Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉక్రెయిన్‌కు రష్యాకు జరుగుతున్న యుద్ధంలో రష్యా సైన్యంపై ప్రయోగించటానికి వీలుగా పైలట్ రహిత ఆయుధ ప్రయోగ సాధనాలు - డ్రోన్లను ఎగుమతి చేయాలని అమెరికాపై ఆ దేశంలో పారిశ్రామిక వాణిజ్య శక్తులు ఒత్తిడి తెస్తున్నాయి. నాటో తరఫున ఫైటర్ జెట్లు ఉక్రెయిన్‌కు మద్దతుగా రంగంలోకి దించేలా ఈ శక్తులు విఫల ప్రయత్నాలు చేశాయి. ఈ సారి ఎలాగైనా ఆధునిక ఆయుధ ప్రయోగ సాధనాలైన డ్రోన్లను ఎగుమతి చేసే విషయంలో అమెరికా ప్రభుత్వాన్ని ఒప్పించాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నాయి. 1994-96 మధ్య కాలంలో యూగోస్లోవియాపై అమెరికా నాటో ద్వారా సాగించిన యుద్ధంతో మొదలు పెట్టి నిన్న మొన్నటి వరకూ సాగిన ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల వరకూ అమెరికా ఆయుధోత్పత్తి పరిశ్రమల్లో తయారువుతున్న ఆధునిక ఆయుధాలకు ఈ యుద్ధాలు టెస్టింగ్ గ్రౌండ్‌గా ఉన్నాయి. ఉక్రెయిన్‌కు ఆయుధాలు ప్రయోగించే సామర్ధ్యం ఉన్న డ్రోన్లను ఎగుమతి చేయాలన్న ప్రతిపాదన కూడా ఈ కోవకు చెందినదే.
ఉక్రెయిన్ అమెరికా ఆయుధ ఉత్పత్తిదారులు నుండి ఎంక్యూ 9 రీపర్ డ్రోన్ల కొనుగోళ్ల కోసం అమెరికా ప్రధాన ఆయుధ కాంట్రాక్టర్ జనరల్ ఆటామిక్ కంపెనీతో చర్చలు ప్రారంభించింది. ఆ డ్రోన్లతో హెల్ఫైర్ క్షిపణులు అవలీలగా ప్రయోగించవచ్చు. ఈ క్షిపణులనే అమెరికా విచక్షణా రహితంగా ఆఫ్ఘనిస్తాన్లోనూ, సోమాలియాతో సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రజలపై ప్రయోగించింది. ఈ క్షిపణులు తయారు చేస్తున్న కంపెనీ జనరల్ ఆటమిక్ కంపెనీ. ఈ కంపెనీ ప్రతినిధులు, అమెరికాలోని ఉక్రెయిన్ మిత్రులు ఈ ఆయుధాల ఎగుమతి కోసం అనుమతించాలని లాబీయింగ్ చేస్తున్నాయి. ఈ ఆయుధాలు ఎగుమతికి అనుమతిస్తే రష్యా ఉక్రెయిన్ సాయుధ సంఘర్షణ అణు యుద్ధం స్థాయికి చేరే ప్రమాదం ఉందని మరో వైపున ఆయుధ పరిశ్రమల పెత్తనాన్ని ప్రశ్నిస్తున్న శాంతికాముకులు హెచ్చరిస్తున్నారు.
