Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా చిన్నతనంలో రేడియోలో ఉదయం పూట ''కార్యక్రమాల వాచవి'' అనే కార్యక్రమం ప్రసారమయ్యేది. (ఇటీవల కొన్ని దశాబ్దాలుగా రేడియో వినడం లేదు కాబట్టి ఇప్పుడా కార్యక్రమం ఉందో, లేదో తెలియదు.) ఆ కార్యక్రమంలో ఆరోజు కార్యక్రమాలన్నిటి ముఖ్య అంశాలను ప్రతి దాన్ని కొన్ని సెకండ్ల పాటు వినిపించేవారు. అలా ఆ కార్యక్రమాల రుచిని కొద్దిగా శ్రోతలు అర్థం చేసుకునే వారు. ఇటీవల కర్నాటక ప్రభుత్వం బీజేపీ పార్టీ నినాదమైన 'విద్యలో కాషాయీకరణ' యొక్క వాచవిని చూపింది. దానిని పరిశీలిద్దాం...
ఈ కాషాయీకరణను గూర్చి ఇటీవలికాలంలో బీజేపీ నేతలందరూ తెగ పొగుడుతూ ఉన్నారు. చివరకు దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఒక సభలో మాట్లాడుతూ... ''విద్యలో కాషాయీ కరణ చేస్తే తప్పేంటి?'' అని మాట్లాడి కాషాయీకరణను సమర్థించారు. బీజేపీ నేతలందరూ ''కాషాయీకరణ అంటే మెకాలే ప్రవేశపెట్టిన బానిస విద్యావిధానాన్ని వ్యతిరేకించడం అనీ, భారతీయ సంస్కృతికి విద్యలో ప్రముఖ స్థానం ఇయ్యడమనీ'' అస్పష్టంగా వివరిస్తుంటే, దేశభక్తులు ఎవరూ దానిని ఖండించ లేకపోయారు. కానీ ఇటీవల కర్నాటకలో ప్రభుత్వం తలపెట్టిన సిలబస్ మార్పులతో కాషాయీకరణ నిజరూపం బయటపడింది.
ఆ సిలబస్ మార్పులలో మొదటిది ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడైన డాక్టర్ హెడ్గేవార్ ప్రసంగాన్ని ఒక పాఠంగా ప్రవేశపెట్టడం. ఈ హెడ్గేవార్ ఎలాంటి వ్యక్తి? ముస్లింలను దేశద్రోహులని పిలువ వద్దనీ, వారిని అలా పిలిస్తే వారు ఈ దేశస్థులే కానీ దేశానికి ద్రోహం చేసే వారు అనే అర్థం వస్తుందనీ, అందువలన వారిని ఈ దేశ శత్రువులు అని పిలవాలనీ కోరిన వ్యక్తి. అలా నిలువెల్లా ముస్లిం వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి డాక్టర్ హెడ్గేవార్. (దినేష్ నారాయణన్ రచించిన 'ది ఆర్ఎస్ఎస్ అండ్ ది మేకింగ్ ఆఫ్ ది డీప్ నేషన్' అనే గ్రంథం నుండి) డాక్టర్ హెడ్గేవార్ ఈ ప్రకటన ఎప్పుడు చేశారు? అనేక వేల మంది ముస్లింలు గాంధీజీ నాయకత్వంలో, నేతాజీ నాయకత్వంలో, భగత్ సింగ్ నాయకత్వంలో, కమ్యూనిస్టుల నాయకత్వంలో దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడుతున్న రోజుల్లో, స్వాతంత్రోద్యమంలో పాల్గొనని సంస్థ నాయకుడుగా ఈ ప్రకటన చేశాడు. ఆయన ప్రసంగాన్ని పాఠ్యాంశంగా చేయడం కాషాయీకరణకు తొలిమెట్టు.
ఇక రెండవ మెట్టుగా అత్యున్నత దేశభక్తుడు భగత్ సింగ్ పాఠాన్ని తొలగించడం జరిగింది. భగత్ సింగ్ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి, నవ్వుతూ ఉరికంబం ఎక్కిన దేశభక్తుడు. ఆయన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ వ్యవస్థాపకుల్లో ఒకడు. స్వాతంత్ర ఉద్యమ నాయకుల్లో ఒకరైన లాలా లజపతి రారుని శాండర్స్ అనే బ్రిటిష్ అధికారి ఒక నిరసన ప్రదర్శన సందర్భంగా తీవ్రంగా కొట్టగా, ఆ దెబ్బలకు కొద్దిరోజుల్లో ఆ వృద్ధ నాయకుడు చనిపోయాడు. దానికి ప్రతీకారంగా భగత్ సింగ్ నాయకత్వంలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ సభ్యులు సాండర్స్‌ను కాల్చి చంపారు. తరువాత కొంత కాలానికి ఆంగ్ల ప్రభుత్వం భగత్ సింగ్, అతని సహచరులను అరెస్ట్ చేసి విచారణ జరిపి భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లకు ఉరి శిక్ష విధించింది. భగత్ సింగ్ తనకు క్షమాభిక్ష పెట్టమని అడగక పోవటమే కాదు, తన తండ్రి క్షమాభిక్ష అడిగితే అందుకు బాధపడ్డాడు. చివరకు 1931 మార్చి 23వ తేదీన రాజ్ గురు, సుఖదేవ్లతోపాటు భగత్ సింగ్ నవ్వుతూ దేశ మాత స్వాతంత్రం కోసం ఉరికంబం ఎక్కాడు. అలాంటి త్యాగమూర్తి పాఠాన్ని తొలగించడం అంటే దేశం కోసం, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వారి పేర్లు కూడా భావితరాలు తెలుసు కొనకుండా చేయడమే కాషాయీకరణ అని అర్థం కావడం లేదా?
