Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా విష పరిష్వంగం నుండి ప్రపంచం ఇంకా విడివడనేలేదు, దెబ్బమీద దెబ్బలా రష్యా - ఉక్రెయిన్ యుద్ధం దాపురించింది. ప్రపంచ ఆర్థిక స్థితి అతలాకుతలం అయింది. కుబేరులు మరింత కుబేరులు అవుతుంటే, దరిద్రులు మరింత దరిద్రులుగా దిగజారుతున్నారు.
కరోనా - యుద్ధం కారణాన యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 5.5శాతం కుచించుకు పోయినట్టు ఇటీవల ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. తత్ఫలితంగా చాలా దేశాల్లో ప్రజానీకం ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, భరించలేని పేదరికం వంటి విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మనుగడ కోసం జీవన పోరాటం చేస్తున్నారు.
అమెరికా, చైనాతో పాటు యూరప్‌లోని అగ్రరాజ్యాలను సైతం ఈ ఆర్థిక ప్రమాదం వెన్నాడుతున్నది. ఇక శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి బడుగుదేశాల సంగతి సరేసరి. అంపశయ్యపై పడుకున్నట్టున్నది వాటి ఆర్థిక స్థితి.
ఈ ఏడాది ఇరవై కోట్లకుపైగా ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం ఉన్నదని అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటించింది. ప్రపంచ చమురు ఉత్పత్తుల్లో అమెరికా, సౌదీ అరేబియా తర్వాత రష్యా మూడవ స్థానంలో ఉన్నది. అయితే యుద్ధ కారణాన రష్యా విధించే ఆర్థిక ఆంక్షల ప్రభావం చాలా దేశాలపై పడుతున్నది. అంతకు ముందు 80లక్షల బ్యారళ్ళ చమురును ఉత్పత్తి చేసేది రష్యా. ప్రపంచ ఎగుమతుల్లో 14శాతం వాటా ఉండేది. ఇప్పుడది ఘోరంగా దెబ్బతిన్నది. చాలా భాగం మార్కెట్లోకి రావడం లేదు. యుద్ధానికి ముందు 78 డాలర్లు ఉన్న బ్యారల్ ధర ప్రస్తుతం 135 డాలర్లకు ఎగబాకింది. గత ఏడాది ఇదే నెలలో బ్యారల్ ధర 65 డాలర్లు మాత్రమే. ఇప్పుడు రెట్టింపు కావడంతో ప్రపంచ ద్రవ్యోల్బణం అకస్మాత్తుగా మూడుశాతం పెరిగింది. గత ఐదేండ్లుగా, అంటే ఏడాది క్రితం వరకు ద్రవ్యోల్బణం సగటు పెరుగుదల శాతం 1.5మాత్రమే. ఆధునిక మానవుని కనీస అవసరాలలో ఒకటైన ఇంధనం (చమురు) సరఫరాకు గడ్డు పరిస్థితి ఏర్పడితే సామాన్యుని జీవితాల్లో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉద్భవిస్తాయో మనం చవిచూస్తూనే ఉన్నాము.
కాగా ఆహార ధాన్యాలపై యుద్ధ ప్రభావం మరో కోలుకోలేని దెబ్బ. రష్యా - ఉక్రెయిన్ దేశాల్లో గోధుమ ప్రధాన పంట. ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో ఈ రెండు దేశాల వాటా 29శాతం. అలాగే ఈ రెండు దేశాలు సన్‌ప్లవర్ నూనెగింజలను టర్కీ, చైనా, భారత్‌కు ఎగుమతి చేస్తాయి. ఆ ఎగుమతులకు కూడా విఘాతం కలిగింది ఇప్పుడు.