ఈ దిశగా రేపర్ డ్రోన్లను ఉక్రెయిన్‌కు సరఫరా చేయాల్సిందిగా మార్చి నుండే ప్రజాభిప్రాయాన్ని మలిచే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మార్చిలోనే ఫోర్బ్స్ పత్రికలో రాసిన ఓ వ్యాసంలో మాజీ అమెరికా ఎయిర్‌ఫోర్స్ లెఫ్టినెంట్ డేవిడ్ డెప్తులా ఓ వ్యాఖ్యానం రాశారు. జనరల్ అటమిక్ కంపెనీ నిధులతో నడుస్తున్న మిషెల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ స్టడీస్ సంస్థలో ప్రధాన బాధ్యతల్లో ఉన్నారు. అప్పటికే పోలండ్ ఉక్రెయిన్‌కు మిగ్ 29 యుద్ధ విమానాలను అమ్మింది. దీనిపై వచ్చిన విమర్శలను ఖండిస్తూ డేవిడ్ డెప్తులా ఈ అమ్మకాన్ని వ్యతిరేకించేవాళ్లు పుతిన్‌ను చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అమెరికా నుండి ఉక్రెయిన్‌కు ఆయుధాల అమ్మకాలు సాగితే యుద్ధోన్మాదం మరింత పెచ్చరిల్లుతుందని, ప్రపంచ శాంతికి భంగం కలుగుతుందన్న వాద నలు... ఉక్రెయిన్ - రష్యా వివాదంలో అమెరికా జోక్యం చేసుకోకుండా ఉండేందుకు రష్యా సాగిస్తున్న ప్రచార ప్రభావమేనని డెప్తుల్లా వాదన.
మరోవైపున మార్చిలో అమెరికాలోని ఉక్రెయిన్ రాయబారి, జనరల్ ఆటమిక్ కంపెనీ ప్రతినిధులను కలిసినప్పుడే జనరల్ అటమిక్ ఉత్పత్తి చేసే ఆయుధాలు ఉక్రెయిన్‌కు ఎగుమతి చేసేందుకు అనుమతించాలని రిపబ్లికన్ ప్రతినిధి ఆడం కినింగర్ డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ పై విమానాలు తిరగటాన్ని నిషేధిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేసిన వారిలో రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎంపీలు టెడ్ లీయు, డి కాలిఫ్, క్రిస్సీ హౌలోహాన్తో పాటు కినింగర్ కూడా ఒకరు. పైగా ఉక్రెయిన్ సైన్యానికి ఎం క్యూ 9 డ్రోన్లు నడపటం నేర్పటానికి ఎంత సమయం పడుతుంతో వివరించాలని అమెరికా రక్షణ శాఖను సవాలు చేశారు. మరోవైపు మే రెండో వారంలో జనరల్ ఆటమిక్ నిధులతో హడ్సన్ కేంద్రంగా నడిచే మరో పరిశోధనా సంస్థ (లాబీయింగ్ సంస్థ) బాధ్యతల్లో ఉన్న పలువురు పరిశోధకులు ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధ పరిశ్రమల్లో తయారైన ఆయుధ సామాగ్రి ఎగుమతి చేయాలని సిఫార్సు చేస్తూ వ్యాఖ్యానాలు రాశారు.
అందరూ ఆశించిన రీతిలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం స్వల్పకాలంలో ముగింపునకు రాకపోవటంతో ఈ యుద్ధాన్ని పావుగా వాడుకుని రష్యాను బలహీనపర్చాలన్న వ్యూహానికి అమెరికా తెరతీసింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కూడా సామ్రాజ్యవాద దేశాలు ఇదే వ్యూహంతో ఫాసిస్టు ముస్సోలిని, హిట్లర్‌ను పావుగా వాడుకోవటానికి ప్రయత్నించిన సంగతి ప్రంపచానికి తెలుసు. సోవియట్ రష్యాను కూల్చటానికి సామ్రాజ్యవాద శక్తులు చేసిన రెండో ప్రయత్నం అది. అది కూడా విఫలం కావటంతో సోషలిజాన్ని కూల్చటానికి సామ్రాజ్యవాద శక్తులు ఏడు దశాబ్దాలు ఎదురు చూడాల్సి వచ్చింది. సోవియట్ రష్యా అంతర్ధానమైనా ఆ వ్యవస్థ సృష్టించిన సాయుధ శక్తి సజీవంగానే ఉంది.
