Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల జరిగిన రెండు సంఘటనలు బీజేపీ తలపెట్టిన హానికరమైన మత విభజన, మోసాలను బహిర్గతం చేయడమే కాక, సంఫ్‌ుపరివార్ అవిశ్రాంతంగా చేసిన ప్రచారంతో బలపడిన రెండు మతాల మధ్య అసహనాన్ని కూడా బయట పెట్టాయి. మహిళలకు, కుల మతాలను కాదని పెళ్ళి చేసుకునే స్వేచ్ఛను నిరాకరించడం పురాతన భారతీయ సామాజపు ఒక లక్షణం. వర్ణాశ్రమ ధర్మం ఉనికి ప్రమాదంలో పడుతుంది కాబట్టి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కును మహిళలకు నిరాకరించడం జరుగుతోంది.
మే 8న, తెలంగాణ రాష్ట్ర డీఎస్ఎంఎం అధ్యక్ష, కార్యదర్శులైన జాన్ వెస్లీ, స్కైలాబ్ బాబుతో కలిసి వికారాబాద్ జిల్లాలోని మారేపల్లి గ్రామానికి వెళ్ళాను. మే 4న అదే గ్రామంలో మాల కులానికి చెందిన నాగరాజును, అతడు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆశ్రిన్ సుల్తానా బంధువులు హత్య చేశారు. కలిసి చదువుకున్న వారిరువురూ చాలా సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఆశ్రిన్ సోదరుడు, మోబిన్ వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించి, ఆమెను పలుమార్లు కొట్టాడు. జనవరి 30 న, ఆశ్రిన్ ఇల్లు వదిలి వెళ్ళి, మరుసటి రోజు ఆర్య సమాజ్ గుడిలో నాగరాజును పెళ్లి చేసుకొని, తన పేరును 'పల్లవి' అనే హిందూ పేరుగా మార్చుకుంది. ఈ యువ జంట హైదరాబాద్‌లోని సరూర్ నగర్లో కలిసి జీవనం సాగిస్తున్నారు. నాగరాజు ఒక ఆటోమొబైల్ షోరూంలో పని చేస్తుండేవాడు. ఆశ్రిన్ సోదరుడు మోబిన్ ఈ జంటను క్షమించకుండా, వారు ఎక్కడ నివాసం ఉంటున్నారో తెలుసుకున్నాడు. మే 4న మధ్యాహ్నం అతడు, తన బావమరిదితో కలిసి, ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్తున్న యువజంటను పలకరించాడు. వాస్తవానికి నాగరాజు తన భార్యను రంజాన్ పండుగ నిమిత్తం షాపింగ్‌కు తీసుకొని పోతున్నాడు. హంతకులు యువ జంటను వాహనం దిగమని, నాగరాజుపై ఇనుపరాడ్, కత్తితో దాడి చేశారు. ఇది పట్టపగలు జనం రద్దీగా ఉన్న ప్రాంతంలో జరిగింది. కానీ ఏ ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు రాకుండా, మొబైల్ ఫోన్లతో జరుగుతున్న సంఘటనను వీడియో తీశారు. హంతకులతో ఆశ్రిన్ పులిలాగ పోరాడినా గానీ, నాగరాజును కాపాడుకోలేక పోయింది.
ఏమాత్రం ఆలస్యం లేకుండా, భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంఘాలు ''హిందువులంతా మేల్కోవాలి'' అనే బ్యానర్లతో నిరసన కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహించారు. అప్పటి నుండి వారు మత విద్వేషాలను రెచ్చగొట్టి, దళితుల్లో మత ప్రచారం చేపట్టడానికి చేయని ప్రయత్నంలేదు. నాగరాజుకు తన గ్రామంలోని దళితవాడలో ఒక చిన్న గుడిసె ఉంది. ఆ ప్రాంతమంతా పూర్తిగా విషాదంలో మునిగిపోయింది. ఆశ్రిన్‌ను మే 5వ తేదీ ఉదయం పోలీసులు అక్కడికి తీసుకొని వచ్చారు. ఆశ్రిన్, నాగరాజు ఇంటికి రావడం, అతని తల్లిదండ్రులను కలవడం మొదటిసారి. మేము ఆ గుడిసెలోకి వెళ్ళినపుడు, ఆశ్రిన్, ఆమె అత్తగారు అనసూయ ఇరువురు బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉన్నారు. మేము వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తూ, అక్కడే చాలాసేపు కూర్చున్నాం. ఆశ్రిన్ హిందుస్థానీ తెలుగులో చాలా చక్కగా మాట్లాడింది. తనకు న్యాయం తప్ప మరేమీ అవసరం లేదని అంటూ, తన సోదరుడు, అతని బావమరిదిని చాలా కఠినంగా శిక్షించాలని కోరుకుంది. కానీ నిర్లక్ష్యం వహిస్తున్న ఈ ప్రభుత్వం వారిని వదిలి వేస్తుందని ఆమె భయపడింది. అలాంటి హింసాత్మక సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండే విధంగా కఠినమైన చట్టాలను తేవాలని ఆమె డిమాండ్ చేసింది. పరువు హత్యలకు వ్యతిరేకంగా చట్టాలను తేవాలని అఖిల భారత మహిళా సమాఖ్య(ఐద్వా) ఏనాడో ముసాయిదా చట్టాలను తయారు చేసిందని, కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వాలు ఆ చట్టాలను నిర్లక్ష్యం చేశాయని ఆమెకు చెప్పాను. అనసూయ కూడా తన కొడుకు హత్యకు గురికావడం పట్ల ఆగ్రహం, బాధను వ్యక్తం చేసింది. కానీ ఆమె ఆశ్రిన్ పట్ల ఆప్యాయతను వ్యక్తం చేస్తూ, తమకు కొడుకైనా, కూతురైనా ఆశ్రినే అని అభిప్రాయపడింది.
