ్యాల పరిరక్షణకై అలుపెరుగని పోరాటం చేస్తున్న యోధురాలు మారినా సిల్వియా. బ్రెజిల్లో ఆమెజాన్ అడవుల పరిరక్షణా పోరాటంలో హత్యగావించబడిన ఛికోమెండిస్ పోరాట స్ఫూర్తినందుకుని ఉద్యమాన్ని కొనసాగించిన సిల్వియా అడవుల నరికివేతను 2004-2007 మధ్య కాలంలో 59శాతం తగ్గించగలిగింది. ప్రభుత్వ నియంత్రణ నుండి అమెజాన్‌ను రక్షించడానికి, సాంఘిక న్యాయం, సుస్థిర అభివృద్ధికి ఆమె చేస్తున్న పోరాటం పర్యావరణ ఉద్యమాలకు స్ఫూర్తినిస్తోంది. కెన్యా దేశపు నయేరి కుగ్రామంలో జన్మించిన వంగారి మాథారు రాజకీయ, పర్యావరణ కార్యకర్త. తూర్ప, మధ్య ఆఫ్రికా నుండి డాక్టరేట్ చేసిన తొలిమహిళ. పర్యావరణమంటే కేవలం చెట్లు నాటడమే కాదనీ, మంచి భావాలను ప్రోదిచేయటమని చెప్పింది. లింగ వివక్షకూ, పర్యావరణ సమస్యలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఎండగట్టి ప్రపంచ పర్యావరణ ఉద్యమంతో స్త్రీవాదాన్ని జోడించింది. ముఫ్పైవేల మంది మహిళలకు శిక్షణనిచ్చి, 51 మిలియన్ చెట్లను నాటిన మాథారు నోబెల్ బహుమతి గెలుచుకుంది.హార్వర్డ్ విద్యనందుకున్న ఒజిబ్వే ట్రైబ్‌కు చెందిన వినోనా లాడ్యూక్ తన జీవితాన్ని వాతావరణ మార్పు సమస్యలపై పోరాటానికి అంకితం చేసింది. స్థానిక అమెరికన్ల భూమి హక్కులు, పర్యావరణ న్యాయంపై కృషి చేస్తున్న పర్యావరణ వేత్త వినోనా లాడ్యూక్. వాతావరణ మార్పును కట్టడి చేసేందుకు పారిస్ ఒప్పందం అమలు చేయాలనీ తక్షణం క్లైమేట్ రక్షణ చర్యలు చేపట్టాలని ప్రపంచ వేదికలపై ప్రజాగళాన్ని వినిపించిన యువ పర్యావరణ వేత్త గ్రేటా థెన్‌బర్గ్. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ సంక్షోభానికి వ్యతిరేకంగా జనాభిప్రాయాన్ని కూడ గట్టడంలో ప్రపంచ యువతకు స్ఫూర్తినిస్తున్నది గ్రేటా.
