Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఇది మల్లెల వేళయనీ... ఇది వెన్నెల మాసమనీ... తొందరపడి ఒక కోయిలా ముందే కూసిందీ... విందులు చేసిందీ'' అన్న ప్రఖ్యాత సినీ గీతం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అచ్చం అట్లనే కొంతమంది రాబోయే ఎన్నికలను ఊహించుకుంటూ తమ తమ పార్టీలు అన్ని సీట్లు గెలుస్తాయి.. ఇన్ని సీట్లు గెలుస్తాయంటూ ముందస్తు కూతలు కూస్తున్నారు. ఇటీవల అధికార టీఆర్ఎస్ చేయించిన సర్వే అంటూ 'గులాబీ' అభిమానులు... కొందరు ఓ చిట్టాను సామాజిక మాధ్యమాల్లో వదిలారు. దాని సారాంశం ప్రకారం... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి వందకు పైగానే సీట్లు వస్తాయని వారి అంచనా. ఎంఐఎంకు ఏడు, కాంగ్రెస్కు ఓ ఐదు, మిగిలినవి బీజేపీకి వస్తాయంటూ ఆ వీరాభిమానులు లెక్కగట్టారు. వీళ్లు ఈ అత్యుత్తమ సర్వే రిపోర్టును వదిలిన కొన్ని గంటల్లోనే హస్తం పార్టీ వీరాధివీరులు మరో సర్వేను వదిలారు. ఆ ప్రకారంగా కాంగ్రెస్కు వంద, టీఆర్ఎస్కు ఓ పది, ఎంఐఎంకు ఏడు, మిగతా సీట్లు బీజేపీకి వస్తాయంటూ ఆ గణిత శాస్త్ర మేధావులు విశదీకరించారు. ఇది జరిగిన రెండు మూడు గంటలకు కమలం పార్టీ కర సేవకులు... సేమ్ టూ సేమ్ రిపోర్టును వండి వడ్డించారు. కాకపోతే ఈసారి తమకు అంటే బీజేపీకి వంద సీట్లు వేసుకుని... మిగతా పార్టీలకు మిగతా సీట్లను పంచి పెట్టుకుంటూ పోయారు. ఇలా ఎన్నికలు రాకముందే ఈ మూడు పార్టీల వారు ఎవడంతట వాడు ప్లస్, మైనస్... అంటూ లెక్కలేసుకుంటూ సీట్లు పంచుకుంటూ పోతే ఇక ఓట్లేసే జనం ఎందుకంట..? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రజల సమస్యలు, వారి మూడ్ గురించి పట్టించుకోకుండా ఈ కోయిలలు ముందే కూయటం కడు విచిత్రంగా కనిపిస్తుంది. ఇలాగే ఉమ్మడి రాష్ట్రంలో మస్తు లెక్కలేసుకుని 2004లో ముందస్తుకు పోయిన చంద్రబాబు పని ఏమయ్యిందో అందరికీ తెలిసిందే. అప్పుడు వ్యతిరేక పవనాలు వీయటంతో బాబు గారు దెబ్బకు అధికార పీఠం దిగారు. గద్దెనెక్కటానికి ఆయనకు మళ్లీ పదేండ్లు పట్టింది. ఆ రకంగా జనానికి తిక్క రేగితే ఈ లెక్కలు, క్యాలుక్యులేషన్లు ఏవీ పని చెయ్యవని మన పార్టీల వాళ్లకు తెలిసేదెప్పుడో. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే... రాష్ట్రం మొత్తంలో 119 అసెంబ్లీ స్థానాలుంటే, వాటిలో సూర్యాపేట జిల్లా కోదాడ స్థానాన్ని ఈ మూడు సర్వేలూ వదిలేయటం గమనార్హం.
-బి.వి.యన్.పద్మరాజు