Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యవసాయం ప్రయివేటు శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి, పంట ధర.. ఇవన్నీ ప్రయివేటు సెక్టార్లోనే కొనసాగుతున్నాయి. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరోక్షంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. నగదు పథకాల ఉచ్చులోకి రైతులను నెట్టి, కార్పొరేట్ శక్తుల దోపిడీకి మార్గాలు సులభతరం చేస్తున్నారు.
వ్యవసాయాధారిత దేశం మనది. 70 శాతానికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపై ఆధార పడి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన వ్యవసాయానికి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదెంత అనేదానిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కేంద్ర సర్కారుకు దీనిపై ఒక విధానమంటూ ఉందా..? ఉంటే రైతులకు జరుగుతున్న లాభమెంత..? ఇలాంటి అనేక ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం వద్ద సమాధానాలుండవు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులపై రైతులకు రాయితీలు రావడం లేదు. పైగా నకిలీ విత్తనాలు మార్కెట్లో విచ్చల విడిగా చలామణి అవుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలతో పాటు సాగు ఖర్చును అంచనా వేసి, గిట్టుబాటు ధర కల్పించాల్సిన కేంద్ర సర్కారు.. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంలో ఆంతర్యమేంటో స్ఫష్టమవుతూనే ఉంది.
కేంద్ర ప్రభుత్వం గతంలో రైతు చట్టాలను తీసుకొచ్చింది. కానీ వీటికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు రావడంతో కేంద్ర సర్కారు తప్పని పరిస్థితుల్లో తాత్కాలికంగా ఉప సంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. కొద్ది కాలం తరువాత ఓ కేంద్ర మంత్రి భవిష్యత్లో అమలు చేసి తీరుతామని ప్రకటన చేయడం మరోసారి దూమారం రేపింది. అయితే, ప్రభుత్వం చట్టాలనైతే రద్దు చేసింది గానీ, దొడ్డిదారిన పని తాను చేసుకుంటూ పోతున్నది. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ (రైతు ఉత్పత్తి దారుల సహకార సంఘం)ను తెరపైకి తీసుకొచ్చింది. ఇటీవలే దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఎంపీలు, ప్రజా ప్రతినిధులు ఇందులో రైతులను సభ్యులుగా చేర్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంటు ఇస్తున్నట్లు రైతులను నమ్మించి ఇందులో చేర్పిస్తున్నారు. రైతుల ఉత్పత్తులు నేరుగా వినియోగ దారుడికే అమ్మేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర మాత్రం ప్రకటించడం లేదు. ఇందులోనే మోసం ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. చిన్న సన్నకారు రైతులు వినియోగ దారుడి వద్దకు వెళ్లి అమ్ముకునే పరిస్థితులు ఉండవు. కార్పోరేట్, ప్రయివేటు సెక్టార్లు నిర్ణయించిన ధరకు అమ్ముకుని నష్టపోయే కుట్ర దాగి ఉందని వామ పక్షాలు చేస్తున్న విమర్శలకు ఇవి బలాన్ని చేకూర్చుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వానికి తోడు రాష్ట్ర ప్రభుత్వమూ తామేమీ తక్కువ కాదన్నట్లు రైతుల నష్టాలకు కారణమౌతోంది. గత రెండేండ్ల కాలంలో టీఆర్ఎస్ సర్కారు అవలంభిస్తున్న విధానాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఆరోపణలు చేయడం సమంజసంగానే ఉన్నా, తన బాధ్యతనూ విస్మరిస్తుందనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు. విత్తనాలు, ఎరువుల రాయితీలు, పంటల మద్దతు ధరకు తోడు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవేమీ చేయడం లేదు. రైతు రుణమాఫీ చేసి, బ్యాంకుల్లో ఎక్కువ మొత్తంలో పంట రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవడం లేదు. ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించిన దాఖలాలు కూడా లేవు. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన లోప భూయిష్టంగా ఉంట,ే కొత్తగా రాష్ట్ర ప్రభుత్వమే బీమా ఏర్పాటు చేసేలా చర్యలు లేవు. సాగు యంత్రాలకు సబ్సిడీ లేదు. వీటిపై అడిగితే, రైతు బంధు, బీమా పథకాల రాగం ఎత్తుకుంటోంది సర్కారు. వీటివల్ల చిన్న-సన్నకారు రైతులు, కౌలు రైతులకు పెద్దగా ప్రయోజనం లేదని తేలింది.
తెలంగాణలో వ్యవసాయ శాఖ సమగ్ర ప్రణాళిక రూపొందించ లేదు. ఇప్పటికే నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రైతాంగానికి, ఈ వానా కాలం పంటల సాగుపై స్ఫష్టమైన భరోసా కల్పించడం లేదు. ఇటీవల కరీంనగర్లో ఉత్తర తెలంగాణ రీజినల్ వ్యవసాయ సదస్సు మూడు రోజుల పాటు జరిగింది. వ్యవసాయ శాఖ ఉన్నత స్థాయి అధికారులు, శాస్త్రవేత్తలు, వానాకాలం పంటల సాగుపై రైతులకు సూచనలు చేశారు. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై వివరించారు. ఈ సదస్సులో రైతులు వేసిన కొన్ని ప్రశ్నలకు అధికారుల నుండి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఆయిల్ ఫాం, నూనె గింజలు, పప్పు దినుసులు పండించేందుకు తాము సిద్ధంగా ఉన్నామనీ, వీటికి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించిన రైతులకు అధికారుల నుండి జవాబు రాలేదు.
ఈ వానకాలం సీజన్లో తెలంగాణలో 50 లక్షల ఎకరాల్లో వరి, 2,488 క్లస్టర్లలో 70 నుండి 75 లక్షల ఎకరాల్లో పత్తి, 71 క్లస్టర్లలో 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది వ్యవసాయ శాఖ. యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు పచ్చిరొట్ట పైర్ల సాగు మంచి మార్గమని.. జీలుగ, జనుము, పిల్లిపెసర, పెసర వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేయాలని సూచిస్తున్నది. ఎరువులు, రసాయణాలు తగ్గించే సూచనలు చేస్తున్న అదికారులు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో మాత్రం రైతులకు భరోసా ఇవ్వలేక పోతున్నారు. యాసంగి పంట కొనుగోళ్లలో తూకంలో కోతలు, మిల్లుల వద్ద తరుగు, అయినప్పటికీ ఆ డబ్బులు ఖాతాల్లో జమ కావడానికి నెలకు పైగా వేచి చూడాల్సి వస్తున్నది. ఇక పత్తి ధర ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కందులు కొనుగోళ్లు చేయడం లేదనే ఆందోళనలూ చూశాం. ఈ వానాకాలం పంటలకైనా గిట్టుబాటు ధర కల్పించేలా రెండు ప్రభుత్వాలూ రైతులకు భరోసా ఇవ్వడం లేదు. ఫలితంగా, రైతులు మరోసారి నష్టపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
- చిలగాని జనార్థన్
సెల్: 8121938106