Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంతటి వారైనా సరే, సమకాలీనాన్ని సరిగా నడుపుకోవాలి. భవిష్యత్‌కు దారులు వేసుకోవాలి. అంతేగాని, గతాన్ని అంటే చరిత్రను మార్చడం ఎవరివల్లా కాదు. ఎవరో కాదంటే విశాల భారతదేశాన్ని పరిపాలించిన రాజుల జాబితాలోంచి అక్బరు, షాజహాన్, ఔరంగజేబులు మాయమైపోతారా? హిందువులతో బంధుత్వం కలుపుకుని, పరమత సహనం పాటించిన అక్బర్ 'ద గ్రేట్' కాకుండా పోతాడా? ఇప్పటి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను మారుస్తామంటే మారుతుందా? పాఠ్యపుస్తకాలు మార్చి, కొత్త సిలబస్ పెట్టి పిల్లల మెదళ్ళలో విషం నింపొచ్చు - కానీ, వందల, వేల సంవత్సరాల చరిత్ర మారదు. ఒక పెద్ద ఊరేగింపు వాయిద్యాలతో వస్తుందనుకో- నీకు నచ్చకపోతే ఇంటి తలుపులు బిగించుకుని కూర్చో. అంతేగాని, ఊరేగింపును ఆపే శక్తి నీకు ఉండదు. నీ చేతిలో ఉన్న నీ కాలాన్ని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. అంతేగాని, కాలప్రవాహాన్ని ఆపడం నీ వల్ల కాదు. ఎవరి వల్లా కాదు. చరిత్ర ప్రవాహం లాంటిది. అది అలా ప్రవహిస్తూనే ఉంటుంది. చరిత్ర ఊరేగింపు లాంటిది. అది అలా సాగిపోతూనే ఉంటుంది. నువ్వు అభివృద్ధికి పనిచేసినా, వినాశనానికి పని చేసినా చరిత్రలో భాగమైపోతూనే ఉంటావు. నువ్వు చేసే పని మీద ఆధారపడి చరిత్ర నిన్ను భవిష్యత్ తరాలకు పరిచయం చేస్తుంది. హిట్లర్ ఎలా పతనమయ్యాడన్నది చరిత్ర నమోదు చేసింది. ఇటీవల శ్రీలంకలో మంత్రుల గుడ్డలిప్పి రోడ్డుమీద పడేసిన సంఘటనల్ని కూడా చరిత్ర నమోదు చేసింది. చరిత్రను మార్చే శక్తి ఎవరికీలేదు. ప్రజా రంజకుడివా, ప్రజా ద్రోహివా అన్నది నీ చర్యల ద్వారా చరిత్రలో నిర్ణయమైపోతుంది. చారిత్రిక చిహ్నాలు మార్చుకుంటావా? మార్చుకో! పోయేదేమీ లేదు. అయితే చరిత్ర మారదు. గడచిపోయిన కాలం ముందుకురాదు. ముందుకు పోయిన ప్రవాహం వెనక్కిరాదు. కాలంలో నిక్షిప్తమై ఉన్న డీ.ఎన్.ఏ. చరిత్ర! చరిత్రను విశ్లేషిస్తే గానీ, కాలపు (వి)లక్షణాలు బయటపడవు.
వివాదాస్పదమై ఇప్పుడు చర్చలో ఉన్న 'జ్ఞానవాపి' మసీదు గూర్చి ఆలోచించేముందు బాబ్రీ మసీదు గూర్చి కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలి! పార్లమెంట్లో చర్చించిన తర్వాత 1991లో ప్రార్థనా స్థలాలకు సంబంధించి ఒక చట్టం అమలులోకి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత మత కేంద్రాలు యధావిధిగా కొనసాగాలని ఎలాంటి మార్పులు జరగగూడదని దాని సారాంశం. చట్టాల్ని, రాజ్యాంగాన్ని గౌరవించుకోవడం మన దేశంలో కొందరికి ఇష్టం ఉండదు కదా? అందుకే ఏండ్లకేండ్లుగా బాబ్రీ మసీదును వివాదాస్పదం చేశారు. చివరకు కూలగొట్టారు. ఇప్పుడు రామాలయం కడుతున్నారు. దాని వల్ల ఏం సాధించినట్టూ? ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఒక ఆసుపత్రి లేదా విద్యా సంస్థ, గ్రంథాలయం లాంటిది ఏదైనా కడితే ప్రజలకు ఉపయోగం. కానీ ప్రభుత్వ మేధావులకు అవి పట్టలేదు. దానివల్ల ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు పెరిగేవి. కానీ, ఏలినవారు అలా చేయలేదు. ఒక కల్పిత పాత్రకు భారీ ఎత్తున ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. మనువాదాన్ని నిలబెడుతూ దేశాన్ని వేల ఏండ్లు వెనక్కి నడిపించాలని నిర్ణయించారు.