కాగా ఇటీవల చైనా కరోనా కొత్త వేరియంట్ ప్రమాదంలో చాలా ప్రాంతాల్లో లాక్డౌన్ విధించింది. ఆదేశం నుండి విదేశాలకు చేరవలసిన పారిశ్రామిక ముడిసరుకులు ఈ లాక్డౌన్ వలన నిలిచిపోయాయి. ఉత్పత్తి కొరతతో ఆ వస్తువుల ధరలు పెరగడంతో పాటు, అసంఖ్యాకంగా ఫ్యాక్టరీలు మూతలు పడి పనులు కోల్పోయి, నిరుద్యోగం అకస్మాత్తుగా ప్రబలింది.
ఈ కారణాల రీత్యా అంతర్జాతీయంగా అప్పులు దాదాపు పదిశాతం - 71.6 ట్రిలియన్ డాలర్లు పెరిగినట్టు జాన్ హాండర్సన్ అసెట్ మేనేజ్మెంట్ ఫోరమ్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. చాలా దేశాలు ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్టు వేరుగా చెప్పక్కర్లేదు. అయితే వీటిలో సింహభాగం అమెరికా, చైనా దేశాలవే.
ప్రస్తుతం శ్రీలంకతో పాటు ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, వెనెజులా, ఇరాక్, యెమన్, లెబనాన్, పాకిస్థాన్ వంటి దేశాల్లో ఆర్థికంగా భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. అగ్నిపర్వతంలా ఏక్షణానైనా బ్రద్దలయ్యే అంతర్యుద్ద పరిస్థితులు కన్పిస్తున్నాయని ఆర్థిక వేత్తలు ఆందోళన పడుతున్నారు.
కాగా, ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (ప్రపంచ ఆర్తిక వేదిక) మరో ఆర్థిక సత్యాన్ని కుండబద్దలు కొట్టింది. కరోనా మొదటి సంవత్సరం అంటే 2020లోనే కొత్తగా 573మంది బిలీయనర్లు (శతకోటీశ్వర్లు) పుట్టుకొచ్చినట్టు తెల్పింది. ఇప్పుడీ పరిణామం ప్రతి 30గంటలకు కొత్తగా ఓ బిలియనీర్ పుట్టు కొస్తున్నట్టు చెప్పింది. తత్ కారణంగా ఈ ఏడాది 26కోట్లమందికి పైగా, అంటే ప్రతి 30 గంటలకు సగటున 10లక్షల మంది బ్రతకలేని దుర్భర దారిద్య్రంలోకి జారిపోతున్నట్టు వివరించింది.
ప్రపంచం మొత్తం సంపదలో కుబేరుల వాటా దాదాపు 14శాతానికి చేరిందట. కరోనాకు ముందు కేవలం 4శాతం మాత్రమే ఉండేదట. కుబేరులంతా పండుగ చేసుకునేందుకే దావోస్ చేరినట్టు కొందరు ఆర్థిక వేత్తలు వ్యాఖ్యానించారు కూడా. ఆహారం, ఇంధనంతో పాటు ఫార్మా (ఔషధ) రంగాలు ఈ దెబ్బతో గరిష్ట లాభాలు ఆర్జించాయి. ఫైజర్ వంటి గుత్తాదిపత్యం గల ఫార్మా కంపెనీలైతే ప్రతి సెకనుకు వెయ్యి డాలర్ల లాభాలు ఆర్జించాయట. మరిక సామాన్యులకు ఔషధ మందులు ఎక్కడ అందుబాటుల్లో ఉంటాయి? కొన్నింటిపై జనరిక్ మందుల ధరలకంటే 24రెట్లు ఎక్కువ వసూలు చేయడం ఎంత ఘోరం? ఎంత అమానవీయం? ఎద్దుపుండు కాకికి ముద్దు అన్న చందంలా తయారైంది స్థితి.
ప్రపంచంలో కుబేరులు ఒకశాతం ఉన్నారనుకుంటే రెక్కాడితేగాని డొక్కాడని కార్మికులు 50శాతం మంది ఉన్నారు. ఆ కుబేరునికి ఓ ఏడాదికి వచ్చే ఆదాయం ఈ కార్మికుడు 112 ఏండ్లు కష్టపడితే తప్ప రాదట. ఆర్థిక వ్యత్యాసం ఇంత దారుణంగా ఉన్నా పాలకులు కళ్ళున్న కబోదుల్లా వ్యవహరిస్తున్నారు.