బంధువులు (నాగరాజు తరపు) తన పట్ల ప్రేమానురాగాలు చూపుతూ, అండగా ఉంటామని చెపుతుండగా, గ్రామంలో అంతర్గతంగా తాను ముస్లిం కాబట్టి, తన కారణంగానే నాగరాజు హత్యకు గురయ్యాడు కాబట్టి, తనను బయటకు వెళ్లగొట్టాలనే ప్రచారం బీజేపీ ప్రేరణతో సాగుతుందని ఆశ్రిన్ నాతో హిందుస్థానీలో నెమ్మదిగా చెప్పింది. తిరిగి వెళ్ళే ముందు, తామంతా ఆశ్రిన్‌కు, నాగరాజు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పిన అనేకమంది గ్రామస్థులతో మేము మాట్లాడాం.
ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆశ్రిన్‌ను గానీ, నాగరాజు కుటుంబాన్ని గానీ ఏ ఒక్కరూ కలవలేదు. మోబిన్ అతని బావమరిదిని అరెస్ట్ చేయడంలో పాలనా వ్యవస్థ చురుకుగా ఉండగా, పాలక టీఆర్ఎస్ నాయకులెవరూ మారేపల్లిని సందర్శించలేదు. బీజేపీ మాత్రం తన ప్రచారంలో అవిశ్రాంతంగా పని చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రిన్, నాగరాజు తల్లిదండ్రులకు పరిహారం చెల్లించాలని, ఆశ్రిన్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఆ కుటుంబానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) డిమాండ్ చేసింది.
మే 12వ తేదీన, ఉత్తర ప్రదేశ్ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు భరత్ సింగ్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తోమర్, ఐద్వా నాయకులు కిరణ్, రాజేంద్రీ, సరోజ్లతో కలిసి నేను ఆగ్రా సందర్శించి, ఏడీజీని, జిల్లా మెజిస్ట్రేట్‌ను కలిశాను. మా వెంట, ఏప్రిల్ 12న ఢిల్లీ ఆర్యసమాజ్ మందిరంలో రితికా జైన్‌ను పెళ్లి చేసుకున్న సాజిద్ సోదరుడు మత్లూబ్, తండ్రి అబ్దుల్ ముఘానీలు కూడా ఉన్నారు. ఈ యువ జంట కలిసి చదువుకున్నారు. ఐదు సంవత్సరాలకు పైగా ప్రేమించుకున్నారు. సాజిద్ ఒక జిమ్‌ను నిర్వహిస్తున్నాడు. రితికా కుటుంబ సభ్యులు ఆమెను చదువు మాన్పించి, పెళ్లి చేయాలని అనుకునే సమయంలో ఆమె చదువుకోడానికి సాజిద్ సహాయం చేస్తున్నాడు. వారు పెళ్లి చేసుకోడానికి ముందు ఆమె తల్లిదండ్రులకు వారి మధ్య ఉన్న సంబంధం గురించి తెలియడంతో, ఏప్రిల్ 11న తండ్రి ఆమెను విపరీతంగా కొట్టి, ఆమె మొబైల్ ఫోన్ లాక్కున్నాడు. ఏదో విధంగా ఆమె ఇంటి నుండి బయటకు వచ్చి, సాజిద్ జిమ్‌కు వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికి వెళ్ళలేనని చెప్పడంతో, సాజిద్ ఆమెను తీసుకొని ఢిల్లీ వెళ్లాడు. సాజిద్, రితికా కొంతమంది న్యాయవాదులను సంప్రదించి, ఏప్రిల్ 12న ఆర్య సమాజ్ మందిరంలో పెళ్లి చేసుకున్నారు. తాను మేజర్ కాబట్టి సాజిద్‌ను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని చెపుతూ ఒక వీడియో తీసింది. సాజిద్ కూడా తాను హిందూ మతంలోకి మారానని, ఇప్పుడు తన పేరు సాహిల్ అని ఆ వీడియోలో పేర్కొన్నాడు.
