Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామజన్మభూమి ఆందోళన సందర్భంగా, విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూత్వ సంస్థలు ఒక నినాదాన్ని లేవనెత్తాయి. ''అయోధ్య కేవలం ప్రారంభం మాత్రమే. మథుర, కాశీలు ఇంకా మిగిలే ఉన్నాయి'' అనేది ఆ నినాద సారాంశంగా ఉంది.
అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న చోటనే రామాలయాన్ని నిర్మించేందుకు జరిగిన యుద్ధంలో గెలుపొందిన అనంతరం.. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి రెండేండ్లు కూడా తిరగకుండానే ఇవే శక్తులు... కాశీ, మథుర ఆలయాల కోసం ఘర్షణ మొదలెట్టాయి. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గాలు ఇప్పుడు వారి లక్ష్యాలుగా ఉన్నాయి. 17వ శతాబ్దంలో అప్పుడు ఉన్న ఆలయాలపై ఈ మసీదులను నిర్మించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనా కాలంలో ఇదంతా జరిగిందన్నది చారిత్రక వాస్తవంగా ఉంది.
ఆర్ఎస్ఎస్, హిందూత్వ శక్తులకు సంబంధించినంత వరకు, చరిత్రలో జరిగిన తప్పులను సరిదిద్దాలన్నది వారి ప్రాధాన్యతగా ఉంది. చరిత్రపై వారి పచ్చకామెర్ల కోణంలో నుండి చూడడం ద్వారా, ముస్లింల పాలన అంటే హిందువులకు బానిసత్వం వంటిదని, అందువల్ల ఈ బానిసత్వ సంకేతాలన్నింటినీ పూర్తిగా తుడిచిపెట్టాల్సి ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాశీ, మథురలను స్వాధీనం చేసుకు నేందుకు ప్రారంభ సమీకరణ మొదలు పెట్టారు. అయితే రెండు చోట్లా మసీదుల అస్తిత్వానికి, గతంలో ఉన్న ఆలయాల చట్టబద్ధతను పునరుద్ఘా టించేందుకు చట్టపర మైన సవాళ్ళతో ఈ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
ఫలితంగా, కాశీ విశ్వనాథ్ ఆలయం-జ్ఞాన్వాపి మసీదు సముదాయం, కృష్ణ జన్మభూమి ఆలయం-ఈద్గా భూమి ఈ రెండు అంశాలపై వారణాసి, మథుర కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటితో పాటు, ఢిల్లీలోని కుతుబ్ మినార్‌లో, మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల సముదాయంపై, ఆగ్రాలోని తాజ్ మహల్‌పై... శిల్పాలు, విగ్రహాల బొమ్మలు ఉండడంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఇటువంటి విచ్ఛిన్నకర, తిరోగమన వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టేందుకై పి.వి.నరసింహారావు ప్రభుత్వ హయాంలో మతపరమైన ప్రార్ధనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టాన్ని (1991) పార్లమెంట్ రూపొందించింది. ఈ చట్టంలోని సెక్షన్ 3 ఆరాధనా స్థలాల మార్పిడిని పూర్తిగా నిరోధిస్తోంది. 1947, ఆగస్టు 15 నాటికి దేశంలో ఆనాడు ఉన్న ప్రార్ధనా స్థలాల మతపరమైన స్వభావాన్ని ఆలాగే కొనసాగించాలని సెక్షన్ 4(1) పేర్కొంటోంది. పైగా, ప్రార్ధనా స్థలాల మతపరమైన స్వభావాన్ని మార్చేందుకు తాజాగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టరాదని సెక్షన్ 4(2) చెపుతోంది. ఇందుకు సంబంధించి ఎలాంటి పెండింగ్ కార్యకలాపాలు ఉన్నా వాటిని అలాగే నిలిపివేయాలని పేర్కొంటోంది. అయితే రామ జన్మభూమి వివాదానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. అప్పటికే ఆ స్థలం ఎవరిదనే అంశంపై కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలైనందున దాని విషయంలో మినహాయింపు అమలైంది.
ఇక జ్ఞాన్వాపి మసీదు కేసులో, మసీదు సముదాయంలోని ''మా శృంగేరి గౌరి'' విగ్రహం వద్ద పూజలు చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ ఐదుగురు హిందూ మహిళలు వారణాసిలోని సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరుపుతూ మసీదు ఆవరణను పూర్తిగా వీడియో తీయాల్సిందిగా సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన ప్రార్ధనా స్థలాల చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఈ ఆదేశాలు ఉన్నాయి. ప్రస్తుతమున్న ప్రార్ధనా స్థలాల స్వభావాన్ని మార్చే లేదా దెబ్బతీసే చర్యలను అనుమతించరాదని ఈ చట్ట నిబంధనలు పేర్కొంటున్నాయి. మసీదు ఆవరణలోని సరస్సులో శివలింగం దొరికిందన్న వార్త కూడా మీడియాకు లీకయింది. కానీ అది ఫౌంటెయిన్ నిర్మాణమని మసీదు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
వారణాసిలోని సివిల్ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మసీదు అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రార్ధనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నందున ఈ పిటిషన్‌ను అనుమతించ వద్దని వారు సుప్రీం కోర్టును కోరారు. అయినా వీడియోగ్రాఫిక్ సర్వేను కోర్టు నిలుపుచేయలేదు. ప్రార్ధనా స్థలాల చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తోందంటూ ఆ పిటిషన్‌ను నిలువరిం చేందుకు జోక్యం చేసుకోలేదు. ''ఒక స్థలం మతపరమైన స్వభావ నిర్థారణను చట్టం ద్వారా నిలువరించలేం'' అని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. అటువంటి వైఖరి, 2019లో అయోధ్య వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. ఆనాడు కోర్టు తన తీర్పులో ఈకింది విధంగా పేర్కొంది...
