Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉద్యోగ నోటిఫికేషన్ల మాటే. కొలువులకు దరఖాస్తు చేయటం, కోచింగ్లు తీసుకోవటం, ఆన్లైన్లో విశ్లేషకులు చెప్పే పాఠాలు వినటం... ఇదీ ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ. అయితే ఉద్యోగార్థులకు, కోచింగ్లు తీసుకుంటున్న యువతకు పెద్ద చిక్కొచ్చి పడింది. వివిధ మీటింగులు, కార్యక్రమాల పేరిట ఇటీవల తెలంగాణకు వస్తున్న బీజేపీ అగ్రనేతల మాటలు విని... ఏది నిజమో, ఏది అబద్దమో తెలియక వారు తలలు గోక్కుంటున్నారు. తాజాగా ఇక్కడకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా... 'తెలంగాణ పోరాటంలో అల్లూరి సీతారామరాజు పాత్ర చిరస్మరణీయం...' అంటూ ఓ డైలాగ్ వదిలారు. ఈ డైలాగ్తో కోచింగ్ తీసుకుంటున్న వారు డైలమాలో పడ్డారు. 'అరే, ఇదేందిర బరు... మనం చిన్నప్పటి నుంచి సాంఘీక శాస్త్రం చదువుకుంటున్నాం. తెలంగాణ సాయుధ పోరాటంలోగానీ, తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన తొలి, మలి దశ ఉద్యమాల్లోగానీ అల్లూరి పాల్గొన్నట్టు ఎక్కడా లేదు కదా? అసలు ఆయన పోరాడింది బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా కదా..? అందునా విశాఖ ఏజెన్సీలోని మన్యంలో కదా...? మరి దేశానికి హోం మినిస్టర్ అయిన ఆ పెద్దాయన గిట్లెట్ల చెబుతడు... అంతటి పెద్దోడు చెప్పిండంటే ఎంతో కొంత నిజమని మనం నమ్ముతం గదా..?' అంటూ తెగ కన్ఫ్యూజ్ అయిపోతున్నరు యువతీ యువకులు. ఇంతకీ తెలంగాణకు, అల్లూరికి సంబంధం ఉందా..? లేదా..? అనే విషయమై మీరైనా వారికి జర క్లారిటీ ఇచ్చి పుణ్యం కట్టుకోండి... ప్లీజ్.
-అచ్చిన ప్రశాంత్