బాబ్రీ మసీదు కూలగొట్టిన విషయంలో సుప్రీంకోర్టు కొన్ని విషయాలు స్పష్టం చేసింది. 1. రామ్‌లల్లా విగ్రహాలు తెచ్చి కావాలని మసీదులో పెట్టడం అపరాధం. 2. అక్కడ గతంలో రామాలయం ఉందని అనడానికి ఏ ఆధారమూ లేదు. 3. రాముడి జన్మస్థలం అదే అని, నిర్ధారించడానికి ఆధారాలే లేవు. 4. ధర్మం పేరుతో రాజకీయాలు చేయడం మానేయాలి... వంటి విషయాలు నాటి సుప్రీంకోర్టు తీర్పులో ఉన్నాయి. బాబ్రీ మసీదు కూలగొట్టిన తర్వాత, అడుగున నేల పొరల్లో దొరికినవన్నీ బౌద్ధారామాల చిహ్నాలు మాత్రమే! హిందువుల ఆలయ నిర్మాణాలు ఏవీ బయటపడలేదు.
కాశీ విశ్వనాధుని ఆలయం కూలగొట్టి, మొగల్ చక్రవర్తి ఔరంగజేబు జ్ఞానవాపి మసీదు కట్టించాడని అంటున్నారు. అవును! అది ఔరంగజేబు కూలగొట్టాడన్నది నిజమే. ఈ విషయాన్ని చరిత్రకారులు, రచయితలు వారి రచనల్లో నమోదు చేశారు. ఇంతకూ ఔరంగజేబు ఎందుకు కూలగొట్టాడూ? అంటే - తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు కుట్ర చేస్తున్నారనీ, వారు కాశీ ఆలయంలో సమావేశమవుతున్నారని తెలుసుకుని - ఆయన దాన్ని 1669లో కూలగొట్టించాడు. అది విద్రోహశక్తులకు అడ్డాగా మారిందన్న సమాచారంతో అలా చేశాడు. అది హిందూ దేవాలయం కాబట్టి, అక్కడికి ముస్లిం చక్రవర్తి గూఢచారులు, అనుచరులు రారని ఆ కుట్రదారులు బహుశా ఆ స్థలాన్ని ఎంపిక చేసుకుని ఉంటారు. అయినా కుట్రలు బయటపడకుండా ఉంటాయా? ఇవి నేను కల్పించి చెపుతున్న విషయాలు కావు. కె.యన్.ఫణిక్కర్ తన గ్రంథంలో పొందుపరిచిన విషయాలు. పుస్తకాలు చదివి సరైన దృక్కోణంలో అర్థం చేసుకునేవారు ఇలా వివాదాలు సృష్టించరు. ఇదే అంశం మీద స్వాతంత్య్ర సమరయోధుడు పట్టాభి సీతారామయ్య కూడా విపులంగా రాశారు. ఆయన రచించిన 'ఫెదర్స్ అండ్ స్టోన్స్' పుస్తకం చారిత్రక పరిశోధన గ్రంథం కాదు కానీ, అందులో రచయిత ఆనోటా ఆనోటా విన్న కథలు ఏరి ఒక చోట కూర్చాడు. అందులో జ్ఞానవాపి మసీదు గురించిన ప్రసక్తి కూడా ఉంది - దర్శనానికి వచ్చిన ఒక రాణిని ఆలయ పూజారులు, సిబ్బంది అల్లరి చేశారని, దోచుకున్నారని ఔరంగజేబుకు తెలిసి, కోపోద్రిక్తుడై ఆలయం కూలగొట్టించాడని రాశాడు. అయితే ఇదే సంఘటనను ఒక లక్నో యూనివర్సిటీ ప్రొఫెసర్ రవికాంత్ చందన్ ఒక టాక్ షోలో చెపితే, కొందరు ఎబివిపి సభ్యులు ఆయనమీద దాడి చేశారు. పైగా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయించారు. ఇదంతా ఎందుకూ? అంటే ఆ ప్రొఫెసర్ దళితుడు. అలాగే ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రతన్‌లాల్, శివలింగం మీద తన ఆలోచనలు ప్రకటించాడని అరెస్టు చేయించారు. భావ వ్యక్తీకరణకు ఇంతగా విఘాతం కలగడం ఈ దేశంలో ఇంతకు ముందెప్పుడూ జరగలేదు.
