Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇండ్ల స్థలాలకై పేదల భూపోరాటాలు మళ్ళీ ఉధృతమయ్యాయి. గత నెలరోజులలో వేలాది మంది పేదలు జక్కులొద్ది, బెస్తంచెరువు, గోపాలపురం, కోట చెరువు, బందం చెర్వు, ఎల్కతుర్తి తదితర కేంద్రాలలో ప్రభుత్వ భూములలో ఇండ్లు నిర్మించుకున్నారు. మండుటెండలను లెక్క చేయకుండా పట్టుదలతో తమకు కనీసం 100గజాల ఇండ్ల స్థలానికి పట్టాలివ్వమని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ భూములను వేలాది ఎకరాలు ఆక్రమించుకున్న భూదురాక్రమణాదారులు, నగరంలోని పెత్తందార్లు, లంచగొండి ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కయి దౌర్జన్యాంగా పేదలందరినీ తాము నివసిస్తున్న స్థలాల నుండి వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ''జక్కులొద్ది''లో గుడిసెవాసులు రమేష్, కవిత, మాధవి, మైరున్నిసా తదితరులపై గుండాలు 2.6.2022నాడు రాత్రి దాడి చేశారు. రమేష్ తలపగిలింది ఆందోళనకర పరిస్థితులో యం.జి.యం ఆసుపత్రిలో చేరాడు. మిగతా వారాంతా చికిత్స పొందుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయ మేమిటంటే... పేదలకు రక్షణ ఇచ్చి గుండాలను శిక్షించాల్సిన పోలీసులు, భూదురాక్రమణదారుల వత్తిడితో గుండాలను ప్రోత్సహించడం. వారిపై తగు కేసులు పెట్టి శిక్షించకపోవడం వలన గుండాలు విచ్చల విడిగా తిరుగుతూ గుడిసెలలో నివసిస్తున్న పేదలను బెదిరిస్తున్నారు. వారు తిరిగే బాటలన్ని మూసేస్తున్నారు. రోడ్లకు అడ్డంగా గోతులు తవ్వుతున్నారు. కంపలు వేస్తున్నారు. మున్సిపాలిటీ చెత్తంతా తెచ్చి పోస్తున్నారు.
ప్రభుత్వ భూములలో ఇండ్లు వేసుకున్న పేదలపై దౌర్జన్యం చేసి బెదిరిస్తున్నారు. ప్రజలు ఇండ్లు వేసుకున్న ఆ ప్రభుత్వ స్థలాన్నంతా ఆక్రమించాలనేది పెత్తందార్ల పన్నాగం. వరంగల్ నగరంలో ప్రభుత్వ భూములు లేవని, ఉన్న భూములన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించ బడ్డాయని అధికారులు చెపుతుంటారు. 1990లోనూ ఇదే మాట చెప్పారు. కాని సుమారు 10వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని సర్వే నెంబర్లతో సహా సీపీఐ(ఎం) అప్పుడే వెలుగులోకి తెచ్చింది. అందులో సీలింగ్ మిగులు భూమి, బంచారాయి, శిఖం భూములున్నాయి. రికార్డులో చెర్వులని ఉన్నా అవెక్కడ కనపడవు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నగర పెత్తందార్లు ఈ భూముల్లో అత్యధిక భాగం ఆక్రమించారు.
ప్రభుత్వ అధికారులు నామమాత్రంగా కేసులువేసి దురాక్రమణదారులకు ధారాదత్తం చేసినవే అత్యధికం. హన్మకొండ చౌరస్తా నుండి కలెక్టర్ ఆఫీసు వరకు ఉన్న రోడ్డుకు రెండు వైపుల ఉన్న భూములు ప్రభుత్వ భూములే. వాటిని పెద్ద పెద్ద వారే ఆక్రమించారు. ఉర్స్, రంగశాయిపేట, కరీమాబాద్‌లో వేలాది ఎకరాలు మిగులు భూములుగా రికార్డులలో ఉంటాయి. కాని భూమంతా దురాక్రమణదారుల చేతుల్లో ఉంటుంది.
