Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సింహం పళ్ళు తోముకోదు, నేను తోముకుంటా... మిగతాదంతా సేమ్ టు సేమ్'' అన్న డైలాగ్ విన్నాం. అలాగే సింహం స్నానం చేయదు నేను చేస్తా మిగతాదంతా సేమ్ టు సేమ్ అని కూడా చెప్పుకోవచ్చు. మృగరాజు పొద్దున సోప్ తీసుకుపోయి లేస్తూనే స్నానం చేయక పోవచ్చు కాని ఏదో ఒక సమయంలో నీళ్ళలో అన్ని జంతువుల లాగే ఆడుకోవచ్చు. దప్పిక వేసి నీళ్ళు తాగడానికి పోయినప్పుడైనా స్నానం చేయొచ్చు. లేదా ఇతర జంతువులను వేటాడేటప్పుడు నీళ్ళలో దిగవలసి రావచ్చు కూడా. మొత్తం మీద అది తెలిసో తెలియకో స్నానం చేస్తుంది. పుట్టిన పసిబిడ్డ నుండి పెద్దగై మహాప్రస్థానం చెందేవరకూ మనిషికి స్నానం అన్నది ఓ నిత్యావసరం. అందుకే రకరకాల స్నానాలకు రకరకాల పేర్లు పెట్టారు మన పూర్వీకులు. స్నానం శుభ్రతకు మూలం. అయితే మొదట నీళ్ళు మంచిగ ఉంటేనే మనుషులకు స్నానం వల్ల మంచి జరిగేది. లేకుంటే అంతే సంగతులు.
స్నానం, సమయం రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. సెలవురోజుల్లో సాయంకాలం దాకా స్నానం చేయకుండా అదే చిన్న నిక్కరుతో చిన్నప్పటిలాగే ఉండేవాళ్ళను చూడొచ్చు. పళ్ళు తోముకోవడానికీ, స్నానం చేయడానికీ కూడా సమయం లేదనే వాళ్ళు ఎందరో. చిన్నప్పుడు మా నాన్న చెప్పేవాడు. అదేమంటే స్నానాల్లో పిట్ట స్నానం, ఏనుగు స్నానం అని రెండుంటాయట. ఉన్న సమయంలో ఒక్కోసారి స్నానం సమయం కట్ చేసి తొందరపడాలని, తరువాత దానికి ఎంతటి సమయమైనా కేటాయించుకొమ్మని చెప్పేవాడు. పిట్ట చిన్న గ్లాసెడు నీళ్ళు ఉన్నా చాలు వాటిలో మునిగి అటూ ఇటూ రెండు కదలికలు వేసి పైకొచ్చి రెక్కలు విదిలించి స్నానం పూర్తి చేస్తుంది. ఇక ఏనుగు స్నానం చేయాలంటే మాత్రం పెద్ద నది కాని, చెరువు కాని కావాలి. నీళ్ళలో మునిగి, లేచి, పొర్లి నానా బీభత్సం చేస్తుంది. తొండంతో నీళ్ళు తెసుకొని పైపులాగా వీపు మీద పోసుకొని మరీ స్నానం చేస్తుంది.
పుణ్య స్నానాల గురించి మాట్లాడుకునేటప్పుడు వేమన చెప్పిన మాటలు కూడా గుర్తు చేసుకోవాలి. కళ్ళు తెరిచి నిజాలు తెలుసుకోవాలి కూడా. ఒక సారి వేమన తల్లి, సోదరుడు పుణ్య యాత్రలకు బయలుదేరారు. ఆయననూ రమ్మన్నారు. నేను రాను కాని మీరు మునిగిన చోటల్లా ఈ మూటను ముంచి తీసుకురండి మధ్యలో దానిని విప్పవద్దు అని చెప్పి మరీ ఒక చిన్ని మూట ఇచ్చాడట. మామూలుగానే వాళ్ళు చాలా తీర్థాలు తిరిగి, తాము మునిగిన చోటల్లా వేమన ఇచ్చిన మూటను ముంచి తిరిగి ఇంటికి చేరారు. ఆయన వాళ్ళముందే ఆ మూట విప్పి అందులోని రాగి నాణాన్ని చూపి ఎలా ఉన్న నాణెం అలాగె ఉంది, రాగిది బంగారుగా మారలేదు, మీ దర్శనాలకు, స్నానాలకు కూడా దక్కింది ఇదే ఫలితమని చెప్పాడు. మార్పు మనిషి మనస్సులో రావాలని మరీమరీ చెప్పాడు. అది వేమన చెప్పిన పుణ్య స్నానాల ఫలం.