సిలబస్‌లో మార్పుల్లో భాగంగా మరో రెండు మార్పులు చేయడం జరిగింది. అందులో ఒకటి కర్నాటకలో ప్రముఖ సంఘ సంస్కర్త అయిన బసవేశ్వరుని పాఠంలో ఆయన ''నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను, దానికి సంబంధించిన ఆచారాలను తీవ్రంగా వ్యతిరేకించాడు'' అనే వాక్యాన్ని తీసివేసి ''బసవేశ్వరుడు వీర శైవ మతాన్ని సంస్కరించాడు'' అని మార్చారు. అలాగే అంబేద్కర్ పాఠంలో కూడా ''అంబేద్కర్ కుల వ్యవస్థను నిరసించాడు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు'' అనే వాక్యాలు తీసివేసి ''అంబేద్కర్ హిందూ మతాన్ని వదలివేసి హిందూ ధర్మం లోని భాగమైన బౌద్ధాన్ని స్వీకరించాడు'' అని మాత్రమే ఉంచారు. అసలు బసవేశ్వర, అంబేద్కర్ల తాత్విక చింతనల లోని ప్రధాన అంశం ఏది? వారు సమాజంలోని కులతత్వాన్ని నిరసించారు. దానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇదీ వారిని గూర్చి భావితరాలకు అంద వలసిన విషయం. ముఖ్యమైన ఆ తాత్విక చింతనను వారికి అందకుండా చేయడం కాషాయీకరణలో భాగం కాదా? గతంలో సంఘ సంస్కర్తలు, దేశభక్తులు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను చైతన్యవంతంగా వ్యతిరేకించారని భావితరాలకు తెలియకుండా చేయడం నిచ్చెన మెట్ల వ్యవస్థను సమర్థించడమే కాదా? అలాంటి సమర్థన దేశ ప్రజలలోని విభేదాలను మరింత పెంచుతుందే కానీ తగ్గించదు కదా? ఇది దేశ సమైక్యతకు హానికరం కాదా? హిందువులను వేలాది సంవత్సరాలుగా చీల్చి ఉంచిన ఈ కుల వ్యవస్థను సమర్థిస్తే భవిష్యత్తులో ఏమవుతుంది? మరల అవలీలగా దాడులకు ఎర అవుతుంది. ఈ విషయంలో 1853 జూలైలో భారతదేశాన్ని గూర్చి కార్ల్ మార్క్స్ రాసిన వ్యాఖ్యను గుర్తు చేసుకోవడం అవసరం. ఆయన ఏమని రాశాడంటే.. ''హిందూ- ముస్లింలు గానే కాకుండా, తెగకు తెగకు మధ్య, కులానికి కులానికి మధ్య, విభేదాలతో విభజించబడిన దేశం, అలాంటి సమాజం, విదేశీ దాడులకు ఎర కాకుండా ఎందుకుంటుంది?'' రాబోయే ఈ ప్రమాదానికి దోహదం చేస్తున్న శక్తుల విషయంలో దేశభక్తులంతా అప్రమత్తులై ఉండాలి.
బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంక్ అయిన లింగాయతుల తీవ్ర నిరసనతో కాషాయీకరణ ప్రయత్నం ప్రస్తుతానికి వాయిదా పడింది. కానీ వారు కర్నాటకలో ప్రయత్నించిన మార్పులు కాషాయీకరణ అంటే ఏమిటో? ఎలా ఉంటుందో? తెలియజేస్తోంది. అత్యంత ప్రమాదకరమైన ఈ విషయాన్ని దేశ ప్రజలందరూ గమనించాలి. దేశ ప్రజలను విభజించడం, దేశభక్తులను, త్యాగ మూర్తులను ప్రజల జ్ఞాపకాల నుండి చెరిపి వేయడం, సామాజిక చైతన్యాన్ని నాశనం చేయడం, నిచ్చెన మెట్ల కుళ్ళు సంస్కృతిని ప్రోత్సహించడం ఇదే బీజేపీ వారి కాషాయీకరణ అని దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి.
- కె.యల్.కాంతారావు