Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జూబ్లీహిల్స్‌లో బాలిక గ్యాంగ్ రేప్ గత రెండు రోజులుగా చర్చనీయాంశమవుతున్నది. నమ్మించి మోసం చేయడం, ఆ తర్వాత బాలికపై లైంగిదాడికి పాల్పడటం అత్యంత దుర్మార్గమైన చర్య. ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండించాల్సిందే. ఈ సంఘటనపై సమగ్రంగా విచారణ చేపట్టి దోషులకు కఠిన శిక్ష వేయాల్సిందే. కానీ బీజేపీ నేతలు దీన్ని కూడా రాజకీయాలకు వాడుకునే హీన స్థితికి దిగజారారు. ఎందుకంటే ముస్లిం యువకులు ఆ బాలికను గ్యాంగ్ రేప్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే నిందితులు ముస్లిం యువకులు కాబట్టే వీరికి బాలికకు జరిగిన అన్యాయం గుర్తొచ్చిందా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎందరో అమాయక అమ్మాయిలూ, మహిళలపై లైంగికదాడులూ, హత్యలూ జరుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తెలంగాణలోనూ లైంగికదాడులు నిత్యకృత్యంగా మారాయి. కానీ ఏ రోజూ బీజేపీ నేతలు వాటిపై పెద్దగా స్పందించిందిలేదు. ముస్లిం అమ్మాయిని పెండ్లి చేసుకున్న నాగరాజను పట్టపగలు సరూర్‌నగర్‌లో ముస్లిం యువకుడు హత్య చేస్తే బీజేపీ నేతలు గగ్గోలు పెట్టారు. అదే గోషామహల్ నియోజకవర్గంలో మర్వాడీకి చెందిన యువకుడు నీరజ్‌ను యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకులు అత్యంత కిరాతంగా చంపితే బీజేపీ నేతలకు, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ నోరుపడిపోయిందా? మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో వారు తమకు ఓట్లు వేయరని భయపడ్డారో ఏమో! మీర్‌పేటలో ఇటీవల మైనర్ బాలికపై లైంగికదాడి జరిగింది. మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధీలోనూ ముగ్గురు మైనర్ బాలికలపై లైంగికదాడి జరిగింది. కానీ ఏనాడూ బీజేపీ నేతలు స్పందించలేదు. కనీసం విచారం కూడా వ్యక్తం చేసిన ఘటనలు లేవు. కారణం అక్కడ వారికి 'మత విద్వేషాలకు' అవకాశం కనిపించలేదు. ఇక్కడ మాత్రం వారికి మత విభజనకు అనుకూలమైన పరిస్థితి కనిపించింది. చూస్తుంటే లైంగికదాడులు, హత్యలు, అఘాయిత్యాలు... ''కావేవీ బీజేపీ మతపిచ్చికి అనర్హం'' అన్నట్టుగా ఉంది వీరి వ్యవహారం.
- గుడిగ రఘు