గంగానదిలో శవాల స్నానం గురించి చూద్దాం. ''స్నానములందు పుణ్య స్నానములు వేరయా'' అన్నట్టు గంగానదిలో స్నానం ప్రత్యేకం. అసలు ''తుంగా పానం గంగా స్నానం'' అన్న నానుడి ఉండనే ఉంది. నిజంగానే తుంగభద్ర నీళ్ళు తీయగా ఉంటాయి. ఇక గంగా స్నానం చేస్తే అంతే సంగతి అని చూసొచ్చిన వాళ్ళు చెబుతున్నారు. దశాబ్దాలుగా గంగానది కాలుష్యంలో మగ్గుతోంది. దాన్ని బాగు చేస్తామంటూ ఎన్నో కార్యక్రమాలు ప్రకటించారు. అన్నీ వికటించాయి. అక్కడ స్నానం చేస్తుంటే పక్కనుండే శవాలు పోతుంటాయట. ఇక ఏకంగా కరోనా సమయంలో శవాలను ఆ గంగా ప్రవాహంగా మారడం బాధ కలిగించే విషయం. ఐనా వ్యక్తిని ఆరాధించే వాళ్ళు దాన్ని అమానవీయ విషయంగా తీసుకోనే లేదు. ఇంకా భక్తి పారవశ్యంతో అతడిని స్తుతిస్తూనే ఉన్నారు. చిన్నప్పుడు భయపెట్టినట్టు ఆయన్ని ఏమన్నా అంటే కళ్ళు పోతాయేమో అన్నంతగా భజనలు సాగుతూనే ఉన్నాయి.
స్నానం గురించి చెప్పుకుంటూ ''స్వామీ నదికి పోలేదా'' అన్న ఎపిసోడ్ గురించి చెప్పుకోకపోతే మజా ఉండదు. ఇప్పటిలా బాత్ రూములు లేని కాలంలో జనాలు నదికి వెళ్ళి స్నానం చేసేవాళ్ళు. ఇప్పటి నదుల్లా కాక అప్పుడు నీళ్ళు స్వచ్ఛంగా ఉండేవి మరి. అసలు నదుల పక్కనే పెద్ద పెద్ద నగరాలు, సంస్కృతులు తయారయ్యాయి. ఇప్పుడు ఆ సంస్కృతులు మారాయి. నదులు, నీళ్ళు ఉన్నచోటికి పెట్టుబడులు వచ్చిపడుతున్నాయి. తాగడానికి మంచినీళ్ళు లేకపోయినా శీతల పానీయాలకు నీళ్ళు అందుతాయి. ఇదీ నేటి తీరు.
ఇక ప్రస్తుత ప్రపంచాన్ని చూస్తే ఒక విషయం అర్థమైపోతుంది. ఇంట్లో చిన్న పిల్లలు కూడ టీవీ ప్రకటనల్లో చూపించే సబ్బు తమకు కావాలని అడుగుతారు. ఎందుకంటే తమకిష్టమైన క్రికెటరో, యాక్టరో అది వాడతారని అందుకే తామూ వాడతామని అడుగుతారు. మేడ్ ఇన్ ఇండియా పోయి మేక్ ఇన్ ఇండియా వచ్చిన రోజుల్లో స్వదేశీ వస్తువులనే వాడండి అని చెప్పిన మహానుభావులే ఇప్పుడు బహుళ జాతి కంపెనీలను ప్రోత్సహిస్తూ వారి అడుగులకు మడుగులొత్తి ఆ పుణ్యంలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ప్రపంచీకరణ మన బాత్ రూముల్లోకి కూడా ప్రవేశించిందని ఆ మధ్య ఓ కవయిత్రి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. నిజమే మరి.
వాగ్దానాలతో, బూతు మాటలతో నేటి నాయకులు మన చెవులకు, ఆ తరువాత మెదళ్ళకు స్నానం చేయిస్తున్నారు. మంచి పనులు చేసిన పుణ్యం సంగతటుంచి రాబోయే రోజుల్లో తాము చేసే మహత్కార్యాల జాబితా చూపుతున్నారు. ప్రాంతీయ పార్టీల చేతిలో ఉన్న రాష్ట్రాల సంగతి ఒకరకంగా ఉంటే, ఇతర రాష్ట్రాల సంగతి మరో విధంగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఏళ్ళ తరబడి పాలిస్తూ చేయలేని పనులను కొత్తగా పాగా వేసే రాష్ట్రాల్లో చేస్తామని చెవులకు అమృతం లాంటి మాటలతో అభిషేకం చేస్తున్నారు. అంతా మోసమని ఇప్పుడు ప్రజలకూ తెలిసిపోతోందనుకొండి అది వేరే సంగతి. కాబట్టి ఈ పవిత్రత సంతరించుకున్న మాటల వెనుక ఉన్న మలినాలను గమనించాలని మనవి.
- జంధ్యాల రఘుబాబు
సెల్:9849753298