Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఎజెండానే దేశ ఎజెండా కావాలంటున్నారు. అందుకోసం తాను రూపొందిస్తున్న కార్యాచరణలో తెలంగాణ ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. భవిష్యత్ ఉజ్వల భారతావని నిర్మాణానికి తెలంగాణ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రం వైఖరి పైన ఒక్కో అంశాన్ని వివరించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి చెందకుండా వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశానికే రోల్ మోడల్‌గా మారిన తెలంగాణపై వివక్ష ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
75ఏండ్ల స్వతంత్రం తర్వాత ఇంకా మన దేశాన్ని దారిద్య్రబాధ ఎందుకు పీడిస్తున్నది? సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టంచేసే ప్రజలుండీ వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరు? దేశాన్ని నడిపించడంలో వైఫల్యం ఎవరిది? విజ్ఞులైన దేశ పౌరులు ఈ విషయాలపైన లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఐదేండ్లకోసారి జరిగే అధికార మార్పిడి కాదు ముఖ్యం. అధికార పీఠం మీదికి ఒక కూటమి బదులు మరో కూటమి ఎక్కడం కాదు కావాల్సింది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి. దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలి. ప్రజల జీవితాల్లో మౌలికమైన పరివర్తన తేవాలి. దేశంలో గుణాత్మక మార్పు రావాలి.
''విద్వేష రాజకీయాలతో దేశం విలవిలాడుతున్నది. మనలాగే స్వాతంత్య్రం సాధించుకున్న దేశాలు సూపర్ పవర్లుగా ఎదుగుతుంటే మనం కులాలు, మతాల రాజకీయాలతో కొట్టుకుచస్తున్నారు.. మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరం. విచ్ఛిన్నకర శక్తులు ఇదేవిధంగా పెట్రేగి పోతే సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది. అశాంతి ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు సరికదా ఉన్న పెట్టుబడులు వెనక్కు మళ్లే విపత్కర పరిస్థితి దాపురిస్తుంది. వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్న కోట్లాదిమంది ప్రవాస భారతీయుల మనుగడకూ ముప్పు వాటిల్లుతుంది'' అంటున్న కేసీఆర్ వ్యాఖ్యలు ఆలోచించదగినవి.
ఇప్పుడు దేశ ప్రజలకు కావాల్సింది కరెంటు, మంచినీళ్ళు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. దేశం ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యవహార శైలి పట్ల బేధాభిప్రాయాలు ఉండవచ్చు. ఆయన మాటలకూ చేతలకూ పొంతన ఉండకపోవచ్చు. కానీ ఆయన వెలుబుచ్చిన ఆకాంక్షలు మాత్రం వాస్తవ రూపం దాల్చాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే కేసీఆర్ చెపుతున్న గుణాత్మక మార్పు సాధ్యమవుతుంది.
అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందాల్సి ఉంది. పార్టీల మధ్య సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉండొచ్చు. కానీ ప్రత్యర్థి పార్టీలుగా చూసే విధానం మంచిది కాదు. ఎన్నికలకు ఇంకా రెండేండ్ల సమయం ఉన్నప్పటికీ అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, సంయమనం కోల్పోయే నేతల తిట్ల పురాణం రాజకీయాలపై అసహ్యం కలిగేలా చేస్తున్నాయి. ఇన్నాళ్లూ విశ్వసనీయత లేనివాడు కేసీఆర్ అని ఆయన రాజకీయ ప్రత్యర్థులు అనే వారు. ఇప్పుడు అవినీతి పరుడు కూడా అంటున్నారు. తెలంగాణను దోచుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ప్రచారాన్ని కేసీఆర్ ఎలా తిప్పి కొడతారో చూడాలి.
మరోవైపు ప్రాంతీయ పార్టీల నేతల మధ్య ఐక్యతను తీసుకురావడం అనుకున్నంత ఈజీ కూడా కాదు. విపక్ష పార్టీల బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని ప్రజల ముందుకు వెళ్లడం, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, ప్రజలను సంఘటిత పరచడం కేసీఆర్ ముందున్న పెద్ద సవాల్. అన్నిటికీ మించి దేశానికి తెలంగాణ దిక్సూచి అంటూ ఇన్నాళ్లుగా చెబుతూ వచ్చిన పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. అప్పులు పుట్టక ప్రాజెక్టులు పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి. మరోవైపు అభివృద్ధి పనులు బిల్లుల కోసం కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు ఆందోళనకు దిగుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మనది ధనిక రాష్ట్రం అని కేసీఆర్ ఆన్న మాటలను ఉటంకిస్తూ రాష్ట్రాన్ని అప్పులపాల్జేశారన్న విమర్శలు జోరందుకున్నాయి. ఈ పరిస్థితిని సీఎం కేసీఆర్ ఎలా చక్కదిద్దుతారు అని ప్రజలు చూస్తున్నారు. అర్జంటుగా సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవాలి. లేకపోతే కేసీఆర్‌కు పాలించడం రాదని ప్రచారం జరిగే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే తెలంగాణ బాగు చేయలేని వాడు దేశాన్ని ఎలా ఉద్ధరిస్తాడు.. అంటూ సాగే ప్రశ్నల పరంపరను సీఎం కేసీఆర్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్ని ప్రతికూలతలు, అడ్డంకు లను అధిగమించి సీఎం కేసీఆర్ తను అనుకుంటున్న లక్ష్యానికి ఎలా చేరుతారు. జాతీయ రాజకీయా లను ఎలా ప్రభావితం చేస్తారు అన్న విషయాల పట్ల రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.
- వంగర మహేందర్‌రెడ్డి
సెల్:9963155523