మాజీ మంత్రి హైగ్రీవాచారియే స్వయంగా ప్రస్తుత హన్మకొండ బస్‌స్టాండ్ పక్కనే ఉన్న అంత్యంత విలువైన 22 ఎకరాల భూమిని ఆ రోజుల్లో దురాక్రమణ చేశాడు. ప్రస్తుతం దీని విలువ 1000 కోట్లకు పైనే ఉంటుంది. తాను మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడే ఆక్రమించాడు. కొన్ని సందర్భాలలో ఈ దురాక్రమణ గురించి విమర్శలున్నా పట్టించుకున్న వారు లేరు. 1980లో సీపీఐ(ఎం) ఈ దురాక్రమణకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేసింది. ఒకవైపు ఆందోళనలు నిర్వహిస్తూనే, మరోవైపు కోర్టుల ద్వారా న్యాయ పోరాటానికి పూనుకున్నది. మున్సిప్ కోర్టు నుండి హైకోర్టు, స్పెషల్ కోర్టు వరకూ వెళ్ళింది. చివరికి హైగ్రీవాచారి దురాక్రమణదారుడనీ, భూమిని దురాక్రమణ చేశాడనీ, సీపీఐ(ఎం) తరపున కేసు వేసి పోరాడిన పిటిషనర్‌కి 56 వేలు కోర్టు ఖర్చులు కట్టి ఇవ్వాలని తీర్పునిచ్చింది. భూదురాక్రమణ చట్టం 1987 ప్రకారం మొత్తం భూమి విలువలో ఒక శాతం పిటిషనర్కివ్వాలని కూడా తీర్పు ఇచ్చిన విషయం వరంగల్ ప్రజలకు తెల్సిందే.
వరంగల్‌లో పేద ప్రజల ఇండ్ల స్థలాలకై 1988 నుండీ సీపీఐ(ఎం) సమరశీల పోరాటాలు నిర్వహిస్తూనే ఉంది. కాకతీయ యూనివర్సిటీ పక్కన హనుమాన్ నగర్లో కస్పారెడ్డి అనే భూస్వామి సీలింగ్ భూమిని గుర్తించి పేదలు ఇళ్ళు వేసుకున్నారు. వాటికి పట్టాలు సాధించే వరకు సీపీఐ(ఎం) పోరాడింది. 1989లో అప్పోజు సమ్మయ్య నగర్ (చౌడు చెర్వు), సుందరయ్య నగర్ (ఏనుమాముల)ల ప్రభుత్వ భూములలో కూడా సీపీఐ(ఎం) నాయకత్వాన వేలాది ప్రజలు ఇండ్లు వేసుకున్నారు. ఇవి రెండూ కీలకమైన కేంద్రాలే. అప్పోజు సమ్మయ్య నగర్ కాజిపేటకు బైపాస్ రోడ్డుగా మారింది. ఏనుమాముల సుందరయ్యనగర్ (రాష్ట్రం లోనే పెద్దగ్రేయిన్ మార్కెట్టులలో ఒకటైన) వరంగల్ మార్కెట్టు పక్కనే ఉంది. 1991లో వరంగల్ రైల్వే స్టేషన్ ప్రక్కనే ఉన్న శివనగర్‌లో బిరుదు అనంతరాజు అనే భూస్వామి సీలింగ్ భూమిని సుమారు 15 ఎకరాలు దురాక్రమణ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారు. దానిపై సీపీఐ(ఎం) పోరాడి పేద ప్రజలకు ఇచ్చింది. అదే నేడు ఏసిరెడ్డి నగర్‌గా నిలిచింది.
ఈ పోరాటాల స్ఫూర్తితో ప్రజలకు గొప్ప భరోసా వచ్చింది. ఇండ్లులేని పేదలందరికి సీపీఐ(ఎం) ''కేర్ఆఫ్'' అడ్రస్‌గా మారింది. ఆ ఊపులో చాకలి ఐలమ్మ నగర్, జ్యోతిబసు నగర్, రామసుందర్ నగర్, వీకర్స్ కాలని, ఓయస్ నగర్, మైసయ్య నగర్, లెనిన్ నగర్, బొంబాయి రైస్ మిల్లు, రఘునాథ్ నగర్, కాసికుంట, మడికొండ తదితర గుడిసె కేంద్రాలు వెలిశాయి. ఈ కేంద్రాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ గుడిసెవాసుల సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించి, ఓటర్‌కార్డ్, రేషన్‌కార్డ్, మున్సిపల్ రికార్డ్, కరెంటు, నల్లాలు, ఇంటి పట్టాలకై సీపీఐ(ఎం) అనేక ఉద్యమాలు నిర్వహించింది.