భారతదేశంలో మహిళలకు పర్యావరణ చైతన్య ప్రతీకలుగా మూడు శతాబ్దాల చరిత్ర ఉంది. చెట్లను కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయని తెగువను 'బిష్ణోరు ఉద్యమం'లో మహిళలు 1700 సంవత్సరంలోనే చూపించారు. రాజస్థాన్‌లోని మేవాడ్ మహారాజు తన కొత్త రాజభవనానికి కలప కోసం సైనికులను పంపితే బిష్ణోరు, కెజార్లీ ప్రాంత మహిళలు వారిపై తిరగబడ్డారు. ఆ ఉద్యమంలో మహిళలకు ముందుండి నాయకత్వం వహించింది అమృతాదేవి. గొడ్డలివేయకుండా చెట్లను కౌగలించు కున్నారు. ఆ క్రమంలో 363 మంది బిష్ణోరు ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మహారాజు దిగిరాక తప్పలేదు. చెట్లకు, జంతువులకు హానికలిగించ రాదని రక్షిత ప్రాంతంగా ప్రకటించాడు రాజు. భారతదేశంలో పర్యావరణ ఉద్యమ తొలి విజయం అది. ఇటీవల 1973లో తెహ్రీ-గరేవాల్, ఛమోలి జిల్లాలో జరిగిన చిప్కో ఉద్యమానికి స్ఫూర్తి బిష్ణోరు ఉద్యమమే! ఇక్కడా మహిళలే ముందున్నారు. సుందర్‌లాల్ బహుగుణ, చండీ ప్రసాద్ భట్ వంటివారితో పాటు గౌరాదేవి, సుధేషాదేవి, బబినీ దేవి ముందుండి నడిపిన ఉద్యమమిది. చెట్ల బోదె (కాండం)లను కౌగలించుకుని చెట్లపై గుత్తేదార్ల గొడ్డలి పడకుండా నిలబడ్డారు. హింస జరిగినా, పోలీస్ కాల్పులైనా వెరువలేదు. శాంతియుత ఆందోళనా మార్గాన్ని వీడలేదు. ఉద్యమం విస్తృతమై విజయం సాధించింది. చిప్కో ఉద్యమ నాయకులెందరినో ప్రోత్సహించి, శిక్షణనిచ్చి, ప్రేరణగా నిలిచిన మరో మహిళా రత్నం 'సరళా బెహన్' అనే గాంధీగారి శిష్యురాలు. 1982లో బీహార్‌లో జరిగిన 'జంగిల్ బచావ్' (అడవులను కాపాడండి!) ఆందోళనకు అక్కడి ఆదివాసులు ముఖ్యంగా మహిళలు నాయ కత్వం వహించి నడిపారు. అడవుల వ్యాపారీ కరణను అడ్డుకున్నారు. ఉత్తర కన్నడ, షిమోగా జిల్లాల్లో జరిగిన 'ఆప్పికో (ఎపిపిఐకెఒ) ఉద్యమం' చిప్కో ఉద్యమానికి దక్షిణ భారతదేశ రూపం. సంప్రదాయ జీవనాన్ని ధ్వంసం చేసి, అడవులను వ్యాపారీకరించడానికి వ్యతిరేకంగా సాగిందీ ఉద్యమం.
1990వ దశకంలో ఆదివాసీలు, రైతులు, పర్యావరణ, మానవ హక్కుల కార్యకర్తలు సాగించిన ఉద్యమం నర్మదా బచావ్ ఆందోళన. దీనికి మేధాపట్కర్, బాబా ఆమ్తే నాయకత్వం వహించారు. పర్యావరణం, నర్మదావాలీ ఆవరణ వ్యవస్థల రక్షణకు మేధాపట్కర్ ఉద్యమించింది. మరో పర్యావరణ స్త్రీవాది వందన శివ. ఆమె నవధాన్యను స్థాపించి విత్తన రక్షణ, వైవిధ్యం, సేంద్రియ వ్యవసాయంపై జాతీయ ఉద్యమాన్ని నడుపుతున్నది. పేటెంట్లు, స్థానిక జన్యువనరుల పరిరక్షణ, భూమిపుత్రుల హక్కులపై పోట్లాడిన మహిళా శాస్త్రవేత్త సుమన్ సహారు. ప్రాదేశిక జన్యువనరుల వ్యాపారంతో వచ్చిన లాభాలలో స్థానికులకు వాటా కల్పించింది. పర్యావరణ ఉద్యమాల్లో మనదేశంలోనైనా, ప్రపంచంలోనైనా మహిళలు ముదుభాగాన ఉండటం గమనార్హం. సుందర్‌లాల్ బహుగుణ వంటి ఉద్యమకారులను సైతం పర్యావరణ మార్గం పట్టించింది ఆయన భార్య విమలనే. వారి పెళ్లికి దీన్నొక షరతుగా పెట్టిన స్త్రీమూర్తి ఆమె. ఇలా ఎందరో మహిళలు పర్యావరణ ఉద్యమ దివ్వెలుగా ఉద్యమ వెలుగులు పంచుతున్నారు.
- ప్రొ|| కట్టా సత్యప్రసాద్
సెల్:949009891