అందుకే ఈ కుబేరులపై 5శాతం సంపద పన్ను వసూలుచేసినా ఏటా 2.5లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుంది. తద్వారా 230కోట్ల మందిని పేదరికం నుండి గట్టెక్కించవచ్చని ఆర్థిక వేత్తలు మొత్తుకుంటున్నా ఈ పాలకుల చెవికెక్కడం లేదు.
ఇదిలా ఉంటే రష్యా - ఉక్రెయిన్ యుద్ధానికి వందరోజులు గడిచాయి. శవాలపై బొగ్గులు ఏరుకున్న చందంగా ఈ యుద్ధాన్ని అడ్డం పెట్టుకుని ఆయుధ వ్యాపారులు పండుగ చేసుకుంటున్నారు. అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌కు అందిస్తున్న ఆర్థిక సహాయంలో అధిక భాగం ఆయుధాలకు సంబంధించినదే.
యుద్ధం మొదలవగానే అమెరికా ఆయుధ కంపెనీ 'లాకిహీడ్' షేర్ విలువ ఒక్కసారిగా 16శాతం పెరిగింది. ఐరోపాలో అతిపెద్ద ఆయుధ కంపెనీ బి.ఎ.ఇ. షేర్ విలువ ఏకంగా 26శాతం పెరిగింది. అమెరికా కాంగ్రెస్‌లో చాలామందికి ఆయుధ కంపెనీల్లో షేర్లు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. మరింక యుద్ధ మంటలు ఎలా చల్లారుతాయి? 'యుద్ధాలు ఎంత ఎక్కువగా జరిగితే వారికంత లాభం' అని బిజెనెన్ ఇన్ సైడర్ పత్రిక వ్యాఖ్యానించింది. కాగా యుద్ధాలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జరుగుతాయా..? అని గోతికాడ నక్కల్లా పొంచి కూర్చునే కుబేరులు పెరుగుతున్నారు. ఆయుధ కంపెనీల్లో షేర్లు కొనేందుకు ఎగబడుతున్నారు. పైగా 'యుద్ధం రాజకీయ నాయకులకు మంచి వ్యాపారం' అని సిగ్గు ఎగ్గులేకుండా ట్వీట్ చేస్తున్నారు. వీరికి చావుకూడా పెళ్ళిలాంటిదే మరి?
ఈ యుద్ధం సందర్భంగా అమెరికా ఉక్రెయిన్‌కు చేసిన సాయం 5300 కోట్ల డాలర్లకుపైగా ఉంటుంది. యుద్ధం సాగినంత కాలం ఈ సాయం (ఆయుధాలు) ఇంకా పెంచనున్నట్టు కూడా అమెరికా హామీ ఇచ్చింది. మరో పక్క ఈ యుద్ధం సాకు చూపి అగ్రదేశాలు తమ జీడీపీలో రక్షణ రంగానికి ఎక్కువ కేటాయింపులు చేస్తున్నాయి. జర్మనీ 1.5శాతం నుండి 2 శాతానికి, జపాన్ 1 శాతానికి పెంచుకున్నాయి. అమెరికా అయితే 3.5 నుండి ఏకంగా 5శాతానికి పెంచవచ్చని అంచనా. ఆయుధ కంపెనీలకు కాసుల పంట అంటే ఇదే. అందుకే రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఆయుధ వ్యాపారులు ఎలా ఉవ్విళ్ళూరారో ఇప్పుడూ అలాగే జరుగుతున్నదని రిటైర్డ్ మేజర్ జనరల్ భిక్త పేర్కొనడం ఎవరికీ విడ్డూరంగా లేదు.
- కె. శాంతారావు
సెల్:9959745723