2000 సంవత్సరం తర్వాత కూడా ఆ పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. నాయుడు పంపు, చింతల్ తదితర కేంద్రాలలో సీపీఐ(ఎం) నాయకత్వాన గుడిసెలు నిర్మించుకొని ప్రజలు జీవిస్తున్నారు. ఈ పోరాటాలలో భూఆక్రమణదారుల గుండాలచే అప్పోజు సమ్మయ్య, రామ సురేందర్, రఘునాథ్, మరుచెల్లి, తదితరులు హత్య చేయబడ్డారు. వక్కల మైసయ్య పోలీసుల దెబ్బలకు బలి అయ్యారు. ఈ వీరుల హత్యలు ప్రజలలో భయాన్నేమి కలిగించలేదు. పైగా లంచగొండి అధికారులు, భూఆక్రమణదారులపై కసి, కోపాన్ని పెంచాయి. అమరుల త్యాగాల స్ఫూర్తితో గుడిసెలకై పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. భూదురాక్రమణ దారుల దాడులు, దౌర్జన్యాలు, వేదింపులు, నిర్భందాలు ప్రజల పోరాటాన్ని ఆపలేవని రుజువైంది. గత ముప్పయి సంవత్సరాలలో 28కేంద్రాలలో 30వేల కుటుంబాలు ఇండ్ల స్థలాలు సాధించి ఆత్మస్ధైర్యంతో జీవించడం, ప్రస్తుత పోరాటాలకు గొప్ప స్ఫూర్తినీ, భరోసానూ, ధైర్యాన్ని ఇస్తున్నది.
ఇండ్లులేని పేదలకు సీపీఐ(ఎం) అండగా ఉంటూ వారిని చైతన్యపరుస్తున్నది. నిజానికి ప్రభుత్వమే ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. ఇండ్లు కట్టించాలి. అది తన బాధ్యత. కానీ నిర్వహించడంలేదు. పేదలకు చెందాల్సిన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్వార్ధ రాజకీయ నాయకులు, పెత్తందార్లు ఆక్రమించుకొని కోట్లు కోట్లు కూడబెట్టు కుంటున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రత్యేకించి రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు లంచాలకు మరిగి దురాక్రమణదారులకు వత్తాసుగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇండ్ల స్థలాలకై పోరాటం మన హక్కు అనే చైతన్యం సీపీఐ(ఎం) ప్రజలకు కల్పిస్తున్నది. వారిని సంఘటితం చేసి, నిర్బంధాలెన్నెదురైనా ప్రజల పక్షాన నిలబడుతున్నది.
పేదల పోరాటానికి సంఘీభావం తెలుపడానికి వస్తున్న రాష్ట్ర సీపీఐ(ఎం) నాయకత్వాన్ని కూడా అరెస్టు చేశారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నాయకులు సుదర్శన్‌లను ఖమ్మం నుండి వస్తుండగా రాయపర్తిలోనే అరెస్టు చేశారు. జిల్లా నాయకులు రత్నమాల, బషీర్, వాసుదేవరెడ్డి, ఉప్పలయ్య తదితరులనే కాక జనగామ నర్సంపేట తదితర ప్రాంతాలలో కూడా సీపీఐ(ఎం) నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ అరెస్టులకు వ్యతిరేకంగా రాస్తారోకోలు, నిరసనలు హోరెత్తాయి. రాష్ట్ర నాయకత్వం ఎస్.వీరయ్య, సీతారాములు, జి.రాములు, కృష్ణారెడ్డి, జగదీష్ తదితరులు పోరాడుతున్న ప్రజలకు అండగా నిలిచి సంఘీభావం తెలపటం వారికి మరింత ఆత్మ విశ్వాసాన్ని పెంచింది.
ఇప్పటికీ వేలాది మంది తాము గుడిసెలేసుకున్న ప్రాంతాలలోనే ఉంటున్నారు. వారంతా ఏదో ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో, రాజకీయ పార్టీకో చెందినవారు కాదు. కేవలం ఇండ్లులేని పేదలు. వారిది న్యాయమైన పోరాటం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పోరాటానికి అందరి సహాయం, మద్దతు అవసరం.
- జి. రాములు