దొరికిన ఆధారాలను బట్టి ఔరంగజేబు కాశీ ఆలయాన్ని కూల్చాడు. అయితే అక్కడ మతం, ధర్మం కారణాలు కావు. రాజకీయ, సామాజిక, కారణాలేవో ఉండి ఉంటాయన్నది మనం అర్థం చేసుకోవాలి. అది పక్కన పెట్టి, ప్రజా భావనల్ని గౌరవిస్తూ ఆయన ఎన్నో హిందూ దేవాలయాలకు భూరి విరాళాలిచ్చాడు. జాగీర్లు ఇచ్చాడు. మరి వాటి గూర్చి ఎందుకు మాట్లాడరూ? ఉదాహరణకు ఉజ్జయినీ మహంకాళీ ఆలయం, అస్సాంలో కామఖ్యాదేవి ఆలయం, బృందావన్‌లో శ్రీకృష్ణ మందిరం వంటివన్నీ ఆ చక్రవర్తి ఇచ్చిన విరాళాలతోనే నిలబడ్డాయి కదా? విశ్వంబర్నాథ్ పాండే రచన 'ఫర్మాన్స్ ఆఫ్ కింగ్ ఔరంగ జేబ్' తిరగేయండి. వివరాలన్నీ అందులో ఉన్నాయి. ఇక్కడ మరొక విషయం తప్పక చెప్పుకోవాలి. ఆలయాలనే కాదు, ఔరంగజేబు ఒక మసీదును కూడా కూలగొట్టించాడు. ఎందుకూ అంటే? గోలకొండ రాజు తానీషా, చక్రవర్తికి కట్టాల్సిన కప్పం మూడేండ్లు కట్టలేదు. ధనం చాలా మొత్తంలో ఆగిపోయింది. గోలకొండ మసీదు నేలమాళిగలో ధనరాసులు నిలువ ఉన్నాయని ఔరంగజేబు తెలుసుకున్నాడు. సైన్యాన్ని పంపి, మసీదు కూలగొట్టించి, ధనం తెప్పించుకున్నాడు. ఇప్పటి ఈ అతి మేధావుల వితండ వాదాలు పక్కన పెట్టి, ఆనాటి స్థితిగతుల గూర్చి ఒకసారి సంయమనంతో, సమదృష్టితో ఆలోచించగలగాలి. జరిగిన పొరపాట్లు భూతద్దంలో చూపడం, చేసిన మంచిని అసలే గుర్తించకపోవడం కుసంస్కారులకే సాధ్యం!
