Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజల నుంచి పన్నుల ద్వారా రాబట్టిన సొమ్మును, తిరిగి వినియోగించేటప్పుడు ప్రతి రూపాయీ సద్వినియోగం అయ్యేలా చూడడం ప్రభుత్వాల విధి. నిధుల మంజూరీ, విడుదలతో పాటు అవి ఏ రీతిన ఖర్చవుతున్నాయి అనే విషయాన్ని కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తూ ఉండాలి. ఆ వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసే పారదర్శక వ్యవస్థకు రూపకల్పన చేయాలి. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చవుతున్న నిధుల తీరును ప్రజలు తెలుసుకునే వ్యవస్థలు ఉంటే అధికార యంత్రాంగంలోనూ జవాబుదారీతనం పెంపోందుతుంది. కానీ నేటి పాలనా వ్యవస్థలో అటువంటి పారదర్శకత లోపించింది. రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సిఫారసులతో అమలవుతున్న నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సిడిపి), అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డిపి) ఈ రెండింటికి కలిపి బడ్జెట్లో భారీగా నిధులు ఇస్తున్నారు. కానీ ఈ నిధుల వినియోగం ఓ ప్రవాహనంగా మారడం విచారకరం.
ప్రతి ఏడాది ఐదు కోట్ల నిధులు..
శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం(ఎసిడిపి) ఉమ్మడి రాష్ట్రంలో 2005లో అమల్లోకి వచ్చి 2008 వరకూ కొనసాగింది. రెండేండ్ల తర్వాత తిరిగి 2010-11 నుంచి మొదలైంది. శాసనమండలి పునరుద్ధరణతో ఎమ్మెల్సీలు కూడా రావడంతో ఏసిడిపి పేరు సిడిపి(నియోజకవర్గ అభివృద్ధి నిధి)గా మార్చినారు. తొలుత ఒక నియోజకవర్గానికి రూ.50 లక్షల చొప్పున ఇచ్చారు. 2006 -07లో ఆ మొత్తాన్ని కోటి రూపాయలకు పెంచారు. నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వం 2014-15లో దీన్ని రూ.1.5 కోట్లకు పెంచింది. ఆ తర్వాత 2016-17లో రూ.మూడు కోట్లకు పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో మూడు కోట్ల నుండి ఐదు కోట్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు నెం.13ను విడుదల చేసింది. సిడిపి మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఏడాది మంజూరైన పనులలో 10శాతం పనులు తనిఖీ చేస్తారు. రెండు లక్షల వరకు జరిగే పనులను స్థానిక మండల అభివృద్ధి అధికారులు తనిఖీ చేస్తారు. రెండు లక్షల కంటే ఎక్కువ సొమ్ముతో మంజూరైన పనులను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో నాణ్యత విభాగం తనిఖీ చేస్తుంది. సిడిపి నిధుల్లో సగం మొత్తంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పూర్తి అధికారం ఉంటుంది. మిగతా సగం నిధుల ఖర్చును ఆయా జిల్లా మంత్రి అనుమతితో పనులను సిఫారసు చేస్తారు. అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాల పర్యటన సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలలో కొన్నింటికి దీని నుంచే నిధులు మంజూరు చేస్తారు. ప్రజా ప్రతినిధులు అందజేసే వినతి పత్రాల ఆధారంగా దీని నుంచి కొంతమేర కేటాయిస్తారు. ఈ విధంగా ఈ రెండు రకాల నిధుల వినియోగం, తద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు పౌర సమాజానికి అందుబాటులో ఉండటం లేదు.
సామాన్య ప్రజలకు అందుబాటులో లేని వివరాలు..
నిధులను ఏ కార్యక్రమాలకు ఏ రీతిన ఖర్చు పెడుతున్నారు అనేది కీలకాంశం. సిడిపి నిధుల మంజూరీకి అనుసరించే విధానాలు, ఆ నిధులతో చేపట్టిన పనుల వివరాలు నేటి వరకూ ప్రజలకు తెలియకపోవడం విచిత్రం. వాటి వెల్లడికి అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లు లేవు. కనుక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లాల మంత్రులు సిఫార్సు చేసిన పనుల్లో ఏవి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయో తెలుసుకోవడం అంత సులువు కాదు. పారదర్శకత కొరవడి నప్పుడు అధికార యంత్రాంగం తనకు తోచిన రీతిలో పనులు పూర్తి కానిచ్చేస్తుంది. ఇప్పుడు నిధులను బాగా పెంచిన నేపథ్యంలోనైనా పనుల వివరాలు ప్రజలకు తెలిసేలా ఉండాలి. ఎంపీ లాడ్స్ నిధుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకునేందుకు కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఒక వెబ్సైట్ నిర్వహిస్తుంది. ఆ వెబ్సైట్ ద్వారా ఎంపీ సిఫార్సు చేసిన పనుల మంజూరు, చేసిన నిధులు ఖర్చు, పూర్తయిన పనులు, పెండింగ్ పనుల వివరాలు మొత్తం అందుబాటు లో ఉంటాయి. అలాంటి వ్యవస్థను ఈ నిధులకు కూడా ఏర్పాటు చేయాలి. ఏ సభ్యుడు ఏ ప్రాంతానికి ఏ పనిని సిఫార్స్ చేశాడు. దాని విలువ ఎంత? ఖర్చయి నిధులు, మిగిలిన నిధులు ఎన్ని? మొదలైన వివరాలు దానిలో కనిపిస్తుండాలి. పనుల ఎంపికలో కొత్త విధానాలు అమలులోకి రావాలి. చాలా మంది ఎమ్మెల్యేలు ఎక్కువ మొత్తంలో నిధులను ఆయా కుల సంఘాల సామాజిక భవనాలకు కేటాయిస్తున్నారు. అలా కాకుండా నిజమైన ప్రజా అవసరాలను గుర్తిస్తూ నిధులను మంజూరు చేయాలి. నిధులు బాగా పెంచినందువల్ల దీర్ఘకాలం నిలబడే పనులకు ఇప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిడిపి, ఎస్డిపి నిధులకు సంబంధించి వెబ్సైట్ నిర్వహిస్తూ సమగ్ర సమాచారాన్ని వాటిలో ఉంచాలి. ఏ పనికి ఎన్ని నిధులు సిఫార్సు చేశారన్న విషయంలో పారదర్శకత పాటిస్తే అది ఒక సామాజిక తనిఖీగా కూడా ఉంటుంది. ప్రజలే విషయాన్ని గ్రహించి ఆయా పనుల గురించి ఆరా తీయగలుగుతారు. అలాగే నిధుల మంజూరుతోపాటు తనిఖీ, విశ్లేషణ అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి. గతంలో ప్రకటించిన ఈస్ట్ (ఎవల్యూషన్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్) ఏర్పాటు దస్త్రం కార్యరూపం దాల్చాలి. అప్పుడే చేస్తున్న పనుల్లో జవాబుదారీతనం, పార దర్శకత ఏర్పడి, ఆయా పనులు ప్రజలకు సత్వరం అందు బాటులోకి రాగలుగుతాయి.
- అంకం నరేష్
సెల్:6301650324