''చట్టమనేది ప్రభుత్వానికి, దేశంలోని ప్రతి ఒక్క పౌరునికి చెందినది. చట్టాన్ని రూపొందించడం ద్వారా ప్రభుత్వం రాజ్యాంగ నిబద్ధతను అమలు చేస్తుంది. రాజ్యాంగం మౌలికాంశాల్లో భాగమైన అన్ని మతాల సమానత్వాన్ని, లౌకికవాదాన్ని పరిరక్షించా లన్న రాజ్యాంగ కర్తవ్యాలను చట్టం అమలు చేస్తుంది. భారత రాజ్యాంగం కింద లౌకికవాదం పట్ల మా నిబద్ధతను ప్రకటించే దిశగా ప్రార్ధనా స్థలాల చట్టం తిరుగులేని కర్తవ్యాన్ని నిర్దేశిస్తోంది. అందువల్ల, రాజ్యాంగం మౌలిక స్వభావంలో ఒకటైన, రాజకీయాల లౌకికవాద స్వభావాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన శాసనపరమైన సాధనమే ఈ చట్టం. ప్రార్ధనా స్థలాల చట్టమనేది... మన లౌకిక విలువల అతి ముఖ్యమైన స్వభావంగా ప్రగతి శీలతను సంరక్షించే శాసనపరమైన జోక్యమే.''
ప్రార్ధనా స్థలాల చట్టం చెల్లుబాటును ఇంత స్పష్టంగా వివరించిన నేపథ్యంలో ఆ చట్ట నిబంధనలను పరిరక్షించేందుకు కోర్టు నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోవడం, వారణాసిలోని సివిల్ కోర్టులో గల పిటిషన్‌పై విచారణను తిరస్కరించడమనేది నిరాశ కలిగిస్తోంది. పైగా, అందుకు బదులుగా, జిల్లా స్థాయిలో సీనియర్ న్యాయమూర్తి అంటే వారణాసి జిల్లా న్యాయమూర్తి సంబంధిత పిటిషన్లను విచారించాలని కోర్టు ఆదేశించింది. ఒక స్థలం మతపరమైన స్వభావాన్ని నిర్థారించే ప్రక్రియ చేపట్టడమంటేనే వరుసగా లీగల్ చర్యలు వరదలా వెల్లువెత్తడానికి మార్గం తెరవడమే. పైగా, రెండు కమ్యూనిటీల మధ్య సంబంధాలపై కూడా ఇది ప్రభావం చూపుతుంది.
కాశీ, మథురల్లోని ప్రార్ధనా స్థలాల స్వభావాన్ని మార్చేందుకు చట్టపరమైన సవాళ్ళకు వెసులుబాటు కల్పించడంలో న్యాయ వ్యవస్థలోని కింది స్థాయి శక్తులు కొన్ని కుమ్మక్కవడం వల్ల ఈ పరిస్థితి మరింత సంక్లిష్టమవుతోంది. మథురలో, కింది స్థాయి కోర్టు నిర్ణయాన్ని జిల్లా న్యాయమూర్తి తిరస్కరించారు. మసీదు నిర్మించిన భూభాగం యాజమాన్య హక్కులను కోరుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి ట్రస్టు, ఇతర సంస్థలు చేసుకున్న అప్పీల్‌ను అనుమతించారు. చట్టం రూపొందడానికి ముందుగా నిర్ణయమైన అప్పీళ్ళు, చట్టాలు, చర్యలు, కార్యకలాపాలకు ఈ చట్టం వర్తించబోదని ఈ చట్టంలోని క్లాజునే ఆశ్రయించడం ద్వారా న్యాయమూర్తి ఈ రకంగా వ్యవహరించారు. ఆలయ, మసీదు యాజమాన్యాలకు ప్రాతినిధ్యం వహించే రెండు పక్షాల మధ్య 1974లో కుదిరిన రాజీ ఒప్పందాన్ని ఈ పిటిషన్ సవాలు చేస్తోంది.
ఒకపక్క అసాధారణ రీతిలో ధరల పెరుగుదల, ఇతర ఆర్థిక ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్న సమయంలో వారి దృష్టిని మళ్ళించేందుకే ఇలా ఆలయం-మసీదు వివాదా లను రెచ్చగొడుతున్నారని పలువురు వ్యాఖ్యాతలు, రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఫలితాలను రాబట్టగల రీతిలో ఇలా ప్రజల్లో చీలికలకు చోటు కల్పించే అంశాలను లేవదీసేందుకు భూమికను సిద్ధం చేస్తున్నారని మరో అభిప్రాయం వినవస్తోంది. ఇవన్నీ నిజమే అయినా, అంతకంటే మరింత ప్రమాదకరమైన మరో ధోరణిని వీరు పట్టించుకోవడం లేదు. అదే బీజేపీ-ఆర్ఎస్ఎస్ కూటమి తమ హిందూత్వ ఎజెండాకు అనుగుణంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేలా, ఈ ఎజెండాకు సంబంధించిన అన్ని అంశాలను అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోందనేది మరో కారణంగా కనిపిస్తోంది.
ఏ ఇతర ఎన్నికలు లేదా రాజకీయ చర్యల కన్నా ఈ సవాలు మరింత ప్రధానమైనది. బీజేపీని వ్యతిరేకించే శక్తులు ఎంత త్వరగా దీన్ని గ్రహిస్తే దేశానికి అంత మేలు చేకూరుతుంది.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)