రిచర్డ్ ఈటెన్ అనే ఆర్కియాలజిస్ట్, చరిత్ర కారుడు గుళ్ళను ఎవరెవరు ఎందుకు కూలగొట్టారన్నది వివరంగా రాశాడు. సారాంశం ఏమిటంటే... వాటిలో బంగారం, వెండి, ధనం ఉండేవనీ, వాటిని దోచుకోవడానికే ఎక్కువ విధ్వంసాలు జరిగాయి తప్పిస్తే... అన్నీ మతం కారణంగానే కాదు. హిందూ రాజులే హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. తమ ఆధిపత్యం, పైచేయి నిలుపుకోవడానికి అలా చేసేవారు. అంతే కాని గుళ్ళ ధ్వంసం వెనక మతం లేదు. వక్రీకరించేవారు వక్రీకరిస్తారు. అది వేరే విషయం! అభిరుచి ఉన్నవారు 1995 డిసెంబర్ 1996 జనవరి ఫ్రంట్ లైన్ ఇంగ్లీషు పత్రిక సంచికలు తిరగేయొచ్చు. రిచర్డ్ ఈటెన్ ఈ విషయాలు చాలా విపులంగా రాశారు. 'వైర్' పత్రిక కూడా ఆయన వ్యాసాలు ప్రచురించింది. హర్షదేవుని కాలంలో 'దేవోత్పతన్ నాయక్' అనే అధికారిని నియమించేవారు. దేవోత్పతన్ - అంటే దేవీదేవతల విగ్రహాలు విరగ్గొట్టి రావడమే అతని విధిగా ఉండేది. ఈ విషయం కవి కల్హణ రచన ''రాగ తరంగిణి''లో ఉన్నట్లు చరిత్రకారులు చెపుతున్నారు. మరోవైపు శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ దేవాలయాలు పునరుద్ధరించిన విషయం ఈ అతిమేధావులు మరిచారు.
ఇటీవల జరిగిన ఒక దుర్మార్గం ఏమిటంటే... ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం- టూరిస్ట్ స్థలాల జాబితాలోంచి తాజ్‌మహల్‌ను తొలగించింది. అది అట్లా ఉంచితే, మసీదుకు 'జ్ఞానవాపి' అనే పేరు ఉందేమని చాలామందికి అనుమానం వస్తుంది. కానీ ఆరోజుల్లో అక్కడ 'జ్ఞానవాపి' పేరుతో ఒక బావి ఉండేది. దాన్ని ఆనుకుని ఉన్న మసీదు కాబట్టి, దాన్ని జ్ఞానవాపి మసీదు అని అన్నారు. అంతే!!
ఇక్కడ భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మాట గుర్తు పెట్టుకోవాలి! భాక్రానంగల్ ప్రాజెక్టు ప్రారంభిస్తూ ఆయన ఆధునిక దేవాలయాలకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. ప్రాజెక్టులు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులే నవీన భారతదేశానికి సరికొత్త 'దేవాలయాల'ని ఆయన అన్నారు. ఆధునిక సమాజాన్ని పురోగమనం వైపు తీసుకుపోవాలంటే వీటి అవసరమే ఉందనీ - మతపరమైన ప్రార్థనా స్థలాల అవసరం లేదని - ఆయన చెప్పకనే చెప్పారు. ఆ స్థాయిని అందుకోలేని చదువురాని సన్యాసులు లింగాల వెంట పడుతున్నారు. దర్గాల కింద, మసీదుల కింద తమ జీవితాలు నలిగిపోతున్నట్టుగా గగ్గోలు పెడుతున్నారు. ఈ దేశం ఒక రాజకీయ పార్టీకి చెందింది కాదు. ఒక మతం, ఒక ధర్మం పాటించే వారిది కాదు. ఒక భాష మాట్లాడేవారిది కూడా కాదు. పాలు, నీళ్ళు, చక్కెర, టీపొడి అన్నీ కలుపుకున్న మిశ్రమ పానీయం సోషలిస్ట్ - చారు - ఈ దేశ సంస్కృతి! చారు అమ్మానని చెప్పుకు తిరిగే వాడికి కనీసం ఆ కాన్సెఫ్ట్ తెలియక పోతే ఎలా? కాశీ విశ్వనాధుని ఆలయం మెట్లమీద కూర్చుని హిందూ దేవతలకు మేలుకొల్పుగా ప్రఖ్యాత సంగీత కారుడు బిస్మిల్లాఖాన్ వేకువ జామున షహనాయి వాయిస్తుండేవాడు. అది కదా ఈ దేశ సంస్కృతీ? భారతీయత - అన్నదానికి ఇంకా ఏ వ్యాఖ్యానమూ అఖ్ఖరలేదు. మేరా భారత్ మహాన్!
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త