ఈ క్రమంలో ఏప్రిల్ 11 సాయంత్రం రితికా తండ్రి, సాజిద్ తండ్రిని జిమ్ వద్ద కలిసి, తెల్లారి ఉదయానికి తన కూతురుని అప్పగించకుంటే పరిణామాలు చాల తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు. తరువాత తన కూతురుని ఎత్తుకెళ్లాడని ఆరోపిస్తూ, సాజిద్‌పై కేసు నమోదు చేయించాడు. సాజిద్ ఫోన్ నెంబర్‌ను పోలీసులకు ఇచ్చాడు. ఏప్రిల్ 12వ తేదీన పోలీసులు వారి పెళ్లి అయిన తరువాత సాజిద్‌తో మాట్లాడారు. మరుసటి రోజు తామిరువురమూ తీస్ హజారీ కోర్టులో పోలీసులకు లొంగిపోతామని సాజిద్ పోలీసులకు చెప్పాడు. ఏప్రిల్ 13న పోలీసులు రితికాను ఆగ్రాకు తీసుకొని వచ్చారు. కానీ సాజిద్‌ను మాత్రం ఢిల్లీలోనే వదిలేసారు. తన తల్లిదండ్రులతో వెళ్ళడం ఇష్టం లేదని రితికా మేజిస్ట్రేట్‌కు స్టేట్మెంట్ ఇచ్చింది. తరువాత ఆమెను ఆగ్రాలోని ఒక షెల్టర్‌కు తీసుకొని వెళ్ళారు, కొన్ని రోజుల తరువాత మధుర తీసుకుని వెళ్లారు.
రితికా దొరికింది, ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలన్నీ ప్రజలకు తెలిసినప్పటికీ, స్థానిక బీజేపీ నాయకులు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో పంచాయతీ పెట్టించారు. ఈ రెండు కుటుంబాలకు చెందిన వారు ఆగ్రాలో భాగంగా ఉన్న గ్రామీణ ప్రాంతమైన రన్కటలో ఉంటారు. ఈ పరిణామాల మధ్య సాజిద్ కుటుంబం ఇల్లును వదిలి ఎక్కడో తలదాచుకుంది. ఏప్రిల్ 15 ఉదయం మరొక పంచాయతీ పెట్టారు. అక్కడికి చేరుకున్న వారంతా సాజిద్ కుటుంబం పైన, అతని బంధువుల పైన దాడి చేశారు. డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులను లూటీ చేశారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి, ఇండ్లకు నిప్పు పెట్టారు. ఈ విధ్వంసం పూర్తయిన తర్వాత ఆ గుంపు సాజిద్ జిమ్‌కు వెళ్లి, అక్కడున్న మెషీనరీని, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు.
మనోవేదనను అనుభవించిన సాజిద్ కుటుంబం ఏకాకిగా మిగిలింది. అఖిల భారత మహిళా సమాఖ్య సభ్యులు వారి ఇంటిని సందర్శించారు, షెల్టర్‌లో ఉన్న రితికా ను కూడా వారు కలిశారు. సీపీఐ(ఎం) సభ్యులు సాజిద్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఏప్రిల్ 12న మేము పోలీసులు, పాలనాధికారులతో మాట్లాడితే, తాము అన్ని విధాలా సహకరించి, సహాయపడతామని హామీ ఇచ్చారు. సాజిద్ కుటుంబానికి సంబంధించిన ఇళ్ళపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేశారు కానీ వారు చేసిన నష్టానికి పరిహారాన్ని కట్టించలేదు. కొన్ని లక్షల రూపాయిలు నష్టపోయిన బాధితులకు ఏ విధమైన నష్టపరిహారాన్నీ చెల్లించలేదు. ముఖ్యంగా, భవిష్యత్తులో దాడులు చేస్తారేమోననే భయంతో రితికాను తన భర్త వద్దకు తిరిగి తెచ్చుకునే విధంగా వారు న్యాయపరమైన సహాయాన్ని కూడా తీసుకోలేక పోతున్నారు. ధ్వంసమైన వారి ఇండ్లను, సాజిద్ జిమ్‌ను కూడా మేం సందర్శించి, కుటుంబ సభ్యులను కూడా కలిశాం. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఇప్పుడు వారికి న్యాయపరమైన సహాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
ఈ రెండు సంఘటనలూ యువ జంటల మధ్య ఉండే ప్రేమను, రెండు మతాల మధ్య ద్వేషభావాలను రెచ్చ గొట్టడానికి సంఫ్‌ుపరివార్ శక్తులు ఎలా ఉపయోగించు కుంటాయో తెలియజేస్తాయి. మన సమాజంలో మతతత్వ, పితృస్వామిక భావనలు కూడా ఎంత బలంగా ఉన్నాయనే విషయాన్ని కూడా పై రెండు సంఘటనలు తెలియ జేస్తాయి. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు అటకెక్కించిన కుల, మత దురహంకార హత్యల వ్యతిరేక చట్టాలు ఎంత అవసరమో కూడా ఈ రెండు ఘటనలు తెలియజేస్తున్నాయి.
- సుభాషిణీ అలీ
అనువాదం: బోడపట్ల రవీందర్,
9848412451