సోవియట్ రష్యా అంతర్ధానం కావటానికి ముందే గోర్బచెవ్ హయాంలో స్టార్ట్ (స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రెటీ - వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం) పేరుతో శిఖరాగ్ర సమావేశాలు జరిగేవి. ఆ సందర్భంగా కుదిరిన ఒప్పందాలను గోర్బచెవ్ నాయకత్వంలోని రష్యా అమలు జరిపినంత నిబద్ధతతో అమెరికా అమలు జరపలేదు. దానికి ఒక్కటే కారణం. అమెరికాలో రాజ్యాధికారం ఆయుధ తయారీ పరిశ్రమల చేతుల్లో ఉంటే రష్యాలో ఆయుధ పరిశ్రమలు రాజ్యాధికారానికి లోబడి ఉండేవి. రెండిటి మధ్య ఉన్న తేడా తరతరాల ప్రపంచ భవిష్యత్తును ప్రభావితం చేసింది. చేస్తుంది. ఆ ప్రభావాన్ని నేడు ప్రపంచం చూస్తోంది.
సామ్రాజ్యవాదం తన ఆధిపత్యాన్ని కొనసాగించుకునేందుకు రష్యా సైనిక శక్తిని నిర్వీర్యం చేయటం ఇప్పుడు లక్ష్యంగా ఉంది. తాజాగా ఉక్రెయిన్ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు ఈ లక్ష్యంతోనే అడుగులు వేస్తున్నాయి. పైన ప్రస్తావించిన వాస్తవాలన్నీ ఇందులో భాగమే. తొలుత కేవలం భుజాన పెట్టుకుని కాల్చే శతఘ్ఞులు మాత్రమే ఎగుమతి చేయటానికి సిద్ధమైన అమెరికా, నేడు అత్యంత ఆధునిక ఆయుధ వ్యవస్థలో భాగమైన అణ్వస్త్ర శ్రేణి డ్రోన్లను ఎగుమతి చేసేందుకు మొగ్గు చూపింది. వీటిని స్విఛ్బ్లేడ్స్ అని పిలుస్తారు. తాజాగా భారీ పేలుడు సామాగ్రిని కూడా ఉక్రెయిన్‌కు అమ్మేందుకు అమెరికా సిద్ధమైంది. మే మొదటివారంలోనే ఉక్రెయిన్‌కు కావల్సిన ఆయుధాలు కొనుగోలు చేసేందుకు అప్పు మంజూరు చేసే చట్టాన్ని ఆమోదిస్తూ అమెరికా అధ్యక్షుడు సంతకం చేశారు. ఈ చట్టం సారాంశం ఒక్కటే. అమెరికా వద్ద పోగుపడుతున్న ఆయుధాల గుట్టలు ఉక్రెయిన్‌కు తరలించటానికి ఆర్థిక వనరులు అప్పుగా ఇచ్చి ఒకే దెబ్బకు రెండు లక్ష్యాలను సాధించటమే.
దేశంలో జరిగే తుపాకి హింస, కోటి మంది విద్యార్ధులకు కోవిడ్ సమయంలో అందుబాటులోకి వచ్చిన ఉచిత భోజన పథకం రద్దు, పెచ్చరిల్లుతున్న జాతిదురహంకార హింసల గురించి పట్టని అమెరికా మీడియా ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలు అమ్ముతుందా లేదా అన్న ప్రశ్న చుట్టూ దేశాన్ని, ప్రజాభిప్రాయాన్ని, ప్రపంచాన్నీ తిప్పుతుంది. మన దేశంలో కూడా మీడియా ఇటువంటి పాత్రే పోషిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇప్పటి వరకూ అమెరికా అనేక దేశాలకు అనేక రకాలైన ఆయుధాలు అమ్మింది. కానీ గ్రే ఈగిల్స్ లేదా రేపర్స్ వంటి ఆయుధాలు మాత్రం అమ్మలేదు. ఇప్పుడు ఎం క్యూ 9 రేపర్ శ్రేణి డ్రోన్ల అమ్మకానికి క్షిపణి తటెక్నాలజీ నియంత్రణ ఒప్పందంపై అమెరికా సంతకం చేయటం కారణం.
- కె. వీరయ్య
సెల్:8971794037